బకాయిలు కొండంత
నత్తనడకన ఆస్తిపన్ను వసూళ్లు
పట్టణాలు, పల్లెల్లో అదే తీరు
పంచాయతీల్లో రూ.102 కోట్ల బకాయిలు
పట్టణాల్లో రావాల్సింది రూ.51.24 కోట్లు
గ్రామాలను వేధిస్తున్న సిబ్బంది కొరత
కొరవడుతున్న పర్యవేక్షణ
పల్లెలు, పట్టణాలకు ప్రభుత్వం వివిధ రూపాల్లో ఇచ్చే నిధులతోపాటు.. ఆస్తిపన్నులు కూడా ముఖ్యమైన ఆదాయ వనరు. ఇంత కీలకమైన పన్ను వసూళ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించడంలేదు. ఫలితంగా పన్ను వసూళ్లు ఇప్పటికీ నత్తనడకగా సాగుతున్నాయి. జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను డిమాండు రూ.107.76 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ.56.52 కోట్లు మాత్రమే వసూలు చేశారు. గ్రామ పంచాయతీల పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ మొత్తం రూ.113 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.11 కోట్లు మాత్రమే వచ్చింది. మరో నలభై రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో.. మిగిలిన బకాయిలు వసూలు కావడం అనుమానమే. దీంతో ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : చాలీచాలని సిబ్బంది, పర్యవేక్షణ లోపాలతో గ్రామ పంచాయతీల్లో పన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అటు ప్రభుత్వం రూపాయి కూడా విదల్చకపోవడం, ఇటు పన్నులు కూడా సరిగా వసూలు కాకపోవడంతో.. గ్రామ పంచాయతీల అభివృద్ధి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. జిల్లాలో 1,063 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో సగానికి పైగా పంచాయతీలు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జిల్లా మొత్తమ్మీద గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలు రూ.113 కోట్లు ఉండగా, ఈ సంవత్సరం రూ.11 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రూ.102 కోట్లు ఇంకా వసూలు చేయాల్సి ఉందన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో కొద్ది రోజులు మాత్రమే గడువుంది. ఇంత తక్కువ వ్యవధిలో అంత పెద్ద మొత్తాన్ని అధికారులు ఏవిధంగా వసూలు చేయగలరనేది ప్రశార్థకంగా మారింది.
గ్రామ పంచాయతీల్లో మంచినీటి పథకాల మరమ్మతులు, వీధిదీపాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, బ్లీచింగ్, ముగ్గు వంటివాటి కొనుగోలుకు సాధారణ నిధులు వినియోగించుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేజర్ పంచాయతీలు సైతం డబ్బులు లేక విలవిలలాడుతూండగా, మైనర్ పంచాయతీల్లో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేక సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. డ్రైనేజీలు, రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు తాత్కాలిక సిబ్బందితో పనులు చేయించేవారు. ప్రస్తుతం డబ్బులు లేకపోవడంతో పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిస్తోంది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లాలోని సుమారు 400 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు లేరు. సగానికి పైగా గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్లు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. కార్యదర్శుల కొరత కారణంగా సిబ్బందిపై అజమాయిషీ లేదు. దీనికితోడు గత ఏడాదిన్నర కాలంగా పూర్తిస్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కూడా లేరు. దీంతో పన్ను బకాయిలపై దృష్టి సారించేవారే కరవయ్యారు. 2015 నవంబర్‌లో డీపీఓగా పని చేసిన కె.ఆనంద్ బదిలీపై వెళ్లారు. అప్పటినుంచీ రెగ్యులర్ డీపీఓను నియమించలేదు. జిల్లా సహకారి అధికారి, సెట్రాజ్ సీఈవో, జిల్లా పరిషత్ సీఈవో, అమలాపురం డీఎల్పీవోలు ఇ¯ŒSచార్్జ డీపీవోలుగా పని చేశారు. ప్రస్తుతం రంపచోడవరం ఏజెన్సీలో పని చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగాధర్ కుమార్ ఇ¯ŒSచార్జ్ డీపీఓగా పని చేస్తున్నారు.
బిల్లు కలెక్టర్‌తో సమావేశాలు లేవు
గతంలో పన్ను వసూళ్లపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బిల్లు కలెక్టర్లతో డీపీఓ దాదాపు ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. మూడేళ్ల కిందట అప్పటి కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర బిల్లు కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి పన్నులు వసూలు చేయకుంటే చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ డీపీఓ లేకపోవడంతో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో గ్రామ పంచాయతీల్లో భారీగా పన్ను బకాయిలు పేరుకుపోయాయి.
పట్టణాల్లో నత్తనడకే
మండపేట : జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సం వత్సరం ముగిసేనాటికి నూరు శాతం వసూళ్లు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకూ 52 శాతం మాత్రమే వసూలయ్యాయి. 77.2 శాతంతో తుని మున్సిపాలిటీ ముందంజలో ఉండగా, 41.4 శాతంతో రామచంద్రపురం చివరి స్థానంలో ఉంది. మరో 40 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. నిధుల విడుదలకు నూరు శాతం పన్నుల వసూళ్లను కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కాకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇది పట్టణ ప్రగతిపై ప్రభావం చూపుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతోపాటు ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల్లో 2,35,685 ప్రైవేటు భవనాలున్నాయి. వీటిద్వారా ప్రస్తుత ఆస్తిపన్ను డిమాండ్ మొత్తం రూ.107.76 కోట్లుగా ఉంది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.56.52 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం పన్ను డిమాండులో ఇది సుమారు 52 శాతంగా ఉంది. 77.2 శాతంతో తుని మున్సిపాల్టీ ముందంజలో ఉంది. మండపేట మున్సిపాల్టీలో 74.7, కాకినాడ నగర పాలక సంస్థలో 58, రాజమహేంద్రవరంలో 55, అమలాపురంలో 58.7, పెద్దాపురంలో 65.6, సామర్లకోటలో 62.5, పిఠాపురంలో 43.6, రామచంద్రపురంలో 41.4 శాతం చొప్పున పన్నులు వసూలయ్యాయి. గొల్లప్రోలు నగర పంచాయతీలో 75.7, ఏలేశ్వరంలో 73.1, ముమ్మిడివరంలో 59.4 శాతం మేర పన్నులు వసూలయ్యాయి. మొత్తం పన్ను డిమాండులో ఇంకా రూ.51.24 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
నూరు శాతం వసూలు జరిగేనా?
14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల మేరకు స్థానిక సంస్థలు నూరు శాతం పన్నులు వసూలు చేయడం తప్పనిసరి. పన్నుల వసూలు ప్రాతిపదికనే నిధుల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే స్థానిక సంస్థలకు ఆదేశాలున్నాయి. ఈ మేరకు పన్ను వసూళ్లపై ఉన్నత స్థాయి నుంచి నిరంతరం సమీక్ష జరుగుతోంది. దాదాపు మరో 40 రోజుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగియనుండగా.. పలు స్థానిక సంస్థల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నుంచి నూరు శాతం వసూలు గగనమేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావం అభివృద్ధి పనులపై పడనుంది.