breaking news
outskirts of hyderabad
-
న్యూ ఇయర్: మందుబాబుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే మందుబాబుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ పేర్కొంది. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసు సౌకర్యం కల్పించనుంది. ఈవెంట్స్ వెళ్లే వారికోసం రాత్రి 7.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు, తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30నుంచి మరుసటిరోజు తెల్లవారుజాము 3గంటల వరకు బస్సు సేవలు అందిచనుంది. 18 సీట్ల ఏసీ బస్సు వెళ్లి రావటానికి రూ.4 వేల ప్యాకేజీని ప్రకటించింది. ఒకరికి రూ.100 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసి సూచించిన 15 ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. టీఎస్ఆర్టీసీ కొత్త సంవత్సరం కానుక కొత్త సంవత్సరం కానుకగా జనవరి1వ తేదీన తల్లిదండ్రులతో ప్రయాణించే 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. -
తారాజువ్వలా ఎగిరిన రియల్ ఎస్టేట్
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్, రిజిస్ట్రేషన్లకు సెలవులతో నేలచూపులు చూసి కుదేలైన స్థిరాస్తి రంగం మూడు నెలల్లోనే తిరిగి తారాజువ్వలా పైకిలేచింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో పెద్ద ఎత్తున పుంజుకున్న రియల్ వ్యాపారాల కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల్లో భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్ రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో ఏడాది కాలంలో జరిగిన కార్యకలాపాల్లో సగం మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే జరగడం విశేషం. ముఖ్యంగా శివార్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారితో పోటెత్తాయి. భూమిపై పెట్టుబడిని ఆదాయ వనరుగా మధ్యతరగతి వర్గాలు భావిస్తుండడంతో పాటు రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) లాంటి ప్రతిపాదనలు, కరోనా వైరస్ నేర్పిన పాఠంతో కాంక్రీట్ జంగిల్‌ను వదిలి ప్రశాంతత కోసం శివార్లలోని విల్లాలు, ఫామ్ హౌస్‌ల వైపు సంపన్నులు మొగ్గు చూపుతుండడం ఇందుకు కారణాలని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రంగారెడ్డిలో అత్యధిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ల గణాంకాలను పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇందులో సగం కంటే ఎక్కువగా రూ.2,503 కోట్ల వరకు రంగారెడ్డి, మేడ్చల్ రిజిస్ట్రేషన్ జిల్లాల నుంచే రావడం గమనార్హం. ఇక, ఈ రెండు జిల్లాల పరిధిలో జరిగిన లావాదేవీలను విశ్లేషిస్తే రంగారెడ్డిæ జిల్లా పరిధిలో ఏడాది కాలంలో 1.7లక్షల లావాదేవీలు జరిగితే చివరి మూడు నెలల్లో 88 వేలకు పైగా లావాదేవీలు జరిగాయి. మేడ్చల్ జిల్లా పరిధిలో ఏడాది కాలంలో లక్షకు పైగా డాక్యుమెంట్లు నమోదు కాగా, మూడు నెలల్లో 58 వేలకు పైగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగడం విశేషం. ట్రిపుల్ ఆర్ ‘భూమ్’ నగరాన్ని చుట్టుముట్టి 340 కిలోమీటర్లకు పైగా ఏర్పాటు కానున్న ఆర్ఆర్ఆర్ ప్రతిపాదనలు ఒక్క సారిగా స్థిరాస్తి రంగ స్వరూపాన్ని మార్చివేశాయి. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే ఏడు జిల్లాల్లో ఈ రహదారి ఏర్పాటవుతుందన్న అంచనాతో శివార్లలో రియల్ కార్యకలాపాలు గత రెండు నెలలుగా జోరందుకున్నాయి. భూముల ధరలు అమాంతం పెంచేసినా, భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఆర్ఆర్ఆర్ చుట్టూ ఉన్న భూముల కొనుగోళ్లపై దృష్టి పెట్టాయి. ఈ ట్రిపుల్ ఆర్ ఏర్పాటు పూర్తయితే దీని చుట్టూ పారిశ్రామికాభివద్ధి జరుగుతుందని, రానున్న ఐదారేళ్లలో భూములకు మరింత డిమాండ్ వస్తుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు నగర శివార్లలో లగ్జరీ విల్లాలపై కూడా సంపన్న వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కనీసం రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల విలువ గల విల్లాల కొనుగోలుపై వ్యాపారవేత్తలు, ఎన్నారైలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గండిపేట, గోపన్‌పల్లి, నార్సింగి, తుక్కుగూడ, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో విల్లాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగిన తీరు వెల్లడిస్తోంది. ఊతమిస్తున్న అభివృద్ధి ఐటీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కూడా రియల్ రంగానికి కొత్త ఊపు తెస్తోంది. ముఖ్యంగా ఐటీ అభివృద్ధితో పాటు పరిశ్రమల విస్తరణ, నగరానికి దగ్గర్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి, వరంగల్–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్, బెంగళూరు జాతీయ రహదారిపై ఎలక్ట్రానిక్ గూడ్స్ క్లస్టర్, లాజిస్టిక్ హబ్‌లు లాంటివి ఏర్పాటవుతుండడంతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో విరివిగా వెంచర్లు, టౌ¯న్షిప్లు ఏర్పాటు చేస్తున్నారు రియల్ వ్యాపారులు. భారీ బహుళ జాతి సంస్థలు కూడా తమ కార్యాలయాలను గ్రేటర్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుండడంతో నివాస ప్రాంతాల కోసం నగర శివార్లలో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. దీంతో భూములు, విల్లాలు, అపార్ట్మెంట్లు, రిసార్టుల క్రయ విక్రయ లావాదేవీలు భారీ ఎత్తున పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ లావాదేవీలు నగర శివార్లలోనే ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి తోడు కోవిడ్ మొదటి దశ తర్వాత మధ్యతరగతి వర్గాలు సొంత ఇళ్లను సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.శివార్లలోని ఉప్పల్, మేడ్చల్, ఘట్కేసర్, పోచారం, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్, మహేశ్వరం, ఆదిభట్ల, బడంగ్పేట్, మణికొండ, శంకరపల్లి, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. -
‘పానీ’ పాట్లు
హైదరాబాద్ శివార్లలో మంచి నీటికి కటకట ఎండాకాలం రాకముందే హైదరాబాద్ శివార్లు గొంతెండుతున్నాయి.. మహానగరంలో విలీనమవడంతో గ్రేటర్‌లోని శివారు ప్రజలు ‘పానీ’ పాట్లు పడాల్సి వస్తోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం... బోరు బావులు వట్టి పోవడంతో గొంతు తడుపుకునేందుకు జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది.. మంచి నీళ్ల కోసం డబ్బును ‘నీళ్ల’లా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా జలమండలి ప్రేక్షక పాత్రే వహిస్తోంది... ప్రభుత్వం మౌనంగానే చూస్తోంది.. సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ శివారువాసులకు క‘న్నీటి’ కష్టాలు మొదలయ్యాయి. మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీలు, సమీప గ్రామాల్లోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో మార్చి ప్రారంభంలోనే నీటి ఎద్దడి ప్రారంభమైంది. దాదాపు 30 లక్షల మంది నీటి కోసం రోజూ ‘జలయజ్ఞం’ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. శివారు ప్రాంతాల్లో జలమండలి మంచి నీటిని సరఫరా చేయకపోవడం, వర్షపు నీటిని సద్వినియోగం చేసే ఇంకుడు గుంతలు లేకపోవడం, బోరుబావులు వట్టి పోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఇక్కడ పలు ప్రాంతాల్లో 2,000 అడుగుల వరకు బోర్లు వేసినా చుక్క నీరు దొరకడం లేదు. దాహార్తి తీర్చుకోడానికి ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. రోజువారీ వినియోగం కోసం నెలకు రూ.2,000 నుంచి రూ.5 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రగతినగర్, నిజాంపేట్, బోడుప్పల్, కాప్రా, మల్కాజిగిరి,అల్వాల్,యాప్రాల్,మాదాపూర్,శేరిలింగంపల్లి,బాలానగర్,కుత్బుల్లాపూర్,మియాపూర్,చందానగర్,ఎల్బీనగర్,బండ్లగూడ,గాజులరామారం తదితర శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ఇక్కడ ఇంటి అద్దెతో పాటు అందులో సగం మొత్తాన్ని అదనంగా నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక కొన్ని బస్తీల్లో మహిళలు గుక్కెడు మంచి నీటికి బిందెలతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇటీవల బోడుప్పల్లో నీటి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ప్రేక్షకపాత్రలో జలమండలి.. గ్రేటర్ పరిధిలో 20 లక్షల నివాస సముదాయాలుండగా.. జలమండలి 8.64 లక్షల నివాసాలకు మాత్రమే రోజూ 340 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తోంది. కొన్ని చోట్ల వారం, మరికొన్ని చోట్ల 15 రోజులకోసారి సరఫరా జరుగుతోంది. బోడుప్పల్, మేడిపల్లిలోని కొన్ని చోట్ల నెలకో రోజు మాత్రమే కుళాయిల్లో నీళ్లొస్తాయి. 11 మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వెయ్యికి పైగా కాలనీల్లో రిజర్వాయర్లు, పైప్లైన్లు లేవు. ఇక్కడి వారు బోరు బావులపైనే ఆధారపడి దాహార్తిని తీర్చుకోవాల్సివస్తోంది. 2,000 అడుగుల లోతుల్లోకి వెళ్లినా.. గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో భూగర్భ జల మట్టాలు గతేడాదితో పోలిస్తే బాగా తగ్గాయి. బహదూర్‌పురా మండలం మినహా ఆసిఫ్‌నగర్,చార్మినార్,నాంపల్లి,హయత్‌నగర్,సరూర్‌నగర్,శేర్,ఉప్పల్,చార్మినార్,బండ్లగూడ,ఘట్కేసర్,మేడ్చల్ తదితర మండలాల్లో భూగర్భ జల మట్టా లు గణనీయంగా పడిపోయాయి. మొత్తంగా గ్రేటర్ పరిధిలో గతేడాది సగటున 7.97 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ దొరకగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.46 మీటర్ల లోతుకు వెళితే గాని నీటి జాడ దొరకడం లేదు. అంటే గతేడాది కంటే ఈసారి అదనంగా 2.49 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయిందన్నమాట. నిజాంపేట్... నీళ్లు లేక ఖరీదైన నిజాం పేట్ ఏరియాలో ఇంటి అద్దెలు సుమారుగా రూ.6 వేలు. ఇక నీటి కోసం వీరు అదనంగా మరో రూ. 3 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల మంజీరా నీళ్ల కోసం ఇక్కడ వాటర్ ట్యాంక్‌ను నిర్మించారు. కానీ, సరిపడా నీటి సరఫరా మాత్రం లేదు. దీంతో చాలా మంది బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. ఎండాకాలం రాకముందే ఆ బోరుబావులు కూడా అడుగంటుతున్నాయి. దీంతో ఇక్కడివారు రూ.1,400 చెల్లించి ప్రైవేట్ నీటి ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు. ఉప్పల్... తిప్పల్.. హైదరాబాద్‌లో అత్యంత ముఖ్య ప్రాంతమైన ఉప్పల్‌లోనూ నీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి... ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. ఇక బోడుప్పల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ 25 వేల మంది నివసిస్తున్నారు. మొత్తం 12,304 నల్లా కనెక్షన్లున్నాయి. రోజుకు 10 వేల కిలో లీటర్లు తాగునీరు అవసరం ఉంటే.. 3,340 కిలో లీటర్ల మంచినీళ్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. 2002 జనాభా లెక్కల ప్రకారం సరఫరా జరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీర్జాదిగూడలో వారానికి ఒకసారి మాత్రమే కొన్ని కాలనీల్లో మంచి నీళ్లు వస్తాయి. ఇక్కడి బుద్ధానగర్,మల్లికార్జున నగర్లలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. మేడిపల్లిలో అయితే నెలకోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. అదికూడా కేవలం 30 నిమిషాలు మాత్రమే. ఇక్కడ అందరూ ట్యాంకర్ నీళ్లు కొనాల్సిందే. రామంతాపూర్‌లోని కొన్ని కాలనీల్లో 2,000 అడుగుల మేర బోరు వేసినా చుక్క నీరు కూడా కనిపించడం లేదు. ఇటీవల నెహ్రూనగర్‌లో జీహెచ్ఏంసీ అధికారులు 1,500 అడుగుల లోతుకు బోరు వేసినా నీటి జాడ దొరకలేదు. హైటెక్ సిటీలో అదే పరిస్థితి... మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, కొండాపూర్ తదితర ప్రాంతాలలో బోరుబావుల్లో నీళ్లు లేకపోవడంతో మంచినీటి సమస్య తీవ్రమైంది. ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు నెలకు రూ.2,500 వరకు మంచి నీటికోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు మియాపూర్‌లోని ఎస్.ఆర్.ఎస్టేట్స్‌లో 322 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందు లో దాదాపు వెయ్యి మందికిపైగా నివసిస్తున్నారు. జలమండలి కనెక్షన్ ఉన్నప్పటికీ తగిన ంత తాగు నీరు లేక వీరు ప్రతిరోజూ 35 ట్యాంకర్ల నీటిని కొంటున్నారు. అంకెల్లో దాహార్తి... 30 లక్షలు... గ్రేటర్‌లోని శివారు ప్రాంతాల్లో దాహార్తితో అలమటిస్తున్న ప్రజలు 1,000...హైదరాబాద్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీల పరిధిలోని నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలు 2,200..ప్రైవేటు ట్యాంకర్ నీళ్లు కొనుగోలు చేయడానికి కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు గరిష్టంగా ఖర్చు చేస్తున్న మొత్తం 2,000...కొన్ని చోట్ల భూగర్భ జలాలు పడిపోవడంతో 2,000 అడుగుల లోతుకు వెళ్లినా చుక్క నీరు కనిపించడం లేదు..