హిందీ.. కనిపించదేందీ..!
స్వాతంత్య్ర సంగ్రామంలో దేశాన్ని ఏకం చేసింది. బానిస సంకెళ్లను తెంచడానికి మాధ్యమంగా పనిచేసిన ఆయుధమది. తామంతా ఒక్కటేనని భారతీయులంతా గర్వంగా చాటేలా చేసింది. అందుకే.. ‘దేశ్‌కి ఆశా.. హిందీ భాషా..’ అని కీర్తినొందింది. మన దేశ రాజభాషగా.. ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే భాషల్లో ఒకటిగా పేరొందింది.
కానీ.. మన మాతృభాష తెలుగు లెక్కనే మన దేశభాష హిందీ కూడా కొంతకాలంగా గత వైభవాన్ని కోల్పోతోంది.త్రిభాషా సూత్రం ప్రకారం రెండోభాషగా మారిపోయిన హిందీ ప్రస్తుతం ఆంగ్లభాషతో పోరాడుతోంది. ఒకప్పుడు ఆంగ్లేయులపై పోరాడేందుకు దేశాన్ని ఏకం చేసిన హిందీ.. ప్రస్తుతం అస్థిత్వం కోసం ఆంగ్లభాషతోనే పోరాడే దుస్థితి చేరుకోవడం భాషాభిమానులను కలచివేస్తోంది. నేడు(సెప్టెంబర్-14) హిందీ భాషాదివస్ సందర్భంగా..
కామారెడ్డి: హిందీ వచ్చినవారు దేశంలో ఎక్కడికైనా వెళ్లి రావొచ్చు. ప్రతీరాష్ట్రంలో హిందీ మాట్లాడేవారుంటారు. చాలా రాష్ట్రాల్లో అధికారభాష కూడా హిందీయే. మనదేశంలో అధికశాతం ప్రజలు మాట్లాడటం వల్లే హిందీని రాజభాషగా గుర్తించారు. భారత ప్రభుత్వం హిందీని రాజభాషగా గుర్తిస్తూ 1949 సెప్టెంబర్ 14న చట్టం కూడా చేసింది. ఆ రోజునే హిందీ దివస్‌గా పేర్కొంటూ, ప్రతిఏటా సెప్టెంబర్ 14 న హిందీ భాషా ప్రాముఖ్యతపై కార్యక్రమాలు చేపడుతున్నారు.
జాతీయ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు హిందీ తోడ్పడుతుంది. ఐక్యరాజ్య సమితిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హిందీలో ప్రసంగించి దాని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటారు. హిందీని జాతీయ భాషగా చేయడంలో గాంధీజీ పాత్ర ఎంతో ఉంద ని చెబుతారు. హిందీ భాష ప్రచారంలో ప్రచార సభలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ప్రాచీన సాహిత్యకారులైన కబీర్దాస్, తులసీదాస్, సూర్దాస్, మీరాబాయి లాంటి మహాకవులు, బీజక్, రామచరితమానస్, సూర్సారావలి, మీరాబాయికే పద్ లాంటి మహాకావ్యాలు హిందీ భాషకు సొంతం.
సులువైన భాషగా
రాయడానికైనా, చదవడానికైనా హిందీ సులభమైనదిగా గుర్తింపు పొందింది. అవధి, బ్రజ్, సదుఖ్ఖడీ భాషల నుంచే హిందీ భాష రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది. ఖడీబోలీగా పిలవబడే హిందీభాష యొక్క లిపి దేవనాగరి. ఇందులో ఏదైతే రాస్తామో.. అదే చదువతాం. సులువైన, సరళమైన, మధురమైన భాషగా హిందీ భాషాభిమానులు కొనియాడుతారు. ప్రతీయేటా సెప్టెంబర్ 14న వివిధ కార్యక్రమాలు చేపట్టి భాషా ప్రాముఖ్యతను వివరిస్తుంటారు.
దేశభాషకు తగ్గుతున్న ఆదరణ
అన్ని మాతృభాషల లెక్కనే రాజభాష హిందీకీ ఆదరణ తగ్గుతోంది. ఆంగ్ల మాధ్యమం విస్తరించడం, విద్య, ఉద్యోగాలన్నింటా ఇంగ్లీష్దే రాజ్యం కావడంతో మిగితా భాషలు దెబ్బతింటున్నాయి. పదో తరగతి వరకు హిందీ పాఠ్యపుస్తకం ఉంటుంది. అయితే హిందీని కేవలం పరీక్షకే పరిమితం చేసుకుని బట్టీ పట్టడం ద్వారా పరీక్షలో పాసవుతున్నా రు తప్పా భాష నేర్చుకు నే ప్రయత్నం విద్యార్థులు చేయడం లేదు. ము నుపటిలా ఉపాధ్యాయులు కూడా అందుకు ప్రోత్సహించడం తగ్గింది. ఇంటర్మీడియట్‌కు వచ్చేసరికి హిందీకి బదులు ఎక్కువ మా ర్కులు సంపాదించేందుకు గాను సెకండ్ లాంగ్వేజ్ కింద సంస్కృతాన్ని ఎంచుకుంటున్నారు.
ఇలా తెలుగు, హిందీ భాషలకు ఆదరణ తగ్గుతోంది. కేవలం పాఠశాల ల్లో హిందీ ఉపాధ్యాయ పోస్టుల కోసం హిం దీ పండిత్ శిక్షణ పొందుతున్నారు. హిందీ పండిత్ శిక్షణా కళాశాలలు అక్కడక్కడ ఉ న్నా అవి భాషను వృద్ధి చేయడానికి ఉపయోగపడటం లేదన్న ఆరోపణలున్నాయి. కేవలం పరీక్షలు రాయించి పట్టాలు ఇవ్వడానికే అవి దోహదపడుతున్నాయి. దీంతో హిందీ భాష రోజురోజుకూ దెబ్బతింటోంది. గతమెంతో వైభవం కలిగిన రాజభాష ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురికావడం పట్ల హిందీ భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందీ భాషను ప్రోత్సహించాలని కోరుతున్నారు.
హిందీని ప్రోత్సహించాలి
స్వాతంత్య్ర కాలం నుంచి హిందీ భాష దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది. ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతోనే హిందీభాషకు ప్రాధాన్యత తగ్గుతోంది. ప్రీ ప్రైమరీ నుంచే హిందీ భాషను బోధించే విధంగా చర్యలు తీసుకోవాలి. హిందీ భాషా పండితుల పోస్టులను పెంచి భాషాభివృద్ధికి కృషి చేయాలి. అన్నింటా ఇంగ్లిషును ప్రోత్సహించడం వల్ల హిందీ, తెలుగు భాషలు దెబ్బతింటున్నాయి.
-గఫూర్ శిక్షక్, పండిత పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు