No Safety
-
కాలువలోనే కడుక్కోవాలి!
హిరమండలం: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు కల్పించడంలో విఫలమవుతున్నారంటూ సుప్రీం కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేస్తున్నా సర్కార్ తీరులో మార్పు రావడం లేదు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా స్పందించడం లేదు. ఇటీవల సర్కార్ బడుల్లో వరుసగా జరిగిన సంఘటనలే వీటిని తేటతెల్లం చేస్తున్నాయి. జి.సిగడాం కేజీబీవీలో కలుషిత ఆహారం తిని 20 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జిల్లాలో విద్యావ్యవస్థపై ఆ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న పర్యవేక్షణకు అద్దం పడుతుంది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు లేవు. ఉన్నచోట వినియోగించడంలో ఉపాధ్యాయులు విఫలమవుతున్నారు. సర్కార్ విద్యకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. హిరమండలం మండలంలోని గొట్టా గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రస్తుతం 110 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో తాగునీటి సదుపాయం ఉన్నప్పటికీ కొందరు ఉపాధ్యాయుల తీరు వల్ల విద్యార్థులు పక్కనున్న మురుగు కాలువకు వెళుతున్నారు. రోజూ మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు ప్లేట్లు పట్టుకొని పాఠశాల సమీపంలో ఉన్న ఎన్ఎమ్ రహదారి పక్కనున్న కాలువకు వెళుతున్నారు. కాలువలో దిగి ప్లేట్లు, చేతులు కడుక్కొని తిరిగి గెంతులేసుకుంటూ పాఠశాలకు వస్తున్నారు. రహదారి పక్కనున్న కాలువకు వెళుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో నని, కాలువలో నీటితో విద్యార్థులు చేతులు, ప్లేట్లు కడుక్కోవడంతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కూడా ఎప్పటిలాగే విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ప్లేట్లును కాలువలో కడుగుతున్నారు. అయితే పక్క గ్రామంలో జరుగుతున్న జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఆర్వీఎం అధికారి శ్రీనివాసరావు విద్యార్థులు పడుతున్న బాధను చూసి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు, మురుగునీరు చెత్తతో కూడిన కుండీని చూసి, పరిసరాలు అధ్వానంగా ఉండటంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.శ్రీనివాసరావు, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనంతరం బయటకు వెళ్లడానికి గల కారణాలు అడిగితెలుసుకున్నారు. ఇకపై విద్యార్థులు బయటకు వెళ్లకుండా రోజుకు ఒక ఉపాధ్యాయుడును పరిశీలనకు ఉంచాలన్నారు. ఇలా చెబుతున్న సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు వచ్చి మాట్లాడుతూ పాఠశాలలో తాగునీటి వసతి ఉన్నా పిల్లలను ఇలా మురుగు కాలువకు పంపడం ఏమిటని ప్రధానోపాధ్యాయులను పలుమార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోయిందన్నారు. దీనిపై గ్రామస్తులకు, ప్రధానోపాధ్యాయుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆర్వీఎం అధికారి కల్పించుకొని విద్యార్థుల తల్లిదండ్రులను, హెచ్ఎంను సముదాయించారు. పాఠశాలలో నీటి సౌకర్యం ఏర్పాటుచేసి విద్యార్థులకు భద్రత కల్పించాలన్నారు. ఇంకోసారి పిల్లలు బయటకు వెళ్లకుండా తాగునీటి వసతి కల్పించాలన్నారు. ఆయనతో పాటు సీఆర్పీ చంద్రరావు ఉన్నారు. -
ట్విన్ డ్యూటీ..భద్రతకు లేదు గ్యారంటీ
సాక్షి, రాజమండ్రి :ఆర్టీసీలో డ్రైవర్లకు విధినిర్వహణ కత్తిమీద సాముగా మారుతోంది. దూరప్రాంత సర్వీసుల్లో డ్రైవర్ కం కండర్లుగా పని చేయడం ప్రాణాలతో చెలగాటమవుతోంది. డ్రైవింగ్ చేస్తూ, టిక్కెట్లు ఇస్తూ, సమయపాలనకు సంబంధించిన ఒత్తిడి మధ్యే జమా ఖర్చులు చూసుకుంటూ, నగదును కాపాడుకుంటూ, ప్రయాణికుల రక్షణ బాధ్యతను మరువకుండా ఏకాగ్రత తెచ్చుకుంటూ అష్టావధానం చేయాల్సి వస్తోంది. వీరి పనిభారం అటు ప్రయాణికులకూ ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నా.. ఆర్టీసీ పట్టించుకోకుండా డ్రైవర్లపై ట్విన్ డ్యూటీ (జంట విధులు) మోపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై ఒత్తిడి పెంచే ఈ విధానం వారితో పాటు జనం భద్రతనూ పణం పెట్టడమేనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం అంటేనే అమ్మో అనే పరిస్థితికి దారి తీస్తోంది. ఒకే ఉద్యోగితో రెండు విధులు చేయిస్తున్నా.. ఆర్టీసీ పారితోషికం మాత్రం నామమాత్రంగా ఇస్తోంది. ఒకవేళ పారితోషికం అధికంగా ఇచ్చినా దానికోసం ఇంతటి ఒత్తిడితో ఉద్యోగం చేస్తే ఎంత వరకూ సురక్షితం అన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో ట్విన్ డ్యూటీ డ్రైవర్లు ఉంటున్నారు. హైదరాబాద్, అంతకు మించి దూరం ప్రయాణించే సర్వీసుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారని ఆర్టీసీ వాదిస్తోంది. కానీ వాస్తవంగా ఆ సర్వీసుల్లో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్లర్లు ఉండాలి. టిక్కెట్లు, ఇతర బాధ్యతలు కండక్టరు చూసుకుంటేనే డ్రైవర్లు కేవలం డ్రైవింగ్ మీదనే దృష్టి సారించగలుగుతారు. దీని వల్ల ప్రయాణం సురక్షితంగా జరుగుతుందన్న నిశ్చింతకు ఆస్కారం ఉంటుందని ఉద్యోగులు, ప్రయాణికులు అంటున్నారు. 1,759 మంది డ్రైవర్లు.. 1,326 మంది కండక్టర్లు ఆర్టీసీ క్రమంగా ట్విన్ డ్యూటీ డ్రైవర్ల సంఖ్యను పెంచుతూ కండక్టర్ల సంఖ్యను తగ్గించేస్తోంది. జిల్లాలోని తొమ్మిది డిపోల్లో 850కి పైగా సర్వీసులు వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటిలో 199 సర్వీసుల్లో డ్రైవర్లు ట్విన్ డ్యూటీలు చేస్తున్నారు. జిల్లాలో 1,759 మంది డ్రైవర్లు ఉంటే కండక్లర్ల సంఖ్య మాత్రం 1,326 మాత్రమే. జిల్లాలో 660 మంది డ్రైవర్లు ట్విన్ డ్యూటీలు చేస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణంగా ఈ డ్రైవర్లకు రోజుకు ఎనిమిది గంటలు డ్యూటీ ఉండాల్సి ఉండగా, సగటున 10 నుంచి 12 గంటలు డ్యూటీ చేస్తున్నారు. మరో వంక రెండు డ్యూటీలు చేస్తున్నందుకు సంస్థ ఇస్తున్న అదనపు పారితోషికం కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. కండక్టర్ విధులు కూడా చేసినందుకు కమీషన్ పద్ధతిలో చెల్లిస్తున్నారు. ఒక ఉద్యోగి చెప్పిన వివరాల ప్రకారం రూ.24 కంటే ఎక్కువ టిక్కెట్ జారీ చేస్తే ఒక రూపాయి, రూ.124 దాటిన టిక్కెట్ జారీ చేస్తే రెండు రూపాయలు కమీషన్ ఇస్తారు. అంటే 40 నుంచి 60 మంది ప్రయాణించే బస్సులో డ్యూటీ ముగిసే సరికి వచ్చే కమిషన్ రూ.60 నుంచి రూ.80 ఉంటోందని డ్రైవర్లు అంటున్నారు.