breaking news
Nilit project
-
శంకుస్థాపనకే నీలిట్ ప్రాజెక్టు పరిమితం
ఎచ్చెర్ల: నీలిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ప్రాజెక్టు 2013 ఏప్రిల్‌లో టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం తర్లికొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి హాదాలో ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో స్థలం కొరత, మరో పక్క శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి దగ్గరగా లేకపోవడంతో మరో ప్రాంతం ఎంచు కోవాలని భావించారు. సరిగ్గా సాధారణ ఎన్నికలు నోటిఫికేషన్ ముందు 2014 ఫిబ్రవరి 28న కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నీలిట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. యూపీఏ ప్రభుత్వ సమయంలో ఈ రెండు శంకుస్థాపనలు జరిగాయి. అనంతరం ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. దీంతో నీలిట్ ప్రాజెక్టు తెరమరుగయ్యింది. ప్రస్తుతం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శిలాఫలకం వెక్కిరిస్తోంది. దేశంలో నీలిట్ ప్రాజెక్టులు 23 ఉన్నాయని, 24వ ప్రాజెక్టు నిర్మాణం జిల్లాకు గర్వకారణంగా అప్పట్లో నేతలు, అధికారులు చెప్పుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.50 కోట్లలో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నట్టు అధికారులు ప్రకటించారు. 10వ తరగతి, ఆపై చదువులు చదివిన విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో శిక్షణ ఇచ్చి, అనంతరం ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పి ంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగ పడడంతో పాటు, ఉపాధికి సైతం దోహద పడేది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం తెరమరుగయ్యింది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అశించిన యువకులకు నిరాశే మిగిలింది. మరో పక్క ఉన్నత స్థాయి వ్యక్తులు శంకు స్థానలు చేశాక ప్రాజెక్టులు కూడా నిలిచిపోతాయా అన్న అంశం సైతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టులు శాశ్వితం కావా అన్నది మరికొందరి వాదన. -
నీలిట్.. ఓటి ప్రాజెక్టే!
మంత్రులుగా తమ సొంత జిల్లా, నియోజకవర్గాలకు ప్రాజెక్టులు మంజూరు చేయించడం మంచిదే. ప్రజలకు మేలు చేసే పనులు ఆహ్వానించదగ్గవే. కానీ ఆందులోనూ రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే.. ఆచరణ సాధ్యమో కాదో.. ఆలోచించకుండా శిలాఫలకాలు వేసేస్తే.. అది ఖచ్చితంగా ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది. జిల్లాలో ప్రతిపాదించిన నీలిట్ ప్రాజెక్టు ఇటువంటి స్వార్థ రాజకీయానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఈ విషయంలో కేంద్ర సహాయ మంత్రి కృపారాణి చిత్తశుద్ధిపై అనుమానాలు రేగుతున్నాయి. ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టాలన్న రాజకీయ కోణమే తప్ప.. అసలు ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందన్న నమ్మకం కలగడం లేదు. అదెలా అంటారా?.. మీరే చదవండి.. ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్:...ఒకే జిల్లాకు రెండు నీలిట్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కేంద్రాలు మంజూరు చేశారా?! అని ఆశ్చర్యం, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారా?.. తొందర పడకండి.. ఈ రెండూ వేర్వేరు కాదు.. తర్లికొండపై ప్రతిపాదించిన ప్రాజెక్టు తాజాగా శ్రీకాకుళం ప్రాజెక్టుకు తరలివచ్చింది.. అంతే!..అదేమిటి.. సాక్షాత్తు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టే అటకెక్కి.. వేరే చోటుకు తరలిరావడమా?.. సీఎం వేసిన శిలాఫలాకానికే కాళ్లు వస్తే.. ఇంకెవరిని నమ్మాలి.. ఇప్పుడు వేసిన శిలాఫలకం కూడా తరలిపోదన్న నమ్మకం ఏమిటి?? అన్న అనుమానాలు రావచ్చు. మీ అనుమానాలు నిజమే.. తాజాగా నీలిట్ కేంద్రానికి ప్రతిపాదించిన శ్రీకాకుళం పాలిటెక్నిక్‌లో కూడా స్థలం కొరత వంటి సమస్యలు ఉన్నా కేంద్రమంత్రివర్యులు పట్టించుకోకుండా శిలాఫలకం వేసి.. తన చిత్తశుద్ధిపై తనే అనుమానాలు రేపుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. నిరుద్యోగ యువతకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేం దుకు కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ శ్రీకాకుళం జిల్లాకు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నీలిట్ కేంద్రాన్ని మం జూరు చేసింది. దేశంలో ప్రస్తుతం ఇటువంటివి 23 కేంద్రాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 24వ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్న కృపారాణి సహజంగా తన నియోజకవర్గం పరిధిలోని కోటబొమ్మాళి మండలం తర్లికొండపై దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, అట్టహాసంగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేత శంకుస్థాపన చేయించారు. అంతే అక్కడితో ఆ ముచ్చట ముగిసిపోయింది. కేంద్రం నిర్మాణానికి టెండర్లు లేవు.. అసలు ప్రాజెక్టులో కదలికే లేదు. శంకుస్థాపన జరిగిన తర్వాత ఈ ప్రాం తాన్ని పరిశీలించిన కేంద్ర బృందం ఇది అనుకూల ప్రాంతం కాదని తేల్చేసినట్లు సమాచారం. ఒక దశలో దీన్ని విశాఖకు తరలించాలన్న ప్రతిపాదన కూడా వచ్చినట్లు తెలిసింది. శ్రీకాకుళానికి తరలివచ్చిన తీరు.. వచ్చే నెలలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో తను ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన చేయించి, ప్రచారం చేసుకున్న ప్రాజెక్టు వేరే ప్రాంతానికి తరలిపోతే ఎన్నికల్లో తనకు మైనస్ అవుతుందని కేంద్రమంత్రి ఆందోళన చెందారు. ఐటీ శాఖకే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె తన పలుకుబడి ఉపయోగించి వేరే జిల్లాకు కాకుండా తన జిల్లాలోని.. అదీ తన లోక్‌సభ నియోజకవర్గ కేంద్రమైన శ్రీకాకుళానికి మార్చేలా ప్రయత్నించి, సఫలమయ్యారు. ఫలితంగా తర్లికొండపై శంకుస్థాపన చేసుకున్న పది నెలలకు నీలిట్ కేంద్రం శ్రీకాకుళం పాలిటెక్నిక్‌కు తరలివచ్చింది. మరోసారి కృపారాణి చేత శంకుస్థాపన చేయించుకుంది. ఎలా అయినా మన జిల్లా నుంచి ఈ ప్రాజెక్టు తరలిపోనందుకు కాస్త సంతోషంగానే ఉన్నా.. ఇంకా కొన్ని అనుమానాలు పీడిస్తూనే ఉన్నాయి. అవేమిటంటే.. తర్లికొండలాగే శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్‌లోనూ కేంద్రం ఏర్పాటుకు అనువైన పరిస్థితులు లేవని తెలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ స్థలం కొరత ఉంది. ఈ కారణంతోనే గతంలో ఇక్కడ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నా ప్రభుత్వం మంజూరు చేయాలేదు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా పాలిటెక్నిక్ క్రీడా మైదానంలో నీలిట్ కేంద్రానికి శంకుస్థాపన చేసేశారు. దీంతో ఇక్కడైనా ఇది కార్యరూపం దాల్చుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఓట్ల లెక్కలే తప్ప.. రెండుసార్లు శంకుస్థాపనలు చేసుకున్న నీలిట్పై సందేహాల నీలినీడలు తొలగకపోవడానికి కేంద్రమంత్రి అనాలోచిత, రాజకీయ నిర్ణయాలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయాలంటే.. సాధ్యాసాధ్యాలు, స్థల పరిశీలన, ఇతర వనరులు, సౌకర్యాలు ఉన్నాయా.. లేవా.. తదితర అన్ని అంశాలు నిశితంగా పరిశీలించిన తర్వాతే మంజూరు చేయాలి. అందులోనూ సీఎం స్థాయి వ్యక్తి శంకుస్థాపన చేస్తున్నారంటే అది ఖచ్చితంగా ఆచరణలోకి వచ్చేలా.. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నీలిట్ విషయంలో అవేవీ లేకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న యావేతోనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల నీలిట్పై అనుమానాలు వీడటం లేదు. అప్పుడు సీఎం.. 2013 ఏప్రిల్ 16.. కోటబొమ్మాళి మండలం తర్లికొండపై నీలిట్ కేంద్ర నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయ మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కిల్లి కృపారాణి ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాజెక్టును మంజూరు చేయించారని అప్పట్లో భారీ ప్రచారం. ఇప్పుడు కేంద్రమంత్రి.. 2014 ఫిబ్రవరి 28.. శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్‌లో నీలిట్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి కృపారాణి శంకుస్థాపన శిలాఫలకం వేశారు. రూ.50 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టును మంజూరు చేయించినట్లు ఆమె ఘనంగా ప్రకటించారు.