breaking news
Music maestro
-
నా మాటలు కొందరికి కడుపు మంటగా ఉన్నాయి: ఇళయరాజా
సంగీత జ్ఞానిగా ఇళయరాజా(Ilayaraja) ఎంతో పేరు సాధించారు. ఆయన సంగీత ప్రయాణంలో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు. 1976లో అన్నకిలి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో 1500 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా 7 వేలకు పైగా పాటలు రాసిన ఘనత ఆయనదే.. ఇప్పటి తరం వారు కూడా ఆయన సంగీతానికి ఫిదా అవుతారు. మైమరిచి ఆయన పాటలు వింటారు. 35 రోజుల్లో సింపోనిని రూపొందించవచ్చని నిరూపించిన సంగీత జ్ఞాని ఇళయరాజా. అయితే ఈయనపై వివాదాలు లేవని చెప్పలేం. ఇటీవల ఇళయరాజా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ... 'నేను సంగీతాన్ని అందించిన పలు పాటల ద్వారా వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేసి మీకు నేర్పించాను. సంగీత దర్శకులు మొజార్ట్, పోతోవన్ బంటి పేర్లు మీకందరికీ ఎలా తెలుసు ? వారి గురించి మీకు చెప్పింది ఎవరు? నేనే వారిని మీకు పరిచయం చేశాను. ఒక సంగీత అభిమానికి పలు విధాలుగా ప్రపంచ సంగీతాన్ని నా పాటల ద్వారా పరిచయం చేశాను. నేను సింపోనిని రూపొందించాను. అంటే నాకు సంగీతం అంటే అంత ఆసక్తి అని మీరు తెలుసుకోవాలి. ఇలా అనడం కొందరికి కడుపు మంట కావచ్చు.అయితే నా సంగీతం అందరి జీవితాల్లోనూ ఉంటుంది. అలాగని మీరు అడగ్గానే సంగీతాన్ని అందిస్తే నేను శరవణ భవనం (హోటల్) అవుతాను. నా సంగీతాన్ని విని చిన్న బిడ్డ తిరిగి ప్రాణం పోసుకుంది. ఒక ఏనుగుల గుంపు నా పాటలు వినడానికి వచ్చాయి. ఇవన్నీ చెబితే నాకు గర్వం, పొగరు అంటారు. అయినా గర్వం నాకు గాక వేరే వారికి ఎందుకు వస్తుంది? నిజమే నాకు పొగరు ఎక్కువే. ప్రపంచంలోనే ఎవరు చేయలేని దానిని నేను చేశాను. అలాంటప్పుడు నాకేగా పొగరు ఉండాలి. ప్రతిభ ఉన్నవారికే గర్వం ఉంటుంది.' అని ఇళయరాజా పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) కన్నుమూశారు. గతనెల కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జన్మించిన రషీద్ ఖాన్ జబ్ వి మెట్ అనే బాలీవుడ్ చిత్రంలోని ఆవోగే జబ్ తుమ్ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. కళారంగంలో ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2006లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. 2022లో పద్మభూషణ్ అవార్డ్ ప్రదానం చేసింది. -
పొంగిపొర్లే సంగీత తరంగం... ఇళయరాజా!
గ్రేట్ పర్సనాలిటీ నాలుగు దశాబ్దాలు.. ఎనిమిది వందల సినిమాలు.. నాలుగు వేలకు పైగా పాటలు.. సంగీత జ్ఞాని, మ్యాస్ట్రో ఇళయరాజా పరిచయానికి ఈ గణాంకాలు సరిపోవు. అంతకు మించిన ఘనకీర్తి ఆయన సొంతం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మధ్యతరగతి స్వభావం ఆయనది. గడచిన మూడు దశాబ్దాలుగా దక్షిణ భారత సంగీత ప్రపంచాన ఏకఛత్రాధిపత్యం వహించినా ఆయనలో కించిత్ గర్వం కనిపించదు. ఇదే ఇళయరాజాను అత్యుత్తమ స్థానంలో నిలిపిందంటే సందేహం ఎంతమాత్రమూ లేదు. భారత దేశపు గ్రేటెస్ట్ మ్యుజీషియన్.. మ్యాస్ట్రో జీవిత విశేషాలు తెలుసుకుందాం..! వినసొంపైన సంగీతానికి మారుపేరు ఇళయరాజా. చెన్నైలో నివాసముండే ఈయన, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఏళ్లుగా సంగీతాన్ని సృష్టిస్తున్న ఈ సంగీత మేధావి ఇటీవలి కాలంలో కాస్తంత విశ్రమించారు. అయినప్పటికీ మ్యాస్ట్రో గీతాలాపన మాత్రం ఆగటంలేదు. అప్పుడెప్పుడో ఆయన వాడిపారేసిన సంగీతపు ఎంగిలి మెతుకులను నేటికీ ఏరుకుంటున్నారు దర్శకులు (ఆయన అంగీకారంతోనే). ఆ మధ్య వచ్చిన హిందీ చిత్రం 'పా', ఇటీవలి 'ఎవడే సుబ్రమణ్యం' లాంటివి ఇందుకు ఉదాహరణలు. బాల్యం.. తమిళనాడులోని పన్నైపురం గ్రామంలో 1943, జూన్ 2న రామస్వామి, చిన్నతాయమ్మాళ్ దంపతులకు మూడో కుమారుడిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయిక ప్రాంతంలో పెరగడం వల్ల రైతులు పాడుకునే పాటలతో ఆయనకు జానపద సంగీత పరిచయం కలిగింది. తన 14వ ఏట సోదరుడు పావలార్ వరదరాజన్‌తో కలిసి ఇళయరాజా సంగీత కచేరీల్లో పాల్గొనేవారు. ఈ కాలంలోనే కన్నదాసన్ అనే తమిళ కవి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా రాసిన కవితకు మొదటిసారిగా బాణీలు కట్టారు. అభ్యాసం.. సంగీతాన్ని వృత్తిగా చేసుకుని స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరమని గ్రహించిన ఇళయరాజా 1968లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ధనరాజ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో పరిచయం ఏర్పడింది. దీంతో బేక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ వంటి పాశ్చాత్య సంగీత దిగ్గజాల శైలిని తెలుసుకోగలిగారు. వీరు ఇళయరాజా బాణీలను ఎంతగానో ప్రభావితం చేశారు. శాస్త్రీయ సంగీతాన్ని లండన్‌లోని ట్రినిటీ సంగీత కళాశాలలో అభ్యసించిన ఆయన.. అక్కడే సంప్రదాయ గిటార్లో బంగారు పతకాన్ని కూడా పొందారు. సినిమాలు.. మొదట చెన్నైలోని శుభకార్యాలు, సభల్లో సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యుడిగా ఇళయరాజా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తరువాతి కాలంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సలీల్ చౌదురి, కన్నడ సంగీత దర్శకుడు జి.కె.వెంకటేశ్ దగ్గర సహాయకుడిగా చేరారు. వీరి దగ్గర గిటార్, కీబోర్డు కళాకారుడిగా పనిచేయడంతో సినీ పరిశ్రమతో అనుబంధం మొదలైంది. వెంకటేశ్ దగ్గరే దాదాపు 200 చిత్రాలకు పైగా పనిచేశారు. ఈ సమయంలోనే పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాతతో పరిచయం ఏర్పడింది. 1976లో ఆయన అవకాశం ఇవ్వడంతో 'అన్నక్కలి' అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తనదైన ముద్ర.. ఇళయరాజా వస్తూనే భారతీయ సినీ సంగీతంపై తనదైన ముద్ర వేయసాగారు. ఎన్నో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు. పాశ్యాత్య సంగీతానికి చెందిన వివిధ వాయిద్యాలను ప్రవేశపెట్టి సరికొత్త సంగీతాన్ని సృష్టించారు. దీంతో సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవ్వడమే గాక, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ లభించేది. సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా సంగీత ఆల్బమ్‌లను కూడా రూపొందించారు. కర్ణాటక సంగీతకారుడు త్యాగరాజుకు అంకితమిచ్చిన 'హౌ టూ నేమిట్' 'నథింగ్ బట్ విండ్' లాంటి ఆల్బమ్‌లు చెప్పుకోదగ్గవి. ప్రపంచం మెచ్చిన పాట.. ఇళయరాజా స్వరపరిచిన దళపతి సినిమాలోని 'చిలకమ్మా చిటికెయ్యంగా' పాట 2003లో ప్రఖ్యాత బీబీసీ సంస్థ 155 దేశాల్లో నిర్వహించిన పోల్‌లో నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ సంగీత సామ్రాట్టుకు దక్కిన అతిపెద్ద గౌరవంగా దీన్ని పరిగణిస్తారు. ఈయన సంగీత సారథ్యం వహించిన 'నాయకుడు' సినిమా టైమ్ మ్యాగజైన్ వారి టాప్-100 సినిమాల జాబితాలో నిలిచింది. గౌరవాలు.. తెలుగు చిత్రాలైన సాగర సంగమం (1984), రుద్రవీణ (1989)తో పాటు 1985లో వచ్చిన తమిళ సినిమా ‘సింధు భైరవి’లకు మూడుసార్లు 'జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు' పురస్కారాన్ని అందుకున్నారు. 2010లో వచ్చిన 'పళసి రాజా' అనే మళయాల చిత్రానికిగానూ ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో జాతీయ అవార్డు గెలుపొందారు. 2004లో ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం, 2010లో పద్మభూషణ్ అవార్డు స్వీకరించారు.