breaking news
Minister yanamala Rama Krishna
-
లక్ష ఉద్యోగాలు హుష్‌కాకి!
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై చంద్రబాబు సర్కారు కాకిలెక్కలు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బాబుకు ఓటేస్తే జాబు వస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అన్నారు. ఇలా ఎన్నికల ముందు నిరుద్యోగులను మురిపించారు. అపుడు ఎన్నో కాకమ్మ కథలు చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఓట్లేయించుకున్న తర్వాత ప్లేటు ఫిరాయించారు. క్రమబద్ధీకరణ మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే తీసేస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా రెండేళ్లు గడిపేశారు. ఇపుడు ప్రభుత్వఉద్యోగాల ఖాళీలపై మరో కథ సిద్ధం చేశారు. ఉన్న ఖాళీలను దాచిపెట్టి కొన్ని ఖాళీలను మాత్రమే చూపిస్తున్నారు. నిరుద్యోగులను మరోసారి బురిడీ కొట్టించడానికి లెక్కలు సిద్ధం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు తమను మరోసారి మోసం చేయడానికి సిద్ధం కావడంపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం.. ఇపుడు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలపై కాకిలెక్కలతో నిరుద్యోగులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తోంది. ఒకపక్క దశల వారీగా 20 వేల ఖాళీలను భర్తీ చేస్తామని చెబుతూ, మరోపక్క సుమారు లక్ష ఉద్యోగ ఖాళీలకు ఎసరు పెడుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఆర్థిక శాఖ గణాంకాలు సమర్పించింది. ఇందులో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలు కాగా అందులో 77,737 ఖాళీలున్నట్లు వివరించింది. ఈ ఖాళీల్లో 20 వేల వరకు దశలవారీగా భర్తీచేస్తామని పేర్కొంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో 13 జిల్లాల అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 1,42,825 ఉద్యోగ ఖాళీలున్నట్లు ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమలనాథన్ కమిటీకి నివేదించింది. 2014 జూన్ 2 తరువాత ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్లకు పెంచడంతో ఆ గడువు తీరిన వారు ఈ జూన్‌లో దాదాపు 30 వేల మంది రిటైర్ కానున్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం ఖాళీలు 1,72,825 అవుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 77,737 ఖాళీలు మాత్రమే ఉన్నట్లు చెబుతోంది. మరి విభజన తరువాత రాష్ట్రంలో ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల (1,72,825)లో మిగతా 95,088 పోస్టులు ఏమైనట్లు? ఎక్కడికి పోయినట్లు?. ఇపుడు ఇదే ప్రశ్న నిరుద్యోగుల్ని వేధిస్తోంది. ఇన్ని వేల ఖాళీలను ప్రభుత్వం కుదించి చూపించడంపై వారిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దశలవారీగా 20 వేల పోసుల భర్తీ ప్రకటనపైనా సందేహాలు నెలకొంటున్నాయి. ఎందుకంటే 10,313 టీచర్ పోస్టుల భర్తీకోసం 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షలు నిర్వహించి నెలలైనా ఇప్పటికి ఒక్కరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నియామకాలు న్యాయవివాదాల్లో ఇరుక్కునేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి భర్తీలు జరక్కుండా ఎత్తుగడ వేస్తోందని, ఇందుకు తార్కాణం 2014 డీఎస్సీనేనని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఏమేరకు ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి? నియామకాల ఉత్తర్వుల జారీ వరకు ప్రక్రియ నడుస్తుందా? అనేది ప్రశ్నార్థకమేనని చెబుతున్నారు. నిరాశలో నిరుద్యోగులు.. పొరుగురాష్ట్రం తెలంగాణలో నోటిఫికేషన్లు వరుసగా వస్తుంటే.. ఏపీలో విభజన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ వెలువడలేదు. నిరుద్యోగుల్లో నిరాశ పెరిగిపోతోంది. లక్షకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకోసం బాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వారిలో అసహనం పెరిగిపోతోంది. మరోవైపు ఖాళీ పోస్టుల భర్తీకి వీలుగా వివిధ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వ అనుమతులకోసం ఏపీపీఎస్సీ నిరీక్షిస్తోంది. అనుమతులు రాగానే నోటిఫికేషన్ల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. అవసరం మేరకే భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినందున ఖాళీ పోస్టుల్లో ఏ మేరకు భర్తీకి అనుమతి లభిస్తుందనేది సందేహమే. ఖాళీల సంఖ్యను భారీగా కుదించడం ఇపుడు నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. పరిమితంగానే భర్తీ.. పరిమితంగానే భర్తీ అని ప్రభుత్వం సంకేతాలిచ్చినందున.. చాలా తక్కువ పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించే అవకాశాలున్నట్టు ఏపీపీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ మేరకు ముందుగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపవచ్చని అభిప్రాయపడుతున్నాయి. కమల నాథన్ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే గ్రూప్-1కు సంబంధించి 247 వరకు ఖాళీలున్నాయి. ఇవికాక ఆ తర్వాత ఖాళీ అయిన పోస్టులు మరిన్ని ఉన్నాయి. అయినా అవేవీ భర్తీ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. గ్రూప్-2లోనూ వేలాది పోస్టులున్నా 900 పోస్టుల భర్తీకే ప్రభుత్వం అనుమతించే వీలుందని, వైద్యుల పోస్టులు 400, సివిల్ ఇంజనీర్ పోస్టులు 500 వరకు భర్తీకి అనుమతి రావచ్చని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్-1లో 100, గ్రూప్-2లో 900 పోస్టుల వరకు భర్తీకి మాత్రమే అనుమతి రావచ్చంటున్నారు. అదే నిజమైతే లక్షలాది నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు కుమ్మరించినట్టే అవుతుంది. సిలబస్‌లో మార్పులు.. అన్ని పోస్టుల భర్తీకి అనుమతి రావచ్చన్న ఉద్దేశంతో ఇటీవల గ్రూప్-1, గ్రూప్-2 , గ్రూప్-4 సిలబస్‌లో ఏపీపీఎస్సీ మార్పు చేయించింది. ఇప్పటికే మార్పులు చేసిన సిలబస్‌పై నిపుణుల నుంచి అభిప్రాయాలూ సేకరించింది. ఇందులో 1,236 మంది అభిప్రాయాలు తెలిపారు. మార్పులకు వీలుగా సిలబస్ రూపకల్పన కమిటీకి ఆ సూచనలు పంపించారు. కొద్దిరోజుల్లో సిలబస్‌లను ఏపీపీఎస్సీ ఖరా రు చేయనుంది. గ్రూప్-4 సిలబస్‌నూ సిద్ధం చేసినా ముందుగా పెరైండు గ్రూపుల సిలబస్‌లలో మార్పుల్ని ఖరారు చేయనున్నారు. వర్సిటీ పోస్టుల భర్తీకీ అడ్డంకులు యూనివర్సిటీల్లో 1,000 వరకు బోధనా సిబ్బంది పోస్టుల్ని భర్తీచేస్తామని ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆర్థికశాఖ మాత్రం ఈ పోస్టులన్నిటికీ ఒకేసారి అనుమతి ఇవ్వట్లేదని సమాచారం. వీటిని మూడు దశల్లో భర్తీచేసుకోవాలని ఆర్థిక శాఖ చెప్పినట్లు తెలుస్తోంది. వర్సిటీల వారీగా గతంలో చేసిన నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న ప్రభుత్వం.. పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంటు బోర్డును ఏర్పాటుచేయాలని యోచి స్తోంది. దీనికి యూజీసీ అనుమతించే పరిస్థితి లేకపోవడంతో ఏపీపీఎస్సీ ద్వారా సెట్‌ను నిర్వహించి ఈ పోస్టుల్ని భర్తీచేయాలని నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగాలెన్ని? రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంతనేదానిపై ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4,88,485గా చూపారు. అయితే గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్య విధాన పత్రంలో మాత్రం 5,18,257 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నట్లు పేర్కొన్నారు. గ తేడాది లెక్కలతో పోల్చితే ఈ ఏడు 29,772 మంది తగ్గిపోయారు. తాజాగా కేబినెట్ సమావేశంలో ఆ సంఖ్యను 4.83 వేలకు కుదించారు. అదే సమయంలో కమలనాథన్ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6,97,621గా ఉండడం గమనించాల్సిన విషయం. -
మీ పాలనలో నరకం చూస్తున్నాం
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల వ్యాపారుల ఆవేదన సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నరకం చూపిస్తున్నారు. మాపై వేధింపులు ఎక్కువయ్యాయి. చీటికీ మాటికీ తనిఖీలు, దాడులు చేస్తూ జరిమానాల మీద జరిమానాలేస్తున్నారు. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. వే బిల్లు, లోకల్ వే బిల్లు, జంబ్లింగ్ అంటూ వేధిస్తున్నారు. మమ్మల్ని చంబల్ లోయ దొంగల్లా చూస్తున్నారు. శత్రువుల్లా పరిగణిస్తున్నారు. అధికారుల వేధింపులను భరించలేకపోతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల మాదిరిగా మేం కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే... ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిర్వహించిన సమావేశంలో చిన్న వ్యాపారుల ఆవేదన ఇదీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత తమపై వేధింపులు ఎక్కువయ్యాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఒత్తిళ్లు, అధికారుల వేధింపుల పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ట్రేడర్స్‌తో రాష్ర్ట ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమైన సందర్భంగా పలువురు వ్యాపారులు మాట్లాడారు. రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ... ‘‘సేల్స్ ట్యాక్స్ అధికారులకు, వ్యాపారులకు మధ్య సుహృద్భావ వాతావరణం లేదు. జంబ్లింగ్ పేరిట అధికారులు వేధిస్తూ నరకం చూపిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎక్కువగా నష్టపోయింది వ్యాపారులే. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో చిల్లర వర్తకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రూ.5 వేలు.. రూ.10 వేల విలువైన స్టాక్ తెచ్చుకునే వారిని సైతం అడ్వాన్స్ వే బిల్లులంటూ తనిఖీల పేరిట వేధిస్తున్నారు. ఈరోజు ఎవరైనా సరే ఐదారు శాతం మార్జిన్ కోసమే వ్యాపారం చేస్తున్నారు. అమ్మకాల్లేక అద్దెలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులను దొంగల్లా చూస్తారా?’’ అని నిలదీశారు. రిక్షాలో తీసుకెళ్లినా వే బిల్లులా? మోటార్ వాహనాలపై తీసుకెళ్లే సరుకులకే వే బిల్లులు ఇవ్వాలని చట్టంలో ఉందని విశాఖ స్టీల్ అండ్ సిమెంట్ అసోసియేషన్ ప్రతినిధి పాలూరి సూర్యనారాయణ చెప్పారు. అయితే, రిక్షాలు, తోపుడుబండ్లపై తీసుకెళ్లే ఐరన్ వంటి వాటికి కూడా వే బిల్లులు కావాలంటూ అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయిని పరిగణనలోకి తీసుకోకుండా భారీగా వసూళ్ల లక్ష్యాలను నిర్దేశిస్తుండడంతో కిందిస్థాయి అధికారులు ఒత్తిడికి గురవుతున్నారని విజయనగరం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కో చైర్మన్ ఆశీష్‌కుమార్ పేర్కొన్నారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలున్నా రూ.వేలల్లో అపరాధ రుసుంలు వేస్తున్నారని ఆరోపించారు. అందరినీ ఒకే గాటన కట్టొద్దు బోగస్ డీలర్లను గుర్తించేందుకు అధికారులు అడ్వైజరీ విజిట్స్ చేస్తున్నారని విజయనగరం జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎన్.వి.చలం చెప్పారు. అయితే, ముప్పై ఏళ్లుగా వ్యాపారాలు చేస్తూ క్రమం తప్పకుండా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసి, సకాలంలో పన్నులు చెల్లించే వారిని కూడా దొంగల్లా సంస్థల ముందు నిలబెట్టి ఫొటోలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు కట్టని వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప అందరినీ ఒకే గాటన కట్టడం సరి కాదని అన్నారు. దాదాపు రూ.10 వేల విలువైన సరుకు తెచ్చుకునేవారిని కూడా అడ్వాన్స్ వే బిల్లు కోసం ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మాకింత లక్ష్యం విధించారు. చిన్న పొరపాటే కదా అని వదిలేస్తే మా లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాం.. అని అధికారులు చెబుతున్నారని వివరించారు. చిన్నచిన్న లోపాలున్నా వదలడం లేదు లోకల్ వే బిల్లు వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని విశాఖ మార్బల్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహారావు అన్నారు. ప్రధానంగా చెక్‌పోస్టుల వద్ద వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. చిన్న చిన్న సాంకేతిక లోపాలున్నా వేధిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే వ్యాపారులు తీవ్రంగా వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నాం.. పన్నులు చెల్లించండి: యనమల ‘‘తీవ్రమైన ఆర్థిక లోటు కారణంగా రాష్ర్ట ప్రభుత్వం కష్టాల్లో ఉంది. వ్యాపారులంతా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను సక్రమంగా, సకాలంలో చెల్లించి తమ వంతు సహకారాన్ని అందించాలి’’ అని మంత్రి యనమల కోరారు. పన్నుల సక్రమంగా చెల్లిస్తే ఎలాంటి వేధింపులు ఉండవని, చెల్లించకపోతే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎగవేతకు తావులేని పన్నుల వ్యవస్థను రూపొందించేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. పన్నుల వసూళ్ల విషయంలో అధికారులకున్న విశేష అధికారాలను తగ్గిస్తామని చెప్పారు. పన్నుల చెల్లింపుల్లో అటోమేటిక్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. వ్యాపారుల నుంచి రూ.2 వేల కోట్లు రావాల్సి ఉందని, వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా ఈ సొమ్ము వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లో 500 ఎకరాల విస్తీర్ణాల్లో ట్రేడ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.