తెలుగు తేజం సంచలనం
అమెరికా ఏసీటీ పరీక్షలో ప్రపంచ ఫస్ట్ ర్యాంకు సాధించిన సాయిఆకాశ్
భారీ ఆఫర్స్‌తో ముందుకొచ్చిన ప్రముఖ వర్సిటీలు
విజయవాడ (లబ్బీపేట): అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఏసీటీ (అమెరికన్ కాలేజ్ టెస్ట్) పరీక్షలో తెలుగు విద్యార్థి అరుదైన రికార్డు సాధించాడు. విజయవాడ సూపర్‌విజ్ అధినేత గుప్తా కుమారుడు మామిడి సాయిఆకాశ్ ఏసీటీ పరీక్షలో 36 పాయింట్లకు 36 పాయింట్లు సాధించి ప్రపంచ ఫస్ట్ ర్యాంకుతో సత్తా చాటాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికాలోని 16 యూనివర్సిటీలు స్కాలర్షిప్లు అందించి మరీ ఆకాశ్‌ను తాము చేర్చుకుంటామంటూ స్వాగతిస్తున్నాయి.
స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏల్, ప్రిన్స్టన్, కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ, బ్రౌన్, డార్జ్‌మౌత్, డ్యూక్, మిషిగాన్, జార్జియా టెక్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, ఇల్లినాయిస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాండియాగో, రైస్ వంటి వర్సిటీలు సాయిఆకాశ్ ప్రవేశానికి ఆహ్వానం పలికాయి. స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ సాయిఆకాశ్ను కంప్యూటర్ సైన్స్‌లో చేర్చుకుంటామంటూ స్వాగతం పలికింది. ప్రతిష్టాత్మక ఐవీవై లీగ్ యూనివర్సిటీలో సీటు రావడం అరుదైన అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటిది సాయిఆకాశ్కు ఏకంగా ఐదు ఐవీవై లీగ్ వర్సిటీల్లో సీటు రావడం ఆయన ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోంది.
పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే లక్ష్యం: సాయిఆకాశ్
ఎంతో మంది విద్యార్థులను జాతీయస్థాయి ర్యాంకర్లుగా తీర్చిదిద్దిన సూపర్‌విజ్ గుప్తా తనయునిగా తనకు ప్రపంచస్థాయిలో ఫస్ట్ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని సాయిఆకాశ్ పేర్కొన్నారు. శనివారం సూపర్‌విజ్‌లో విలేకరులతో సాయిఆకాశ్.. తనకు వచ్చిన అడ్మిషన్ ఆఫర్స్‌ను చూపించారు. అమెరికాలో విద్య పూర్తి చేసినా, భవిష్యత్తులో పారిశ్రామికవేత్తగా మనదేశంలోనే స్థిరపడి దేశసేవ చేస్తానన్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోసం కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సాయిఆకాశ్ మెంటర్ సుభాష్‌బాబు పాల్గొన్నారు.