breaking news
Malladi Krishna nand
-
నిజాం నజరానా.. మహబూబియా
20 వ శతాబ్ది తొలినాళ్లలో నిజాం ప్రభువు హైదరాబాద్ నగర మహిళలకు ఇచ్చిన గొప్ప నజరానా మహబూబియా కళాశాల. ఆ నాటి పెద్దలు ఆడపిల్లలకు విద్యా గంధం సోకనిచ్చేవారు కాదు. 14 ఏళ్లయినా నిండకముందే పెళ్లి చే సి తల్లిదండ్రులు చేతులు దులుపుకునేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే చదువుకు అతివలను ఆమడ దూరంలో ఉంచేవారు. అలాంటి రోజుల్లో ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ నగర నారీమణులకు నజరానాగా మహబూబియా కళాశాలను బహూకరించారు. నిజాం ఆస్థానంలో పని చేస్తున్న సర్ జార్జ్ కాసన్ వాలర్-ఆయన భార్య కేసన్ వాలర్ నగర మహిళలందరి తరఫున, ఆడపిల్లల కోసం ఒక ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని పిటిషన్ తయారు చేసి నిజాం ప్రభువుకు అందజేశారు. దీనికి వెంటనే స్పందించిన నిజాం.. బాలికల పాఠశాల తక్షణం ఏర్పాటు చేయాల్సిందిగా తన ప్రధాన మంత్రి మహారాజా కిషన్ ప్రసాద్‌ని ఆదేశించారు.పాఠశాల నిర్వహణ కోసం నెలకు వెయ్యి రూపాయలు మంజూరు చేశారు. అంతేకాదు స్కూల్ మెయింటెనెన్స్ కోసం కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అధ్యక్షురాలిగా లేడీ కేసన్ వాలర్, బేగం ఖాదీవ్ జంగ్, అక్బర్ హైద్రీ, బేగం ముంతాజ్ యార్-ఉద్-డౌలా, సరోజినీ నాయుడు, సొరాభి జంషేడ్జీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఆ రకంగా 1907 ఫిబ్రవరి 1న నాంపల్లి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ భవనంలో (ప్రస్తుతం రాయల్ హోటల్ ఉన్న ప్రాంగణంలో) బాలికల పాఠశాల ప్రారంభమైంది.నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ ఏర్పాటు చేయడంతో ఈ స్కూల్ పేరు మహబూబియా పాఠశాలగా నామకరణం చేశారు. దీనికి తొలి ప్రిన్స్‌పాల్‌గా, ఆక్స్ఫర్డ్ వర్సిటీలో చదువుకున్న జెఫ్రీని నియమించారు. ఇంగ్లిష్ టీచర్‌గా వైష్, ఉర్దూ, పర్షియన్ పాఠాలు నేర్పేందుకు ఖుజిస్తా బేగంను నియమించారు. ఎంతో ఆర్భాటంగా ఆడపిల్లల కోసమని ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తే నలుగురు మాత్రమే స్కూల్లో చేరార ట. క్రమేణా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినా, 1908లో మూసీ వరదలు.. విద్యార్థినుల రాకను గట్టి దెబ్బతీశాయి. అయినా, సరోజినీ నాయుడు వంటి ప్రముఖుల చొరవతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో మరో టీచర్‌ను నియమించాలని నిజాంను కోరగా, అందుకు ఆయన తక్షణం అంగీకరించారు. మార్పు మొదలు.. మహబూబియా పాఠశాల ఏర్పాటయ్యాక బాలికల జీవన ప్రమాణాల్లో మార్పు మొదలైందని చరిత్రకారుల అభిప్రాయం. కట్టు, బొట్టు, నడవడిలో మార్పు వచ్చిందని చెబుతారు. జెఫ్రీ తర్వాత ఫ్లోరా వైల్డ్, బేతా వుడెన్ హైస్, హేండీ ఇలా ఒకరి తర్వాత మరొకరు ఆంగ్లేయ ప్రధానోపాధ్యాయులు మహబూబియా పాఠశాలలో పనిచేశారు. ఆ తర్వాత 1930 నుంచి 1947 దాకా పాఠశాలకు ఆఖరి ఆంగ్లేయ ప్రిన్సిపాల్‌గా చేసిన గ్రేస్ లినెల్లీ దీని అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు. 1947లో ఆమెను స్థానిక ఉమెన్స్ కాలేజీ ప్రిన్స్‌పాల్‌గా బదిలీ చేశారు. మహబూబియా పాఠశాల తొలి భారతీయ మహిళా ప్రిన్సిపాల్‌గా మేరీ నంది నియుక్తులయ్యారు. పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సరోజినీ నాయుడు తన కుటుంబంలోని ఆడపిల్లలందరూ మహబూబియాలోనే చదివేలా ప్రోత్సహించారు. కాలంతో మార్పు.. కాలక్రమంలో ఎందరికో విద్యాబుద్ధులు ప్రసాదించిన మహబూబియా పాఠశాల నేటి అవసరాలకు అనుగుణంగా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా వినూత్న తరహాలో ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇండో యూరోపియన్ శైలిలో, రాతి కట్టడాలతో, విశిష్ట రీతిలో, శైలిలో పది ఎకరాల విశాల ప్రాంగణంలో వున్న మహబూబియా కళాశాల నేడెందరినో ఆకర్షిస్తోంది. ఆధునిక విద్యా బోధనతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే రీతిలో నర్సింగ్, కంప్యూటర్లు, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ ట్రైనింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇక్కడ ఇప్పిస్తున్నామని కళాశాల ప్రిన్స్‌పాల్ చెప్పారు. అయితే, కార్పొరేట్ కళాశాలల మోజులో ప్రభుత్వ ఆధీనంలో గల కళాశాలల వైపు కన్నెత్తి చూసేవారు కరువయ్యారు. ఈ ధోరణికి మహబూబియా కళాశాల కూడా మినహాయింపు కాదు. ఒకప్పుడు కళాశాలలో సీటు కావాలంటే పడిగాపులు పడే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. కేవలం దిగువ మధ్య తరగతి కుటుంబాల వారు, పేదవారి పిల్లలు మాత్రమే మహబూబియా వైపు తొంగి చూస్తున్నారంటారు ఇక్కడి అధ్యాపకులు. ఉన్నత విద్యా ప్రమాణాలతో అత్యధిక ఉత్తీర్ణతా శాతాన్ని సాధిస్తున్నా, ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలల వైపే యువత మొగ్గు చూపడం ‘కొత్తొక వింత’ అని అధ్యాపక బృందం కొట్టి పారేస్తోంది..! ఈ వాదనలోనూ నిజం లేకపోలేదు !! - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
బ్రిటిష్ రెసిడెన్సీ
ప్రధాన రెసిడెన్సీ భవనాన్ని ఆనుకుని వున్న విశాలమైన ప్రాంగణంలో ఆనాటి బ్రిటిష్ అధికారుల కోసం నిర్మించిన ఆఫీసు గదులు, వారి నివాసం కోసం నిర్మించిన క్వార్టర్లు వున్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ నిర్మించిన తర్వాత సుమారు 50 ఏళ్ల దాకా చుట్టూతా ఎలాంటి ప్రహారీ నిర్మించ లేదు. ఐతే, 1857లో భారత స్వాతంత్య్ర సమరంలో భాగంగా రెసిడెన్సీపై ఉద్యమకారుల దండయాత్ర జరిగింది. దాంతో దీని చుట్టూ రాళ్లతో ప్రహరీ నిర్మించారు. చారిత్రక పురాతన వారసత్వ సంపదకు నిలువెత్తు సాక్ష్యం బ్రిటిష్ రెసిడెన్సీ. ఇండో-బ్రిటిష్ కాలం నాటి భవనాలకు సంబంధించిన తీపి గుర్తుగా బ్రిటిష్ రెసిడెన్సీ నిలుస్తుంది. హైదరాబాద్‌లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సమయంలో ఈ కట్టడం నిర్మించారు. దీని నిర్మాణంలో ఆనాటి గొప్ప ఆర్కిటెక్చర్, వాస్తు శిల్ప శైలీ విశిష్టత నేటికీ ప్రతిబింబిస్తుంది. బ్రిటిష్ 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కోఠి-సుల్తాన్ బజార్, చౌరస్తాలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన రాజ ప్రాసాదంలో నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల ఉంది. అసఫ్ జాహీల కాలంలో (1724-1948)బ్రిటిష్ పాలకుల ఆధిపత్యం అధికంగా ఉండేది. స్థానిక నిజాం ప్రభువులు కల్పించిన క్వార్టర్సలోనే బ్రిటిష్ రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మేజర్ జె.ఎ. కిర్క్‌పాట్రిక్, బ్రిటిష్ అధికారులకు వారి హోదాకు దీటుగా ఒక పెద్ద బంగళా ఉండాలని, అందుకోసం కోఠి ప్రాంతంలో మూసీనది సమీపంలో సుమారు 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ పెద్ద భవంతి నిర్మించాలని ప్రతిపాదించాడు. అప్పటి నిజాం ప్రభువు ముందుగా ఈ ప్రతిపాదనను ఒప్పుకోకపోయినా, తర్వాత అంగీకరించి రెసిడెన్సీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకయిన ఖర్చునంతా నిజాం ప్రభువే భరించాడు. బ్రిటిష్ రాయల్ ఇంజనీర్లు లెఫ్టినెంట్ శామ్యూల్ రస్సెల్, మద్రాసు, ఈ భవన నమూనాను రూపొందించారు. నిజాం ఆస్థానంలోని ఉన్నతాధికారి శ్రీరాజా కంద స్వామి ముదిలియార్ తదితరులు సివిల్ పనులు పర్యవేక్షించారు. 22 పాలరాతి మెట్లు రెసిడెన్సీ ప్రధాన హాలును చేరుకోవడానికి 22 పాలరాతి మెట్లు ఎక్కవల్సి వుంటుంది. ఒక్కొక్క మెట్టు సుమారు 60 అడుగుల పొడవు వుంది. పోర్టికో ముందు భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనిమిది భారీ ఎత్తై పిల్లర్లు, నాటి రాచఠీవికి దర్పణంగా దర్శనమిస్తాయి. అలాగే, తెల్లని ఎత్తై పాలరాయి వేదికపై ప్రధాన సింహద్వారానికి ఇరు పక్కలా పెద్దసైజు సింహాలు బ్రిటిష్ ఇంపీరియల్ చిహ్నంగా స్వాగతం పలుకుతాయి. ఇది దాటి రాజప్రాసాదంలో అడుగిడగానే ఉన్న దర్బార్ హాల్లో అత్యంత ప్రతి భావంతంగా చెక్కిన పలు కళాకృతులున్నాయి. దర్బారుహాల్లో సుమారు 60 అడుగుల ఎత్తున గల పైకప్పుపై ఆనాటి చిత్ర కళాకారుని తైలవర్ణ చిత్రాలు నేటికీ చెక్కుచెదర లేదు. ఖరీదైన చాండిలియర్లు, గోడలకు బిగించిన నిలువుటెత్తు అద్దాలు, అద్దాల మహల్‌ను తలపిస్తూ దర్శకుల మనసులను దోచుకుంటాయి. అన్నిరకాల హంగులున్నా బ్రిటిష్ రెసిడెన్సీలోని ప్రధాన భవనం చాలా భాగం శిథిలావస్థకు చేరుకుంది. వాటికి తక్షణ రిపేరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాన భవన సముదాయానికి కొద్దిపాటి దూరంలో బ్రిటిష్ రెసిడెంట్ల సమాధులు ఉన్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ కట్టడ నమూనా కూడా ఇక్కడ దగ్గర్లోనే ఉంది. అయితే ఈ ప్రాంతంలో నేడు కాలు మోపడానికి కూడా వీలు లేనంతగా పిచ్చి మొక్కలతో నిండి ఉంది. వీటికి తగిన రక్షణ, మరమ్మతులు చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచితే బాగుంటుంది. న్యూయార్కులోని గిౌటఛీ కౌఠఝ్ఛ్ట గ్చ్టిఛిజి అనే సంస్థ బ్రిటిష్ రెసిడెన్సీలో తగిన మరమ్మతుల కోసం ఒక లక్ష అమెరికన్ డాలర్లు గ్రాంటుగా ప్రకటించింది. చారిత్రక, వారసత్వ కట్టడాలపై ఆసక్తి గల వారందరికీ బ్రిటీష్ రెసిడెన్సీ ఎన్నో కథలు తెలియజేస్తుంది. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com