breaking news
Malcing sheet
-
మల్చింగ్.. ఇక సులభం!
ఎత్తు మడులపై మల్చింగ్ షీట్ పరిచి ఉద్యాన పంటలు పండించడానికి సాధారణంగా ట్రాక్టర్‌కు అనుసంధానం చేసే పరికరాన్ని ఉపయోగిస్తుంటారు. ఎకరానికి 6 నుంచి 8 మంది కూలీల అవసరం ఉంటుంది. ఒక రోజు నుంచి రోజున్నర సమయం పడుతుంది. అయితే, సులువుగా, తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్‌ను పరిచే పరికరాన్ని మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన యువకుడు రూపొందించారు. కేవలం ఇద్దరు మనుషులతో, 8 గంటల్లోనే ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి ఉపయోగపడే మల్చింగ్ పరికరాన్ని యువ ఉపాధ్యాయుడు, రైతు నితిన్ ఘలే పాటిల్ రూపొందించారు. నాసిక్‌లోని శివాజీ నగర్లో గల అభినవ్ బాల్‌వికాస్ మందిర్ పాఠశాలలో నితిన్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే వ్యవసాయాన్ని మక్కువతో చేస్తుంటారు. గత ఏడాది మే నెలలో తన 7 ఎకరాల భూమిలో టమాటో, మిరప, బంతిపూలను సాగు చేయటం కోసం ఎత్తుమడులపై మల్చింగ్ షీట్ పరవాలని అనుకున్నాడు. అయితే, కూలీల కొరత వల్ల సాధ్యంకాలేదు. ఆ క్రమంలో మల్చింగ్ షీట్ పరిచే ప్రక్రియను సులభతరం చేసే పరికరాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న పాత ఇనుము వస్తువులను ఉపయోగించి, సొంత ఆలోచన ప్రకారం వెల్డింగ్ చేయించి ఒక పరికరాన్ని రూపొందించాడు. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేశాడు. మల్చింగ్ షీట్ చిరిగిపోతుండటంతో.. ట్రాక్టర్ లేకుండా మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్ షీట్ పరిచేలా మార్పులు చేశాడు. పరికరం అడుగున చక్రాలను అమర్చటంతోపాటు.. పరిచిన షీట్‌పై మట్టి ఎగదోయడానికి వీలుగా రెండు ఇనుప బ్లేడ్లను అమర్చడంతో ఈ పరికరం సిద్ధమైంది. 15 రోజులు కష్టపడి అనేక విధాలుగా మార్పులు చేస్తూ చివరికి విజయం సాధించారు. తన పొలంలో ఉపయోగించడంతోపాటు మరో ఇద్దరు రైతులకు కూడా ఈ పరికరాన్ని ఇచ్చి పరీక్షించానన్నారు నితిన్. ‘మా ప్రాంతంలో ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి 12 మంది కూలీలు అవసరం. వారి కూలి, తిండితో కలిపి రూ. 8 వేల వరకు రైతుకు ఖర్చవుతుంది. నేను ఈ పరికరాన్ని రూ. 10 వేలకే తయారుచేసి ఇస్తున్నాను. ఒక్కసారి కొనుక్కుంటే చాలు. ఇద్దరు మనుషులతో దీనితో మల్చింగ్ షీట్ పరచవచ్చు. ఎకరాన్ని 8 గంటల్లోనే పూర్తి చేయవచ్చు. చిన్న రైతులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది. కూలీలతో కూడా పనిలేకుండా రైతు కుటుంబ సభ్యులే దీన్ని ఉపయోగించవచ్చు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని కొద్ది రోజుల్లోనే వంద మంది రైతులు ఇది కావాలన్నారు..’ అని నితిన్ (98909 82432) సంతోషంగా చెప్పారు. తన టొమాటో తోటలో నితిన్ పాటిల్ -
చకచకా మొక్కలు నాటే చక్కని పరికరం!
‘ఈజీ ప్లాంటర్’తో కూరగాయ మొక్కలు నాటే కూలీల ఖర్చు ఎకరానికి రూ. 3 వేలు తగ్గుతుంది 15 మందికి బదులు.. ముగ్గురు పనిచేస్తే చాలు మల్చింగ్ షీట్‌కు పెద్ద బెజ్జం వేయకుండానే మొక్కలు నాటుకోవచ్చు పొలం పనులను సులభతరం చేయడం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు? ఇప్పుడు చేస్తున్న పనిని ఇంకా సులువుగా, వేగంగా, తక్కువ శ్రమతో చేసే మార్గం ఇంకేదైనా ఉందా?.. భూపతిరాజు రామవిశ్వనాథరాజు మదిలో అనుదినం ఇటువంటి ప్రశ్నలే మెదులుతూ ఉంటాయి. చదివింది పదో తరగతే అయినా వ్యవసాయం మీద మక్కువతో ఉద్యాన పంటలు సాగు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించడం.. తన సృజనాత్మక ఆలోచనలను ఖర్చుకు వెనకాడకుండా ఆచరణలో పెడుతూ రైతు శాస్త్రవేత్తగా ఎదిగారాయన. కూరగాయ మొక్కలు పొలంలో నాటే ప్రక్రియను సులభతరం చేయడంపై ఆయన పరిశోధన ఫలించి.. చకచకా మొక్కలు నాటే చక్కని పరికరం ‘ఈజీ ప్లాంటర్’గా ఆవిష్కృతమైంది. ఈ పరికరాన్ని తొలుత చెక్కతో తయారు చేశారు. తర్వాత పీవీసీ పైపుతో, మైల్డ్ స్టీల్‌తో తయారు చేశారు. అయితే, మొక్కేసేటప్పుడు మాత్రమే ఉపయోగపడే ఈ పరికరం తుప్పు పట్టకుండా ఉంటే మన్నిక బాగుంటుందన్న అభిప్రాయంతో స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు. 2014 మార్చిలో స్టెయిన్లెస్ స్టీల్‌తో ఈజీ ప్లాంటర్‌ను రూపొందించారు. 2 కిలోల బరువు.. ఈజీ ప్లాంటర్ పరికరం బరువు రెండు కిలోలు. కూలీలెవరైనా సులభంగా ఉపయోగించొచ్చు. ఈ పరికరాన్ని నేలపైన గుచ్చి(మొక్కను ఎంత లోతులో గుచ్చాలనుకుంటే అంత బలంగా గుచ్చాలి), మొక్కను దీని గొట్టంలో వేసి, చేతితో క్లచ్ నొక్కితే చాలు మొక్క చిటికెలో భూమిలో నాటుకుంటుంది. మల్చింగ్ షీట్ వేసి మొక్కలు నాటే సమయంలో దీని ఉపయోగం మరీ ఎక్కువ. మల్చింగ్ షీట్‌పైన మొక్క నాటేటప్పుడు షీట్‌ను కొంచెం ముక్క కత్తిరించడం చేస్తుంటారు. ప్లాస్టిక్ షీట్‌కు బెజ్జం చేయాల్సిన పని లేదు. చిన్న గాటుతోనే చటుక్కున మొక్కను నాటేస్తుంది. అందుకే దీనికి ‘ఈజీ ప్లాంటర్’ అని పేరు పెట్టారు. ప్రోట్రేలలో పెంచిన నారే కాదు, మడిలో పెరిగిన నారును సైతం.. పొడి నేలలోనే కాదు తడి నేలలోనూ దీనితో మొక్కలు నాటొచ్చు. తడిగా ఉన్న నేలలో అయితే, మొక్క నాటిన తర్వాత ఈ పరికరానికి ఎడమ పాదాన్ని ఆనించి ఈజీ ప్లాంటర్‌ను పైకి తీయాలి. రైతుల కోసం రైతే ఆవిష్కరించిన ఈ వినూత్న పరికరంపై పేటెంట్ కోసం గత ఏప్రిల్‌లో దరఖాస్తు చేశారు. ఈజీ ప్లాంటర్‌ను ప్రస్తుతానికి తానే తయారు చేయించి రూ. 3 వేలకు అమ్ముతున్నారు. దీన్ని ప్రతి రైతుకూ అందించాలన్నదే తన లక్ష్యమని, ప్రభుత్వమే తయారు చేయించి రైతులకిస్తే తనకు రాయల్టీ కూడా అక్కర్లేదని విశ్వనాథరాజు స్పష్టం చేశారు. - సాగుబడి డెస్క్ ఈజీ ప్లాంటర్ పరికరంతో మల్చింగ్ షీట్ పైన, దుక్కి చేసిన పొలంలో మొక్కలు నాటే పద్ధతిని వివరిస్తున్న రైతు శాస్త్రవేత్త విశ్వనాథరాజు