breaking news
Lotto millionaire
-
రూ.328 కోట్ల లాటరీ బ్రో అంటే.. ‘ఏప్రిల్ ఫూల్’ అనుకున్నాడు.. తీరా చూస్తే షాక్!
క్లీవ్(అమెరికా): ఆదివారంతో వారాంతం ముగిశాక అందరూ సోమవారం కొత్త వారాన్ని మొదలుపెడతారు. కానీ అమెరికాకు చెందిన మాజీ మెకానిక్ ఏకంగా కొత్త జీవితాన్నే మొదలుపెట్టారు. 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.328 కోట్ల) లాటరీ రూపంలో ఆయనను ధనలక్ష్మి వరించింది. చిరకాల మిత్రుడొచ్చి లాటరీ గెలుపు సంగతి చెబితే ‘ఏప్రిల్ ఫూల్’ చేస్తున్నాడని భావించాడు ఎర్ల్ లాపే. ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీన ఆయన ఆ టికెట్ కొన్నాడు మరి. అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని డబ్యూక్ సిటీలో ఉండే 61 ఏళ్ల లాపే మెకానిక్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఇటీవల ఆయన కొన్న ‘లోట్టో అమెరికా’ లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. సోమవారం లాటరీ ప్రధాన కార్యాలయానికి వచ్చి టికెట్‌ను క్లెయిమ్ చేశాడు. విడతలవారీగా అయితే రూ.328 కోట్లను 29సంవత్సరాల కాలంలో ఇస్తారు. కానీ విడతలవారీగా కాకుండా ఒకేసారి ఏకమొత్తంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయనకు రూ.175 కోట్ల నగదు బహుమతి దక్కనుంది. -
డబ్బు కోసమే నన్ను వాడుకున్నాడు!!
మూడేళ్ల కిందటి వరకు ఆమె అందరిలా మామూలు అమ్మాయే. కానీ 17 ఏళ్ల వయస్సులో తనకు మిలియన్ పౌండ్ల (రూ. 9.68 కోట్ల) లాటరీ తగలడంతో ఓవర్‌నైట్ సంపన్నురాలిగా మారిపోయింది. తనకు దాచుకోలేనంత డబ్బు వచ్చాక మార్క్ స్కేల్స్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. అతడితో ప్రేమలో పడింది. ప్రణయసల్లాపాల్లో మునిగిపోయింది. 'ట్రు లవ్' (నిజమైన ప్రేమ) తనకు దొరికిందని సంబురపడింది. అతనికి అడిగినంత డబ్బు ఇచ్చింది. బోలేడె కానుకలు ఇచ్చింది. అతడు తనపై ప్రేమతో కాకుండా, తన డబ్బుపై కన్నుతో తన వెంటపడ్డాడని తెలిసి ఇప్పుడు వాపోతున్నది ఇంగ్లండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు చెందిన జేన్ పార్క్ (20). ఆమెకు అదృష్టం కలిసివచ్చి మూడేళ్ల కిందట హిబ్స్ ఫ్యాన్ మార్క్ లాటరీ తగిలింది. లాటరీ తగలడంతోపాటు మార్క్ స్కేల్స్ అనే బాయ్‌ఫ్రెండ్ కూడా ఆమెను తగులుకున్నాడు. తన డబ్బుతో అతడు జల్సా చేసేవాడని, తనను కాకుండా తన డబ్బును మాత్రమే అతను ప్రేమించాడని ఆమె తాజాగా వాపోతున్నది. తాను ఎంతో ప్రేమగా ఇచ్చిన ఏడువేల పౌండ్ల రోలెక్స్ వాచ్ గిఫ్ట్‌ను మార్క్స్ అమ్మేశాడని, దీంతో అతని నిజస్వరూపం తెలిసి.. అతడ్ని విసిరికొట్టానని, తమ ప్రేమ పెటాకులైందని తాజాగా 'సన్' మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ లాటరీ మిలియనీర్ తెలిపింది. తాను డబ్బుతో అతడి ప్రేమను కొనాలని భావించిన మాట వాస్తవమేనని, కానీ అతడు తనను ప్రేమించకుండా వాడుకోవడం మొదలుపెట్టాడని, అదే బాధ కలిగించిందని జేన్ పార్క్ చెప్పుకొచ్చింది. 'అతడు వట్టి పాములాంటి వాడు. మేం ఎప్పుడూ వాదించుకుంటూ ఉండేవాళ్లం. గత నెలలోనే అతన్ని వదిలించుకున్నా' అని జేన్ సన్ మ్యాగజీన్‌కు తెలిపింది. 'డబ్బు కోసమే నిన్ను వాడుకుంటున్నాడని నాకు అందరూ చెప్పారు. కానీ ఎవరి మాట వినలేదు. నేను ప్రేమలో ఉన్నట్టు భావించాను. గుడ్డిగా మసలుకున్నాను. డబ్బు కోసం తప్ప నన్ను ఏమాత్రం గౌరవించని ఇంతటి మూర్ఖుడిని ఎలా ప్రేమించానో తెలియడం లేదు. ఎంతో బాధగా ఉంది' అంటూ జేన్ పార్క్ ట్విట్టర్లో తెలిపింది. తన కారును అతనే వాడుకుంటున్నాడని, తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని ఆమె పేర్కొంది.