breaking news
the list of beneficiaries
-
‘మాఫీ’కి మరో కొర్రీ
* ‘రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతమంది మరణించారు?’ * ‘2,37, 148 మంది.’ ‘వాళ్ల పేర్లేమిటి?’ ‘....???????’ ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలోని సంభాషణ ఇది. ఎదుటివారు అవాక్కయ్యేలా చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటే ఇలాంటి ప్రశ్నలే సంధిస్తారు. అదేవిధంగా రైతులను అవాక్కయ్యేలా చేసి వారు రుణమాఫీ ఊసెత్తకుండా చూద్దామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అందుకే రుణమాఫీ అంశంలో కొత్తగా మరో అంకానికి తెరలేపింది. మెజార్టీ శాతం నిరక్షరాస్యులైన లబ్ధిదారులను రోజుకో విధంగా విసిగించేలా కొత్త కొత్త నిబంధనలు విధిస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తోంది. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటరు కార్డు, రుణాలు తీసుకున్న రైతు కుటుంబంలోని సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతాల నంబర్లు రెండ్రోజుల్లో అందజేయాలని తాజాగా ఆదేశించింది. గణపవరం: రైతు రుణాల మాఫీ హామీతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు అమలుకొచ్చేసరికి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విధిస్తున్న వివిధ నిబంధనలను పరిశీలిస్తే లబ్ధిదారుల జాబితాను కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. తొలుత కుటుంబానికి రూ. 1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం వివిధ నిబంధనలు విధించారు. రుణం తీసుకున్న రైతులందరూ తమ బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు, రుణం తీసుకున్న బ్యాంకుశాఖలో అందజేయాలని అదేశించింది. అనేకమంది రైతులు సకాలంలో ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలు కూడా ఇవ్వలేకపోయారు. నిన్నా, మొన్నటి వరకు త్వరలోనే అర్హులైనవారి జాబితా ప్రకటిస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం మరో కొత్త నిబంధన విధిస్తూ శుక్రవారం సర్క్యులర్ జారీచేసింది. అదనపు సమాచారం అందించాలంటూ అర్హత పొందిన వారి జాబితాను మండల రెవెన్యూ కార్యాలయానికి పంపింది. రుణం పొందిన వ్యక్తి ఆధార్‌కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఓటు గుర్తింపు కార్డు నెంబరు వీటితో పాటు భార్య ఓటు గుర్తింపుకార్డు నెంబరు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుల నెంబర్లు (ఒకవేళ భార్య రుణం తీసుకుంటే భర్త తాలూకా వివరాలు) వారి కుటుంబీకుల్లో మేజరు కుమారుడు లేదా కుమార్తె ఓటు గుర్తింపు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు నెంబరు ఇవ్వాలంటూ ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. దీనితోపాటు ఆయా గ్రామాల్లో ఎంతమందైతే దీనికి అర్హత పొందారో వారి జాబితాను పేరు, బ్యాంకు ఖాతా నెంబరుతో సహా వివరాలతో లిస్టులను ప్రభుత్వం రెవెన్యూ కార్యదర్శులకు అందజేసింది. దీనితో ఆ లిస్టులు పట్టుకుని రెవెన్యూ కార్యదర్శులు గ్రామాల్లో పడ్డారు. ఈ లిస్టులో వివరాలు 10వ తేదీ లోపుగా అందజేయాలంటూ ఆదేశాలు కూడా జారీచేశారు. రుణం తీసుకున్నప్పుడు బ్యాంకులో ఇచ్చిన అడ్రస్‌ల ఆధారంగా లిస్టులు అందాయి. దీంతో రెవెన్యూ కార్యదర్శులు అడ్రస్‌లు సేకరించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. 8,901మంది రైతుల వివరాలు సేకరించండి గణపవరం మండలంలో రుణమాఫీకి 8,901 మంది రైతులు అర్హత పొందారని వారి నుంచి అదనపు వివరాలు సేకరించి నమోదు చేయాలని గ్రామాల వారీగా జాబితాలను రెవెన్యూ కార్యదర్శులకు అందజేశారు. తలలు పట్టుకుంటున్న అధికారులు జాబితాలో పలు త ప్పులు దొర్లడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆ జాబితా ఏ ప్రాతిపదికన రూపొందించారో తెలియడం లేదని అధికారులంటున్నారు. ఆధార్‌కార్డులో అడ్రస్ ప్రకారం మండలాల కేటాయింపు జరిగిందా? మరే ఇతర విధానంలోనా ? అర్థం కావడం లేదని చెబుతున్నారు. అయిదుశాతం మంది అడ్రస్‌లు తెలియడంలేదని, ఆ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళాతామని చెప్పారు. రెండు రోజుల్లో పూర్తి సమాచారం అందేనా? కొన్ని గ్రామాల్లో రుణం తీసుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణకు గణపవరంలో 2,591 మంది, పిప్పరలో 1,611 మంది, మొయ్యేరులో 764 మంది ఉన్నారు. ఇంతమంది సమాచారం కేవలం రెండు రోజుల్లో సేకరించడం సాధ్యం కాద ని రెవెన్యూ సిబ్బందే అంటున్నారు. గణపవరంలో శ్రీ కన్యకాపరమేశ్వరి వర్తక సంఘ భవనంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో ఎక్కువ మంది అర్హులున్న గ్రామాల్లో అదనపు సిబ్బందితో వివిధ కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియపై కసరత్తులు చేస్తున్నారు. మరొకపక్క జిల్లా అధికారులు తక్షణం సమాచారం అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. కుటుంబీకుల ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేకపోతే అర్హత కోల్పోయినట్టేనా ? కుటుంబ సభ్యులకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేకపోతే రుణమాఫీ అర్హత కోల్పోయినట్టేనా? అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వివిధ నిబందనలతో రుణమాఫీ జాబితాలో కోతకు పన్నాగాలు పన్నుతోందని రైతుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బ్యాంకు ఖాతా నెంబరు, ఇతర పత్రాలు ఇవ్వడానికి బ్యాంకులు చుట్టూ తిరిగి నానా అవస్థలు పడ్డామని, మళ్లీ ఇప్పుడు కుటుంబ సభ్యుల వివిధ పత్రాల వివరాలు తక్షణం ఇవ్వమంటే ఎలా సాధ్యమంటూ రైతులు వాపోతున్నారు. -
పింఛన్.. ఫట్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సామాజిక పింఛన్ల లబ్ధిదారుల జాబితాలో భారీగా కోతలు పడనున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. దరఖాస్తుల్లో సుమారు 40శాతం మేర నిబంధనలకు అనుగుణంగా లేనట్లు పరిశీలక బృందాలు తిరస్కరిస్తున్నాయి. గతంలో మంజూరైన పింఛన్లతో సంబంధం లేకుండా నూతన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. మరోవైపు నిర్ధేశిత గడువులోగా దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయడం సాధ్యమయ్యేలా లేదు. ఈనెల 8వ తేదీలోగా లబ్ధిదారులకు పింఛను మంజూరుపత్రాలు అందజేయాలనే లక్ష్యం కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు కోసం జిల్లాలో 5.55లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 30లోగా దరఖాస్తులను పరిశీలించి అర్హులజాబితాను సిద్ధం చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. దరఖాస్తుల పరిశీలనకు మండలస్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించారు. ఇప్పటివరకు 4.98లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తికాగా, మరో 56,983 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. ఉరుకులు.. పరుగులు సామాజిక పింఛన్ లబ్ధిదారులకు ఈనెల 8న నగదు రూపంలో పింఛన్ మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తికాకపోవడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. దరఖాస్తుల వడపోత అనంతరం అర్హులైన లబ్ధిదారులను జాబితాను ఆన్లైన్లో కంప్యూటరీకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో ఈ నెల8వ తేదీలోగా మంజూరు పత్రాలు ఇవ్వడం అసాధ్యమమేనని అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలన, మంజూరు పత్రాల జారీప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉందని పర్యవేక్షిస్తున్న ఓ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా, దరఖాస్తుల వడపోత ప్రక్రియలో పెద్దఎత్తున అర్జీలను తిరస్కరిస్తున్నారు. సుమారు 30నుంచి 40శాతం మేర దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు ‘సాక్షి పరిశీలనలో తేలింది. నిబంధనలను సాకుగా చూపుతూ గతంలో పింఛన్ పొందినవారి పేర్లను కూడా తొలగిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారుల జాబితాలో కోత? వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో పాటు వివిధ కేటగీరీల కింద ప్రస్తుతం జిల్లాలో 4.59లక్షల మంది పింఛన్లు పొందుతుండగా.. తాజాగా 5.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్య పింఛన్లలో వయసు నిర్ధారణకు ఆధార్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో చాలామందిని ‘అండర్ ఏజ్’ అంటూ తొలగిస్తున్నారు. మరోవైపు వితంతు పింఛన్ల విషయంలో భర్త మరణధ్రువీకరణ పత్రం ఇవ్వాలని తొలుత నిబంధన విధించిన అధికారులు ఆ తర్వాత కాస్త సడలించారు. ప్రస్తుతం సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నా లబ్ధిదారుల్లో ఎంపికతీరుపై నిరసన వ్యక్తమవుతోంది. సదరం ధ్రువీకరణపత్రాల్లో 40శాతం కంటే ఎక్కువ వైకల్యాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. మరోవైపు అర్హత ఉండి సదరం సర్టిఫికెట్లు లేని దరఖాస్తుదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పరిశీలనకు వస్తున్న బృందాలు విచారణ అనంతరం జాబితాను వెల్లడించకపోవడంతో తమ పేరు ఉందో, గల్లంతైందో తెలియక ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తుల పరిశీలన తీరుతెన్నులను పరిశీలిస్తే లబ్ధిదారుల జాబితాలో కోతపడడం ఖాయంగా కనిపిస్తోంది. అనర్హులను ఎంపికచేస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు ఉంటాయని ప్రకటించడంతో పరిశీలనకు బృందాలు కూడా తీవ్రఒత్తిడికి లోనవుతున్నాయి. లోకుర్తిలో తగ్గిన లబ్ధిదారులు దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామంలో పింఛను దరఖాస్తుల ప్రక్రియను ‘సాక్షి’ పరిశీలించింది. దరఖాస్తుల్లో 31శాతం మేరకు తిరస్కరణకు గురైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పింఛను పొందుతున్న వారి సంఖ్యతో పోలిస్తే 15మంది పేర్లు జాబితాలో కనిపించడం లేదు. పింఛన్.. దరఖాస్తులు దామరగిద్ద మండలం లోకుర్తిలో పింఛన్ దరఖాస్తులు ఇలా.. కేటగిరీ ప్రస్తుత అందిన అర్హులుగా పింఛన్లు దరఖాస్తులు తేలినవి వృద్ధాప్య 153 190 110 వితంతు 72 110 97 వికలాంగ 12 15 15 మొత్తం 237 321 222