breaking news
Land squatters
-
కబ్జా మామూలే..!
సాక్షి, మంచిర్యాల : భూ కబ్జాదారులు బరితెగిస్తున్నారు. కబ్జాకు కాదేది అనర్హం అన్న చందంగా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. చెరువులు, కుంటలు, కాలువలు సైతం వదలడం లేదు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం పరిపాటిగా మారింది. చెరువుల సర్వేలోనూ పరిగణనలోకి తీసుకోకపోవడంతో చెరువుల పునరుద్ధరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు ఇప్పటికే కనుమరుగయ్యాయి. పట్టణంలో ఉన్న మురుగు అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. జోరుగా సాగుతోన్న ఆక్రమణల పర్వంపై స్పందించాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. ఈ నెల ఒకటిన హైదరాబాద్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల ఆక్రమణ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని కలెక్టర్లను ఆదేశించారు. చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యల విషయంలో రాజీపడొద్దని, ఆక్రమిత చెరువు భూములను స్వాధీనం చేసుకుని వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. అయినా అధికారులు కదలకుండా.. మెదలకుండా మొద్దునిద్రపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం కట్టుబడి ఉంది. అయినా క్షేత్రస్థాయిలో కబ్జా కు గురైన చెరువుల వివరాలు సేకరించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచిర్యాలలో రాముని చెరువు మాత్రమే కబ్జాకు గురైనట్టు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తహశీల్దార్ కె.సురేశ్ వివరించారు. మిగతా చెరువుల సర్వే ఇరిగేషన్ అధికారులు చేపట్టారని అన్నారు. ఇటు ఇరిగేషన్ అధికారులూ స్థానికంగా ఉన్న చెరువుల సమగ్ర సర్వే చేపట్టలేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్రమిత చెరువుల స్వాధీనం.. పునరుద్ధరణ ఎలా చేపడతారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాలువపై అక్రమ నిర్మాణాలు.. రాముని చెరువు పార్కు సమీపంలోని మత్తడి నుంచి నీరు రాళ్లవాగులో కలిసేలా సుమారు 2కిలోమీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పుతో కాలువ నిర్మించారు. కాలువ ద్వారా నీళ్లు పట్టణంలోని ప్రధాన వీధులైన జన్మభూమినగర్, ఇస్లాంపుర, రెడ్డికాలనీల మీదుగా రాళ్లవాగులో కలుస్తాయి. కాలువ పట్టణంలోని ప్రధాన రహదారి, కాలనీలోని నివాస గృహాలకు ఆనుకుని ఉండడంతో వ్యాపారులు, ప్రజలు కాలువ ను అక్రమించుకున్నారు. ఇంకొందరైతే ఏకంగా కాలువపై స్లాబు వేసి నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఆ కాలువ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం.. కాలువ నుంచి రెండు మీటర్ల స్థలం వదిలి నిర్మాణం చేపట్టాలి. కానీ కాలువకు ఆనుకునే భవంతుల నిర్మాణం చేపట్టారు. కాలువ ఉధృతి పెరిగితే.. నీళ్లు భవంతుల పునాదులకు చే రి భవనాలు కూలిపోయే ప్రమాదమున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. రాముని చెరువు కనుమరుగు.. మంచిర్యాల పట్టణంలోని 406 సర్వే నెంబర్లో 46.10 ఎకరాల్లో రాముని చెరువు విస్తరించి ఉంది. చెరువు పరిసర ప్రాంతాలన్నీ ఇప్పటికే అభివృద్ధి చెందాయి. ఓ పక్క హైటెక్ సిటీ, మరోపక్క జన్మభూమి నగర్, ఇటు ప్రధాన రహదారి ఉన్న ఈ ప్రాంతంలో గజం భూమి కొనాలంటే రూ.12వేలపైనే ధర ఉంది. దీన్ని అదునుగా చేసుకుని భూ కబ్జాదారులు సుమారు 30ఎకరాల శిఖం భూమిని ఆక్రమించుకున్నారు. అయినా అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ సైతం శిఖం భూమిని ఆక్రమించి నివాసగృహం నిర్మించుకోవడం గమనార్హం. తిలక్‌నగర్ చెరువు మిగిలింది ఐదెకరాలే..! మంచిర్యాల శివారు ప్రాంతంలోని తిలక్‌నగర్‌లో 50 ఎకరాలు, నస్పూర్‌లో 70 ఎకరాల్లో మొత్తం 120 ఎకరాల్లో తిలక్‌నగర్ చెరువు ఉంది. 1976లో భూ సేకర ణ నిర్వహించిన అధికారులు ఈ భూమిని శిఖం భూ మిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉన్న పట్టాదారు లకు అప్పటి మార్కెట్ విలువ ప్రకారం నష్టపరి హా రం కూడా చెల్లించారు. కానీ ఆ చెరువు శిఖం అని రె వెన్యూ అధికారులు తమ రికార్డుల్లో నమోదు చేయక పోవడంతో రియల్టర్లు ఆ భూమిని ఆక్రమించేశారు. ప్రస్తుతం ఐదెకరాల భూమి మాత్రమే మిగిలింది. పట్టణంలోని 449 సర్వేనంబర్‌లో ఉన్న పోచమ్మ చెరువు విస్తీర్ణం 5.10 ఎకరాలు. హమాలీవాడలో ఉన్న ఈ చెరువు ఏళ్ల నుంచి క్రమంగా కబ్జాకు గురవుతూ వచ్చింది. ప్రస్తుతం రెండు ఎకరాల్లో మాత్రమే చెరువు ఆనవాళ్లు ఉన్నాయి. మున్సిపల్ పరిధిలోని ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంతం 339 సర్వే నెంబర్లో ఉన్న చీకటివెలుగు కుంట విస్తీర్ణం ఏడు ఎకరాలు. ఈ కుంటలో నీళ్లు లేకపోవడంతో దానిపై భూ కబ్జాదారుల కన్ను పడింది. దశల వారీగా కుంటను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం కుంట భూమి 2.30 ఎకరాల్లో మాత్రమే మిగిలింది. -
భూ సర్వేయర్ల దందా
రఘునాధపాలెం, న్యూస్‌లైన్: ఇప్పటివరకూ మనం దళారులు, భూకబ్జాదారులు భూదందా సాగించడం చూశాం. ఇప్పుడు సరికొత్తగా.. రెవెన్యూ ఉద్యోగులే (భూ సర్వేయర్లు) భూదందా సాగిస్తున్నారు. అసైన్డ్ భూమి పట్టాదారులను అదిరించి, బెదిరించి అందినంత దండుకుంటున్నారు. కాదూ... కూడదంటూ ఎవరైనా ఎదురుతిరిగితే.. ‘మీ భూమి సర్వే హద్దులు నిర్ణయించేది మేమే. మేం చెప్పినట్టు వినకపోతే.. మీ భూమి హద్దులు మారతాయి. మీ చేతుల్లోని భూమి ప్రభుత్వానికి స్వాధీనమవుతుంది’ అంటూ, బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఎదంతా ఎక్కడో మూరుమూలన కాదు.. నగరంలోనూ, దాని చుట్టుపక్కల సాగుతున్న ఈ ‘నయా దందా’కు సంబంధించి ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రఘునాధపాలెం మండలంలోని రఘునాధపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 21, 30లోని అసైన్డ్ భూములను అధికారులు 2009లో రైతుల నుంచి స్వాధీనపర్చుకున్నారు. సాగర్ కాల్వ కట్టలపై తొలగించిన గుడిసె వాసులకు ఈ భూమిలో ప్లాట్లు ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా ఈ భూమిని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు గడిచిన 15 రోజులుగా చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. ఇక్కడే, భూ సర్వేయర్లు బేరసారాలకు, అవి ఫలించకపోతే దందాగిరీకి దిగుతున్నారు. ఈ భూముల పరిసరాల్లోని పట్టా భూముల రైతులకు సర్వేయర్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అసైన్డ్ భూమికి అటూఇటూ ఉన్న తమ భూముల్లోనూ హద్దు రాళ్లు పాతుతున్నారని కొందరు రైతులు లబోదిబోమంటున్నారు. అక్కడ ఎకరం భూమి ధర 50లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోంది. ఇదే అదనుగా, అందనికాడికి దండుకునేందుకు మార్గంగా ఎంచుకున్న సర్వేయర్లు.. ఉద్దేశపూర్వకంగానే ప్రయివేటు భూముల్లో రాళ్లు పాతుతున్నారు. ఇదేమంటూ ప్రశ్నించిన రైతులతో బేరసారాలకు దిగుతున్నారు. ‘మా వద్ద పక్కాగా కాగితాలున్నాయి. మీకు రూపాయి కూడా ఇవ్వం’ అంటూ, తెగేసి చెప్పిన రైతులపట్ల సర్వేయర్లు దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేయర్ బాధిత రైతులకు, సర్వే అధికారులకు మధ్యవర్తిగా ఒక రెవెన్యూ అధికారిణి భర్త రాయబారం సాగిస్తున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. {పస్తుతం ప్లాట్లు చేస్తున్న అసైన్డ్ భూమిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఒక రియల్ వ్యాపారి పట్టా భూమిని ప్లాట్లు గా చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీనికి ప్రధాన రోడ్డు వైపు ఉన్న అసైన్డ్ భూమిలో పేదలకు ప్లాట్లు చేసి ఇస్తే.. లక్షలు ధారపోసి కొన్న భూమికి విలువ పడిపోతుందని సదరు వ్యాపారి భీతిల్లుతున్నారు. అక్కడ ఉన్న అసైన్డ్ భూమిలో ప్లాట్లు చేయకుండా ఉండేందుకుగాను కొంద రు రెవెన్యూ అధికారులకు, సర్వేయర్లకు ఆ వ్యా పారి పెద్ద మొత్తంలో ముట్టచెప్పినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఒకవైపు అసైన్డ్ భూమిని పోలీసులకు ప్రభుత్వం కేటాయించిందని, ఆ వివరాలు సక్రమంగా లేవనే పేరుతో కొత్త పంచాయతీ మొదలైంది. ఈ వ్యవహారాలతో మొత్తంగా రెవెన్యూ శాఖ అభాసుపాలవుతోందన్నది జనాభిప్రాయంగా ఉంది. పరిసర మండలాల్లో కూడా ఇదే దందా... నగరీకరణలో భాగంగా ఖమ్మం పరిసర ప్రాంతాలైన రఘునాధపాలెం, ఖమ్మం రూరల్, కొణిజర్ల, చింతకాని మండలాల సరిహద్దుల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఇప్పటికే పలువురు అక్రమించి అడ్డదారిని పట్టాలు చేయించుకున్నట్టు సమాచారం. గతంలో పనిచేసిన అధికారులు ఇష్టా రాజ్యంగా ఇనాం తదితర భూములకు పట్టాలు ఇవ్వడం.. ఇప్పటి అధికారులకు వరంగా మారింది. {పధానంగా ఖమ్మం అర్బన్ మండలంలో పనిచేసి బదిలీపై వెళ్ళిన ఓ అధికారి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అనుచరులకు ప్రభుత్వ భూమిని రాసిచ్చినట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై సదరు అధికారిపై పలు ఆరోపణలతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. పాత నక్షా తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉంది.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న భూమి ఎవ్వరి ఆధీనంలో ఉంది.. అనేది ఆరా తీసి పలువురు అధికారులు మామూళ్ళపర్వానికి తెర లేపినట్టు సమాచారం. ఈ సందర్భంలో నిజమైన భూ యజమానులను కూడా బెదిరించి పలువురు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు పలువురు ఉన్నతాధికారుల అండదండలు ఉండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, పట్టా భూములపై కూడా నిబంధల పేరుతో... అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని పలువురు భూ యజమానులు ఆరోపిస్తున్నారు. రాసిస్తే చర్యలు తీసుకుంటా.. అంటున్నారు.. ఆర్డీఓ సంజీవరెడ్డి. దీని పై ఆయనను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. ‘అలాంటిదేమీ మా దృష్టికి రాలేదు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి, వాస్తవాలని తేలితే చర్యలు తీసుకుం టా. అసైన్డ్, ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నా కచ్చితంగా సర్వే చేసి స్వాధీనపర్చుకుంటాం. వాటిని ప్లాట్లు చేసి పేదలకు ఇస్తాం. సర్వే చేసే అధికారులపై మరో అధికారి పర్యవేక్షణ ఉంటుంది. సర్వేలో రాజీ పడేది లేదు’ అన్నారు.