breaking news
lady workers
-
ఆ దీపాలన్నీ స్త్రీలవే.. ఆ దీపాలూ స్త్రీలే
తమిళనాడులో కరువు ఊరు అది. సరిగా భుక్తి లేదు. చేయడానికి స్త్రీలు చేయదగ్గ పని లేదు. భర్త ఎలక్ట్రీషియన్. నీ పనే నేను చేస్తాను అంది ధనలక్ష్మి. ‘కరెంటు పని నువ్వు చేయలేవు’ అన్నాడు భర్త. ఆమె వినలేదు. వెదురుపుల్లలతో కట్టిన బొమ్మలకు సీరియల్ సెట్లు అమర్చడం నేర్చుకుంది. జాతరలు, తిరునాళ్ళు, పండగలకు సీరియల్ సెట్ల వెదురుబొమ్మలు కావాలి. ఆ పనిలో విపరీతమైన నైపుణ్యం సంపాదించింది. మిగిలిన ఆడవాళ్లకు కూడా ఆ పని నేర్పించింది. నేడు ‘అరసర్కుళం’ అనే ఊరు సీరియల్సెట్ల బొమ్మలకు ప్రసిద్ధి. ఆ దీపాలన్నీ స్త్రీలవే. ఆ దీపాలూ స్త్రీలే. తమిళనాడు తిరునల్వేలి ప్రాంతంలోని ఎండను, కరువును భరించడం కష్టం. ఉన్నట్టుండి జలుబు చేసినట్టు కొన్ని మేఘాలు చీదుతాయి. వాటికి ఏమైనా పండితే పండినట్టు. అయినా ముక్కు కారితే పంటలు పండుతాయా? ‘మా ఊరి పేరు అరసర్కుళం. అది మారుమూల. పంటలు లేక చాలామంది వలస పోతుంటారు. ఉన్నవారికి పని ఉండదు. రోజూ పట్నానికి పోయి పని చేసుకురావడానికి బస్సులు కూడా తిరగవు’ అంటుంది ధనలక్ష్మి. ఆమె ఇప్పుడు ఆ ఊరిలోని ‘ధనలక్ష్మి వైరింగ్ వర్క్స్’కు అధిపతి. ఆమె దగ్గర 50 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆమె వల్ల ఉపాధి మార్గం తెలుసుకొని మరో 500 మంది జీవిక పొందుతున్నారు. ఇది ఇప్పటి పరిస్థితి. పదేళ్ల క్రితం కాదు. పదేళ్ల క్రితం... ధనలక్ష్మిది అరసర్కుళం ఊరే. అక్కడే పుట్టి పెరిగింది. ‘మాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. కాని వానలు లేకపోతే ఏమిటి చేయడం. అదంతా ఉత్త మట్టిగడ్డే కదా’ అంటుంది. తండ్రి ఆమెకు ప్రాయం రాగానే అదే ఊళ్లో ఉన్న అశోక్ అనే ఎలక్ట్రీషియన్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ముగ్గురు కూతుళ్లు పుట్టారు. ‘మా ఆయన ఎలక్ట్రీషియన్. ఏదైనా డెకరేషన్ వస్తే లైట్లు వేస్తాడు. కాని రెండు మూడు వేల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు’ అంటుంది ధనలక్ష్మి. తెలుగులో ప్రసిద్ధ రచయిత శ్రీరమణ ‘ధనలక్ష్మి’ అనే కథ రాశారు. అందులో ధనలక్ష్మి అనే ఇల్లాలు భర్తకు ఉన్న నిర్వహణాలోపాలను గ్రహించి తోడు నిలిచి అతడు వ్యాపారంలో వృద్ధిలోకి రావడానికి సహకరిస్తుంది. సరిగ్గా ఈ ధనలక్ష్మి కూడా భర్త అశోక్‌కు అలాగే అండగా నిలిచింది. ‘ఊళ్లో ఏ పనీ లేదు. నీ పనే నేను చేస్తా’ అందామె. అశోక్ ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పనంటే కరెంటుతో వ్యవహారం. అది ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం. అందుకే వద్దు అన్నాడు. ‘కాని నేను పట్టుపట్టాను. సాధించాను’ అంటుంది ధనలక్ష్మి. ఊళ్లో జాతర వస్తే... సరిగ్గా ఆ సమయంలోనే ఊళ్లో జాతర వచ్చింది. జాతరకు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సీరియల్ సెట్లతో వెలిగించిన అలంకరణలు చేస్తారు. వెదురుపుల్లతో దేవతల బొమ్మలు, పూలు, జంతువులు, పార్టీ గుర్తులు, రాజకీయ నాయకుల ముఖాలు కట్టి వాటికి సీరియల్లైట్లు అమర్చి వెలిగిస్తారు. వెదురుపుల్ల కట్టడంలో అశోక్ పని మంతుడు. కాని వాటికి సీరియల్లైట్లు బిగించడం శ్రమతో, నైపుణ్యంతో, ఓపికతో కూడిన పని. సీరియల్ సెట్లలో మధ్యలో ఒక లైట్ కాలిపోయినా మిగిలిన సెట్ వెలగదు. ఆ లైట్‌ను కొత్తది వేయాలి. లేదా వైర్‌ను జాయింట్ చేయాలి. ‘ఆ పనంతా నేను నేర్చుకుని మొదలెట్టాను’ అంటుంది ధనలక్ష్మి. భర్త వెదురు ఫ్రేమ్స్ కడితే ధనలక్ష్మి చకచకా సీరియల్ సెట్లు అమర్చేది. వెలిగిస్తే వెదురు కటౌట్ మిలమిలమని బ్రహ్మాండంగా వెలిగేది. అశోక్ ఆ జాతరలో లైట్లు వెలిగించి పేరు సంపాదించాడు. ధనలక్ష్మి హస్తవాసి మంచిదని నిరూపితం అయ్యింది. అందరు మహిళల కోసం తిరునల్వేలి జిల్లాలో ఆ మాటకొస్తే తమిళనాడులో ప్రతి ఊళ్లో ఏదో ఒక ఉత్సవం వేడుక జరుగుతూనే ఉంటాయి. వాటికి వెదురుపుల్లల సీరియల్సెట్ల కటౌట్స్ అవసరం. అవి తయారు చేసే కార్ఖానా పెడదామని ధనలక్ష్మి భర్తకు సూచించింది. ఊళ్లో ఉన్న ఒక ట్రస్టు సాయంతో లోన్ పొంది పని మొదలెట్టింది. భర్త మరికొందు మగపని వారు ఫ్రేమ్స్ తయారు చేస్తుంటే తను మరికొంతమంది మహిళలతో ఆ ఫ్రేమ్స్‌కు లైట్లు బిగించడం మొదలుపెట్టింది. ధనలక్ష్మి దగ్గరకు వస్తే రెడిమేడ్‌గా కావలిసిన కరెంటు బొమ్మలు దొరుకుతాయనే పేరు వచ్చింది. ఆ తర్వాత ధనలక్ష్మి చెన్నై నుంచి లైట్లు టోకున కొనుక్కొచ్చి సీరియల్ సెట్లను తయారు చేయడం కూడా ఆడవాళ్లకు నేర్చింది. సీరియల్ లైట్లు తామే తయారు చేసుకుని తామే కటౌట్స్‌కు అమర్చి మొత్తం కటౌట్‌ను అమ్మడం వల్ల వారికి లాభం బాగా రావడం మొదలెట్టింది. ‘ఇవాళ మా ఊరు పెద్ద సీరియల్ సెట్ల కేంద్రమే అయ్యింది’ అంటుంది ధనలక్ష్మి. తన వద్ద పనిచేస్తున్న మహిళలతో ధనలక్ష్మి ధనలక్ష్మి ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తెకు పెళ్లయ్యింది. ఆమె కంప్యూటర్ ద్వారా కావలసిన బొమ్మలు తీసి తల్లికి ఇస్తోంది. అల్లుడు ఊళ్లు తిరిగి ఆర్డర్లు తెస్తున్నాడు. ధనలక్ష్మి ధైర్యం లక్ష్మిని తెచ్చింది. మూడు వెలుగులు ఆరు కాంతులుగా ఆమె జీవితం వెలుగుతోంది. ఆరు వందల మంది స్త్రీలూ వెలుగుతున్నారు. చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు కూడా వెలగొచ్చని వీరు చెబుతున్నారు – సాక్షి ఫ్యామిలీ -
భద్రత లేని బతుకులు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: పొగాకు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర కూలీలదే. అందులోనూ 70 శాతానికిపైగా మహిళా కూలీలే ఉంటారు. పొగాకు పంట సాగు మొదలుకొని బోర్డులో అమ్మకాలకు వెళ్లేదాకా వారే కీలకం. అలాంటి పొగాకు కూలీలకు ఇచ్చే కూలి, కల్పించే సౌకర్యాలు నామమాత్రం. జిల్లాలో గ్రేడింగ్ కూలీలు పడుతున్న ఇక్కట్లపై సమరసాక్షి కథనం. పొగాకు పనులు చేసే మహిళా కూలీలు వెట్టిచాకిరితో పాటు భద్రత లేని బతుకులు వెళ్లదీస్తున్నారు. పొగాకు సాగులో మొక్కలు వేయటం మొదలు మొక్కల్లో పురుగులు పట్టడం, ఆకుకొట్టడం, మందుల పిచికారీ, పొలం నుంచి కొట్టిన ఆకును బ్యారన్ల వద్దకు చేర్చడం, కర్రలకు అల్లటం, కట్టలు కట్టడం, పొగాకు కంపెనీల్లో గ్రేడింగ్‌తో కూలీల పని ముగుస్తుంది. జిల్లాలో 1.70 వేల ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నారు. 1.20 లక్షల మంది కూలీలు పని చేస్తున్నారు. వీరి లో 80నుంచి 85 వేల మంది మహిళా కూలీలు. పొగాకు పొలాల్లో, బ్యారన్లలో, గ్రేడింగ్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. జిల్లాలో 25వేలకుపైగా పొగాకు బ్యారన్లున్నాయి. రేయింబవళ్లు చాకిరీనే... బ్యారన్ల వద్ద పొగాకు కూలీలు రేయింబవళ్లు పని చేస్తుంటారు. ముఠాలుగా ఏర్పడి తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉండాలి. అయినా వారు మాట్లాడుకునే కూలి సరాసరిన చూసుకున్నా రోజుకు *250 కూడా పడదు. కుటుంబమంతా వలసలు.. పొగాకు సీజన్ మొదలైందంటే కుటుంబాలకు కుటుంబాలు వలస వస్తుంటాయి. చంటిబిడ్డలను వెంటేసుకొని పొలాలు, బ్యారన్ల వద్దే కాపురాలు ఉంటుంటారు. పురుగు, పుట్రతోటే సహజీవనం చేస్తూ భద్రత లేని బతుకులు వెళ్లదీస్తున్నారు. తాత్కాలిక గుడారాలే వారి ఆవాసాలు. పిల్లలు కూడా వీరితోనే ఉండటంతో వారికి చదువులూ దూరమే. జిల్లా నుంచి వందల కుటుంబాలు నెల్లూరు ప్రాంతానికి పనుల కోసం వలసలు వెళ్తుండగా జిల్లాకు గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, రాజమండ్రి ప్రాంతాల నుంచి పచ్చాకు కూలీలు వస్తున్నారు. వీరికి కనీస వసతులు కల్పించడంలో అటు రైతులు వ్యాపారులు వైఫల్యం చెందారు. కనీస వేతనం వీరి దరి చేరదు... కనీస వేతన చట్టం పొగాకు పచ్చాకు, గ్రేడింగ్ కూలీల దరిచేరదు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గంటలే పని చేయాలి. అలాంటి నిబంధన వీరికి వర్తించదు. ఒక్కొక్క కూలీకి కనీస వేతన చట్టం ప్రకారం రోజుకు పనినిబట్టి, పని నైపుణ్యాన్ని బట్టి *260 నుంచి *330 వరకు ఇవ్వాలి. పచ్చాకు కూలీలకు రోజుకు సరాసరిన *125 పడుతుంటే గ్రేడింగ్ కూలీలకు *120 మాత్రమే ఇస్తున్నారు. దళారుల చేతిలో చిక్కి.... వెట్టిచాకిరీతో ఒక వైపు, దళారుల దోపిడీతో మరోవైపు పచ్చాకు కూలీలు సతమతమవుతున్నారు. దళారులు కొంత మంది చేరి వీరిని ముఠాలుగా మాట్లాడుకొని పనులు చేయించుకొని చివరకు అనుకున్న ప్రకారం కూడా డబ్బులివ్వకుండా ఎగ్గొడుతున్నారు.ఇలాంటి కేసులు గతంలో జిల్లాలో అనేకం చోటు చేసుకున్నాయి.రెవెన్యూ, పోలీస్ అధికారుల దాకా వెళ్లి పరిష్కారం అయిన కేసులున్నాయి. మహిళలు లైంగిక వేధింపులకు గురైన సంఘటనలూ ఉన్నాయి. అందని వైద్యం.. కూలీలకు వైద్యం ఓ పెద్ద సమస్య. పచ్చాకును పొలాల నుంచి ట్రాక్టర్లలో బ్యారన్లకు తీసుకొచ్చేటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడుతుంటారు. పాములు, తేళ్లు కుట్టి వైద్యమందక మృతి చెందిన కూలీలు కూడా ఉన్నారు. కందుకూరు ప్రాంతంలో గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల నుంచి దాదాపు 500 నుంచి 600 మంది పొగాకు కూలి పనులకు వస్తుంటారు. తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని అభద్రత నడుమ బతుకులు ఈడుస్తున్నారు. రేయింబవళ్లు పని చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో బేస్తవారిపేట, అర్థవీడు, గిద్దలూరు మండలాల్లో అత్యధికంగా పొగాకు సాగు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 10 గంటల వరకు కుటుంబాలకు కుటుంబాలే కలిసి గుత్తకు మాట్లాడుకొని పచ్చాకు పనులు చేస్తున్నారు. రేయింబవళ్లు పని చేసినా రోజుకు *125 కూడా కూలి గిట్టడం లేదని ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతున్నామని కూలీలు వాపోతున్నారు. అద్దంకి ప్రాంతంలో పొగాకు కూలీలకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. రవాణా సౌకర్యాల్లేక తరచూ కిలోమీటర్ల కొద్దీ నడిచి కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కనిగిరి ప్రాంతంలో 1500 బ్యార్నీల వరకు ఉన్నాయి. గుంటూరు, ఒంగోలు పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస కూలీలు వచ్చి పనులు చేస్తున్నారు. రోజు వారి కూలి గిట్టుబాటు కాక, కొన్ని కుటుంబాలు మధ్యలోనే వెళ్లిపోతున్నాయి. దళారులు అనుకున్న ప్రకారం కూలీలు ఇవ్వకుండా ఎగ్గొడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. కొండపిలో దాదాపు 8,500 బ్యారన్ల వరకు ఉన్నాయి. ఇక్కడ బాలికలు బాలకార్మికులుగా పనులు చేయటం పరిపాటిగా మారింది. చర్మవ్యాధుల బారిన పడటం సంపాదించుకున్న కూలి డబ్బులు కాస్త వైద్యానికే సరిపోక అల్లాడుతున్నారు. జాతీయ రహదారిపై ఉన్న టంగుటూరులో పొగాకు గ్రేడింగ్ కంపెనీలున్నాయి. కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా వారి చేత పని చేయించుకుంటున్నారు. రోజంతా పనిచేసినా వందే ..వెంకాయమ్మ వెంకాయమ్మ గ్రేడింగ్ కూలీ, నాగులుప్పలపాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా వంద రూపాయల కూలే ఇస్తున్నారు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. కూలి రేటు పెరగాలి, మరియమ్మ, మార్టూరు ధరలు పెరిగినా కూలి రేట్లు పెరగడం లేదు. వ్యవసాయ కూలీలకు కూడా రేట్లు పెరిగాయి. కానీ పచ్చాకు కూలీలకు ఎన్నో ఏళ్ల నుంచి అదే కూలి చెల్లిస్తున్నారు.