హామీలు, శంకుస్థాపనలు
ముగిసిన ముఖ్యమంత్రి కుప్పం పర్యటన
పాతవి నెరవేర్చకనే కొత్త హామీలపై జనం పెదవి విరుపు
సీఎం ప్రసంగాలకు స్పందన కరువు
చిత్తూరు: సీఎం నారా చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన మూడు హామీలు, ఆరు శంకుస్థాపనలుగా సాగింది. ముఖ్యమంత్రి మంగళ, బుధవారాల్లో కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం, కుప్పంలో పర్యటించారు. తొలిరోజు రూ.183.44 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. బుధవారం కుప్పంలో జరిగిన సభలో మాట్లాడారు. ఎంత చేసినా కుప్పం రుణం తీర్చుకోలేనిదన్నారు. తాగునీరు లేక అల్లాడుతున్న కుప్పం వాసులకు ఏడాది తిరగకుండానే హంద్రీ-నీవా నీళ్లు ఇస్తానన్నారు. కుప్పం అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులైనా వెచ్చించేందుకు సిద్ధమని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కొత్తగా ప్రకటించిన వాటిపై జనం నుంచి స్పందన కరువైంది. ఆయన వరాల జల్లు కురిపించినా జనంలో ఉత్సాహం కనిపించలేదు. ఇప్పటికే రుణమాఫీ అమలు చేయకపోవడంపై డ్వాక్రా మహిళలు, రైతులు అసంతృప్తితో ఉన్న విషయం విదితమే. రామకుప్పం సభకు ఒక మోస్తరు జనం వచ్చినా శాంతిపురం, కుప్పం సభలకు నామమాత్రంగానే హాజరయ్యారు.
అధికారుల బాధలు వర్ణనాతీతం
సీఎం రెండు రోజుల కుప్పం పర్యటనతో అధికారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. పర్యటనకు ముందు రెండు రోజులు సమీక్షల పేరుతో నిద్రాహారాలు కోల్పోయారు. పర్యటన రెండు రోజులు కుప్పంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. పైగా కలెక్టర్, సీఎం సమీక్షల పేరుతో అధికారులను అర్ధరాత్రి ఒంటి గంట వరకు వదిలిపెట్టలేదు. దీంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు.