breaking news
kuldhara
-
ఘోస్ట్ విలేజ్ కుల్ధారా
ఊరినిండా మనుషులు ఉంటారు. అలా మనుషులు ఉంటేనే మనం దాన్ని ఊరు అంటాం. కానీ ఊరునిండా దెయ్యాలు ఉన్న సంగతి మీరెప్పుడైనా విన్నారా? అవును ఆ ఊరంతా దెయ్యాలే ఉన్నాయి. అక్కడ చూడటానికి మనుషులు ఎవరూ కనపడరు. ఖాళీ ఇళ్లు, పెద్ద పెద్ద పాడుబడ్డ గోడలు... ఆ ఊళ్లో దర్శనమిస్తాయి. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం కదా.....! సినిమాలనే తలదన్నే విధంగా ఉండే ఈ నిజజీవిత కథను మీరూ తెలుసుకోండి. అజయ్, సురేంద్రలు ఇద్దరు స్నేహితుడి పెళ్లికోసం జైసల్మేర్ బయలుదేరారు. కొంచెం దూరం ప్రయాణించాక రాత్రి 8 గంటలకు హైవే పక్కనున్న దాబాలో భోంచేసి మరల ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పుడు రాత్రి 11 గంటలు కావస్తోంది. కారులో ఎంచక్కా పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వెళుతున్న వారు దారితప్పారు. కొంచెం దూరం వెళ్లాక ఒక ముసలావిడ కనిపించడంతో దారి చెప్పమని అడిగారు. ఆమె చెప్పిన దారి గుండా కొద్ది దూరం వెళ్లాక గ్రామ ముఖద్వారం కనపడింది. గ్రామంలోకి ప్రవేశించి కారును ముందుకు నడుపుతున్నాడు అజయ్. కానీ అక్కడ ఎవరూ మనషులు ఉండేలా అనిపించలేదు వారికి. అక్కడ అన్ని పాడుబడ్డ బంగాళాలు, దుమ్ము, ధూళితో నిండి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇద్దరు కారు దిగారు. వెనుకవైపు నుంచి ఎవరో వస్తున్నట్లు అలికిడి వినబడగానే తిరిగి చూశారు. ఒక పాతికేళ్ల మహిళ నీళ్లు మోసుకుంటూ వెళుతోంది. ఆమెను పలకరించిన ఉలూకూ పలుకూ లేకుండా పక్కనే ఉన్న సందులోకి వెళ్లింది. ఆమెను అనుసరించిన అజయ్, సురేంద్రలకు ఆ మహిళ మళ్లీ కనపడలేదు. ఎక్కడికి వెళ్లిందా అని ఆమెకోసం వెతుకుతుండగానే వారికి చిన్నగా ఏడుపు వినిపించింది. అది కాస్త పెద్దగా అయి భరించలేనంత శబ్దంతో మహిళ ఏడుస్తోంది. తీవ్ర భయానికి లోనైన వారు కారు వద్దకు పరుగెత్తుకొచ్చారు. కారులో కూర్చొని స్టార్ట్ చేయబోయినా ఫలితం లేకపోయింది. మహిళ ఏడుపు తగ్గించి నవ్వడం మొదలుపెట్టింది. అజయ్, సురేంద్రలు ఇద్దరు భయంతో హైవేవైపు పరిగెత్తడం ప్రారంభించారు. ఎదురుగా వస్తున్న లారీని ఆపి అందులోకి ఎక్కారు. చెమటలు, భయంతో వణుకుతున్న ఇద్దరిని చూసి ఏమిజరిగిందని డ్రైవర్ అడిగాడు. విషయం చెప్పడంతో మీరు కుల్ధారా వెళ్లారా అని లారీ డ్రైవర్ అడిగాడు. అవును అనడంతో అక్కడ మనుషులు ఎవరూ ఉండరు, 300 ఏళ్లుగా అక్కడ దెయ్యాలే ఉంటున్నాయని డ్రైవర్ చెప్పడంతో ఇద్దరు భయంతో వణికిపోయారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో మాత్రమే చూస్తాం కానీ ఇది నిజం. రాజస్థాన్లోని కుల్ధారా గ్రామానికి వెళితే ఇలాంటి సన్నివేశాలు బోలెడు చూస్తాం. కుల్ధారా కథేంటి? రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్ధారా. ఒకప్పుడు ఊరినిండా జనంతో, అందమైన గృహాలతో కళకళలాడేది.కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇళ్లు లేవు. అంతుపట్టని నీడలు, వికృతమైన అరుపులు, ఎవరివో తెలియని అడుగుల జాడలు తప్ప మనుషుల ఉనికి లేదు. మూడు వందల ఏళ్ల క్రితం కుల్ధారాలో పలివాల్ అనే బ్రాహ్మణ కులస్థులు మాత్రమే ఉండేవారు. ఒకరోజు ఆ గ్రామానికి ప్రధాని సలీమ్ సింగ్ (అప్పట్లో గ్రామలకు ప్రధానులని ఉండేవారు. వారిదే ఆధిపత్యం)!కుల్ధారా గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను సలీమ్ ఇష్టపడ్డాడు. కానీ ఆమె అతణ్ని ఇష్టపడలేదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీమ్. అది తట్టుకోలేక ఊరివాళ్లు తిరగబడ్డారు. తమ కులం కానివాడికి అమ్మాయిని ఇవ్వలేమని, దూరంగా ఉండమని హెచ్చరించారు. రగిలిపోయిన సలీమ్ ఊరివాళ్లపై పగబట్టాడు. అధిక పన్నులు విధించి హింసించాడు. అయినా ఎవరూ లొంగకపోవడంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు. అతనికి ఎదురు తిరిగి పోరాడటం మాటలు కాదు. అందుకే అందరూ కలసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లేముందు... ఆ ఊరు ఇక నివాసయోగం కాని విధంగా నాశనమైపోతుందని శపించారట. అందుకే కుల్ధారా అలా అయిపోయిందని అంటారు. అయితే ఈ కథలో కొంతే నిజం ఉందని, గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోలేదని, రాత్రికి రాత్రే సలీమ్ సింగ్ అందరినీ చంపి పాతి పెట్టేశాడని, వాళ్లంతా దెయ్యాలై ఊరిని పట్టి పీడించడం మొదలు పెట్టారనేది మరో వాదన. అందరికీ భయానక అనుభవాలు ఏది నిజమో తెలుసుకోవాలని, రాత్రికి రాత్రే జనమంతా ఏమైపోయారో కని పెట్టాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఎవరి జాడ తెలియకపోవడంతో మిన్నకుండిపోయారు. తర్వాత కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో నివసించడానికి వచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. అర్ధరాత్రి వేళల్లో ఎవరో తలుపులు బాదేవారు. తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఎవరో గట్టిగట్టిగా అరిచేవారు. ఏడ్చేవారు, నవ్వేవారు. ఏవేవో నీడలు వెంట తిరుగుతూండేవి. ఏవేవో రూపాలు కనిపించి భయపెట్టేవి. దాంతో అందరూ ఊరు వదిలి పారిపోయారు. క్రమంగా ఈ గ్రామంలో జరుగుతున్నవన్నీ బయటకు తెలియడంతో ఎవ్వరూ అక్కడకు వెళ్లే సాహసం చేయలేపోయారు. ఒక్కోసారి ఆ ఊరి పక్క నుంచి వెళ్లేవాళ్ల వాహనాలు హఠాత్తుగా ఆగిపోయేవి. తర్వాత వారికి అక్కడ భయానక అనుభవాలు ఎదురయ్యేవి. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారంతా కలిసి కుల్ధారాను ఘోస్ట్ విలేజ్ గా తేల్చారు. ఆ ముద్ర నేటికీ అలానే ఉంది. దాన్ని చెరిపే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. ప్రభుత్వం ఇప్పుడు దీన్ని పర్యాటక ప్రాంతంగా మార్చింది. రాత్రి అయితే మాత్రం ఇక్కడ ఎవరూ ఉండరు. – సాక్షి. స్కూల్ ఎడిషన్ -
గజ్జెల చప్పుడు.. చెవిలో గుసగుసలు
► మనిషి కనిపించరు.. ఒంటికి చల్లగా తగిలే స్పర్శలు ► గుసగుసలాడుతూ మనుషులతో మాట్లాడే చీకటి శక్తులు ► దుప్పట్లు తొలగించి ముఖాలు చూసే మసక రూపాలు ► గ్రామం మొత్తం నిర్మానుష్యం ► రాజస్థాన్లోని కుల్ధార గ్రామం వింత గాధ జైపూర్: ఆ గ్రామంలో 200 ఏళ్ల క్రితం చక్కగా ఇటుకలతో కట్టిన రెండంతస్తుల ఇళ్లలో ఇప్పటికి కొన్ని చెక్కు చెదరకుండా చక్కగా ఉన్నాయి. కొన్ని కప్పులు కూలిపోయి మొండిగోడలే మిగిలాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇళ్ల మధ్య సందులు, గొందులు తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తున్నాయి. ప్రజల మంచినీటి అవసరాల కోసం తవ్వించిన బావులు ఇప్పటికీ మన నీడలను నిర్మలంగా ప్రతిఫలిస్తున్నాయి. అయినా గ్రామంలో ఒక్క పురుగు కూడా కనిపించదు. రాజస్థాన్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జైసల్మీర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్యమైన ఈ గ్రామం ఇప్పుడు పురాతత్వ శాఖ పరిరక్షణలోకి వెళ్లింది. కుల్ధారగా చరిత్రలో నిలిచిపోయిన ఈ గ్రామానికి సంబంధించిన ఆసక్తికర కథలెన్నో ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. ‘రాత్రిపూట ఈ గ్రామంలో దెయ్యాల లాంటి ముసుగేసుకున్న రూపాలు తిరుగుతుంటాయి. అడుగుల శబ్దం వినిపించడం తప్ప కనిపించని అతీత శక్తులు కదలాడుతుంటాయి. మన చెవుల పక్క నోరుపెట్టి గుసగుసలాడుతున్న చీకటి శక్తులేవో మనతో మాట్లాడుతుంటాయి. మనం అక్కడ మొండి గోడల్లో భయం భయంగా నిండా కప్పుకొని నిద్రపోతే మసక రూపాలేవో వచ్చి మన దుప్పట్లను తొలగించి ముఖాలను చూసి పోతుంటాయి. మనిషి కనిపించని స్పర్శలేవో ఒంటికి చల్లగా తగులుతుంటాయి. ఇది నా బృందానికి ఎదురైన అనుభవాలు’ అని ‘ఇండియన్ పారానార్మల్ సొసైటీ (అతీత శక్తులపై పరిశోధనలు జరిపే సంస్థ)’ వ్యవస్థాపకులు గౌరవ్ తివారీ కొంత కాలం క్రితం చెప్పారు. అతీత శక్తుల ఆచూకీ కోసం.... అతీత శక్తుల చుట్టూ అల్లుకునే భ్రమలను తొలగించేందుకే తమ సొసైటీ ఏర్పాటైందని, కుల్దార గ్రామంలో మాత్రం ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి అందని వింత శబ్దాలు, అంతుచిక్కని అంశాలు ఎన్నో ఉన్నాయని గౌరవ్ తివారీ తెలిపారు. తాను అనేక బృందాలను అనేకసార్లు తీసుకొని వెళ్లి రాత్రిపూట కుల్దారా గ్రామంలో బస చేశానని, ఎప్పుడూ తమకు వింతైన అనుభవాలే కలిగేవని, ఒక్కోసారి అరుపులు. కేకలు కూడా వినిపించేవని, మనుషులు మాత్రం కనిపించేవారు కాదని ఆయన తెలిపారు. ఓసారి తాము తీసుకెళ్లిన వాహనాలన్నింటిపై తాము చూస్తుండగానే చిన్న పిల్ల అరచేతి ముద్రలు ప్రత్యక్షమయ్యాయని ఆయన చెప్పారు. అక్కడ తమకు కనిపించిన దృశ్యాలను, వినిపించిన శబ్దాలను, కనిపించీ కనిపించని, వినిపించీ వినిపించని దృశ్యాలను, ధ్వనులను పూర్తిస్థాయి స్పెక్ట్రమ్ కెమేరాలు, సీసీటీవీ కెమెరాలు, ఈఎంఎఫ్ మీటర్లు, ఈవీపీ రికార్డర్లు, థర్మల్ ఇమేజర్లు, మోషన్ సెన్సర్లు, రెమ్ పాడ్స్, స్టాటిక్ డిటెక్టర్లను ఉపయోగించి రికార్డు చేశామని తివారీ తెలిపారు. తివారీ ఆకస్మిక మరణం... తివారీ పరిశోధనలపై కొన్ని ఆంగ్ల పత్రికల్లో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయన మరణించారు. ఆయన మృతిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన వెల్లడించిన కథనం ప్రకారం: అది 1825వ సంవత్సరం. రక్షాబంధన్ రోజు, నాటి రాత్రి పున్నమి వెన్నల పుస్కలంగా విరగకాసింది. ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకొనే సందర్భం. కానీ చుట్టుపక్కల 85 గ్రామాల్లో నివసిస్తున్న పాలివాల్ బ్రాహ్మణులు దాదాపు 1500 మంది కుల్ధార కూడలిలో సమావేశమయ్యారు. జైసల్మీర్ రాజ్యానికి చెందిన సలీమ్ సింగ్ అనే మంత్రి కుల్ధార గ్రామ పెద్ద కుమార్తెను ప్రేమించాడు. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని గ్రామ పెద్దయిన పాలివాల్ బ్రాహ్మణ పెద్దను బెదిరించారు. లేకపోతే వ్యవసాయంపై బతికే పాలివాల్ బ్రాహ్మణులపై భారీగా సుంకాలు విధిస్తానని, రెండు రోజుల్లో నిర్ణయం తెలియజేయాలని హెచ్చరించారు. ఆ అంశాన్నే చర్చించేందుకే బ్రాహ్మణులంతా సమావేశమయ్యారు. వారి తెగకు చెందిన వారికి తప్ప మరో తెగ లేదా కులానికిచ్చే ఆనవాయితీ అప్పటికీ వారికి లేదు. 1500 మంది బ్రాహ్మణుల అదృశ్యం.. వారు ఆ రోజు అర్థరాత్రి వరకు చర్చించి ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ, ఆ రోజు రాత్రి నుంచి వారిలో ఒక్కరు కూడా కనిపించకుండా అదృశ్యమయ్యారు. వారితోపాటు వారి కుటుంబసభ్యులు కూడా కట్టుబట్టలతో కనిపించకుండా పోయారు. ఇది చరిత్రలో ఇప్పటికీ అంతుచిక్కని విషయం. తివారీ వివరించిన ఈ చారిత్రక కథనాన్ని ‘ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ స్థానిక అధికారులు ధ్రువీకరించారు. అయితే రాత్రి పూట అతీంద్రియ శక్తులు తిరుగుతాయన్న అంశాన్ని మాత్రం వారు ఖండించారు. ప్రజల్లో అలాంటి విశ్వాసాలు ఉన్నాయని, తమకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని వారు చెప్పారు. తాము పర్యాటకులను మాత్రం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పారు. అవన్నీ కట్టుకథలే కావచ్చు.. కుల్ధారలో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న విషయాన్ని ‘జైసల్మీర్ వికాస్ సమితి’ కార్యదర్శి చంద్ర ప్రకాష్ వ్యాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఖండించారు. తివారీ బృందం పరిశోధనల గురించి ప్రస్తావించగా ఆయనతోపాటు తాను కూడా కొన్ని రోజులు కుల్ధార గ్రామంలో రాత్రిపూట బస చేశానని, తనకు మాత్రం ఎలాంటి వింత శబ్దాలు వినిపించలేదని, వికృత రూపాలు కనిపించలేదని చెప్పారు. ఆరోజు అద్యశ్యమైన బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కుడికి వెళ్లి ఉంటాయని ప్రశ్నించగా, కొన్ని కుటుంబాలు చెల్లాచెదురుగా రాజస్థాన్ ఇతర ప్రాంతాల్లో స్థిరపడి ఉండొచ్చని, మరికొన్ని కుటుంబాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, బిహార్ రాష్ట్రాలకు వలసపోయి ఉంటాయని ఆయన చెప్పారు. పర్యాటకులను ఆకర్షించడం కోసం కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కథనాలను ప్రచారం చేసి ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతుచిక్కని రహస్యమే.. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో అతి తక్కువ నీటిని ఉపయోగించి వ్యవసాయం చేయడంలో పాలివాల్ బ్రాహ్మణులు అనుభవజ్ఞులు. వారు గోధుమ పంటను ఎక్కువగా పండించేవారు. పాలి ప్రాంతం నుంచి వారి పూర్వీకులు రావడం వల్ల వారి పాలివాల్ బ్రాహ్మణులని పేరు వచ్చి ఉంటుందన్న చారిత్రక అంచనాలు కూడా ఉన్నాయి. వారు నేర్పిన వ్యవసాయం గురించి రాజస్థాన్ విద్యాలయాల్లో ఇప్పటికీ పాఠాలు చెబుతారు. వారు ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికి వలస వెళ్లారో, వారి ఆనవాళ్లు ఎక్కడున్నాయో మాత్రం ఎప్పటికీ చరిత్రకందని రహస్యమే!