breaking news
Krsnastami celebrations
-
నేడు ఇస్కాన్‌లో కృష్ణాష్టమి వేడుకలు
తిరుపతి కల్చరల్: శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు సోమవారం నుంచి మూడు రోజులపాటు తిరుపతిలోని ఇస్కాన్‌లో అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని కమలమందిరాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సుందరమైన పుష్పాలతో రాధాకృష్ణులను, గోపికల ప్రతిమలను అలంకరించి కొలువు తీర్చారు. ఇస్కాన్ మందిరంలో బాలకృష్ణుని జన్మవృత్తాంతాన్ని తెలిపే విధంగా ఏర్పాటు చేసిన వర్ణ చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీకృష్ణుని భక్తితత్వాన్ని చాటే ఫొటో ఎగ్జిబిషన్, భక్తులకు ఆహ్వానం పలుకుతూ సుందరమైన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇస్కాన్ రోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించారు. రాధాకృష్ణులను భక్తులందరూ దర్శించుకునేందుకు వీలుగా ఇస్కాన్ మందిరం లో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఇస్కాన్‌లో నేటి కార్యక్రమాలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఇస్కాన్ మందిరంలో సోమవారం ఉదయం 4.15 గంటలకు హారతి, 9 గంటలకు శృంగార హారతి, 9 నుంచి రాత్రి 11.45 గంటల వరకు దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు వైభవంగా ఉట్లోత్సవం జరుగుతుంది. 7 గంటలకు ముఖ్య అతిథుల సందేశం, 7.15 గంటలకు మందిర అధ్యక్షుల సందేశం, 7.30 గంటలకు ఆధ్యాత్మిక నాటిక ప్రదర్శన ఉంటాయి. రాత్రి 12 గంటలకు రాధాగోవిందులకు మహా శంఖాభిషేకం నిర్వహిస్తారు. -
టీటీడీ వర్సెస్ హథీరాం మఠం
కృష్ణాష్టమి వేడుకలపై మరో వివాదం మఠం మెట్లు కూల్చేశారని కోర్టుకెళ్లిన నిర్వాహకులు మహారథం కోసం మెట్లుతీసామన్న టీటీడీ మఠం ఆవరణలోనే ఆస్థానం నిర్వహిస్తామన్న అధికారులు సాక్షి, తిరుమల : మాస్టర్‌ప్లాన్ స్థల సేకరణపై టీటీడీ, హథీరాంమఠం మధ్య రెండు దశాబ్దాలుగా వివాదం నెలకొంది. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మఠానికి వెళ్లే మెట్లను టీటీడీ ఇటీవల తొలగించి స్థలాన్ని విస్తరించింది. దీనివల్ల కృష్ణాష్టమి ఉట్లోత్సవ వేడుకలకు శ్రీవారి ఆలయం నుంచి ఉత్సవమూర్తులు హథీరాంమఠానికి రాలేరని మళ్లీ మఠం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. అయితే సంప్రదాయం ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. రెండు దశాబ్దాలుగా వివాదం టీటీడీ మాస్టర్‌ప్లాన్ ప్రకారం తూర్పు, దక్షిణమాడ వీధిలోని మఠాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతం మినహా మిగిలిన నాలుగు మాడ వీధుల విస్తరణ పనులు పూర్తి అయ్యాయి. 2003లో వేయికాళ్ల మండపం కూల్చివేత సమయంలోనే హథీరాం మఠం ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని కూల్చివేయాలని టీటీడీ ప్రయత్నించింది. దీనికి మఠం తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపింది. అంతకుముందే కోర్టును ఆశ్రయించటంతో పనులు పెండింగ్‌లో పడ్డాయి. వాటికి సంబంధించి వాదనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. మహారథం ఊరేగింపుకోసం మఠం మెట్ల తొలగింపు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ తర్వాత అంతే ప్రాధాన్యం ఉన్న మహారథం(కొయ్యతేరు) ఊరేగింపునకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇలాంటి తరుణంలో తూర్పు, దక్షిణ మాడవీధి ఇరుకైన దారిలో తేరు సులభంగా వెళ్లలేకపోతోంది. దేవుని ఉత్సవాలకు సహకరించండి అంటూ టీటీడీ అధికారులు మఠం నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గత ఒప్పందం ప్రకారం మఠానికి ఉత్తర దిశలో ఉన్న 104 అడుగుల స్థలాన్ని ఇవ్వాలని కోరారు. కోర్టులో కేసు నడుస్తుండటం వల్ల తాము జోక్యం చేసుకోలేమని మఠం నిర్వాహకులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో మఠానికి ఆనుకుని ఉన్న టీటీడీకి చెందిన పురాతన కొలువు మండపం ముందు భాగాన్ని తొలగించారు. దీనికి అనుకుని ఉన్న మఠానికి వెళ్లే మెట్లను కూడా తొలగించి ఆ ప్రాంతాన్ని విస్తరించారు. దీనివల్ల కొయ్యతేరు ఊరేగింపు సులభంగా సాగే అవకాశం కలిగింది. కృష్ణాష్టమి వేడుకలపై కోర్టుకు.. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరుసటి రోజు తిరుమలలో ఉట్లోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మలయప్ప, వెన్నముద్ద కృష్ణుడు సమక్షంలో పలు ప్రాంతాల్లో ఉట్టికొడతారు. ఇందులో భాగంగానే ఉత్సవర్లు హథీరాం మఠానికి వచ్చి ప్రత్యేక పూజలందుకుని ఉట్లోత్సవాన్ని తిలకిస్తారు. అయితే, మఠానికి వెళ్లే మెట్లను తొలగించటం వల్ల ఉత్సవమూర్తులు పూజలందుకునేందుకు రాలేరని నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. గత సంప్రదాయాల ప్రకారమే ఉత్సవమూర్తులను మఠం ఆవరణలోకి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని టీటీడీ ఆలయ అధికారులు కోర్టుకు బదులిచ్చారు. దీనిపై కోర్టు ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ తరుణంలో మంగళవారం జరిగే ఉట్లోత్సవ కార్యక్రమ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. అయితే సంప్రదాయం ప్రకారం జీయర్‌మఠంతో పాటు హథీరాం మఠ ఆవరణలోనే ఉట్లోత్సవ ఆస్థానం నిర్వహిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు.