breaking news
Karif farmer
-
బె‘ధర’గొడ్తూ!
నేలకొండపల్లి: ఎన్నెన్నో ఆశలతో సాగు పనుల కు శ్రీకారం చుడుతున్న రైతులు ఆదిలోనే బెదిరేట్లుగా ఎరువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి రేట్ల పెంపుపై ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు రాకున్నా..వ్యాపారులు మాత్రం గతంతో పోలిస్తే ఎక్కువ చేసి అమ్మేస్తున్నారు. దీంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుబంధు, ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాల ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న తరుణంలో ఇలా..ఎరువుల ధరలు పెరగడమేంటని సామాన్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూ.1250 ఉన్న డీఏపీ కట్ట ప్రస్తుతం మార్కెట్ లో రూ.1470 పలుకుతోంది. దీంతో ఒక్కో బస్తాపై అదనంగా రూ.200కు పైగా భారం మోయాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్ సమీపిం చిన నేపథ్యంలో రైతులు పొలాల బాట పట్టారు. దుక్కులు దున్నుతూ ఇతర పనులు చేస్తూ, వ్యవసాయ పనిముట్లను సిద్ధం చేసుకుంటూ..వారం పది రోజుల్లో రుతుపవనాలు రానుండటంతో ఖరీప్ సాగుకు అంతా సన్నద్ధమవుతున్నారు. అయితే పెరిగిన ఎరువుల ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో పెంచిన లెక్క ప్రకారమే విక్రయాలు జరుపుతుండటంతో ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సాగు అంచనాలు ఇలా.. జిల్లాలో ఈ సంవత్సర ఖరీఫ్‌లో 2,30,498 హెక్టార్లు సాగు చేసే అవకాశాలున్నాయి. అందులో వరి–59,361 హెక్టార్లలో వేయనున్నారని అంచనా. ఇంకా పత్తి–96,116 హెక్టార్లు, మొక్కజొన్న 3,802 హెక్టార్లు,పెసర–9,249 హెక్టార్లు, కంది–2,340 హెక్టార్లు, మిర్చి–21,250 హెక్టార్లలో పండించే అవకాశాలున్నాయి. ఖరీఫ్‌లో వినియోగం 2.34 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. యూరియా– 72,408 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంది. ఇంకా డీఏపీ–31,561 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 22,946 మెట్రిక్‌టన్నులు, కాంప్లెక్స్ –1,05,560 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ–2500 మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్లో వినియోగిస్తారని అంచనా. తగ్గిన భూసారాన్ని పెంచుకోవాలంటే మళ్లీ సేంద్రియం ఒక్కటే మార్గం అంటున్న శాస్త్రవేత్తల సూచనలను అందరూ పెడచెవిన పెడుతున్నారు. సేంద్రియ సాగుపై రైతు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నా..ఆచరణలో ఆశించిన స్థాయిలో అమలు కావట్లేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా..వ్యవసాయాన్ని కాపాడేందుకు సేంద్రియ విధానాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. రైతులపై మోయలేని భారం.. అసలే సాగు పెట్టుబడులు పెరిగి వ్యవసాయం అంటేనే భయపడుతున్న తరుణంలో ఎరువుల ధరలు పెంచడం దారుణం. వీటిని నియంత్రించాలి. రైతుల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వెంటనే ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. – గుడవర్తి నాగేశ్వరరావు, రైతుసంఘం నేత, నేలకొండపల్లి పెట్టుబడి ఇంకా పెరిగింది.. వ్యవసాయం ప్రతి ఏటా భారంగా మారుతోంది. ఒకపక్క పెరిగిన పెట్టుబడి, మరోపక్క కౌలు పెరగడంతో సాగు చేయాలంటేనే భయమేస్తోంది. కౌలు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాలకులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. – కాశిబోయిన అయోధ్య, కౌలురైతు, సింగారెడ్డిపాలెం -
ఖరీఫ్‌ను కనికరించిన వర్షం
సాక్షి, ఏలూరు : జిల్లాలో వరినాట్లు నెల రోజులు ఆలస్యమయ్యాయి. కొద్ది రోజులుగా సాగు నీరు అందక చేలు ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. కలుపు మొక్కలు పెరిగిపోవడంతో వరి దుబ్బులు సరిగా మూన కట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో కనీసం చిరు జల్లులైనా పలకరిస్తే చాలని రైతులంతా ఆకాశం వైపు ఆబగా చూస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారం వరుణుడు పలకరించాడు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వాన ఖరీఫ్ రైతుల ఆశల్ని చిగురింపజేసింది. రానున్న పక్షం రోజుల్లో ఎంతోకొంత వర్షం కురిస్తే ఏదోరకంగా గట్టెక్కవచ్చనే ఆశతో అన్నదాతలు ఉన్నారు. ఈ నెల రెండో వారం నాటికి జిల్లాలో 457.2 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 368.3 మి.మీ. కురిసింది. అదనులో కురవకపోవడంతో ఆ జల్లులేవీ రైతులకు అక్కరకు రాలేదు. జిల్లాలో ఈ ఖరీఫ్ పంట కాలంలో 2.42 లక్షల హెక్టార్లలో వరినాట్లు వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు దాదాపు 1.90 లక్షల హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదినుంచీ ఎదురవుతున్న అవాంతరాలు ఖరీఫ్ రైతును కలవరపెడుతున్నాయి. ఆగస్టు తొలివారానికే జిల్లాలో నాట్లు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ సెప్టెంబర్ మొదటి వారానికి గానీ కొలిక్కి వచ్చేలా లేవు. అంటే ఖరీఫ్ సీజన్ దాదాపు నెల రోజులు ఆలస్యమైంది. ఫలితంగా రైతులకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. అడుగడుగునా నీటి సమస్యలే.. సాధారణంగా నారుమడి వేసిన 20 రోజులకు నాట్లు వేసే అవకాశం కలుగుతుంది. కాలువలకు సాగునీటి విడుదల ఆలస్యం కావడం, మధ్యలో డెల్టా ఆధునికీకరణ పేరుతో కొన్ని కాలువలకు నీరు నిలిపివేయడం, వర్షాలు లేకపోవడం వంటి కారణాలతో నారుమళ్లు ఆలస్యమయ్యాయి. ఫలితంగా నాట్లు కూడా ఆలస్యమయ్యాయి. నాట్లు వేసిన తరువాత వానలు కురవకపోవడంతో చేలల్లో తగినంత నీరులేక కలుపు విపరీతంగా పెరిగిపో దానిని తొలగించడానికి ఎక్కువ మంది కూలీలను వినియోగించాల్సి వస్తోంది. ఇందుకోసం ఎకరానికి కనీసం రూ.వెరుు్య నుంచి రూ.1,500 అదనంగా వెచ్చిస్తున్నారు. కలుపు తీసిన తర్వాత కూడా నీరు సరిగా లేకపోతే మళ్లీ కలుపు పెరిగి పంట దిగుబడి తగ్గిపోతుంది. రెండోసారి కలుపు తీయించాల్సి వస్తే అందకయ్యే ఖర్చు రైతులపై మరింత భారం మోపనుంది. ఈ పరిస్థితుల్లో ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆచంట, నిడదవోలు, పోలవరం, తణుకు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో కృష్ణా నీటిపై ఆధారపడి సాగుచేసే రైతులు నాట్లు ప్రారంభించారు. మొత్తానికి ఎండిపోయే స్థితికి చేరుకున్న వరి చేలకు మంగళవారం నాటి వర్షం జీవం పోసింది.