breaking news
Justice P.Laxman Reddy
-
ప్రజాస్వామ్య విలువలకు పాతర
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది. అక్రమ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొన్నారు. ప్రజాతీర్పుకు విలువ లేకుండా చేశారు. ఓటుకు పది వేలు ఇచ్చేందుకూ సిద్ధమంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టి పార్టీ కార్యకర్తల్లా మార్చేశారు. సీఎంగా భరోసా కల్పించాల్సిన వ్యక్తి భయపెడుతూ పాలన సాగించారు. అధికార పార్టీ నేతలు చెబితేనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాజధాని పేరిట రైతుల నుంచి భూములను లాక్కొని.. తన వాళ్లకు, విదేశీ కంపెనీలకు భూపందేరం చేస్తున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఎన్నికల్లో నోటుకు అమ్ముడుపోతే సర్వం కోల్పోయినట్లే. ప్రశ్నించే హక్కును చేజేతులారా వదిలేసుకున్నట్లే. ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం సరిగా స్పందించడం లేదు’ అంటున్నారు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో అవినీతి, అస్తవ్యస్త పాలనపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన సొంత మాటల్లోనే.... ‘‘డబ్బు తీసుకుని ఓటు వేయడం ద్వారా.. ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే.. ఊరికే ఓటు వేశావా.. డబ్బు తీసుకునే కదా..! అంటూ నేతలు ఎదురు ప్రశ్నించే పరిస్థితి వస్తోంది. ప్రశ్నించే హక్కును కోల్పోతే.. సర్వం కోల్పోయినట్లే! ‘‘ఓటర్లు గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళితే.. ఓటర్ల జాబితాలో పేరు లేదు, ఓటు వేయడం కుదరదంటున్నారు. గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు.. అతనికి ఓటు వేసే అవకాశం ఇవ్వకపోతే, మరి ఆ గుర్తింపు కార్డుకున్న విలువ ఏమిటి? ఓటర్ల ప్రమేయం లేకుండానే వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి మాయం అవుతున్నాయి’’ సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఐదేళ్ల పాలన సాగింది. పార్టీకి, ప్రభుత్వానికి తేడా లేకుండా పాలించారు. పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నట్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారు. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పార్టీతో సంబంధం లేకుండా పాలన సాగాలి. రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా చంద్రబాబు.. ఇది టీడీపీ పాలన అన్నట్లు చేశారు. వాళ్ల పార్టీకి చెందిన వారికే మేలు చేశారు. ఉద్యోగులను కూడా పార్టీ కార్యకర్తల్లా మార్చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా వదల్లేదు. వారి విషయంలోనూ ఇదే ధోరణితో వ్యవహరించారు. 2014లో ఐఏఎస్, ఐపీఎస్‌లను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడిన మాటలను ఇక్కడ గుర్తు చేయదలిచాను. అధికారులంతా మాకు అనుకూలంగా పనిచేయాలి. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం దురదృష్టకరం. మీ విధుల్లో మా జోక్యం ఉండదు.. నిష్పక్షపాతంతో విధులు నిర్వర్తించండి.. పార్టీలకు అతీతంగా వ్యవహరించండి అని చెప్పాల్సింది పోయి.. పార్టీ కార్యకర్తల కోసమే పనిచేయమని చెబుతారా? సీఎంగా భరోసా కల్పించాల్సిన వ్యక్తి, భయపెడుతూ పాలన సాగించారు. వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా : ప్రభుత్వంపై, వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా చేశారు. ఎక్కడ చూసినా ఆశ్రితపక్షపాతం, అవినీతి. అధికారులను చెప్పుచేతుల్లో పెట్టుకుంటే.. అవినీతికి అడ్డూఅదుపే ఉండదు. అందుకే నయానో భయానో అధికారులను తమ దార్లోకి తెచ్చుకున్నారు. ఏ పార్టీకి చెందని తటస్థ వ్యక్తి..ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లితే పని జరగదు. చాలాసార్లు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. చివరకు డబ్బులిచ్చి పనిచేయించుకోవాల్సిన దుస్థితి. ప్రతి చిన్న పనికీ అధికార పార్టీ నేతలను తీసుకురావడమో, వారితో సిఫారసు చేయించడమో తప్పనిసరైపోయింది. చివరకు పోలీసులు కూడా అధికార పార్టీ నేతల నుంచి సిఫారసు వస్తే తప్ప కేసు కూడా నమోదు చేయడం లేదంటే.. ఈ రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ అధికారుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. వీళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫారసు ఉంటే తప్ప పనిచేయడం లేదు. ముఖ్యమంత్రే తప్పు చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఫలానా పనికి ఫలానా రేటు అంటూ వాటాలు పంచుకుంటున్నారు. కాంట్రాకర్టు చేసిన పనులకు సైతం బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లులు చెల్లించాలంటే.. లంచం ఇవ్వాల్సిందే. కాంట్రాక్ట్ రావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందే. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్కక్కై ప్రజలను దోచుకుంటున్నారు. నీకు ఇంత.. నాకు అంత అంటూ.. వాటాలు వేసుకుని ప్రజల డబ్బును పంచుకుంటున్నారు. కింది స్థాయి అధికారి తప్పు చేస్తే, పై అధికారికి చెబుతారు. పై అధికారి తప్పు చేస్తే ప్రజా ప్రతినిధులకు చెప్పాలి. ప్రజా ప్రతినిధులు తప్పు చేస్తే.. మంత్రికి.. మంత్రులు తప్పు చేస్తే చివరకు సీఎంకి చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటి వ్యక్తే తప్పు చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి.. ఎవరికి చెప్పుకోవాలి..? ఇంతకంటే ప్రభుత్వ వైఫల్యం ఏముంటుంది? టెండర్ వ్యవస్థను దిగజార్చి : కావాల్సిన వారికోసం టెండర్ నిబంధనలనే మార్చేశారు. ఎవరికి పనులు ఇవ్వాలనుకుంటున్నారో.. వారికే కట్టబెడుతున్నారు. టెండర్ల వ్యవస్థను దిగజార్చారు. అర్హతల ప్రకారం ఎవరైనా పనులు దక్కించుకుంటే.. వారిని బెదిరిస్తున్నారు. కమీషన్ ఇచ్చేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ మీకో ఉదాహరణ చెబుతాను. ఓ ప్రాజెక్టుకు సంబంధించి ముగ్గురు టెండర్లు వేశారు. ఎల్3గా వచ్చిన వ్యక్తి ప్రభుత్వానికి కావాల్సి వ్యక్తి. ఎల్1ని బెదిరించడంతో అతను తప్పుకున్నాడు. ఎల్2 దారికి రాకపోవడంతో.. ఎక్సెస్ వేసిన మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒప్పుకోకపోవడంతో ఏవేవో సాకులు చెప్పి కాంట్రాక్ట్ రద్దు చేయించారు. విదేశీ కంపెనీలకు దాసోహం : స్విస్ ఛాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ ఎత్తి చూపింది. వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చింది. అయినా ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకోకుండా..తమ దోపిడీకి అడ్డుగా ఉన్న చట్ట నిబంధనలనే మార్చేసింది. ఆ కంపెనీల స్థితిగతులను కూడా తెలుసుకోలేదు. కంపెనీలపై కేసులు వేయాలంటే..ఆ కంపెనీలు ఉన్న దేశాల్లోనే వేయాలట. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఇదెక్కడి అరాచకం. ఎవ్వరూ నోరు మెదపకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇవన్నీ చేసింది. స్విస్ ఛాలెంజ్ కింద ఏం చేసినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ద్వారానే చేయాలి. కాని ఈ ప్రభుత్వం ఆ అథారిటీని నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఈ అథారిటీకి అధికారాలు లేకుండా చేశారు. తాము చేసే అక్రమాలు ఎవరికి తెలియకుండా ఉండేందుకు, తెలిసినా అడ్డు చెప్పకుండా ఉండేందుకే ఈ చట్ట సవరణ చేశారు. పంట భూములు లాక్కున్నారు : రాజధాని కోసమంటూ మూడు పంటలు పండే భూములను లాక్కున్నారు. చాలాచోట్ల పూలింగ్ కింద భూములు ఇవ్వకున్నా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయలేదు. రైతుల భూములు ప్రభుత్వపరం కాక ముందే.. వాటిని విదేశీ కంపెనీలకు పందేరం చేయడం మొదలుపెట్టారు. ప్రాజెక్టుల విషయంలో అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకునే నాథుడే లేడు. ఎవరైనా అధికారి గట్టిగా మాట్లాడితే కక్ష సాధింపు చర్యలు. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు అభ్యంతరం చెబితే.. వాటిని ఖాతరు చేయకుండా క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారే చెబుతున్నారంటే.. ఈ పాలన ఎంత అరాచకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ కంపెనీలకు అణాపైసలకు భూములు : భూముల కేటాయింపుల్లో కూడా ఇష్టారాజ్యమే. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలకు కోట్ల రూపాయల ధరతో భూములు కేటాయిస్తున్నారు. అదే తమకు కావాల్సిన ప్రైవేటు కంపెనీలకు మాత్రం నామమాత్రపు ధరలకు భూములు ఇచ్చేస్తున్నారు. ఈ ప్రైవేట్ కంపెనీలకు ఉన్న అర్హతలు ఏమిటి.. వాటి స్థితిగతులుæ.. ఉపాధి కల్పించే సత్తా ఆ కంపెనీలకు ఉందా? అన్న విషయాలను పట్టించుకోవడం లేదు. దొడ్డిదారిన పైరవీలతో వస్తే చాలు.. బహిరంగ మార్కెట్లో కోట్ల విలువ చేసే భూమి కూడా అణా పైసలకు ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం కేటాయించే భూముల ధరలను నిర్ణయించేందుకు ఓ కమిటీ ఉంటుంది. ధరల విషయంలో ఈ కమిటీదే తుది నిర్ణయం. కాని ఏపీలో అందుకు విరుద్ధంగా ప్రభుత్వ పెద్దలే భూముల ధరలు నిర్ణయించేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎకరాకు రూ.5కోట్లు వసూలు చేస్తారు. అనామక కంపెనీలకు మాత్రం రూ.50 లక్షలకే భూమి ఇచ్చేస్తారు. రికార్డుల్లో ధరలను వేరుగా ప్రస్తావిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో కోట్ల రూపాయలను జేబులో వేసుకుంటున్నారు. స్పీకర్‌కున్న ఆ అధికారాలను రద్దు చేయాలి : పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికార పార్టీకి వంత పాడటం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ఫిరాయింపులు పెరిగిపోవడానికి స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు ప్రధాన కారణం. ఫిరాయించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. స్పందించడం లేదు. అందుకే ఫిరాయింపుల విషయంలో స్పీకర్‌కున్న అధికారాల్ని వెంటనే రద్దు చేయాలి. ఆ మేరకు చట్ట సవరణ చేయాలి. ప్రస్తుతం స్పీకర్‌కున్న అధికారాలను ఎన్నికల సంఘానికి లేదా న్యాయస్థానాలకు అప్పగిస్తూ చట్ట సవరణ తీసుకురావాలి. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకపోతే, అది ఫిరాయింపులను మరింత ప్రోత్సహించినట్లవుతుంది. అధికారంలోకి వచ్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్లు పెట్టి కొనేందుకు సైతం వెనుకాడరు. ఈ ధోరణి వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. అక్రమ సంపాదన వల్లే ఫిరాయింపులను ప్రోత్సహించగలగుతున్నారు. ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారు డబ్బు తీసుకుని ఓటు వేయడం ద్వారా.. ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, ఊరికే ఓటు వేశావా.. డబ్బు తీసుకునే కదా.. అంటూ నాయకులు ఎదురు ప్రశ్నించే పరిస్థితి వస్తోంది. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. ఎన్నికల్లో ప్రజా సేవ చేయడానికి ఎవ్వరూ పోటీ చేయడం లేదు. డబ్బు సంపాదించేందుకే వస్తున్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది. కోర్టులు క్రియాశీలకంగా ఉండాలి ఓటర్ల హక్కులను పరిరక్షించే విషయంలో న్యాయస్థానాలు క్రియాశీలకంగా పనిచేయాలి. ఓటర్ల తొలగింపుపై ఏదైనా పిల్ దాఖలు చేసినప్పుడు.. తొలగింపునకు గురైన వ్యక్తే కోర్టుకు రావాలని న్యాయస్థానాలు అంటున్నాయి. వాస్తవంగా ఇదెలా సాధ్యం. ప్రతీ వ్యక్తికి కోర్టుకు వచ్చే స్థోమత ఉండదు కదా? ఈ విషయాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. సాంకేతిక అంశాలను, లోపాలను కారణాలుగా చూపుతూ ఓటర్లకు సంబంధించి వ్యాజ్యాలను కొట్టేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి!! ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదు రాష్ట్రంలో పెద్దఎత్తున ఓటర్ల తొలగింపు జరుగుతుంటే ఎన్నికల సంఘం సరిగా çస్పందించలేదు. ఓటర్లు గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళితే.. ఓటర్ల జాబితాలో పేరు లేదు, ఓటు వేయడం కుదరదంటున్నారు. ఓటర్ల ప్రమేయం లేకుండానే వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి మాయం అవుతున్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో అధికారులు తగిన విచారణే చేయడం లేదు. ఒకవేళ ఓటరు జాబితాలో పేరు తొలగిస్తే.. అప్పుడే ఆ వ్యక్తి ఓటరు గుర్తింపు కార్డునూ రద్దు చేయండి. అప్పుడు ఆ వ్యక్తికి తన ఓటు తొలగించినట్లు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తరువాత గానీ ఓటర్ల జాబితాలో పేరు ఉందో,లేదో తెలియడం లేదంటే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్లు? ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. రాష్ట్రంలో ఈసారి ఓటర్ల సంఖ్య పెరగాలి. కాని అందుకు భిన్నంగా ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇది ఎందుకు జరిగిందో ఎన్నికల సంఘం చెప్పగలిగే పరిస్థితిలో ఉందా? అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారు ఇలా అవినీతి ద్వారా వెనకేసుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చినట్లు కొంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆ డబ్బునే ఖర్చుపెడుతున్నారు. ఓటుకు పదివేలు ఇచ్చేందుకు సైతం సిద్ధమంటున్నారంటే.. అవినీతి డబ్బు ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. డబ్బు, ఇతర ప్రలోభాలను ఎర వేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఫిరాయింపుల విషయంలో మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ను ఓ ఆదర్శ రాష్ట్రంగా మార్చేశారు. -
సమైక్య తీర్మానమే రాష్ట్రానికి రక్ష
-
సమైక్య తీర్మానమే రాష్ట్రానికి రక్ష
* ‘సాక్షి’తో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఉద్ఘాటన * రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన ప్రక్రియ * తీర్మానం కోరకుండా నేరుగా ముసాయిదా బిల్లు పంపడం చట్టసభలను అవమానించడమే * అసెంబ్లీ విభజనకు అనుకూలమా? ప్రతికూలమా ముందు తేలాలి * ఈ అంశంపై సీఎం అనుబంధ తీర్మానం ప్రతిపాదించొచ్చు * సమైక్య రాష్ట్రంపై చిత్తశుద్ధిలేనివారే సమైక్య తీర్మానానికి పట్టుబట్టరు * విభజనపై సభల అభిప్రాయం తీసుకోకుండా డ్రాప్టుపై చర్చకు అర్థం లేదు * ముసాయిదాపై చర్చకు అంగీకరించడమంటే.. విభజనకు అంగీకరించినట్లే! * తీర్మానానికి అసెంబ్లీలో పట్టుబట్టాలేగాని.. సభనూ ఎవరూ బాయ్‌కాట్ చేయకూడదు * బాయ్‌కాట్ చేస్తే టీ సభ్యులు చెప్పిందే సభ అభిప్రాయంగా కేంద్రానికి పంపే ప్రమాదముంది * జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర విభజనపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రను కాంక్షిచేవారందరూ.. సమైక్య రాష్ట్ర తీర్మానం చేయాల్సిందిగా అసెంబ్లీలో పట్టుబట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, సమైక్యాంధ్రను కాంక్షించేవారు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (రాష్ట్రాల విభజన, కలపడం, సరిహద్దుల మార్పు) విషయంలో చట్టసభలకున్న అధికారాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇది చట్టసభలను (ప్రజలను) అవమానించడమే. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సుమోటోగా విభజన బిల్లు రూపొందించి శాసనసభ అభిప్రాయాల (వ్యూస్) కోసం పంపింది. ఇందులో కూడా రాష్ట్రాన్ని విభజించాలా? కలిపి ఉంచాలా? అనే ఆప్షన్ లేదు. అందువల్ల దీనిపై చర్చలో పాల్గొనడమంటే సూత్రప్రాయంగా రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లే అవుతుంది. అందువల్ల దీనిపై చర్చను అడ్డుకుని సమైక్య తీర్మానం కోసం సభ్యులు పట్టుబట్టాల్సిందే’ అని లక్ష్మణరెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి మొదట నుంచి చేసిన డిమాండు ఇదే కదా! రాష్ట్రానికి కేంద్రం నుంచి ముసాయిదా బిల్లు రాకముందే సమైక్య రాష్ర్టం కోసం అసెంబ్లీలో తీర్మానం చేద్దామని అన్ని రాజకీయ పక్షాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా ముందే విజ్ఞప్తి చేశారు. అప్పట్లో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఇదే ప్రతిపాదన చేశాను. రాష్ట్ర పునర్విభజనపై తీర్మానం కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఎటూ ప్రతిపాదన పంపుతుందని, అప్పుడూ వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ద్వారా తీర్మానం పంపితే బాగుంటుందని సీఎం చెప్పారు. కేంద్రం నుంచి ప్రతిపాదన రాకముందే మనం సుమోటోగా తీర్మానం పంపినా పక్కన పడేసే అవకాశం ఉందని సీఎం చెప్పడంతో ఆనాడు సంతృప్తి చెందాం. తర్వాత దిగ్విజయ్‌సింగ్, షిండేతోపాటు ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం చెప్పాల్సిందిగా ఒకసారి తీర్మానం కోరతారని, మరోసారి ముసాయిదా బిల్లు వస్తాయని ప్రకటించారు. ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీర్మానాన్ని కోరకుండా నేరుగా ముసాయిదా బిల్లునే పంపింది. ఇందులో కూడా రాష్ట్ర విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే క్లాజు లేదు. ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉంది. ఆర్టికల్ 3 కింద రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం కేంద్ర ప్రభుత్వానిదే కదా? రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించలేదు. రాష్ట్ర విభజనకు రెండు విధానాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం పంపితే దానిని కేబినెట్ ఆమోదించి తర్వాత ముసాయిదా బిల్లు రూపొందించి పంపడం ఒక విధానం. కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాల పునర్విభజన కమిటీ(ఎస్ఆర్సీ) తరహాలో నిపుణుల కమిటీని వేయడం. ఆ కమిటీ నివేదికను పార్లమెంటులో చర్చించి పార్లమెంటు చేసే సవరణల ప్రకారం ముసాయిదా బిల్లును రూపొందించడం. మన రాష్ట్రం విషయంలో ఇవి రెండూ జరగలేదు. నేరుగా కేంద్రం తనకు నచ్చినట్లు ముసాయిదా బిల్లు రూపొందించింది. చట్టసభలు రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే ఆర్టికల్ -3 ద్వారా దానిని అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మామూలుగా కూడా చట్టసభలు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే దాన్నిఅమలు చేసే అధికారం ప్రభుత్వానికి (కార్యనిర్వాహక వ్యవస్థకు) ఉంటుంది. ఆర్టికల్ -3 సవరించాలనే డిమాండుపై.. కేంద్రం ప్రభుత్వమంటే అధికారపక్షమే. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్న ప్రస్తుత అధికార పక్షం తనకు అనుకూలించే రాజకీయ ధ క్పథంలో ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించే ప్రయత్నం చేస్తోంది. అందువల్లే రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఆంధ్రను కేంద్రం విభజిస్తున్న విషయాన్ని, ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరం గురించి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ పార్టీల నేతలను కలిసి వివరించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం జగన్ చొరవ వల్ల ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆంధ్రను విభజిస్తే అంగీకరించబోమని, పార్లమెంటులో వ్యతిరేకిస్తామని వివిధ రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు చెప్పారు. మరిప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ముందున్న పరిష్కారమార్గం ఏమిటి? రాష్ట్ర విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే అంశంపై సభ అభిప్రాయం తీసుకుని ఓటింగ్ నిర్వహించాలని సభా నాయకుడైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించొచ్చు. సభలో ఎవరైనా అంశంపై ప్రైవేటు తీర్మానం ప్రతిపాదించినా స్పీకరు ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజనకు సంబంధించి తీర్మానం చట్టసభల నుంచే రావాలి. అయితే మన రాష్ట్ర విభజనకు సంబంధించి అటు పార్లమెంటులో గానీ, ఇటు అసెంబ్లీలోగానీ తీర్మానం జరగలేదు. కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా ముసాయిదా బిల్లును రూపొందించి రాష్ట్రంపై రుద్దింది. ఇది చట్టసభలను అగౌరవపరచడమే. ఈ నేపథ్యంలో మన చట్టసభకు ఉన్న అధికారాన్ని వినియోగించుకునేందుకు సమైక్య తీర్మానం కోరుతూ సభ్యులు నోటీసు ఇస్తే స్పీకరు అనుమతించాల్సిందే. లేకపోతే మన సభ గౌరవాన్ని మన సభాపతే మంటగలిపినట్లు అవుతుంది. సభ గౌరవాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న స్పీకరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించలేరు. రాష్ట్రపతి పంపిన ముసాయిదాకు ప్రాధాన్యం అంటున్నారు? అసలు ఇది రాష్ట్రపతి పంపినది కాదు. కేంద్ర హోంశాఖ రూపొందించి పంపిన ముసాయిదా బిల్లు మాత్రమే. ప్రొసీజర్‌లో భాగంగా రాష్ట్రపతికి వెళ్లి వస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలు వెళ్లిన తర్వాత కేబినెట్ మళ్లీ దానిని రాష్ట్రపతికి పంపితే రాష్ట్ర విభజన బిల్లు ప్రతిపాదించాలా? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుని కేబినెట్‌కు పంపుతారు. అయితే రాష్ట్ర విభజనపై సభ అభిప్రాయాలు తెలియకుండా విభజనవల్ల తలెత్తే అంశాలపై సభలో ఎలా చర్చిస్తారు? ముందు విభజనకు అనుకూలమా? ప్రతికూలమా? అనే అంశం తేల్చాలి. విభనకు సభ అనుకూలమని (మెజార్టీ సభ్యుల అభిప్రాయాలే(వ్యూస్) సభ అభిప్రాయాలుగా పరిగణిస్తారు) సభ అభిప్రాయపడితే విభజన బిల్లుపై చర్చించవచ్చు. రాష్ట్రాన్ని విభజించవద్దని సభ అభిప్రాయపడితే తదుపరి ముసాయిదా బిల్లుకే విలువ ఉండదు. క్లాజుల వారీ ముసాయిదా బిల్లుపై చర్చించాలని సీఎం అంటున్నారు? అది అర్థరహితం. సీమాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్ర శాసనసభ్యులు కూడా రాజ్యాంగ విరుద్ధంగా, చట్టసభల తీర్మానం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు పంపిందని, దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని బయట చెబుతున్నారు. ఇలాంటప్పుడు విభజన బిల్లుకు సంబంధించి క్లాజులపై ఎలా చర్చిస్తారు? చర్చను అంగీకరించడమంటే.. రాష్ట్ర విభజనను సూత్రప్రాయంగా అంగీకరించినట్లే కదా? ఇప్పుడు చర్చలో పాల్గొంటే .. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును పంపిందని సుప్రీంకోర్టులో ఎలా వాదిస్తారు? రాజ్యాంగ విరుద్ధమైతే చర్చలో ఎలా పాల్గొన్నారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే కేసు బలహీనపడుతుంది. అందువల్ల బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లో చర్చకు అంగీకరించరాదు. రాష్ట్ర విభజన గురించి కేంద్రం ప్రకటించగానే సీమాంధ్ర రాజధాని కోసం రూ. 4 లక్షల కోట్లు ఇవ్వాలని డిమాండు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సమన్యాయం అంటూ తప్పించుకు తిరుగుతున్నారు.. సీఎం మాత్రం విభజనకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ క్లాజులవారీగా ముసాయిదా బిల్లుపై చర్చించాలంటున్నారు.. దీనిని ఏమనుకోవాలి? అందుకే రాష్ట్ర విభజనకు అనుకూలమా? ప్రతికూలమా? అనే అంశంపై సభలో చర్చించాలని పట్టుబడితే సమన్యాయం అనేవారు, విభజనను అడ్డుకుంటామంటూ పరోక్షంగా సహకరించే వారి బండారం బయటపడుతుంది. విభజనకు వ్యతిరేకంగా నిలిచిందెవరో? ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా విభజనకు సహకరించేదెవరో ఓటింగ్‌లో తేలిపోతుంది. వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. అందుకే రాష్ట్ర విభజనను బహిరంగంగా వ్యతిరేకించకుండా గూడు పుఠాణి చేసేవారే, సమైక్య రాష్ట్రంపై చిత్తశుద్ధి లేనివారే తీర్మానం కోసం పట్టుబట్టకుండా వెనుకంజ వేస్తారు. బహిష్కరించవద్దు సమైక్య తీర్మానం కోసం సభ్యులు పట్టుబట్టాలేగానీ స్పీకరు అనుమతించకపోతే బాయ్‌కాట్ చేయరాదు. స్పీకరు సస్పెండు చేస్తే తప్ప సీమాంధ్ర సభ్యులెవరూ బాయ్‌కాట్ చేయరాదు. బాయ్‌కాట్ చేస్తే తెలంగాణ సభ్యులే అనుకూలంగా మాట్లాడి సభ అభిప్రాయం కింద కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రమాదం ఉంది. ఒక వేళ స్పీకరు సస్పెండ్ చేస్తే ఆ విషయం రికార్డు అవుతుంది. అప్పుడు సభ్యులంతా సమైక్యానికే కట్టుబడి ఉన్నట్లు అఫిడవిట్లు సమర్పించవచ్చు. మమ్మల్ని సభ నుంచి బహిష్కరించి అతి తక్కువమంది అభిప్రాయాన్నే సభ అభిప్రాయం కింద పంపారని వాదించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాన్ని రాష్ట్రపతితోపాటు కోర్టులు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.