breaking news
Judgment of the Supreme Court
-
సీఎం పలాయన వాదం బీజేపీ విమర్శలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతి విషయంలోనూ పలాయన వాదాన్ని అనుసరిస్తున్నారని, తన ప్రభుత్వ వైఫల్యాలను గత బీజేపీ సర్కారుపై నెడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సురేశ్ కుమార్ విమర్శించారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన బీజేపీ ఐటీ విభాగం సమావేశం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సమస్య నుంచి టోల్ వివాదం వరకు...అన్నిటికీ గత బీజేపీ సర్కారే కారణమని ఆరోపించడం ద్వారా ఈ ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజూస్తున్నదని విమర్శించారు. దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలో ఎలివేటెడ్ రహదారిని నిర్మించకుండా టోల్ వసూలు చేయరాదని గత బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. మైసూరు రోడ్డులో సైతం టోల్ వసూలు ప్రతిపాదన వచ్చిన ప్పుడు, ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించకుండా వసూళ్లు చేపట్టరాదని తెలియజేసిందని వెల్లడించారు. బీజేపీ హయాంలో టోల్ ఛార్జీని నిర్ణయించలేదన్నారు. కాగా ప్రాంతీయ భాషలో ప్రాథమిక విద్యా బోధనను తప్పనిసరి చేయడం కుదరదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినందున, అన్ని రాష్ట్రాల్లో మాతృభాషకు విఘాతం ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఏర్పడబోయే తదుపరి ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తెచ్చి ఈ విషయంలో చట్ట సవరణకు ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. అంతకు ముందు సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగించిన ఎమ్మెల్సీ రఘునాథ్ మల్కాపుర, నరేంద్ర మోడీ పేరును పల్లె పల్లెకు తీసుకు పోవడంలో ఐటీ విభాగం కార్యకర్తలు చక్కగా పని చేశారని కొనియాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తమ ఫలితాలను సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు -
మున్సి‘పోల్స్’ కోలాహలం
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: మున్సిపాలిటీల్లో మూడున్నరేళ్ల ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడనుంది. సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికలు అనివారం కావడంతో జిల్లాలో కోలాహలం మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే కర్నూలు కార్పొరేషన్ మినహా జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో హడావుడి కనిపిస్తోంది. నాయకులు అభ్యర్థుల ఎంపికపై తలమునకలవుతున్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే అందరి దృష్టి కేంద్రీకృతం కాగా.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ అభ్యర్థులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించవచ్చనే చర్చ జరుగుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆశావహులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విభజన తర్వాత నిర్వహిస్తున్న ఎన్నికలు కావడం.. వైఎస్ఆర్సీపీ ఊపు మీద ఉండటంతో అభ్యర్థుల్లో పోటీ అధికమైంది. అయితే కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విభజన గుబులు వెంటాడుతోంది. సమైక్యవాదులు ఆ పార్టీని మట్టికరిపించేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతం కూడా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనుంది. విభజనకు ఆయన కూడా కారణం కావడంతో ఓటమి భయం నెలకొంది. ఇక బీజేపీ, సీపీఐ పార్టీలు నామమాత్రం కాగా.. కొన్ని ప్రాంతాల్లో సీపీఎం తన బలాన్ని పదిలం చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మొత్తంగా సహకార, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన వైఎస్ఆర్సీపీ.. మున్సిపాలిటీల్లోనూ పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలు మహిళలకు రిజర్వు కావడంతో నేతలు తమ సతీమణులను బరిలో నిలిపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.