తెలుపు రంగులో జనసేన జెండా!
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశానికి చకాచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రేపు సాయంత్రం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటుచేసే సభలో పవన్ కళ్యాణ్ పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ పెట్టబోయే జనసేన పార్టీ జెండాను ఇప్పటికే రూపొదించినట్టు టీవీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జనసేన పేరుతో ప్రారంభించిన ఫేస్ బుక్ పేజీలో జెండా నమూనా ఉంచారు. అయితే పవన్ ఆవిష్కరించే దాకా దీన్ని జనసేన జెండాగా పరిగణించలేం.
తెలుపు రంగులో ఉన్న జెండాలో ఎరుపు రంగు వృత్తాకారంలో పెద్ద నక్షత్రం ఉంచారు. వృత్తం చుట్టూ నల్లటి రంగులో గీత పెట్టారు. స్టార్ మధ్యలో ఎర్రటి చుక్క ఉంచారు. విప్లవానికి ప్రతీకగా, పార్టీ నిబద్దతను తెలిపేందుకు చుక్క పెట్టారు. పార్టీ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు స్టార్ గుర్తు ప్రతీకగా నిలుస్తుందంటున్నారు. శాంతి, స్థిరత్వానికి ప్రతీకగా జెండాను రూపొందించినట్టు పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఇక పవన్ ప్రసంగాన్ని సీమాంధ్ర, తెలంగాణలో 28 చోట్ల ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.