breaking news
Jawaharlal Nehru National Urban Renewal Mission
-
వద్దు బాబోయ్..!
*జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు ఆర్టీసీ తిరస్కరణ *రూ.125 కోట్లకు పైగా రాయితీ కోల్పోయినట్లే సిటీబ్యూరో: జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం రెండో దశలో రానున్న కొత్త బస్సులను ఆర్టీసీ తిరస్కరించింది. మొదటి దశలో ప్రవేశపెట్టిన బస్సులతో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కొత్తవి తీసుకొనేందుకు ఆర్టీసీ వెనుకంజ వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 80 ఓల్వో బస్సులతో పాటు, 252 ఏసీ, నాన్ ఏసీ, 30 లోఫ్లోర్ బస్సులు, 20 వెస్టిబ్యూల్, 40 మినీ బఋస్సులు అందించేందుకు కేంద్రం అంగీకరించింది. వీటిలో ఓల్వో బస్సులను మాత్రమే ఆర్టీసీ స్వీకరించింది. గత నవంబర్‌లో సీఎం కేసీఆర్ వీటిని ప్రారంభించారు. మిగతా 342 బస్సులను అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ...ఆర్టీసీ తిరస్కరణ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త బస్సులు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఈ బస్సులపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి లభించాల్సిన 60 శాతం రాయితీ అంటే రూ.125 కోట్లకు పైగా ఆర్టీసీ కోల్పోయే పరిస్థితి నెలకొంది. చేదు అనుభవాలే కారణం.... జేఎన్ఎన్యూఆర్ఎం పథకం మొదటి దశలో 2009 నుంచి వివిధ దశల్లో 1000 బస్సులను నగరంలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తిరుగుతున్న పుష్పక్ ఏసీ బస్సులతో పాటు, శీతల హంస ఏసీ, మెట్రో బస్సులన్నీ మొదటి దశలో వచ్చినవే. వీటిలో సింహభాగం మార్కోపోలో కంపెనీకి చెందినవి. ఆ బస్సులతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయింది. మార్కోపోలో బస్సుల్లో ప్రధాన సమస్య ఇంజిన్ ఆయిల్ గడ్డకట్టిపోవడం. దీంతో ఇవి పదే పదే మరమ్మతులకు గురయ్యేవి. వాటి విడిభాగాలకు ఏటా రూ.కోట్లలో ఖర్చు చేయవలసి వచ్చింది. మిగతా సంస్థల బస్సులు ఒక లీటర్ ఆయిల్‌కు 4 నుంచి 5 కిలోమీటర్లు తిరిగితే... ఈ బస్సులు 2.5 కిలోమీటర్లకే పరిమితమయ్యాయి. వీటి నిర్వహణ ఆర్టీసీకి పెను భారంగా పరిణమించింది. బెంగళూరు ఆర్టీసీ ఈ కంపెనీ బస్సులను నడపలేక పక్కన పెట్టినప్పటికీ హైదరాబాద్‌లో ఇప్పటికీ తిప్పుతూనే ఉన్నారు. కొత్త బస్సులను శాస్త్రీయంగా పరిశీలించి తీసుకొనే అవకాశం ఉంది. ఇతర సంస్థల బస్సులను ట్రయల్న్ ్రకింద కొద్ది రోజులు తిప్పేందుకు అవకాశం కావాలని కోరవచ్చు. రెండు, మూడు నెలలు పరిశీలించి కొనుగోలు చేయవచ్చు. అలాంటి పరిశీలన లేకుండానే ఆర్టీసీ అధికారులు వీటిని తిరస్కరించినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో అందని సేవలు నగరంలో ఇప్పటి వరకు అతి పెద్ద ప్రజా రవాణా సంస్థ గ్రేటర్ ఆర్టీసీయే. 3,850కి పైగా బస్సులతో నిత్యం 34 లక్షల నుంచి 36 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ప్రస్తుతం 29 డిపోలు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఈ బస్సులు ప్రయాణికుల డిమాండ్ తగ్గట్టుగా సేవలందించలేకపోతున్నాయి. నగరం చుట్టు పక్కల వెలుస్తున్న కాలనీలు, గ్రేటర్ అవసరాలకు అనుగుణంగా కొద్ది రోజుల్లో 50 లక్షల మందికి ఉపయోగపడేలా 5000 బస్సులను, 50 డిపోలను ప్రారంభించాలనేది ఆర్టీసీ యోచన. ఆచరణ అందుకు అనుగుణంగా లేకపోవడం గమనార్హం. -
ప్రత్యేక మున్సిపల్ కేడర్ ఉంటేనే జేఎన్ఎన్యూఆర్ఎం నిధులు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల్లో పాలన, పనులకు ప్రత్యేకంగా మున్సిపల్ కేడర్ (సిబ్బంది) ఉంటేనే ‘జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ’ పథకం కింద నిధులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించనుంది. ఢిల్లీలో సోమవారం జరిగిన ‘ఇన్నోవేషన్స్ ఆఫ్ అర్బన్ గవర్నెన్స్’ సదస్సులో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కమల్‌నాథ్ మాట్లాడారు.‘‘దేశంలో పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో భూమిని, వనరులను సమర్థవంతంగా వినియోగించగల అధికారులు, సిబ్బంది కావాలి. ప్రస్తుతం కొందరు ఉద్యోగులకు పట్టణ పాలనలో శిక్షణ ఇచ్చి వినియోగించుకోవచ్చు. కానీ, వారు కొద్దికాలం తర్వాత వేరే శాఖలకు బదిలీ కావొచ్చు. లేక వారే వెళ్లిపోవచ్చు. అందువల్ల మున్సిపల్ పాలనకు సంబంధించి ప్రత్యేక కేడర్ ఉంటేనే జేఎన్ఎన్యూఆర్ఎం నిధులు మంజూరు చేసేలా నిబంధన అమలుచేయనున్నాం’’ అని కమల్‌నాథ్ తెలిపారు. మేయర్లకు మరిన్ని అధికారాలు.. పట్టణాల పాలనాధికారులకు సరైన అధికారాలు లేనందున సమస్యలు వస్తున్నాయని, దేశవ్యాప్తంగా మేయర్లు పాలనా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రధాని సలహాదారు శ్యామ్ పిట్రొడా పేర్కొన్నారు. అందువల్ల మేయర్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. పట్టణాలకు సంబంధించిన నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటున్నాయని, స్థానిక ప్రభుత్వాలకు అసలు భాగస్వామ్యమే ఉండడం లేదని ప్రధాని కార్యదర్శి ఆర్.రామానుజం వ్యాఖ్యానించారు.