బీజేపీ స్క్రీన్‌ప్లేను మార్చిన 'గీత'
భారత బిడ్డ గీత విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రచించిన స్క్రీన్ ప్లే ఆశించినట్లుగా క్లైమాక్స్‌కు చేరలేదు. బజరంగీ భాయీజాన్ స్క్రీన్ ప్లే కాదు కదా ఎంతైనా! పాకిస్తాన్ నుంచి భారత్‌కు తీసుకురావడం వరకు ప్రభుత్వం రచించిన స్క్రీన్ ప్లే సవ్యంగానే సాగింది. ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయిన భారత బిడ్డ గీత చివరి నిమిషంలో ఊహించని విధంగా ఎదురుతిరగడంతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు.
తనను అట్టహాసంగా ఇంటికి తీసుకెళ్లడానికి బీహార్ నుంచి వచ్చిన మహతో కుటుంబంతో తనకు సంబంధం లేదని గీత చెప్పడమే కాకుండా, వాళ్లు చెబుతున్నట్టు తనకు పెళ్లి కాలేదని, కొడుకు కూడా లేడని సైగల ద్వారా స్పష్టం చేసింది. బీహార్ ఎన్నికలకు రెండు రోజుల ముందు.. సోమవారం కరాచీ నుంచి ఢీల్లీకి తీసుకొచ్చిన గీతను విలేకరుల సమావేశంలో సుష్మా స్వరాజ్ ఆర్భాటంగా పరిచయం చేయడమే కాకుండా పదేపదే గీతను అక్కున చేర్చుకుంటూ ఆమెను తీసుకురావడానికి తానెంతగా దౌత్యం నెరపాల్సి వచ్చిందో, ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో సవివరంగా వివరించారు.
మహతో కుటుంబమే తన కుటుంబమని పాకిస్తాన్లో ఉన్నప్పుడే గుర్తించిన గీత.. హఠాత్తుగా ఇప్పుడు వారెందుకు తన కుటుంబసభ్యులు కాదన్నదో ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే అయినా, ఈ హఠాత్పరిణామాన్ని సర్దిచెప్పేందుకు సుష్మా స్వరాజ్ కష్టపడాల్సి వచ్చింది. తల్లిదండ్రులుగా భావిస్తున్న మహతో దంపతులు, గీత డీఎన్ఏలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని, ఆ నివేదికలు వచ్చాక అసలు విషయం తెలుస్తుందని, ఒకవేళ మహతో కుటుంబంతో నిజంగా గీతకు సంబంధం లేకపోతే ఆమె పోషణ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తుందని ఆమె ప్రకటించారు.
బుధవారం బిహార్‌లో మూడోవిడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గీత బీజేపీ గీతను మారుస్తుందని బీజేపీ నేతలు బాగానే ఆశించారు. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా ములాఖత్ ఏర్పాటుచేశారు. దశాబ్దం క్రితం జలంధర్‌లో జరిగిన మేళాలో తన కూతురు హీరా (ఇప్పటి గీత)ను కోల్పోయామని వాదిస్తూ వచ్చిన జనార్దన్ మహతో గీత తాజా రియాక్షన్‌పై పెద్దగా స్పందించలేదు. ఇప్పటివరకు గీత తల్లిదండ్రులమంటూ ఒక్క మహతోనే కాదు, చాలా కుటుంబాలు ముందుకొచ్చాయి. నిజంగా పిల్లలు తప్పిపోయిన కుటుంబాలే ముందుకొచ్చాయా, ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందుతుందనే అత్యాశతో ముందుకొచ్చాయా? అన్న కోణంలో ఇప్పటివరకు విచారణ జరగలేదు.
ఏది ఏమైనా తాము మానవతావాదులమని, లౌకికవాదులమని నిరూపించుకొని బిహార్ ఎన్నికల్లో లబ్ధి పొందుదామనుకున్న బీజేపీ వ్యూహం ఆశించిన మేరకు ఫలించలేదు. అయినా ఫర్వాలేదు. గీతను తీసుకొచ్చిన కరాచీ నుంచే అలీగఢ్‌కు చెందిన సల్మాన్‌ను తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తే బీజేపీ లౌకిక విలువలను ప్రజలు నమ్మవచ్చు. 1994లో కరాచీలో ఉంటున్న తన తాత వద్ద రెండేళ్ల సల్మాన్‌ను అతని తల్లి వదిలేసి వచ్చింది. ఇప్పుడు 23వ ఏట అడుగుపెట్టిన సల్మాన్ తన తల్లిదండ్రుల వద్దకు వస్తానంటూ, తనను భారత్‌కు తీసుకెళ్లాలని కేంద్రానికి మొరపెట్టుకున్నాడు. గీత విషయంలో తీసుకున్న చొరవనే సల్మాన్ విషయంలో తీసుకోవడానికి కేంద్రానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?