breaking news
inter school football tournment
-
గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: సచ్దేవ్ స్పోర్ట్స్ ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నీలో గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ జట్టు గెలుపొందింది. తిరుమలగిరి ఫుట్‌బాల్ గ్రౌండ్లో శాస్త్రి సాకర్ క్లబ్ నిర్వహించిన ఈ టోర్నీలో గురువారం గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ జట్టు 5-0తో సాక్రెడ్ హార్ట్ జట్టుపై గెలిచింది. మ్యాచ్ మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి 1-0తో గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ జట్టు ఆటగాళ్లు కిరణ్ (3), అరవింద్ (1), ప్రభాకర్ (1) చెలరేగడంతో జట్టుకు ఏకపక్ష విజయం చే కూరింది. మరో మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 4-0తో ఫిత్జీ జట్టుపై నెగ్గింది. ప్రథమార్ధంలో 2-0తో సెయింట్ ఆండ్రూస్ జట్టు ముందంజలో ఉంది. జట్టులో భరత్ (2), గులామ్ (1), జస్టిన్ జేమ్స్ (1) రాణించారు. అనంతరం మరో మ్యాచ్‌లో తేజస్విని జట్టుపై 6-0తో భవాన్స్ జట్టు విజయం సాధించింది. మయూర్ రెండు గోల్స్ చేయగా... శరణ్, కపిల్, ఆన్ తలా ఒక గోల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు.. -
సెయింట్ ఆండ్రూస్‌కు టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు 4-3 స్కోరుతో పెనాల్టీ షూటవుట్ ద్వారా సెయింట్ మైకేల్ స్కూల్ జట్టుపై ఘన విజయం సాధించింది. పెనాల్టీ షూటవుట్‌లో బి.భరత్ గోల్ చేశాడు. నిర్ణీత సమయం ముగిసే సమయానికి సెయింట్ ఆండ్రూస్, సెయింట్ మైకేల్ స్కూల్ జట్ల ఆటగాళ్లు స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. దీంతో టైబ్రేకర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా ఇరు జట్ల స్కోరు 3-3 వద్ద సమమైంది. దీంతో పెనాల్టీ షూటవుట్‌లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు తరఫున జీవన్, గులామ్ హుస్సేన్, అభిషేక్, భరత్ తలా ఓ గోల్స్ చేశారు. సెయింట్ మైకేల్ స్కూల్ జట్టులో మోహిత్, హర్షిత్, అనుమాల్ గోల్స్ చేశారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పల్లవి మోడల్ స్కూల్ జట్టు 3-2తో సెయింట్ పాట్రిక్ స్కూల్‌పై నెగ్గింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు 3-0తో పల్లవి మోడల్ స్కూల్ జట్టుపై, సెయింట్ మైకేల్ స్కూల్ జట్టు1-0తో సెయింట్ పాట్రిక్ స్కూల్‌పై గెలిచింది. ఈటోర్నీలో మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విష్రుద్ (సెయింట్ ఆండ్రూస్ స్కూల్) గెలుచుకోగా, మాన్ ఆఫ్ ది టోర్నీ నరేష్ (సెయింట్ ఆండ్రూస్ స్కూల్)లు గెలుచుకున్నాడు. ముగింపు వేడుకలకు రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. రఫత్ అలీ ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి ఫల్గుణ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.