breaking news
illegal constructions regularisation
-
కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు భారీ షాక్
ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు షాక్ ఇచ్చింది ముంబై హైకోర్టు. జుహు ప్రాంతంలోని రాణెకు చెందిన భవనం పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ముంబై అధికారులను ఆదేశించింది. ఆ నిర్మాణాలు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ), కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జడ్) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టం చేసింది జస్టిస్ ఆర్డీ ధనుక, జస్టిస్ కమల్ ఖాటాలతో కూడిన ధర్మాసనం. నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలంటూ రాణా కుటుంబం నిర్వహిస్తున్న సంస్థ దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవద్దని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)ని ఆదేశించింది ధర్మాసనం. అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయటం ద్వారా అలాంటి వాటిని ప్రోత్సహించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. రెండు వారాల్లోపు అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని బీఎంసీకి సూచించింది కోర్టు. ఆ తర్వాత వారం లోపు నివేదికను సమర్పించాలని తెలిపింది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని ఆదేశించటంతో పాటు కేంద్ర మంత్రి నారయణ్ రాణెకు రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. రెండు వారాల్లోగా మహారాష్ట్ర లీగల్ సర్వీసెస్ విభాగంలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు.. ఈ అంశంపై ఆరు వారాలు స్టే ఇవ్వాలని, దాంతో సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామని రాణె తరఫు న్యాయవాది కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. సివిక్ బాడీ గతంలో ఇచ్చిన ఆదేశాలపై తాము దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిశీలించేలా ఆదేశించాలని రాణెకు చెందిన కాల్కా స్థిరాస్తి సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అంతకు ముందు ఈ ఏడాది జూన్‌లో అదనపు నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలని కోరగా బీఎంసీ తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించింది సంస్థ. ఇదీ చదవండి: ఆ చీతాల రక్షణ విధుల్లోకి గజరాజులు.. రేయింబవళ్లు గస్తీ! -
ఫైన్‌తో సరిపెట్టేస్తే మరి నిబంధనలెందుకు?
సాక్షి, హైదరాబాద్: అక్రమ భవన నిర్మాణాల విషయంలో జరిగిన ప్రతీ ఉల్లంఘననూ జరిమానాతో సరిపెట్టేస్తూ పోతుంటే, ఇక భవన నిర్మాణ నిబంధనలు ఉన్నది ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. శాస్త్రీయంగా, ఇంజనీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌తో సంబంధం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరణ పేరుతో అనుమతిస్తూ పోతే, ఆ మాస్టర్ ప్లాన్, ఆ నిబంధనలు నిష్ప్రయోజనమని హైకోర్టు స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్‌కు, అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేయడం సమాజ క్రమబద్ధ అభివృద్ధిని అడ్డుకోవడమేనంది. ఆదిలాబాద్ జిల్లా, బాగులవాడకు చెందిన ఎ.రాజన్న అనే వ్యక్తి నిర్మించిన అక్రమ కట్టడాన్ని క్రమబద్ధీకరించేందుకు నిరాకరిస్తూ నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని, నాలుగో అంతస్తు నిర్మించడాన్ని తప్పుపట్టింది. ఆ వ్యాజ్యాన్ని నివేదించండి.. అక్రమ కట్టడాలకు జరిమానా విధించి, వాటిని భవన క్రమబద్ధీకరణ పథకం కింద క్రమబద్ధీకరించాలంటూ 2012లో అప్పటి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులతో హైకోర్టు విభేదించింది. ఈ ఉత్తర్వులు ఇదే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. 2012లో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తే, అక్రమ నిర్మాణాలు చేసుకుని, ఆ తర్వాత క్రమబద్ధీకరించుకుంటే సరిపోతుందనే భావనను పౌరుల్లో కలిగించినట్లవుతుందని, అందువల్ల ఆ పని చేయడం లేదని స్పష్టం చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు విరుద్ధంగా 2012 నాటి ఉత్తర్వులున్న నేపథ్యంలో, ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదించాలంది. ఈ విషయంలో పాలనాపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ కేసు ఫైళ్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చౌహాన్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పటివరకు పిటిషనర్ భవనాన్ని కూల్చివేయరాదని అధికారులను ఆదేశించింది. అలాగే అదనంగా నిర్మించిన అంతస్తును ఉపయోగించరాదని పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అటువంటి ఉత్తర్వులు జారీ చేయలేం.. అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించుకునే వీలుందన్న పిటిషనర్ వాదనపై న్యాయమూర్తి ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. ఉల్లంఘనలకు జరిమానాలు విధించి అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించమని 2012లో సింగిల్ జడ్జి ఉత్తర్వుల ఆధారంగా ఈ వ్యాజ్యంలో కూడా అటువంటి ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని జస్టిస్ కోదండరామ్ స్పష్టం చేశారు. త్రీ ఏసెస్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేసులో ఎటువంటి ఉల్లంఘనలను మన్నించాలి.. ఎటువంటి వాటి విషయంలో చర్యలు తీసుకోవాలన్న విషయంలో ఇదే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం 1995లో తీర్పునిచ్చిందని, 2012లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఆ తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. చదరపు అడుగు లేదా చదరపు గజం ఆధారంగా జన సాంద్రతను పరిగణనలోకి తీసుకుని కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, మురుగునీరు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. అయితే ఈ ఉల్లంఘనలు జరుగుతుంటే, అటువంటి సౌకర్యాలు సరిపోవని, అంతిమంగా అందరూ ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన చట్ట నిబంధనలు ఏపీ పట్టణ ప్రాంతాల (అభివృద్ధి) చట్ట నిబంధనల కు విరుద్ధంగా ఉన్నాయా.. అన్న ప్రశ్న ఒక్కటే ఈ కోర్టు ముందు ఉత్పన్నమవుతోందన్నారు. క్రమబద్ధీకరణ చట్ట నిబంధనలను సవాల్ చేయకపోయినప్పటికీ, వాటి విషయంలో కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఏది ఏమైనా కూడా ఈ వ్యాజ్యంపై ధర్మాసనమే విచారణ జరపాల్సి ఉందంటూ.. ఫైళ్లను ఏసీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. -
'ప్రభుత్వ భూముల్లో ఎవర్నీ ఉండనీయం'
హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించుకోవాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. క్రమబద్దీకరించుకోకుంటే ఖాళీ చేయిస్తామన్నారు. ఏప్రిల్ తర్వాత ప్రభుత్వ భూముల్లో ఎవర్నీ ఉండనీయబోమని హెచ్చరించారు. 125 గజాలలోపు నివాసం ఉంటున్న పేదలకు ఉచితం క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 125 - 250 గజాలలోపు భూముల రిజిస్ట్రేషన్‌కు 50 శాతం రాయితీ... 250 - 500 గజాలలోపు భూముల రిజిస్ట్రేషన్‌కు 75 శాతం రాయతీ... 500 నుంచి ఆపై బడిన నివాస స్థలాలకు 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించి భూమిని క్రమబద్ధీకరణ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది.