breaking news
IDMC
-
ప్రకృతి వికృతి
తాత్కాలికంగానైనా ఇల్లు వాకిలి వదిలిపెట్టి వెళ్లిపోవడానికి ఈ మధ్య కాలంలో మరో కారణం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే ప్రకృతి. భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనలతో ప్రపంచదేశాల్లో ప్రజలకు నిలువ నీడ లేకుండా పోతోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వివిధ దేశాల్లో తుపాన్లు ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా 70 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మోనటరింగ్ సెంటర్ వెల్లడించింది. వివిధ దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి మానవీయ వ్యవహారాలు చూసే సంస్థ, మీడియా నివేదికలు ఆధారంగా ఆ సంస్థ గణాంకాలను రూపొందించి ఒక నివేదికను విడుదల చేసింది. 2003 సంవత్సరం నుంచి ప్రకృతి వైపరీత్యాలపై జరిగిన నష్టాన్ని విశ్లేషించిన ఆ నివేదిక 2019 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు ప్రజలపై తీవ్ర స్థాయిలో పడ్డాయని వెల్లడించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ముందస్తుగానే తుపాన్లను గుర్తించి ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవడం, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత శిబిరాలకు తరలించడంతో మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. మనిషి ప్రకృతి ముందు మరుగుజ్జే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో తుపాన్లు ఎప్పుడొస్తాయో పసిగడుతున్నాం. పిడుగులు ఎక్కడ పడతాయో అంచనా వేస్తున్నాము. వాన రాకడని తెలుసుకుంటున్నాం. ప్రాణం పోకడని నివారిస్తున్నాం. కానీ ప్రజలు నిరాశ్రయులు కాకుండా ఏమీ చెయ్యలేకపోతున్నాం. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా మనిషి ఎప్పుడూ ప్రకృతి ముందు మరుగుజ్జే. అందులోనూ ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రకృతి ప్రకో పం తారస్థాయికి చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2.2 కోట్ల మంది నిరాశ్రయులు కావచ్చునని ది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అంచనా వేస్తోంది. ‘‘వాతావరణ మార్పులు భవిష్యత్‌లో మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. బహమాస్ వంటి దేశాల్లో తరచూ వానలు ముంచెత్తుతాయి. దీనికి ముందు జాగ్రత్తలు మరింత అవసరం’’ అని మానిటరింగ్ సెంటర్ డైరెక్టర్ అలగ్జాండర్ బిలక్ హెచ్చరించారు. ఏయే దేశాల్లో ఎంతమంది నిరాశ్రయులు ? ► ఫణి తుపాన్ పడగ విప్పడంతో భారత్, బంగ్లాదేశ్ దేశాల్లో నిలువనీడ కోల్పోయినవారు 34 లక్షలు. ఈ తుపాను కారణంగా 100 మంది లోపే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ► ఇదాయ్ తుపాన్ దక్షిణాఫ్రికాను ముంచెత్తడంతో 6,17,000 మంది నిరాశ్రయులయ్యారు. వెయ్యి మందికిపైగా మరణించారు. మొజాంబిక్, మాలావీ, జింబాబ్వే, మడగాస్కర్‌లో ప్రజలు ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ► గత కొన్ని దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని వరదలు ఇరాన్లో సంభవించడంతో 5 లక్షల మంది వరకు చెల్లాచెదురయ్యారు. ► బొలీవియాలో వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 70 వేల మంది సొంత ఇళ్లను వీడి వెళ్లిపోయారు. -
దేశీయ వలసల్లో భారత్‌ది మూడోస్థానం
ఐక్యరాజ్యసమితి: భారత్‌లో 2016లో దాదాపు 24 లక్షల మంది స్వదేశంలోనే వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లారని ఓ నివేదిక పేర్కొంది. అంతర్గత వలసలు ఎక్కువగా నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్గత వలసల పర్యవేక్షణ కేంద్రం (ఐడీఎంసీ), నార్వేజియన్ శరణార్థుల మండలి (ఎన్ఆర్సీ)లు కలిసి ఈ నివేదికను విడుదల చేశాయి. నివేదిక ప్రకారం 2016లో అత్యధికంగా చైనాలో 74 లక్షల మంది స్వదేశంలో వలసపోగా, తర్వాతి స్థానంలో ఫిలిప్పీన్స్ (59 లక్షల మంది) ఉంది. ఘర్షణలు, హింస, ప్రకృతి విపత్తులు స్వదేశీ వలసలకు ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా 3.1 కోట్ల మంది స్వదేశాల్లోనే తమ నివాస స్థలాలను మార్చుకోవాల్సి వచ్చింది. 2015లో దక్షిణాసియా దేశాల్లో 79 లక్షల మంది స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లగా, 2016లో ఈ సంఖ్య సగానికి పైగా తగ్గి 36 లక్షలకు పరిమితమైంది. ఇందులో భారత్ నుంచే 24 లక్షల మంది ఉండడం గమనార్హం. భారత్‌లో బిహార్‌లో గతేడాది జూలై–అక్టోబర్ల మధ్య సంభవించిన వరదల వల్లే 16 లక్షల మంది వలసపోయారని నివేదిక వెల్లడించింది.