breaking news
the High Court Stay
-
ఆక్రమణల తొలగింపు... మిన్నంటిన ఆక్రందనలు
ఇళ్లను కూల్చరాదని అడ్డుకున్న మహిళలు బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు పంపిన పోలీసులు రెండు రోజులు సమయం ఇవ్వాలని వేడుకున్న బాధితులు హైకోర్టు స్టేతో ఆక్రమణల తొలగింపునకు తాత్కాలిక బ్రేక్ కోలారు : పేదల ప్రతిఘటన మధ్య నగర సమీపంలోని కోలారమ్మ చెరువులో బుధవారం ఆక్రమణల తొలగింపు ప్రారంభమైంది. అయితే బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో తొలగింపునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆర్డీవో మంజునాథ్ నేతృత్వంలో బుధవారం ఉదయం ఏడుగంటలకే అధికారులు జేసీబీలతో కోర్టు సర్కిల్ సమీపం నుంచి ఆక్రమణల తొలగింపు ప్రారంభించారు. అయితే కొంతమంది తమ ఇళ్లనుంచి హడావుడిగా ఇళ్లనుంచి సామగ్రిని బయటకు తీసుకురాగా మరికొందరు ఇళ్లను కూల్చవద్దని బీష్మించుకూర్చున్నారు. అయితే పోలీసులు ఇళ్ల యజమానులను బలవంతంగా బయటకు పంపి సామాగ్రిని బయటకు తరలించారు. కొందరు మహిళలు బయటకు రాకుండా తాళం వేసుకొని ఇంట్లోనే బైఠాయించారు. తమను ఇంట్లోనే ఉంచి నివాసాన్ని కూల్చాలని, తాము ఇంటి సమేతంగా సమాధి అవుతామని తలుపులు వేసుకున్నారు సీఐ శివకుమార్ సిబ్బంది సహాయంతో బలవంతంగా తలుపులు తెరచి ఇంటిలో ఉన్న మహిళలను మహిళా పోలీసు సిబ్బంది సహాయంతో బయటకు పంపారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి కిందపడిపోయింది. రెండు రోజులు గడువియ్యండి ఇళ్లను కూల్చివేయడానికి అధికారులు రాగా మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సామగ్రిని తరలించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని వేడుకున్నారు. ఆర్డీవో చేతులు పట్టుకుని మరీ వేడుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నందువల్ల తామేమి చేయలేదని ఆయన నిస్సహాతను వ్యక్త పరిచారు. మరో ఇంటి యజమాని అయితే ఏకంగా జేసీబీకి అడ్డు తగిలి తన ఇంటిని కూల్చవద్దని వేడుకున్నారు. పోలీసులు అతనిని బలవంతంగా పక్కకు లాగేశారు. హైకోర్టు స్టే ఓ వైపు ఆక్రమణల తొలగింపు కొనసాగుతుండగా మరో వైపు కొందరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారి విన్నపాన్ని పరిశీలించిన కోర్టు స్టే మంజూరు చేయడంతో ఆక్రమణల తొలగింపును నిలిపివేశారు. భాధితులు అక్కడి నుంచి తరలి వెళ్లడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని హైకోర్టు సూచించినట్లు సమాచారం -
ఇక ఫీజులపై సమరం
అధిక ఫీజుల వసూలు చేస్తే క్రిమినల్ కేసులు యాజమాన్యాలతో పోరుకు పేరెంట్స్ నుంచి మద్దతు తల్లిదండ్రులతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సమావేశం సాక్షి, సిటీబ్యూరో: గుర్తింపులేని పాఠశాలలపై కొరడా ఝుళిపించిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం తాజాగా అధిక ఫీజులపై సమరానికి సన్నద్ధమైంది. ఫీజుల నియంత్రణ చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ.. ఆయా పాఠశాలల్లో అదనపు వసూళ్లపై జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా దృష్టిసారించారు. ఒకవైపు ప్రైవేటు యాజమాన్యాల పిటిషన్‌పై హైకోర్టులో అప్పీల్‌కు సిద్ధమవుతూనే, మరోవైపు పాఠశాలల గుర్తింపునకు సంబంధించిన జీవోలోని వివిధ అంశాల అమల్లో కఠిన వైఖరిని అవలంభించాలని జిల్లా విద్యాశాఖకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలన్నీ నిబంధనలకు లోబడే పనిచేయాలని, యాజమాన్యాలు ప్రకటించిన ఫీజుల కంటే అదనంగా ఒక్కరూపాయి వసూలు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేసి, పాఠ శాలల గుర్తింపు రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఫీజుల దోపిడీపై తీసుకుంటున్న చర్యలకు తల్లిదండ్రుల నుంచి మద్దతు కావాలని కలెక్టర్ కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అంశంపై శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులతో కలెక్టర్, డీఈవో సమావేశమయ్యారు. స్కూళ్లకు సంబంధించి వివిధ అంశాలపై తల్లిదండ్రులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగునకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలన్నీ ప్రభుత్వ ఉత్తర్వులను, చట్టాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనన్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజు మినహా ఎటువంటి(డొనేషన్, అడ్మిషన్ పీజు, బిల్డింగ్ ఫండ్.. వగైరా)కాపిటేషన్ ఫీజు తీసుకోరాదన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు నగరంలోని 2100 ప్రైవేటు పాఠశాలల్లో 1800 పాఠశాలల యాజమాన్యాలు తాము వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సమర్పించాయన్నారు. వారు ప్రకటించిన ఫీజులకు కట్టుబడి ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు. యాజమాన్యాలు ప్రకటించిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తే బుక్లెట్ వెనుక ఉన్న ప్రొఫార్మాలో వివరాలను నింపి అక్కడిక్కడే ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదులు నమోదుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాఠశాలల పేర్లలో కాన్సెప్ట్, ఒలంపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ పేర్లను తొలగించాలని ఆదేశించారు. పేరుకే కార్పొరేట్ టెక్నో, కాన్సెప్ట్, ఒలింపియాడ్.. అంటూ గొప్పలు చెబుతున్న కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కువమంది ఇంటర్,డిగ్రీ చదివిన వాళ్లే చదువు చెబుతున్నారు. ప్రతి ఏటా ఇష్టా రాజ్యంగా ఫీజులను పెంచుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో టెన్త్ క్లాస్ ఫీజు ఎంబీబీఎస్ ఫీజును మించిపోతోంది. జిల్లా యంత్రాంగమే దీనిని అరికట్టాలి. -అశ్విన్ ఫిర్యాదులను పట్టించుకుంటారా! కొన్ని పాఠశాలల్లో పదో తరగతికి రూ.70వేల నుంచి రూ. లక్షవరకు ఫీజు వసూలు చేస్తున్నారు. అదనపు ఫీజుల వసూళ్లపై ఫిర్యాదు చేస్తే మా పిల్లలను యాజమాన్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మేము చేసే ఫిర్యాదులపై స్పందిస్తామని హామీ ఇస్తే.. వ్యక్తిగతంగా లేదా సామూహికంగా ఫిర్యాదులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. -రుక్మిణి