breaking news
haridasulu
-
కాలం మారింది.. హరిదాసులు అప్డేట్ అయ్యారు!
సంక్రాంతి నెల రావడంతో పల్లెల్లో సందడి మొదలైంది. హైటెక్ హరిదాసులు సందడి చేస్తున్నారు. మోటారు వాహనాలపై తిరుగుతూ దానం స్వీకరిస్తున్నారు. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుంచే ఈ హరిదాసులకు పూలు, పండ్లు, ధాన్యం ఇస్తుంటారు. రానురాను ప్రజల్లో భక్తిభావం తగ్గుతుందని, హరిదాసులు జీవించడానికి ఆశించిన విధంగా ఆదాయం రాకపోయినా తాతముత్తాతల నుంచి వస్తున్న ఈ వృత్తినే కొనసాగిస్తున్నామని కొవ్వలి గ్రామానికి చెందిన హరిదాసు మహేష్ అన్నారు. – దెందులూరు(ఏలూరు జిల్లా) -
సంక్రాంతికి స్వాగతం
సంక్రాంతి పండగ ఆరంభానికి సరిగ్గా వారం రోజులు ఉంది. పల్లెల్లో సందడి ఆరంభమైంది. దూర ప్రాంతాల్లో నివసించేవారు పల్లెగూటికి చేరుకుంటున్నారు. పంటల అమ్మకాలలో రైతులు బిజీ అయ్యారు. ఉదయాన్నే హరిదాసులు సందడి చేస్తున్నారు. డూడూ బసవన్నల విన్యాసాలు చిన్నారులను అలరిస్తున్నాయి. కొమ్మదాసరులు, బుడబుక్కలపాటవారు, జంగమదొరలు ఆటపాటలతో సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. విజయనగరం, బొబ్బిలి రూరల్: సంక్రాంతి వస్తోందంటే పల్లెల్లో సందడి నెలకొంటుంది. ధనుర్మాస ప్రారంభం నుంచి అంటే నెలగంట పెట్టిన నాటినుంచి పల్లెల్లో ముందు పంటకోతల సందడి, ఆనక సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు సందడి ఉంటుంది. చిన్నారులు భోగిపిడకలు, భోగి సందడి ఉంటే పల్లెల్లో రైతుల ముంగిట హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు, కొమ్మదాసర్లు, గంటాసాహెబ్లు, బుడబుక్కలవాళ్లు సందడి చేసి వారికి ఇవ్వాల్సిన తృణమో ఫణమో పొందుతూ కాలం గడుపుతారు. హరిదాసులు... హరిలో రంగహరి అంటూ విష్ణునామస్మరణ చేస్తూ గ్రామాలలో సందడి చేసే హరిదాసులు నెత్తిపై పాత్రతో చిడతలతో సందడి చేస్తూ పాటలు పాడుతూ వెళ్తుంటారు. వీరు ఎవరినీ దేహీ అని అడగరు. వారిపై దయతలచి భక్తితో ఇస్తే ఆగి తీసుకుంటారు. పల్లెల్లో వీరిని ఆదరించి వీరికి ఎంతోకొంత ఇచ్చి పండగను జరుపుతారు. పండగ అయ్యాక కూడా వీరికి భోజనాలు పెట్టి పలు దానాలు చేస్తుంటారు. ఆదరణ ఉన్నా... హరిదాసులకు సంక్రాంతి, కార్తీక సమయాలలో ఆదరణ ఉన్నా పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. కొన్ని ప్రాంతాలలో అసలు విలువే ఇవ్వడం లేదు. సంప్రదాయ పరిరక్షణకు మేం కృషిచేస్తున్నా జీవనం కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది.– చింతాడ సింహాచలం, హరిదాసు,రాముడువలస గంగిరెద్దుల సందడి.... సంక్రాంతి పండగకుముందు నుంచి పల్లెల్లో గంగిరెద్దుల సందడి ఉంటుంది. పాటలు పాడుతూ అమ్మగారికి దండం పెట్టు.. అయ్యగారికి దండంపెట్టు అంటూ గంగిరెద్దులు ఆడించేవారు వస్తుంటారు. వీరికి తమకు పండే ధాన్యం, పంటలు ఇచ్చి గంగిరెద్దులు అంటే ఈ ప్రాంతంలో సింహాచలం సింహాద్రప్పన్న అనే నమ్మకంతో వాటిని ప్రసన్నం చేసుకుంటారు. వీరికి పల్లెల్లో ఆదరణ నేటికీ ఉంది. వివాహం అయ్యాక దండలు, బట్టలు వీరికి ఇచ్చి దానం చేస్తే పుణ్యం వస్తుందని ఈ ప్రాంతాలలో భావన నెలకొంది. గంటాసాహెబ్... నడుమ భాగాన గంట వేలాడుతీసుకుని ముస్లిం మతానికిచెందిన వ్యక్తులు గంటాసాహెబ్లుగా ప్రసిద్ధి చెందారు. వీరు అతికొద్దిమంది మాత్రమే సంచారం చేస్తున్నారు. పల్లెల్లో ముస్లిం మతానికి చెందిన వ్యక్తులను ఆదరించి సైతాను బారినపడకుండా చేయాలని గంటాసాహెబ్లను కోరుతూ గ్రామీణులు వారికి దానధర్మాలు చేస్తుంటారు. కొమ్మదాసరులు... పూర్వం వీరు చెట్లపై కూర్చుని కనిపించకుండా వ్యక్తుల జాతకాలను తమ వ్యంగ్యవ్యాఖ్యలతో వివరించేవారు. ఇప్పుడు చెట్లుపై కూర్చుంటే ఎవరూ పట్టించుకోకపోతుండడంతో కొమ్మను చేతితో పట్టుకుని పల్లెల్లో వేకువజామున తిరుగుతుంటారు. అక్కా,బావా చెల్లెమ్మా, అమ్మా అంటూ పల్లెల్లో పిలుస్తూ అందరి బాగోగులు అడుగుతూ వారిని ఆకట్టుకుని వారి వద్దనుంచి తృణమో ఫణమో పొందుతుంటారు. బుడబుక్కలవారు.. ఢమరుకంతో వేకువజామున మాత్రమే వచ్చేవారు బుడబుక్కలవారు. కనుమరుగవుతున్న ఈ తెగవాళ్లు కొద్దిప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంటారు. వేకువజామున డమరుకంతో శబ్దం చేసి మేలుకొలిపి వారికి కావలసింది అడిగి తీసుకుని దానం చేసేవారిని ఆశీర్వదిస్తుంటారు. జంగమదొరలు(అయ్యవార్లు).. పల్లెల్లో తంబురాలతో ధనుర్మాసంలో మేలుకొలుపులు చేస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ వీరు కనిపిస్తుంటారు. దాసరికులానికి చెందిన వీరు పల్లెల్లో తంబురాలు,అక్షయపాత్రలతో కనిపిస్తుంటారు. వీరికి ఆదరణ కొంతమేర తగ్గింది. పగటివేషగాళ్లు... పేదరికంలో ఉండే కళాకారులు పలురకాల దేవుళ్ల వేషధారణలతో అందరినీ అలరిస్తుంటారు. పలు ప్రాంతాలనుంచి వీరు వస్తూ 10 లేదా 15 రోజుల పాటు ఒకప్రాంతంలో ఉంటూ పలురకాల వేషాలు వేస్తూ అందరినీ ఆకట్టుకునే యత్నం చేస్తుంటారు. వీరికి రైతులు తమకు పండే ధాన్యం ఇచ్చి ఆదరిస్తారు. -
పసిడి రాశుల పచ్చని కాంతిసంక్రాంతి
ఇళ్లముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుంచి కిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, వాటిపైనుంచి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్కకుండా ‘హరిలో రంగ హరి’ అంటూ తమ మధుర గానంతో మేలుకొలుపు పలుకుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు’ అంటూ గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు...తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు... అదొక కళావిలాసం. అదే సంక్రాంతి పండుగ వైభవం. ఏడాదంతా ఎక్కడెక్కడున్నా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరూ. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ సమయానికి దరిదాపుల్లో అన్ని పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి. రైతులు మాత్రమే కాక వ్యవసాయ కూలీలు ఇంకా సరిగా చెప్పాలంటే గ్రామంలో ఉన్న అందరూ పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా, కంటికి ఇంపుగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పొలం పనులు పూర్తి అయి ఉంటాయి. కొంత కాలం విశ్రాంతి తీసుకునే వీలుంటుంది. దానితో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమికి, రైతులకు, కూలీలకు, పాలేర్లకు, పశువులకు, పక్షులకు అన్నింటికీ కృతజ్ఞతను తెలియచేసుకోవడం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవడం ఈ వేడుకల్లో కనపడుతుంది. ఈ రోజుకే ప్రత్యేకత ఎందుకు? భారతీయులు సాధారణంగా పాటించేది చాంద్రమానాన్ని. కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకర సంక్రమణం. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని సంక్రమణం అంటారు. మకర రాశిని సంక్రమించినపుడు అది మకరసంక్రమణం అవుతుంది. సంవత్సరంలో ఉండే పన్నెండు సంక్రమణాలలో మకర సంక్రమణం ప్రధానమైనది. దీనికి కారణం మకర సంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటివరకు దక్షిణ దిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుంచి ఆరు నెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరు నెలల నుండి దక్షిణాయనం. దక్షిణాయణాన్ని పితృయానం అని, ఉత్తరాయణాన్ని దేవయానంఅని చెబుతారు. అందుకనే ఈరోజుని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. తాము సంతోషంగా ఉండే కాలంలో ఆ ఆనందాన్ని వ్యక్తపరచుకునేందుకు ఈ పుణ్యకాలాన్ని నిర్ణయించుకున్నారు. విధులు: అంతరిక్షంలో జరిగే ఖగోళ విశేషాలననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన రుషుల ఘనత, అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా ఉంటాయి. ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్ర విజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. నిజానికి మన పండుగలు బహుళార్థ సాధన ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చెప్పారు. విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరుప్పావై లేక శ్రీవ్రతాన్ని ఆచరిస్తారు. ద్వాపర యుగం చివరిలో గోపికలు ఆచరించిన ఈవ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమైంది. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవడం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. భోగి: సంక్రమణానికి ముందు రోజుని భోగి అనే పేరుతో జరుపుకోవడం మన సంప్రదాయం. తెల్లవారుజామునే లేచి ఒక పక్క భోగిమంటల దగ్గర కొంతమంది చలి కాచుకుంటూ ఉంటే, మిగిలిన వారు వంటికి నువ్వుల నూనె రాసుకొని, నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని, నువ్వులు వేసి కాచిన వేడినీళ్ళతో తలంటు పోసుకొని, కొత్తబట్టలు కట్టుకుంటారు. (చలికాలం వల్ల వచ్చే ఎన్నో ఇబ్బందులను అధిగమించటానికి నువ్వుల వాడకం ఆరోగ్యసూత్రం) పిండి వంటలతో పులగం, చక్కెరపొంగలి మొదలైనవాటితో భోజనం, అరిసెలు, చక్కిలాలు(సకినాలు)మొదలైనవి నములుతూ, ఇంటికి వచ్చినవారికి ఇస్తూ బంధుమిత్రుల ఇళ్ళకి వెళుతూ ఆనందంగా గడుపుతారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే భోగి పళ్ళుపోస్తారు. వీటివల్ల దృష్టిదోషం పోయి, ఒక సంవత్సరం వరకు దృష్టి సోకకుండా ఉంటుందని నమ్మకం. ఆడపిల్లలు ఉంటే బొమ్మల కొలువు పెడతారు. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మగారి కొలువును తమ ఇంటిలో చిన్న పన్నాలో చూడడం నేర్పటానికి. సృష్టిలోని అన్ని రకాల వస్తువులని కొలువులో పెట్టి, వాటికి పూజ చేసి, నైవేద్యం పెట్టి, హారతి ఇవ్వటంతో అన్నీ దేవుడి స్వరూపాలుగా చూడటం అలవాటవుతుంది. అంతేకాదు, భోగి పళ్ళకి, బొమ్మల కొలువుకి పేరంటం చేసి వచ్చిన వారికి తాంబూలాలివ్వటం పద్ధతి. ఆ తాంబూలాలతో పాటు తమ శక్తికొద్దీ ఇంకేమైనా ఇస్తారు. తమకు కలిగిన దానిని అందరితో పంచుకోవడం అలవాటు చేయడం ఈ వేడుకలలో అంతరార్థం. పితృదేవతలకేకాక సమస్తానికి కృతజ్ఞతలని తెలియజేసే పండుగ కదా! తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియజేయటం ఈ పండుగలో ప్రతి అంశంలోనూ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరికంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమనాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. తమిళనాడులో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి కనుమనాడు అన్నపుముద్దలను ఊరి బయటకు తెచ్చి పక్షులకు పెడతారు. ఆ రోజు మాట్టు పొంగల్ అంటారు. వారికి పొంగలి వండటం ప్రధానం కనుక ఈ సంక్రాంతి పండుగను పొంగల్ అంటారు. తెలుగువారు కూడా పొంగలి వండుతారు. దానిని తెలుగువారు పులగం అంటారు. కొత్తబియ్యం, కొత్తపెసరపప్పు కలిపి వండిన పులగాన్ని ముందుగా దేవుడికి నివేదన చేసి కృతజ్ఞతను చూపిస్తారు. ఈ సందర్భంగా కొత్త బియ్యాన్ని లేగంటిఆవు పాలలో వండి, కొత్త బెల్లం వేసి పరమాన్నం తయారుచేయడం చాలా ముఖ్యం. అన్ని కొత్త వస్తువులను ఇప్పుడే ఉపయోగించడం మొదలుపెడతారు. ‘కనుమునాడు కాకైనా కదలదు’, ‘కనుమునాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి, పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ఏమైనా పండుగలలోని ఆచారాలను అర్థం చేసుకుని ఆచరిస్తేనే అసలైన ఆనందం. - డాక్టర్ ఎన్.అనంతలక్ష్మి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్యకాలంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడు రోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలికి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్టం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకర రాశిలో ఉండే శ్రవణా నక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వులదానం చేయడం శ్రేయస్కరం. దీనితోబాటు వస్త్రదానం, పెరుగుదానంతో పాటు ఏ దానాలు చేసినా మంచిదే. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరు నెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతాపూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుమనాడు తర్పణాలిస్తారు. కనుమని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రెపొటేళ్ళ పోటీలు, కోడి పందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈ రోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండివంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారిపట్ల కృతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఇందుకు ఉపయోగిస్తారు. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపే సంస్కారం ఇక్కడ కనపడుతుంది.