వికలాంగులపై కేంద్ర మంత్రి వరాల జల్లు
గుంటూరులో బ్రెయిలీ లిపికి సంబంధించిన ప్రెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక సహాయ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో రూ. 73.50 లక్షల విలువ చేసే కృత్రిమ అవయవాలు, ఉపకరణాలను ఆయన వికలాంగులకు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించారని కేంద్రమంత్రి చెప్పారు.
విశాఖలో వికలాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, ఏలూరులో వికలాంగుల కోసం మానసిక ఆరోగ్య, పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కర్నూలులో రూ. 5 కోట్లతో సెంచరీ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. వినికిడి లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, రూ. 6 లక్షల ఖర్చుతో వైద్యం చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.