breaking news
G.Srikanth reddy
-
సభ ప్రారంభంలోనే గందరగోళం
ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రారంభం నుంచే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ పట్టుబట్టగా, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. దానిపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చర్చకు డిమాండ్ చేశారు. ఆ సమయంలో ప్రతిపక్షం నుంచి జి.శ్రీకాంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే.. ''ప్రశ్నోత్తరాల సమయాన్ని పోగొట్టాలనేది మా ఉద్దేశం కాదు. 1.20 వరకు సభను జరగనివ్వకుండా చేసిందెవరు? రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రత్యేక హోదాతో ప్రజలకు ఏం లాభం కలుగుతుందో తెలియనివ్వండి. దానిమీద నిన్నటి సభలో స్పష్టత రాలేదు. ప్రత్యేక హోదాపై తీర్మానం చేస్తామని అన్నారు.. అది ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్లో లేదు. ఒకవైపు కేంద్రంలో మంత్రులను కొనసాగిస్తూ ఇక్కడ పోరాటం చేస్తామంటే ఎలా కుదురుతుంది'' -
సభ ప్రారంభంలోనే గందరగోళం
-
'బుకాయించడం బాబుకే చెల్లింది'
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి గురువారం కడపలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆంధ్రప్రదశ్ పరువు - ప్రతిష్టను మంటగలిపారని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా బుకాయించడం బాబుకే చెల్లిందని విమర్శించారు. అధికారం చేపట్టిన ఏడాదికి హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల రక్షణ బాబుకు గుర్తొచ్చిందంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పరిపాలిస్తున్న రాష్ట్రంలోనే ప్రజలుకు రక్షణ లేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. -
కల్లబొల్లి మాటలతో చంద్రబాబు మోసం: శ్రీకాంత్ రెడ్డి
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా రైతు రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఐదు సంవత్సరాలు పూర్తయినా.. రుణమాఫీ సాధ్యం కాదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు అబద్దపు మాటలతో కమిటీలు, జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
చేసింది గోరంత.. చంద్రబాబు ప్రచారం కొండంత: శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమస్యల నుంచి పక్కకు తప్పుకోవడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. హుదూద్ తుఫాన్ సహయ చర్యలు ఎవరికీ అందలేదని, ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. తుఫాన్ సహాయ కార్యక్రమంలో విఫలమైన అంశాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించేందుకే ఏపీ రాజధాని అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారని శ్రీకాంత్ విమర్శించారు. లక్ష కోట్లు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు.. రూ.30 వేల కోట్లకు కుదించినట్లే.. లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణమని 30 వేల ఎకరాలకు కుదించారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు రైతులను బ్లాక్ మెయిల్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీశైలంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను వెంటనే ఆపేయాలని, రుణమాఫీపై చంద్రబాబుకే స్పష్టత లేదన్నారు. తుఫాన్ బాధితులకు చంద్రబాబు గోరంత చేసి, కొండంత ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇన్సూరెన్స్ లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని.. చంద్రబాబు అసమర్ధత కారణంగానే ఈ సమస్య తలెత్తిందన్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
రభసలోనే ప్రకటన
* రాజధానిపై ప్రజాస్వామ్య బద్ధ చర్చ కోసం ప్రతిపక్ష నిరసనలతో అట్టుడికిన అసెంబ్లీ * జగనోక్రసీ, ఫ్యాక్షనిజం అంటూ విపక్షంపై అధికార పక్షం ఎదురు దాడి * ప్రకటనకు ముందే చర్చ చేపట్టాలని విపక్షం వాయిదా తీర్మానం.. స్పీకర్ తిరస్కరణ * ప్రభుత్వం నోటీసు ఇచ్చినందున తర్వాతే చర్చించవచ్చన్న స్పీకర్ * ప్రకటన చేశాక చర్చలో అర్థమేముంటుందని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి నిరసన * 1953లో రాజధాని నగరంపై ఐదు రోజుల చర్చ జరిగిందని గుర్తుచేసిన వైనం * జగన్, వైఎస్ విభజనకు కారణమయ్యారంటూ టీడీపీ సభ్యుల అసంబద్ధ ఆరోపణలు * పరుష పదజాలంతో విపక్షంపై దాడి.. జగన్‌ను దూషిస్తూ బాబును పొగుడుతూ ప్రసంగాలు * గందరగోళంలోనే ‘ముహూర్తం’ పేరుతో రాష్ట్ర రాజధానిపై ప్రకటన చేసిన సీఎం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై గురువారం రాష్ట్ర శాసనసభ అట్టుడికింది. రాజధాని ప్రాంతాన్ని ప్రకటించే ముందే ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరగాలన్న ప్రతిపక్షంపై ప్రభుత్వం ఎదురుదాడే అస్త్రంగా ప్రయోగించింది. ముందుగా చర్చించటానికి ససేమిరా నిరాకరించింది. ప్రకటన తర్వాతే చర్చ అంటూ ప్రతిపక్ష వినతిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇదెక్కడి పద్ధతి అని ప్రశ్నించిన విపక్షంపై.. రాష్ట్ర విభజనకు కారకులు మీరేనంటూ అర్థంలేని అసంబద్ధ ఆరోపణలతో విరుచుకుపడింది. ఇది ప్రజాస్వామ్య పద్ధతేనా అని ప్రతిపక్ష నేత ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. ఆయన అసెంబ్లీలో జగనోక్రసీ నడిపిస్తున్నారని, ఫ్యాక్షనిజాన్ని నడుపుతున్నారంటూ అధికారపక్షం అడ్డగోలు విమర్శలకు తెరతీసింది. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతూ.. ముందుగా చర్చ జరగాలని నినాదాలు చేస్తుంటే.. అధికార టీడీపీ సభ్యులు వారిపై ఆరోపణలు, ప్రతినినాదాలు చేయటంతో సభ హోరెత్తింది. నినాదాలు, అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ఈ గందరగోళంతో రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షం నిరసనల హోరు మధ్యే సీఎం చంద్రబాబు ముహూర్తం ప్రకారం ఉదయం 11:11 గంటలకు రాజధాని ప్రాంతంపై ప్రకటన చేసి పంతం నెగ్గించుకున్నారు. చర్చకోసం వాయిదా తీర్మానం తిరస్కరణ... గురువారం ఉదయం సభ ప్రారంభంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జి.శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపడుతున్నట్టు ప్రకటిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబును మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఒక్కుదుటున లేచి వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తే ఎలాగని స్పీకర్‌ను అడిగారు. దీనిపై ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో ప్రకటన ఇవ్వబోతున్నారని, ఇక చర్చ అవసరం లేదని స్పీకర్ బదులిచ్చారు. దీనికి ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్తూ పోడియంలోకి వెళ్లారు. రాజధానిపై తొలుత చర్చ చేపట్టాలని, ఆ తర్వాత ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ బదులిస్తూ.. ప్రకటన ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చేసేదేమీ లేదని, ఏమైనా అభ్యంతరాలుంటే అప్పుడు చెప్పాలని పేర్కొన్నారు. యనమల క్షమాపణ చెప్పాలి... వైఎస్సార్ సీపీ శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ.. ‘‘యనమల ఇజాలు (వాదాలు) మాట్లాడుతున్నారు. గతంలో నన్ను రెండుసార్లు అవమానపర్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు సాక్షాత్తు ప్రతిపక్ష నేత జగన్‌ను అవమానపర్చేలా మాట్లాడుతున్నారు. ఈ ఇజాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ మేధో సంపత్తి నుంచేనా? మేమూ ప్రజామోదంతోనే వచ్చాం. మీలాగా దొడ్డిదోవన వచ్చి, నాయకుని ప్రాపకంతో మంత్రి పదవులు అనుభవించడం లేదు. యనమల వ్యాఖ్యలను మీ (స్పీకర్) విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. రికార్డులను పరిశీలించి అగౌరవపర్చే వ్యాఖ్యలుంటే తొలగిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. ఈ గొడవ మధ్యనే మంత్రులు అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యల్ని ఖండించారు. యనమల దొడ్డిదారిన రాలేదని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలను తెలుసుకుని మెలగాలంటూ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. పరిస్థితి అదుపుతప్పడంతో స్పీకర్ కోడెల ఉదయం 9.35 గంటల సమయంలో సభను తొలివాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనా అదే హోరు... శాసనసభ 40 నిమిషాల తర్వాత 10.20 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టింది. స్పీకర్ పోడియం ముందు ప్ల కార్డులతో నిరసన తెలిపింది. సభ్యుల నినాదాలు, ప్రతినినాదాల మధ్యనే అధికార టీడీపీ సభ్యులు గొల్లపల్లి, గోరంట్ల, తెనాలి శ్రావణకుమార్, కాలువ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ, మంత్రులు పి.సుజాత, పల్లె రఘునాథరెడ్డి తదితరులు మాట్లాడారు. విపక్షాన్ని, ప్రతిపక్ష నేత జగన్‌ను విమర్శిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. చట్టసభలో ధర్నాలు, బైఠాయింపులు, ప్లకార్డులతో నిరసనలు చేసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారంటూ నిందారోపణలకు దిగారు. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?: జగన్ ఈ సందర్భంలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ స్పందిస్తూ ‘‘రాష్ట్ర రాజధాని అనేది ప్రాధాన్యతాంశం. మొదట చర్చ, ఆ తర్వాత ఓటింగ్, ఆపైన ప్రకటన వెలువడాలి. ఇది సంప్రదాయం. దీన్ని పక్కనబెట్టి ‘ముహూర్తం టైం అయిపోతోంది.. ప్రకటన చేస్తాం.. ఆ తర్వాత చర్చిస్తాం..’ అంటే సరిపోతుందా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అన్న అనుమానం వస్తోంది. ఇది అన్యాయం’’ అని నిరసన తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మాట్లాడుతూ 1953లో రాజధాని లేదని, ఏదో ఇంట్లో కూర్చుని మాట్లాడుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ నాయకుడు ప్రకటన చేస్తారని, ఆ తర్వాత చర్చించుకోండన్నారు. దీనికి వైఎస్సార్ సీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ, ఓటింగ్ తర్వాతే ప్రకటన చేయాలని పదేపదే కోరినప్పటికీ సభావ్యవహారాల మంత్రి యనమల మాత్రం.. ప్రతిపక్షం నిబంధనలకు అనుగుణంగా తీర్మానం కూడా ఇవ్వలేదని, ప్రకటన చేయడం ప్రభుత్వ హక్కని పేర్కొన్నారు. అప్పటికి సమయం 11.11 గంటలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై ప్రకటన చేసేందుకు లేవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. మంత్రుల ఎదురుదాడి.. ఓ పక్క ఈ వివాదం నడుస్తుండగానే మంత్రులు రావెల కిషోర్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, అడ్డగోలు విభజనకు కారణమయ్యారని, అనైక్యతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని లేనిపోని ఆరోపణలకు దిగారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఎన్ని గంటల చర్చకైనా తాము సిద్ధమని, ఎన్ని సూచనలు, సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు జగన్, ఆయన తండ్రి కారకులంటూ.. అందుకు క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ దశలో స్పీకర్‌కు, విపక్ష సభ్యులకు మధ్య వాగ్వాదం నడిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూను మాట్లాడాలని స్పీకర్ కోరినప్పటికీ ఆయన తిరస్కరిస్తూ తాము ప్రకటనకు ముందు చర్చకు పట్టుబడుతున్నామని, అదే తమ డిమాండ్ అని స్పష్టంచేశారు. ఇలా దాదాపు 15 నిమిషాల పాటు సభలో గందరగోళం చెలరేగింది. అప్పటి పరిస్థితులు వేరు: స్పీకర్ అప్పటి (1953 నాటి) పరిస్థితులు వేరని, ఇప్పటి పరిస్థితులు వేరని, రూల్ నంబర్ 338 కింద ముఖ్యమంత్రి లేదా మంత్రి ప్రకటన చేసే అధికారం ఉందని స్పీకర్ పేర్కొన్నారు. ఆ తర్వాత కావాలనుకుంటే ప్రతిపక్షం వివరణ కోరవచ్చన్నారు. అనంతరం సభావ్యవహారాల శాఖ మంత్రి యనమల మాట్లాడుతూ ప్రతిపక్ష నేత అయినా, ముఖ్యమంత్రి అయినా నిబంధనలను పాటించేలా విధివిధానాలున్నాయని, సభలో ప్రజస్వామ్యం ఉందే గానీ జగనోక్రసీ (జగన్వాదం) లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చామని, దానిపై చర్చ జరుగుతుందని చెప్పారు. విధివిధానాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష సభ్యులు అల్లరి చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. యనమల వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా యనమల మాట్లాడలేదని, ప్రకటన చేసేందుకు ప్రభుత్వానికి విశేషాధికారం ఉందని స్పీకర్ అనడంతో మళ్లీ గొడవ జరిగింది. ఈ దశలో యనమల తిరిగి మాట్లాడుతూ తిరస్కరించిన వాయిదా తీర్మానంపై మాట్లాడేదేమీ ఉండదని, ప్రభుత్వం ప్రకటన ఇచ్చేదాక ఓపిక పట్టి ఆ తర్వాత చెప్పదల్చుకున్నది చెప్పాలని పేర్కొన్నారు. -
నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ కోడెల: శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: నిబంధనలు, సభా సాంప్రదాయాలకు విరుద్దంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సభా సాంప్రదాయాలను కాపాడాలని ప్రతిపక్ష పార్టీ కోరుతోందని ఆయన అన్నారు. గతంలో రాజధాని ఏర్పాటుపై చర్చ జరిగిందని, ఇప్పుడు సభలో చర్చించడానికి అభ్యంతరమేమిటని ఆయన ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుపై సభలో చర్చకు స్పీకర్ అనుమతించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. -
సీఎం కిరణ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ... సీఎం కిరణ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసిపోతున్న దశలో త్యాగాలు చేస్తానని ఆయన ప్రకటించడాన్ని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకే సీఎం అలా మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిన్నాభిన్నం అవడానికి యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులే ప్రధానకారణమని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్ర సమైక్యతపై తీర్మానం చేయాలని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజనపై విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి పై విధంగా స్పందించారు.