breaking news
G.R. Maharishi
-
మంగలి రాముడికి పిచ్చి పట్టింది
ప్రత్యేక ప్రశంస పొందిన కథ మంగలి రాముడికి పిచ్చి పట్టింది. పెళ్లామే అతన్ని నడివీధిలో చావ బాదింది. ఆస్పత్రిలో లైట్ నీరసంగా వెలుగుతూ ఉంది. సెలైన్ కన్నీటి బొట్టులా జారుతూ ఉంది. గాయపడిన పక్షిలా ఎవరో మూలుగుతున్నారు. ‘‘సార్, మా నాయన...’’ అడిగాడు సురేష్. ‘‘నథింగ్ టు వర్రీ. ఏదో షాక్‌లో ఉన్నాడు. వన్ వీక్‌లో రికవరీ అవుతాడు’’ చెప్పాడు డాక్టర్. కొంచెం దూరంలో పార్వతమ్మ ఏడుస్తూ ఉంది. మొగుణ్ని ఎడాపెడా కొట్టడం గుర్తొచ్చినప్పుడల్లా ఆమె పిచ్చిపిచ్చిగా ఏదో గొణుగుతోంది. మూడు రోజులైంది ఆమె కడుపు నిండా తిని. మంచంపైన రాముడు కొద్దిగా కదిలాడు. తెల్లటి జుత్తు, మాసిపోయిన గడ్డం, ముసలితనం ముడుతలు ముడుతలుగా ఇపుడిపుడే మొహాన్ని తాకుతోంది. తండ్రి మంచం పక్కన నిలబడ్డాడు సురేష్. తానీ రోజు బెంగళూరులో ఏసీ గదిలో ఉద్యోగం చేస్తున్నాడంటే ఈ పేదతండ్రి ఎండా, వాన, చలికి తడవడం వల్లే. ఆగకుండా కదిలిన ఆ చేతులే తనకీ జీవితాన్నిచ్చాయి. రాముడి పెదవులు వణుకుతూ కదులుతున్నాయి. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చింది. కళ్లు తుడుచుకుంటూ పార్వతమ్మ గబాలున వెళ్లింది. ‘‘నాయనా, నాయనా’’ అంటున్నాడు సురేష్. రాముడి కనురెప్పలు తడుస్తున్నాయి. ఏదో విషాద దృశ్యం ఆ కళ్లవెనుక కదులుతూ ఉంది. ‘‘మా నాయన్ని... చంపేసినారు’’ అని గొణిగాడు. పార్వతమ్మ కుప్పకూలిపోయింది. వారం రోజుల తరువాత... రాముడు శుభ్రంగా తలదువ్వుకున్నాడు. పెట్టెని తీసి చూశాడు. కత్తెర్లు, కత్తి, బ్లేడు, పటిక, బ్రష్, సబ్బు, అద్దం, దువ్వెన్లు అన్నీ సర్దుకుని చూసుకున్నాడు. తెల్లటి పంచె, చారల చొక్కా తొడుక్కుని బయలుదేరాడు. ‘‘నీకేమైనా బుద్ధుందా? ఆస్పత్రి నుంచి వచ్చి రెండు దినాలు కాలేదు. నువ్వు పనికి పోయి మమ్మల్ని సాకాల్సిన పనేమీ లేదు కానీ ఇంట్లోనే ఉండు’’ అని అరిచింది పార్వతమ్మ. రాముడు ఏం పట్టించుకోకుండా చెప్పులేసుకున్నాడు. భుజానికి సంచీ తగిలించుకున్నాడు. నిదానంగా నడుచుకుంటూ సెంటర్‌కి వెళ్లాడు. పది గంటలకే పెనంలాగా రోడ్లు వేడెక్కాయి. మామూలుగా అయితే ఉదయం ఆరు గంటలకే రాముడి పని మొదలవుతుంది. సోడాల రహీం పరిగెత్తుకుంటూ వచ్చాడు. ముగ్గురు పిల్లల్ని అతను సోడాలపైన సాకుతున్నాడు. ‘‘ఏందిరా అప్పుడే రాకపోతేనేం, ఇంకా కొన్నాళ్లు రెస్ట్ తీసుకోకూడదా?’’ అన్నాడు. భుజానికున్న సంచీలో నుంచి ఒక గుడ్డ తీసి ఫుట్‌పాత్ మీద పరిచాడు రాముడు. చెనిక్కాయలు అమ్ముకునే యశోదమ్మ మెల్లిగా రోడ్డు దాటుకుంటూ వచ్చింది. ఆమె ఒక్కగానొక్క కొడుకు పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. తిరిగి రాలేదు. ఏమైనాడో తెలియదు. కొడుకు ఫొటో పట్టుకుని ప్రతి సోమవారం ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లి అర్జీ ఇస్తుంది. కొడుకు వయసువాళ్లు ఎవరు కనిపించినా ఆ మసక కళ్లలో వెలుగు కనిపిస్తుంది. ‘‘ఎట్లుండావురా రామా’’ అని ముసల్ది రాముడి చేతుల్ని తడిమింది. అతనేం మాట్లాడలేదు. ‘‘మన మూగోడు పది రోజులుగా గడ్డం పెంచుకుని తిరుగుతున్నాడు రామా. నీ చెయ్యి పడాల్సిందే’’ అని నవ్వాడు రహీం. చిరిగిపోయిన చొక్కాని ప్యాంట్లో ఇన్‌షర్ట్ చేసుకున్న మూగోడు ‘హిహిహి’ అని నవ్వాడు. ఫుట్‌పాత్ మీద అనాథగా తండ్రి వదిలి వెళుతున్నప్పుడు కూడా వాడు అలాగే నవ్వాడు. అక్కడున్న వాళ్లంతా వాణ్ని సాకారు. ఏం పని చెప్పినా చేస్తాడు. అన్నం పెడితే చాలు. దూరంగా కూలీల అరుపులు వినిపిస్తున్నాయి. రోడ్డు పని జరుగుతూ ఉంది. నిర్లిప్తంగా ఆకాశం వైపు చూశాడు రాముడు. ఎండ చుర్రుమని తగులుతూ ఉంది. వెచ్చటి నీటి బుగ్గలా కన్నీళ్లు ఎగదన్నాయి. ‘‘రాముడూ’’ అంటూ చెయ్యి పట్టుకున్నాడు రహీం. ‘‘మా నాయన్ని చంపేసినారు రా’’ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. రాముడి చెంప పగిలిపోయింది. ‘‘పిచ్చినా కొడకా, మీ నాయన చచ్చిపోయి ఇరవై ఏండ్లయ్యింది. నువ్వూ నేనూ పీనుగని తీసుకెళ్లి మట్టి చేసినాం, గుర్తుందా?’’ అన్నాడు రహీం కోపంగా. లోకమంతా కన్నీళ్లతో అల్లుకుపోతూ ఉండగా రాముడికి తండ్రి రూపం గుర్తుకొచ్చింది. తెల్లటి పంచె, చారల చొక్కా, నుదుటి బొట్టు, ప్రేమని పంచే కళ్లు. ఆరడుగుల శివయ్య, చిటికెన వేలు పట్టుకుని నడుస్తున్న ఐదేళ్ల రాముడు. తెల్లవారే వెలుగులో రోజూ కనిపించే దృశ్యమిది. ఒక చేతిలో పెట్టె, ఇంకో చేతిలో కొడుకు. రెండూ ప్రాణమే శివయ్యకి. తల్లి ఎలా ఉంటుందో రాముడికి తెలియదు. మళ్లీ పెళ్లి చేసుకోలేదు శివయ్య. ఉదయాన్నే కొడుకుని నిద్రలేపి, స్నానం చేయించి, తాను చేసి పూజ ముగిస్తాడు. సంగటి చేసి కొడుక్కి తినిపించి, తానో ముద్ద తిని, మిగిలింది క్యారియర్‌లో వేసుకుని బయలుదేరుతాడు. సెంటర్లోకి రాగానే మర్రిచెట్టుకి దండం పెట్టుకుంటాడు. ఒక బెల్లం ముక్కని చీమల పుట్ట దగ్గర పెడతాడు. గుప్పెడు జొన్నల్ని పక్షులకి చల్లి, కొబ్బరిచిప్పలో నీళ్లు పెడతాడు. పాతగుడ్డ చెట్టు కింద పరిచి పనిలోకి దిగుతాడు. రాముడి కళ్లకి చెట్టు ఒక అద్భుతం. దాని చుట్టూ తిరిగి ఆడుకుంటాడు. తండ్రి చెప్పే కథల్లోని రాజకుమారుడు తానే. చెట్టులో దాక్కున్న రాక్షసుణ్ని చంపేస్తాడు. దాని బోదె మహావిష్ణువు గదలా కనిపించేది. ఆ కొమ్మలన్నీ దేవుడి చేతుల్లా ఊహించుకునేవాడు. చెట్టు ఒక లోకంలా కనిపించేది. చీమలు, చిన్న చిన్న పురుగులు హడావుడిగా తిరుగుతూ ఉండేవి. ఏవేవో పక్షులు ముచ్చట్లాడుతూ ఎగురుతూ ఉండేవి. చెట్టు కింద శివయ్యతో పాటు సోడాల బండి ఇబ్రహీం, పాత ఇనుప సామాన్లకు పాకం పప్పు అమ్మే వెంకటేశ్ వుండేవాళ్లు. ఎండని భరించలేని అనేక మంది వచ్చి కూర్చునేవాళ్లు. శివయ్య దగ్గరికి వచ్చేవాళ్లంతా నిరుపేదలు. అతనెప్పుడూ మనిషిని చూడడు. పెరిగిన గడ్డాలు, మీసాలు, జుత్తుపైనే అతని దృష్టంతా. ఒక మనిషిని శుభ్రం చేయడం కూడా దైవకార్యమనే నమ్మేవాడు. ఎలుగుబంటిలా వచ్చినవాడు కుందేలు పిల్లలా తిరిగి వెళుతుంటే శివయ్యకి పట్టరాని సంతోషం! తోలు పటకాపైన కత్తి సాన పెడుతున్నప్పుడు వచ్చే శబ్దం, తండ్రి వేళ్లపై కత్తెర కదులుతున్నప్పుడు వచ్చే ధ్వని సంగీతంలా అనిపించేవి రాముడికి. ఒకసారి అద్దంలో చూసుకుంటూ తనకు తానే కటింగ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి కొడుక్కి కత్తి, కత్తెర అందకుండా జాగ్రత్త పడేవాడు శివయ్య. చెట్టుని ఎక్కడానికి, రెండు చేతులతో కౌగిలించుకోవడానికి ప్రయత్నించేవాడు రాముడు. ‘‘దాన్ని ఎక్కాలంటే నాలుగు కాళ్లు, కౌగిలించుకోవాలంటే ఎనిమిది చేతులు కావాలి’’ అనేవాడు తండ్రి. ‘‘నేను దేవుణ్ని, నాకు పది చేతులున్నాయి’’ అనేవాడు కొడుకు. ‘‘అవును. నువ్వే నాకు దేవుడు’’ కొడుకుని ముద్దుపెట్టుకునేవాడు తండ్రి. మంగళవారం పనికి సెలవైనా, చెట్టుకి దండం పెట్టి, చీమలకు బెల్లమేసి, పక్షులకు గింజలేసి వెళ్లేవాడు శివయ్య. మధ్యాహ్నం వరకూ వూర్లో తిరిగి పేదపిల్లలకి ఉచితంగా క్షౌరం చేసేవాడు. ‘‘మనమే పేదవాళ్లం. మనకీ ఉచితసేవ అవసరమా, బతకడం నేర్చుకోరా శివయ్య’’ అని ఒక బంధువు మందలించాడోసారి. ‘‘అదే నేర్చుకుంటున్నా పెద్దనాయినా’’ అన్నాడు శివయ్య. మంగళవారం సాయంత్రం ప్రపంచం మునిగిపోయినా సరే సినిమాకి వెళతారు తండ్రీకొడుకులు. సినిమా కథని తండ్రి మళ్లీ చెబుతుంటే వింటూ నిద్రపోయేవాడు. ఎండిన ఆకులపై నడవడం సరదా రాముడికి. ‘‘ఎందుకు నాయనా రాలిపోతాయి’’ అని అడిగాడు తండ్రిని. ‘‘ముసలి ఆకులు రాలితేనే లేత ఆకులు ఎదిగేది.’’ ‘‘అంటే?’’ ‘‘పెద్దవాడైతే అర్థమవుతుంది.’’ పన్నెండేళ్ల వయసులో పని నేర్చుకున్నాడు రాముడు. కత్తి చేతికిచ్చి తన గడ్డాన్ని గీయమన్నాడు శివయ్య. తండ్రి గొంతు మీద కత్తి పెట్టినప్పుడు చేతులు వణికాయి. ‘‘భయంగా వుంది నాయనా, ఇంకెవరికైనా చేస్తా’’ అన్నాడు. ‘‘ఇంకెవరికైనా గాటుపడితే వాళ్లు తిడతారు. అది నాకిష్టం లేదు.’’ కత్తి ధైర్యంగా కదిలింది. తండ్రి మొహానికి నీళ్లు కొట్టి, శుభ్రంగా తుడిచాడు. ఒక్క గాటు కూడా లేదు. గడ్డానికి చెంపల్ని ఆనించి తడిమాడు. ఎక్కడా గరుకు తగల్లేదు. నునుపే. తండ్రిని ముద్దుపెట్టుకున్నాడు. తండ్రీకొడుకుల స్నేహం అందరికీ ముచ్చటే. మర్రిచెట్టుకి రోజూ దండం పెట్టే తండ్రిని చూసి ‘‘ఆ చెట్టంటే ఎందుకు నాయనా నీకంత ఇష్టం’’ అని అడిగాడు. ‘‘మనలాంటి పేదోళ్లు గొడుగులు కొనలేరు కాబట్టి, ఆ దేవుడు మనకు చెట్లని ఇచ్చాడు. ఏ మహానుభావుడు విత్తనమేసినాడో కానీ ఇది మా నాయనకి నీడనిచ్చింది, నాకూ నీకూ కూడా ఇచ్చింది. ఇది చెట్టు కాదురా మా నాయన’’ ఆప్యాయంగా చెట్టుని తడుముతూ చెప్పాడు శివయ్య. ‘‘నీకు నాయనైతే, నాక్కూడా నాయనే.’’ రాముడికి పెళ్లయ్యింది. ఇంటిని రాముడికి ఇచ్చేసి, చిన్నగదిని బాడుగకి తీసుకున్నాడు శివయ్య. ‘‘ఏంది నాయనా ఇది’’ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు రాముడు. ‘‘ఉండేది ఒక గది. పెళ్లాం మొగుడంటే చానా ముచ్చట్లుంటాయిరా’’ అన్నాడు శివయ్య. రాముడికి కొడుకు పుట్టాడు. మనవడిని వీపుపై ఎక్కించుకుని గుర్రం ఆట ఆడుతున్నాడు శివయ్య. ఒకరోజు గుర్రం ఒరిగిపోయింది. ఆకు రాలింది. కాలం ఒక మురిక్కాలవ. అది నానా చెత్తని మోసుకుంటూ మన కాళ్ల కింద నుంచి పారుతూ ఉంటుంది. ఒకరోజు రాముడు షేవింగ్ చేస్తున్నాడు. రెండు ఇన్నోవాలు వచ్చి ఆగాయి. ఎవరెవరో అధికారులు దిగారు. టేపులతో రోడ్డుని కొలిచారు. చెట్టుని ఫొటోలు తీశారు. ‘‘ఏంది సార్, ఇదంతా?’’ అడిగాడు రాముడు. ‘‘రోడ్డు వెడల్పు చేస్తున్నారు. ఈ చెట్టుని కొట్టేస్తారు.’’ గొడ్డలి వేటు తగిలింది రాముడికి. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. కూలిపోతున్న చెట్టుకి బదులు తండ్రి కనిపించాడు. ఎమ్మెల్యేకి వెళ్లి అర్జీలిస్తే పని జరుగుతుందని ఎవరో చెప్పినట్టు గుర్తుకొచ్చింది. ఉదయాన్నే ఎమ్మెల్యే ఇంటికెళ్లాడు. ‘‘నా పేరు రాముడయ్యా, సెంటర్లో క్షౌరం పని చేస్తా’’ అన్నాడు. ‘‘ఏం కావాలి నీకు, ఇంటికి అప్లయ్ చేశావా?’’ అని అడిగాడు ఎమ్మెల్యే. ‘‘నాకు ఇల్లుంది సార్.’’ ‘‘మరి లోన్ కావాలా?’’ ‘‘అక్కరలేదు సార్.’’ ఆశ్చర్యంగా చూశాడు ఎమ్మెల్యే. ‘‘సెంటర్లో మర్రిచెట్టు కింద బతికేటోళ్లం సార్, ఆ చెట్టుని కొట్టేస్తారంట, కాపాడండి సార్.’’ ‘‘మరి రోడ్లు కావాలి, చెట్లు కావాలంటే ఎట్లా కుదురుతుందయ్యా.’’ ‘‘అది చెట్టు కాదు సార్, మా నాయన. ఆ చెట్టుని నరకొద్దు సారూ’’ అని ఏడ్వసాగాడు. ‘‘చూడు రాముడూ, ఆ చెట్టు సంగతి నేను ఎంక్వయిరీ చేస్తాగానీ, నువ్వు ఇంటికెళ్లు’’ అని భుజంపై చెయ్యి వేసి వూరడించాడు. ‘‘ఏందట్టా వున్నావ్’’ అని అడిగింది పార్వతమ్మ. ‘‘ప్రాణానికి బాగలేదు’’ అన్నాడు. ఆ రాత్రి అతనికో కల వచ్చింది. చెట్టు నడుస్తూ వూరంతా తిరుగుతోంది. వంద చేతుల్లో వంద ఆయుధాలున్నాయి. మనుషుల్ని తరిమి తరిమి కొడుతోంది. తెల్లారింది. రాజకీయ నాయకులకు డబ్బులిస్తే కానీ పనులు జరగవని గతంలో అతను విన్నాడు. అందుకని ట్రంకు పెట్టె తీశాడు. తండ్రి చనిపోయిన రోజునాడు ప్రతి ఏటా అన్నదానం చేస్తాడు. అందుకని కొంత డబ్బు దాచి ఉంచుతాడు. లెక్కేస్తే తొమ్మిది వేలు తేలింది. కర్చీఫ్లో మూట కట్టుకున్నాడు. నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాడు. రాముణ్ని చూసి ఎమ్మెల్యే ‘‘చెప్పానుగా విచారిస్తానని, మళ్లొచ్చినావే’’ అన్నాడు. ‘‘మీ ఒక్కరితోనే మాట్లాడాలి సార్’’ అన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు ఎమ్మెల్యే. ‘‘పరవాలేదు చెప్పు, వాళ్లంతా నా సెక్యూరిటీ’’ అన్నాడు. అందరివైపు చూసి, సడన్‌గా డ్రాయర్ జేబులోంచి కర్చీఫ్ మూట తీసి ఎమ్మెల్యే చేతిలో పెట్టాడు. ఎమ్మెల్యే కంగారుగా ఆ మూటని జారవిడిచే సరికి డబ్బుల కట్ట కిందపడింది. ‘‘ఈ డబ్బుల్ని తీసుకుని, ఆ చెట్టుని కాపాడండి సార్’’ అన్నాడు. ఎమ్మెల్యేకి కోపమొచ్చింది. గన్‌మ్యాన్ వచ్చి రాముడి చెంపపై కొడితే పెదవి చిట్లి రక్తమొచ్చింది. ‘‘అన్నంటే ఏమనుకుంటున్నావ్, పద బయటికి’’ అన్నాడు. రాముడు ఎమ్మెల్యే కాళ్లపై పడ్డాడు. విదిలించుకుని లోనికెళ్లిపోయాడు. డబ్బులు ఏరుకుని జేబులో పెట్టుకుని బయటికొచ్చాడు. సెంటర్ దగ్గరికి వెళ్లాడు. ట్రాఫిక్ క్లోజ్ చేశారు. కొంచెం దూరంలో చెట్టు శిలావిగ్రహంలా ఉంది. ‘‘ఏమైంది?’’ అని అడిగాడు రాముడు. ‘‘చెట్టుని కొడతారట, అందుకే ఎవర్ని రానివ్వడం లేదు.’’ ప్రాణం పోయినా సరే దానిమీద వేటు పడకూడదు. చెట్టు దగ్గర నలుగురు పోలీసులు, ఎవరో అధికారులు, పది మంది కూలోళ్లు ఉన్నారు. వాళ్ల చేతిలో గొడ్డళ్లు, రంపాలు, ఎలక్ట్రిక్ రంపాలున్నాయి. ‘‘వెయ్యేళ్ల నాటి చెట్టు సార్ ఇది. అంత సులభంగా లొంగదు. ఒక్క కొమ్మే చెట్టులాగా ఉంది. ముందు కొమ్మలన్నీ నరికేయాలి’’ మేస్త్రీ చెబుతున్నాడు. బ్యారికేడ్స్ తోసుకుని రాముడు పరిగెత్తాడు. అక్కడున్నవాళ్లంతా కంగారుపడ్డారు. పోలీసులు లాఠీలు తీసుకుని, ‘‘ఎవరయ్యా నువ్వు’’ అని వచ్చారు. ‘‘సార్, మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ చెట్టు కిందే బతికాం సార్, దీన్ని నరక్కండి సార్’’ చేతులు జోడించి ఏడుస్తున్నాడు రాముడు. ‘‘ఎవడయ్యా నువ్వు. పిచ్చోడిలా ఉన్నావే. చెట్టుని నరకమని గవర్నమెంట్ ఆర్డర్. మేమేం చేయాలి?’’ అని చెప్పాడో పోలీసు. ఒక నిచ్చెన వేసుకుని ఇద్దరు కూలీలు చెట్టుపైకి ఎక్కారు. కింద ఉన్న కూలీ పెద్ద పెద్ద మేకులు పట్టుకుని నిలబడి ఉన్నాడు. పైకి ఎక్కిన కూలీలు ఎక్కడ నరకాలని మార్క్ చేసుకుంటున్నారు. ఒక కూలీ గొడ్డలి ఎత్తి చిన్న దెబ్బ వేశాడు. రాముడికి పిచ్చెక్కిపోయింది. పక్కనే ఉన్న రాళ్లకుప్ప దగ్గరికి వెళ్లాడు. చేతికందిన రాయి తీసుకుని, గట్టిగా అరుస్తూ చెట్టుపైనున్న కూలీల పైకి విసరసాగాడు. మీదికొస్తున్న రాళ్లని చూసి కూలీలు భయంతో చెట్టు దిగేశారు. వూహించని ఈ సంఘటనతో షాక్ తిన్న పోలీసులు లాఠీలతో పరిగెత్తుకొచ్చారు. ఇంతలో ఒక రాయి పోలీసు నుదుటికి తగిలింది. భయంతో పోలీసులు తగ్గారు. చుట్టూ ఉన్న జనానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొన్ని క్షణాల్లో తేరుకుని రాముడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు పక్కన సీసాల్లో అమ్ముతున్న పెట్రోల్ కనిపించింది రాముడికి. గబాలున వెళ్లి చేతిలోకి తీసుకున్నాడు. పక్కనే కిళ్లీకొట్టు వద్ద అగ్గిపెట్టె లాక్కున్నాడు. మీద పెట్రోలు ఒంపుకుంటూ చెట్టు దగ్గరికెళ్లాడు. ‘‘ఆ చెట్టు మీద వేటు పడితే అంటించుకుంటా’’ అని అరిచాడు. ఇంతలో ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి పార్వతమ్మ దూకింది. ఈ గొడవంతా ఆమెకి ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఎదురుగా పెట్రోల్‌తో తడిసిన భర్త, పోలీసులు, ఆమెకేం అర్థం కాలేదు. మెరుపు వేగంతో వెళ్లి మొగుని చేతిలోని అగ్గిపెట్టెని లాక్కుంది. ‘‘దొంగ ముండాకొడకా, మమ్మల్ని అన్యాయం చేయాలనుకున్నావా?’’ అని ఎడాపెడా కొట్టింది. పోలీసులొచ్చి రాముడి రెండు చేతులు పట్టుకున్నారు. అతను పెనుగులాడుతున్నాడు. పోలీసులు తంతున్నారు. ఏవో అరుపులు, కేకలు. నరాలు మెలితిప్పే బాధ, ఏడుపు. ఇదంతా జరుగుతూ ఉండగా ‘టప్’మని చెట్టుపై గొడ్డలి వేటు పడింది. ‘‘మా నాయన్ని చంపేసినారు’’ అని రాముడు గొణిగాడు. అతని బుగ్గలన్నీ తడిసిపోతున్నాయి. చెట్టు చేతులన్నీ తెగిపోతున్నాయి. తాతల తండ్రుల నీడలన్నీ కన్నీళ్లు కారుస్తున్నాయి. చీమలు చెల్లాచెదురయ్యాయి. పక్షులు దిక్కులేనివయ్యాయి. ఉడుతల పసి వూయలలు ధ్వంసమయ్యాయి. చెట్టు ఒక దుఃఖ జలపాతమయ్యింది. చూసే కళ్లకు కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా! - జి.ఆర్.మహర్షి -
ఏం ఫ్యామిలీరా బాబూ!
హ్యూమర్‌ప్లస్ ఒకాయన ఎవరింటికో వెళ్లబోయి ఇంకెవరింటికో వెళ్లాడు. ఆ ఇంట్లో జనమంతా ఉత్సాహంగా స్టెప్పులేస్తూ కనిపించారు. ‘‘ఇది డ్యాన్సింగ్ స్కూలా?’’ అని అడిగాడు. ‘‘అదేం కాదు, ఉదయాన్నే కాఫీ తాగగానే ఒక పాట పాడతాం. టిఫిన్ తర్వాత ఒక సాంగ్. లంచ్‌కి ముందు, ఆ తరువాత ఇంకో సాంగ్ అండ్ డ్యాన్స్’’ అని ఒక పెద్దాయన చెప్పాడు. ‘‘ఆకలవడానికి ఒక పాట, అరగడానికి ఇంకో పాట అన్నమాట.’’ ‘‘అన్నమాట కాదు, అదే ఉన్న మాట. ఈ ఇంట్లోకి ఎవరు రావాలన్నా నాలుగు మంచి మాటలు చెప్పి రావాలి.’’ ‘‘సత్యమునే పలుకవలెను’’. ‘‘పాసైపోయారు’’ అంటూ ఆ పెద్దమనిషి కాఫీ తెమ్మని భార్యకి చెప్పాడు. ఆమె స్టెప్పులేస్తూనే వెళ్లి కాఫీ తీసుకొచ్చింది. ‘‘కాఫీని తాపీగా హ్యాపీగా తాగండి’’ అంటూ ఆవిడ మళ్లీ ఒక పాట ఎత్తుకుంది. జడుసుకున్న అతిథి షర్ట్‌పైన కాఫీ ఒలకబోసుకున్నాడు. ‘‘షర్ట్‌పైన మరక మంచిదే. సర్ఫ్‌తో పోతుంది. క్యారెక్టర్‌పైన మరక పడితే ఉతికినా పోదు’’. ‘‘మీరు నవలల్లోని పాత్రల్లా మారుతున్నారు.’’ ‘‘నవల, వల, పావలా, ముప్పావల, కష్టసుఖాల కవల ఈ జీవితం. ఇంట్లోని పాత్రలు రుద్దితే మెరుస్తాయి. ఒంట్లోని పాత్రలు... ’’ ఆ పెద్దమనిషి ఏదో చెప్పబోతే అతిథి దిగ్గున లేచి ‘‘ఇక వస్తానండి’’ అన్నాడు. ‘‘ఈ మంచిమాటల మల్లికార్జునరావు ఇంటికి ఎవరూ రారు. వచ్చినవాళ్లు వెనక్కి పోరు’’ అంటూ అతిథి చొక్కా ఊడబీకి బకెట్లో వేసి ఉతుకుతూ ‘‘చాకిరేవు కాడ ఏమైంది’’ అంటూ సాంగ్ స్టార్ట్ చేయగానే మిగిలినవాళ్ళంతా వచ్చి ‘ఏమైంది’ అంటూ గ్రూప్ డ్యాన్స్ చేశారు. ఇంతలో ఒక కుర్రాడు బాహుబలిలో కట్టప్పలా మోకాళ్లతో స్కేటింగ్ చేస్తూ వచ్చి ‘నాన్నగారూ’ అంటూ ఒక చెప్పుల జత పెట్టాడు. ‘‘ఇవి నావి కావు నాన్నా. తొందరపడి మామయ్యవి తెచ్చావు. సైజ్ తేడా వుంటే చొక్కా తొడుక్కోవచ్చు కానీ, చెప్పులు తొడుక్కోలేం’’ అన్నాడు నాన్న. ‘‘చెప్పులు ఆ కుర్రాడు తేవడమెందుకు? మీరే వేసుకోవచ్చుగా’’ ‘‘నా కాలికి ఆనెలు, నడవలేను’’ ‘‘మరి స్టెప్పులేస్తున్నారుగా.’’ ‘‘జీవితంలో ఎన్నో స్టెప్పులెక్కినవాణ్ణి, ఆ మాత్రం స్టెప్పులేయలేనా?’’ ‘‘ఇంతకూ మీరేం చేస్తున్నారు?’’ ‘‘సాంగ్‌కి సాంగ్‌కి మధ్య బ్రేక్‌లో బిజినెస్ చేస్తుంటాను’’ ఆ కుర్రాడు మళ్లీ స్పీడ్బీట్లా వచ్చి చెప్పులు పెట్టాడు. ‘‘కరుస్తాయని చెప్పుల్ని, తడుస్తుందని గొడుగుని వాడకుండా ఉండలేం కదా’’ ఇంతలో ఒకమ్మాయి వచ్చి ‘‘అత్తయ్య కారంపొడి దంచడానికి రమ్మంటోంది’’ అని పిలిచింది. ‘‘రండి రోకటి పాట విందురుగాని’’ ‘‘రోకటి పోటు తింటున్నాం కదా, మళ్లీ పాట కూడానా’’ అని తప్పించుకోడానికి ప్రయత్నిస్తే బలవంతంగా లాక్కెళ్లి చేతికి రోకలిని ఇచ్చారు. ‘‘దంచినోళ్లకి దంచినంత’’ అని ఆడోళ్లు పాట ఎత్తుకున్నారు. మంచి మాటలాయన కూడా నాలుగు దంచి ‘‘కారంకారం అంటాడు కానీ చెల్లెమ్మా, కారం లేని దెక్కడ చెల్లెమ్మా’’ అని చెప్పులతోనే స్టెప్పులేశాడు. ‘‘వైఫై ఉందని వైఫ్‌ని, ఫేస్బుక్ ఉందని ఫేస్‌ని మరిచిపోలేం కదా, గ్రూప్‌సాంగ్ ఉంటేనే మన బ్లడ్‌గ్రూప్ మనకి గుర్తుండేది. డాన్స్ చేస్తేనే బోన్స్ సెట్ అయ్యేది’’ దంచుతున్న కారం మీదపడి అతిథి ఒళ్లు మండింది. ‘‘ఇల్లుని పిచ్చాసుపత్రి చేసినా, పిచ్చాసుపత్రినే ఇల్లుగా మార్చుకున్నా పెద్ద తేడా లేదు. జీవితం స్ట్రెయిట్ రోడ్ కాదు, ఘాట్ రోడ్ బ్రేకుల ప్లేస్‌లో యాక్సిలేటర్, యాక్సిలేటర్ ప్లేస్‌లో బ్రేకులు ఉంటాయి. బీమిలీ బీచ్‌లాంటి ఫ్యామిలీ ఉంటే లాభం లేదు కొంచెం తెలివి కూడా ఉండాలి’’ అన్నాడు. అదేం పట్టించుకోకుండా మంచి మాటల మల్లికార్జునరావు ఆనెలు ఉన్నాయని కూడా మరిచిపోయి గాల్లోకి ఎగిరి పాట పాడేడు. అతిథి పారిపోయాడు. - జి.ఆర్. మహర్షి -
సోఫాలో సాఫీగా...
హ్యూమర్‌ప్లస్ నేల, బెంచీ, కుర్చీలు కాకుండా సోఫా క్లాసులు కూడా ఉంటాయని హైదరాబాద్ వచ్చాకే తెలిసింది. ఈమధ్య ఒక సినిమాకి వెళ్లాను. బటన్ నొక్కితే సోఫా విచ్చుకుంది. కాళ్లు చాపుకుని పడుకున్నా. పక్కసీటాయన లేపితే లేచా. ‘‘నిద్రపోండి, కానీ గురకపెట్టకండి. నా నిద్ర డిస్టర్బ్ అవుతోంది’’ అన్నాడు. ఈ సోఫా వల్ల సౌలభ్యం ఏమింటే, సినిమా బావున్నా, బాలేకపోయినా నిద్ర మాత్రం గ్యారంటీ. ఈమధ్య మా ఆవిడ సెల్లో రికార్డు చేసిన ఒక విచిత్రమైన సౌండ్ వినిపించింది. కుక్క, పిల్లి, కోతి ఒక బోనులో గొడవపడుతున్నట్టుగా వుంది. ‘‘ఏంటీ శబ్దం?’’ అని కంగారుగా అడిగాను. ‘‘మీ గురక’’ అంది. మగవాళ్ల గురక వల్ల ఆడవాళ్లకి మతి భ్రమణమైనా కలుగుతుంది. లేదా వేదాంతమైనా అబ్బుతుంది. రెంటికీ పెద్ద తేడా లేదు. ఆడవాళ్లు కూడా భారీగా గురకపెడతారు. వయసుని ఒప్పుకోనట్టే, దీన్ని కూడా ఒప్పుకోరు. నా మిత్రుడు ఒకాయన భార్య గురకకి భయపడి హౌస్‌కి వెళ్లకుండా మాన్షన్‌హౌస్ మందు తాగుతున్నాడు. మరక మంచిదే అని సర్ఫ్వాళ్లు అన్నారు కానీ, గురక మంచిదే అని ఎవరైనా అన్నారా? ఈ మధ్య మన సినిమాలు నిద్రకి మంచి మందుగా పనిచేస్తున్నాయి. నా మిత్రుడికి వ్యాపారంలో ఒక స్లీపింగ్ పార్టనర్ ఉన్నాడు. ఆయన సినిమాకెళితే టైటిల్స్ వస్తున్నప్పుడు నిద్రపోయి, రోలింగ్ టైటిల్స్‌లో లేస్తాడు. మధ్యలో ఏం జరిగినా ఆయనకి అనవసరం. ఈమధ్య సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకి వెళ్లి చిరాకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ ప్రతి ఐదు నిముషాలకి ఒసారి తుపాకీతో కాల్చి నిద్రపట్టకుండా చేశాడట! డైలాగుల కంటే తుపాకి గుళ్లే ఎక్కువగా పేలాయట. కాల్చడం మొదలుపెడితే పవన్ ఎవరి మాటా వినడు. నిద్రలో బోలెడు రకాలుంటాయి. కునుకు, దొంగనిద్ర, కలత నిద్ర, గాఢనిద్ర, యోగనిద్ర, దీర్ఘనిద్ర. చివరిదాన్ని ఎవడూ తప్పించుకోలేడు. వెనుకటికి ప్రధానిగా ఉన్నప్పుడు దేవెగౌడ కునుకు వేయకుండా ఏ సమావేశమూ ముగించేవాడు కాదు. దొంగనిద్ర ఎలా పోవాలో శ్రీకృష్ణుడికి బాగా తెలుసు. అందుకే కురుక్షేత్రం నడిపించాడు. విజయ్‌మాల్యాకి అప్పులిచ్చినవాళ్లంతా అనుభవిస్తుండేది కలతనిద్ర. గాఢనిద్ర పసి పిల్లల ఆస్తి. స్కూల్లో చేరిన తరువాత ఆ ఆస్తిని పోగొట్టుకుని అప్పులపాలవుతాం. ఇతరుల దుఃఖాన్ని తమదిగా భావించే మహాయోగులకి అబ్బేది యోగనిద్ర. అది మనకు చేతకాదు. నిద్ర పట్టని వాళ్లుంటారు. నిద్రపోయేవాళ్లని చూస్తే వీళ్లకు జెలసీ. వీళ్లు ఆఫీస్‌లో బాస్‌లైతే మనం చచ్చినా నిద్రపోలేం. నిద్రలో నడిచేవాళ్లుంటారు. నా చిన్నప్పుడు ఒకాయనుండేవాడు. డిటెక్టివ్ పుస్తకాలు తెగ చదివేవాడు. నిద్రలో నడుస్తూ ‘‘మిస్టర్ ఏజెంట్ త్రిబుల్వన్, నీ ఆటలు డిటెక్టివ్ యుగంధర్ వద్ద సాగవు’’ అని అరుస్తూ వీధిలో వాళ్ళందరికీ జేమ్స్‌బాండ్ సినిమాలు చూపించేవాడు. నిద్రలో కలలొస్తే వరం. పీడకలలొస్తే కలవరం. జర్నలిస్ట్‌లకి సరిగా నిద్ర వుండదు కాబట్టి కలలు కూడా సరిగా రావు. జర్నలిస్ట్‌గా వున్నప్పుడు ఏది కలో, ఏది మెలకువో తెలిసేది కాదు. జర్నలిజమే ఒక వైష్ణవమాయ. తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు ఆఫీస్‌లో కొందరు నిద్రపోతూ పనిచేసేవాళ్లు. పనిచేస్తూ నిద్రపోయేవాళ్లు. ఈ నిద్రావస్థలో ఒకసారి మునిసిపల్ చైర్మన్ ఫోటోకి బదులు గజదొంగ ఫోటో పెట్టారు. జనం పెద్ద తేడా తెలుసుకోలేకపోయారు. చైర్మన్ కూడా తన మొహాన్ని గుర్తుపట్టలేకపోయాడు. (మనల్ని మనం గుర్తుపట్టడమే అన్నిటికంటే కష్టం). గజదొంగ పేపర్ చదవడు కాబట్టి, మా స్లీపింగ్ సబ్ఎడిటర్లు వాడికిచ్చిన గౌరవాన్ని గుర్తించలేకపోయారు. మనుషులే కాదు, ప్రభుత్వాలు కూడా నిద్రపోయి గురకపెడతాయి. మన ప్రభుత్వాలకి వున్న మంచి లక్షణాల్లో ఇదొకటి. నిద్రపోవడం మన హక్కు. నిద్రని నేను గౌరవిస్తాను కానీ, గురక మాత్రం ఇతరుల హక్కుల్ని హరించడమే! - జి.ఆర్. మహర్షి -
మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా...
హ్యూమర్ ప్లస్ మా ఊళ్లో ఒకాయనుండేవాడు. పనేమీ చేసేవాడు కాదు. మూడు పూట్లా తిని ఆరు పూట్ల నిద్రపోయేవాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకునేవాడు. ఒక్కసారి నిద్రపోతూ కూడా మాట్లాడేవాడు. మర్రిచెట్టు కింద కూచుని వచ్చీపోయే వాళ్లకి తత్వబోధ చేసేవాడు. విన్నవాళ్లకి బుర్ర తిరిగిపోయేది. వినకపోతే కర్రతో బుర్రపై ఒకటిచ్చేవాడు. విన్నా వినకపోయినా జ్ఞాన బాధే.బాధలతోనే ఈ ప్రపంచం పుట్టిందని, బాధలతోనే అంతరిస్తుందని ఆయన సిద్ధాంతం. ఈయనతో బాధలు పడిపడి ఆయన భార్యకు ఒకరోజు పిచ్చెక్కింది. ఆమె మలయాళంలో బూతులు తిడుతూ దొరికినవన్నీ దొరికినట్టు ఉతకసాగింది. మనుషులకే బస్సులు లేక సర్వీస్ ఆటోలకు వేలాడుతున్న కాలంలో ఒక దెయ్యం రెండు రాష్ట్రాలు దాటి మా ఊరికొచ్చి ఈమెను పట్టుకోవడంలో ఆంతర్యమేమిటో చెట్టుకింద పండితులకి ఎవరికీ అర్థం కాలేదు. మనుషులు తమ బాధల్ని తీర్చుకోవటానికి ఇతరుల్ని బాధించినట్టు దెయ్యాలు కూడా బాధావిముక్తి కోసం ఇలాంటి క్రియాశీలక చర్యలకు దిగుతుంటాయని ఆమె భర్త వాదించాడు. ఈ మాట అన్న మరుక్షణం ఆ దెయ్యపు భార్య దుడ్డుకర్రని గిరగిర తిప్పి భర్త మోకాళ్లకు గురిచూసి కొట్టి మలయాళాన్ని ఎత్తుకుంది. ఇంతకూ ఆమె మాట్లాడుతున్నది మలయాళమో కాదో ఎవ్వరికీ తెలియదు. మా ఊళ్లో ఎవరికీ మలయాళం రాదు, వినలేదు. తెలుసుకోవాలనే కోరికుండాలే కానీ, దానికి దారులు అనేకముంటాయి. తాడిపత్రి బస్టాండులో టీ అమ్ముకునే నాయరుని ప్రవేశపెట్టారు. వాడు రావడం రావడమే టీ కెటిల్‌తో వచ్చి అందరికీ టీ అందించి, డబ్బులు వసూలు చేశాడు. డబ్బు వల్ల జ్ఞానమూ, జ్ఞానం వల్ల అజ్ఞానం సంభవిస్తాయని దెయ్యపు భర్త కొత్త సిద్ధాంతాన్ని ఎత్తుకున్నాడు. భర్త గొంతు వినగానే మలయాళ దెయ్యం విజృంభించింది. అనేకమంది కకావికలై పారిపోగా, కొంతమంది ధైర్యవంతులు ఆమెని నిలువరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ముందస్తు చర్యగా దెయ్యపు భర్త దుడ్డుకర్రకి అందకుండా చెట్టెక్కాడు. ఆమె ఉగ్రరూపం చూసి నాయరు తాడిపత్రి వైపుకి తిరిగి పిక్కబలం కొద్దీ పారిపోసాగాడు. ఈ హడావుడిలో టీ కెటిల్ కూడా మరిచిపోయాడు. ఎలాగోలా వాడిని వెనక్కి లాక్కొచ్చారు. ఆమె మాట్లాడింది మలయాళమే కానీ, తనకేమీ అర్థం కాలేదని నాయర్ చెప్పాడు. నిరూపితం కానప్పుడు ఏ భాషకీ శాస్త్రీయత ఉండదని చెట్టుపైన ఉన్న భర్త వాదించడానికి ప్రయత్నించాడు కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇలా కాదని టవున్ నుంచి డాక్టర్ని తీసుకొచ్చారు. రోగితోనూ రోగంతోనూ నిమిత్తం లేకుండా ఆయన ప్రతివాడికి మూడు ఇంజెక్షన్లు వేస్తాడు. ఒకవేళ రోగాన్ని ఆయన పసిగడితే ఇంజక్షన్ల సంఖ్య పెరుగుతుంది. ఒకసారి పొరపాటున రోగితో పాటు వెళ్లిన సహాయకునికి కూడా మూడు సూది పోట్లు పొడిచాడు. వాడు కళ్లు తిరిగి పడిపోతే వాడి కులపోళ్లు వచ్చి ధర్నా చేశారు. చేతి చమురు వదిలించుకున్న పరిజ్ఞానంతో అప్పటినుంచి మనిషి ముఖకవళికల ఆధారంగా సూదిమొనను సవరిస్తాడు. దెయ్యపు స్త్రీ దగ్గరకెళ్లి నాడిని చూశాడు. గుండె శబ్దాన్ని విన్నాడు. ఎప్పటిలాగే సూది వేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో డాక్టర్‌కి తెలియదు. కళ్లు తెరిచేసరికి తన ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇదంతా జరుగుతూ ఉండగా మా పెద్దమ్మ సీన్లోకొచ్చింది. ఆమె రిటైర్డ్ టీచర్. దెయ్యపు స్త్రీ దగ్గరికెళ్లి ఆప్యాయంగా అదుముకుంది. భర్తని చెట్టు దింపి చెంప పగలగొట్టింది. ‘‘నువ్వు వాగడమే కానీ, దాన్ని ఏనాడైనా నాలుగు మాటలు మాట్లాడనిచ్చావా? చివరికి తిట్టడానికి కూడా భాష మరిచిపోయింది. ఇప్పటికైనా నోర్మూసుకుని ఉంటే ఉంటావు, లేదంటే పోతావు’’ అని వెళ్లిపోయింది. కాలం ఎవడి అదుపాజ్ఞల్లో ఉండదు. మారుతూ ఉంటుంది. మా ఊళ్లో ఆడవాళ్లు ఇప్పుడు ఎంతలా మారారంటే మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా. - జి.ఆర్.మహర్షి