breaking news
Government supply
-
మళ్లీ మొదటికే..
తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కోడిగుడ్ల సరఫరా బాధ్యత మళ్లీ మొదటికొచ్చింది. గుడ్ల కొనుగోలుకు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో వీటి సరఫరా బాధ్యతను తిరిగి కాంట్రాక్టరుకే అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జిల్లాలోని పాఠశాలలకు గుడ్లు సరఫరా చేయాలని పేర్కొన్నారు. గత నెలలో కాంట్రాక్టు గడువు ముగియడంతో కోడిగుడ్లను ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలే కొనుగోలు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. కోడిగుడ్డు ఒక్కింటికి రూ.4.68 చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే గత నెల 29 నుంచి 31వ తేదీ వరకూ మూడు రోజుల పాటు గుడ్ల సరఫరా నిలిచిపోయింది. దీనిపై ఈ నెల ఒకటో తేదీన ‘గుడ్డు వార్నింగ్’ శీర్షికతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. గుడ్లు కుళ్లి పోతున్నాయని, పగుళ్లు వస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో కోడిగుడ్లను తాము సరఫరా చేయలేమని కాంట్రాక్టరు వెనుకంజ వేసినట్లు సమాచారం. దీంతో ఈ నెల ఒకటో తేదీ నుంచే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలే కోడిగుడ్లను కొనుగోలు చేసి విద్యార్థులకు అందించాలని, నెలాఖరున బిల్లు పెడితే డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ముందుగా కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి పెట్టలేమని స్వచ్ఛంద సంస్థలు, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు ఎంఈవోల ద్వారా అధికారులకు తెలియజేశాయి. దీంతో ప్రభుత్వం ఒక్క రోజులోనే నిర్ణయం మార్చుకుని కోడిగుడ్లను సరఫరా చేసే బాధ్యతను తిరిగి కాంట్రాక్టరుకే అప్పగించింది. అందుకే నిరాకరిస్తున్నారు కాంట్రాక్టరు కోడిగుడ్లను సరఫరా చేసేందుకు నిరాకరించడానికి ప్రధాన కారణం ధర సరిపోకపోవడమే. కోడిగుడ్డు ఒక్కింటికి ప్రభుత్వం రూ.4.68 చెల్లిస్తోంది. మార్కెట్ ధరలో హెచ్చుతగ్గులు రావడంతో ఈ మొత్తం తమకు సరిపోవడంలేదని కాంట్రాక్టరు చెబుతున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం పాత ధరకే కోడిగుడ్లు సరఫరా చేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. గుడ్లు కావాలిలా.. జిల్లాలోని 4,260 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రతి రోజూ సగటున 2.80 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారంలోని ఆరు పని దినాల్లో తప్పనిసరిగా ఐదు రోజులు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన వారానికి 14 లక్షలు, నెలకు సుమారు 56 లక్షల కోడిగుడ్లు జిల్లాలోని పాఠశాలలకు అవసరమవుతాయి. -
అటకెక్కిన సర్కారీ ఫోన్ల సిమ్‌లు
పల్లెల్లో సత్వరమే పశువైద్యం అందించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో పశుపోషకులకు అందుబాటులో ఉండేందుకు పశు వైద్యాధికారులకు ప్రభుత్వం అందజేసిన ఫోన్ల సిమ్‌లు మూలనపడి ఉన్నాయి. సిమ్ల వాడకంలో వైద్యాధికారుల నిర్లక్ష్యంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. - పశుపోషకులకు యాతనలు ఒంగోలు టూటౌన్ : పశువైద్యాధికారులకు సర్కార్ సరఫరా చేసిన ఫోనల సిమ్‌లకు (నెంబర్లు) విలువ లేకుండా పోతోంది. సొంత ఫోన్ నంబర్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. సర్కార్ సరఫరా చేసిన సిమ్‌ను పక్కన పడేశారు కొంతమంది పశువైద్యాధికారులు. నాలుగేళ్ల క్రితం మంజూరు చేసిన ఎయిర్టెల్ సిమ్‌లను పట్టుమని పదిమంది కూడా వాడటం లేదని సమాచారం. పశువులకు తక్షణ వైద్యసదుపాయాలు కల్పిచేందుకు పశువైద్యాధికారులందరూ ఫ్రీగా వాడుకునే ‘ కామన్ యూజర్ గ్రూప్’ ఫోన్ నంబర్ల వాడకంలో పశువైద్యాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే మంజూరు జిల్లాలో పశుపోషకులకు అందుబాటులో ఉంచి పశువులకు సకాలంలో వైద్య సేవలందించాలనే లక్ష్యంతో సర్కార్ కామన్ యూజర్ గ్రూప్ (సీయుజీ)కింద ఎయిర్ టెల్ ఫోన్ సిమ్‌లను పశువైద్యాధికారులకు నాలుగేళ్ల క్రితం మంజూరు చేశారు. కందుకూరు డివిజన్ అధికారులకు 8790997087 ఫోన్ నంబర్ నుంచి 8790997113 ఫోన్ నంబర్ వరకు 40 మందికి సిమ్‌లు ఇవ్వడం జరిగింది. ఇదేవిధంగా మార్కాపురం, ఒంగోలు డివిజన్లలో పనిచేసే పశువైద్యాధికారులకు కూడా మిగిలిన ఫోన్ నంబర్లను సీరియల్ ప్రకారం అందజేశారు. వీరితో పాటు జిల్లాలో మొత్తం 124 మంది పశువైద్యాధికారులకు వీటిని మంజూరు చేశారు. పశుపోషకులకు తెలియని ఫోన్ నంబర్లు జిల్లాలోని 56 మండలాల్లో 1030 గ్రామ పంచాయతీల పరిధిలో మరికొన్ని అదనపు గ్రామాలున్నాయి. గొర్రెలు, మేకలు మొత్తం 18 లక్షల వరకు ఉన్నాయి. వేల సంఖ్యలో పశువులు ఉన్నాయి. దాదాపు లక్ష వరకు పాడి పశువులు ఉన్నాయి. 400 గొర్రెల సొసైటీలు ఉన్నాయి. నూటికి 90 శాతం మంది పశుపోషకులకు, గొర్రెలు, మేకల పెంపకందారులకు ప్రభుత్వం పశువైద్యాధికారులకు సరఫరా చేసిన ఫోన్ నెంబర్ గురించి తెలియని పరిస్థితి జిల్లాలో నెలకొంది. పశువులకు, గొర్రెలు, మేకలకు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే.. పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకమే. చాలా గ్రామాల్లో పశువైద్యాధికారులు వాడుకుంటున్న సొంత ఫోన్ నంబర్లు కూడా పశుపోషకులకు, గొర్రెల, మేకల పెంపకం దారులకు తెలియదు. ఇప్పటికైనా ఆ శాఖ జిల్లా అధికారులు డిపార్ట్మెంట్ సరఫరా చేసిన ఫోన్ నంబర్లు ఎంత మంది వాడుతున్నారో విచారించి గ్రామాల్లో పశుపోషకులు ఆ ఫోన్ నంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువులు పశుపోషకులు, గొర్రెల పెంపకందారులు కోరుతున్నారు.