breaking news
FRDI Bill
-
కొత్త రూపంలో పాత ఎఫ్ఆర్డీఐ బిల్లు
కొన్నేళ్లక్రితం సహకార రంగ బ్యాంకులన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ)బిల్లు కొత్త రూపంలో మళ్లీ రాబోతోంది. ఈ నెల మొదట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టాక విలేకరులతో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎఫ్ఆర్డీఐ బిల్లులో మార్పులు చేర్పులు చేసి కొత్త రూపంలో దాన్ని తీసుకొస్తామని చెప్పారు. అయితే బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతామన్నది ఆమె చెప్పలేదు. 2017లో ఆ బిల్లును చట్టంగా మార్చాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందులో ఉన్న ‘బెయిల్ ఇన్’ అనే పదంపై అందరికీ తీవ్ర అభ్యంతరాలున్నాయి. బ్యాంకు దివాలా తీసే పరిస్థితుల్లో ఆ బ్యాంకులోవున్న డిపాజిట్లలో కొంత భాగంగానీ, మొత్తంగా గానీ డిపాజిట్‌దారునికి తదనంతర కాలంలో ఇవ్వొచ్చునని ఆ క్లాజు చెబుతోంది. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులు, సాధారణ ప్రజలకు చెందిన 68 శాతం డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. నెలనెలా ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో వారు బతుకీడుస్తున్నారు. కనుకనే ఆ బిల్లుపై అంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఫైనాన్స్ సెక్యూరిటీ డెవలప్మెంట్ రిజల్యూషన్(ఎఫ్‌ఎస్‌డీఆర్) పేరిట కొత్త బిల్లుకు రూపకల్పన చేస్తున్నారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు స్వల్ప మార్పులు చేసి, బిల్లు పేరు మార్చి, ‘బెయిల్ ఇన్’ అనే పదం తొలగించి అంతకన్నా ప్రమాదకరమైన అంశాలతో దీన్ని రూపొందించారు. ఇది చట్టమైతే ఫైనాన్స్ సెక్యూరిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్ఎస్డీఏ) పేరిట ఒక నియంత్రణ సంస్థ ఏర్పాటవుతుంది. ఒక ఫైనాన్స్ సంస్థ నష్టాల బారిన పడితే ఆ సంస్థకున్న డిపాజిట్లను వినియోగించి ఆ నష్టాలను పూడ్చివేయడానికి లేదా అదే డిపాజిట్లతో కొత్త వ్యాపార సంస్థను నెలకొల్పడానికి ఆ నియంత్రణ సంస్థకు అధికారం వుంటుంది. డిపాజిట్ల నుంచి కొంత లేదా పూర్తి మొత్తం తీసుకుని ఎప్పుడైనా తిరిగిచ్చే వీలు వుంటుంది. ఈ బిల్లు చట్టమైతే స్వతంత్ర ప్రతిపత్తిగల రిజర్వ్ బ్యాంక్ నిర్వీర్యమవుతుంది. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నియంత్రణ ఆర్బీఐ పరిధి నుంచి అథారిటీకి వెళ్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రస్తుతం బ్యాంకులకు రావాల్సిన రుణాల్లో కార్పొరేట్ సంస్థలు ఎగవేసినవే 86 శాతం వరకూ వున్నాయి. మిగిలిన 14 శాతం వ్యవసాయదారులు, చిన్న పరిశ్రమలవారు తీసుకున్నవే. ఇప్పటికైతే అన్ని బ్యాంకుల నిరర్థక ఆస్తులు(అంటే పారు బాకీలు) 9 శాతం( అంటే రూ. 8 లక్షల కోట్లు) అని చెబుతున్నారు. వచ్చే నెలకు ఈ మొత్తం పది లక్షల కోట్లు ఉండొచ్చునని నిపుణుల అంచనా. బ్యాంకు డిపాజిట్లపై ఇప్పటివరకూ వున్న రూ. లక్ష గ్యారంటీని రూ. 5 లక్షలకు పెంచామని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ ఇప్పుడు రూపొందిస్తున్న బిల్లులోని అంశాలు అందుకు అనుగుణంగా లేవు. డిపాజిట్‌దారునికి ఇందులో వున్న రక్షణ ఏమిటో అర్థంకాని పరిస్థితివుంది. ఈమధ్య టీఎంసీ బ్యాంకు, మరి కొన్ని ఫైనాన్స్ సంస్థలు దివాలా తీసి డిపాజిట్‌దారులకు శఠగోపం పెట్టిన నేపథ్యంలో అందరిలో ఆందోళన నెలకొంది. తాజా బిల్లులో అథారిటీకి విస్తృతమైన అధికారాలున్నాయి. ఈ బిల్లు చట్టమైతే బ్యాంకులకు ఉద్దీపన ప్యాకేజీలు వుండవు. వాస్తవానికి అలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ఈమధ్య బాగా తగ్గిపోయాయి. నష్టజాతక బ్యాంకులకు రూ. 2 లక్షల 11 వేల కోట్లు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఇచ్చింది రూ. 95,000 కోట్లు మాత్రమే. చాలా బ్యాంకులు భారీ నష్టాల్లో నడుస్తున్నాయి. అప్పులు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యలు అమలవుతుంటే ఎవరూ బాకీలు ఎగ్గొట్టడానికి సాహసించరు. కానీ మన దేశంలో ఆ పరిస్థితులున్నాయా? లేవు కాబట్టే పారు బాకీలు వసూలు కావడం అసాధ్యం. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటివారు రుణాలు తీసుకుని, చెల్లించే సమయం వచ్చేసరికి చడీచప్పుడూ లేకుండా విదేశాలకు పరారయ్యారు. గత రెండేళ్లలో కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన బాకీలు భారీయెత్తున రద్దయ్యాయి. ఇలాంటి చర్యలు తీసుకోవాల్సివచ్చినప్పుడు ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వకుండా వుండటానికే తాజా బిల్లుకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే లాభాలు ఆర్జిస్తున్న ఎల్ఐసీ వంటి సంస్థ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇక ఎఫ్ఆర్డీఐ బిల్లు ఏ రూపంలో వచ్చినా పరిస్థితి మరింత అధ్వానమవుతుంది. కనుక ఇలాంటి ఆలోచన మానుకోవడం ఉత్తమం. కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త ఉమ్మడి ఏపీ నీటి సంఘాల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి ఫోన్: 9440204323 -
ఆంధ్రప్రదేశ్‌లో డిపాజిట్లు ఢమాల్!
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లోని డిపాజిట్లు తగ్గిపోతున్నాయి. ప్రజల్లో నెలకొన్న కొన్ని రకాల భయాల కారణంగా బ్యాంకులపై ఖాతాదారుల్లో నమ్మకం సడలుతోంది. గడిచిన మూడు నెలల్లో రాష్ట్రంలో సుమారు రూ.32,000 కోట్ల డిపాజిట్లను ఖాతాదారులు వెనక్కి తీసుకుని ఉండవచ్చునని బ్యాంకు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లు భయానికి తోడు.. వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలతో బ్యాంకులు విశ్వాసాన్ని కోల్పోతున్నట్లు ఆర్థికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు డిపాజిట్లపై వడ్డీరేట్లు రోజురోజుకీ తగ్గిపోతుండడం, అవసరాలకు సొంత డబ్బు తీసుకోవాలన్నా నగదు కొరతతో బ్యాంకులు ఆంక్షలు పెడుతుండటంతో బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదు. ప్రతీరోజు మా బ్యాంకు నుంచి సగటున రూ. 20 లక్షల వరకు విత్‌డ్రాయల్స్ ఉంటాయని, ఇందులో తిరిగి రూ.10 నుంచి 15 లక్షలు డిపాజిట్ల రూపంలో తిరిగి వచ్చేవని, కానీ.. గత రెండు నెలలుగా బ్యాంకు నుంచి డబ్బులు బయటకు వెళ్లడమేగానీ ఒక్క రూపాయి కూడా వెనక్కి రావడంలేదని తూర్పుగోదావరి జిల్లా రాయవరానికి చెందిన ప్రభుత్వరంగ బ్యాంకు అధికారి ఒకరు ప్రస్తుత బ్యాంకుల పరిస్థితిని కళ్లకుకట్టారు. అలాగే, గతంలో ప్రతీ బ్యాంకు శాఖకు సగటున రూ.10 లక్షల వరకు రెండు వేల నోట్లు వచ్చేవని, ఇప్పుడా సంఖ్య రూ.4 లక్షలకు పడిపోయిందని బ్యాంకు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఎఫ్ఆర్డీఐ బిల్లువల్ల డిపాజిట్లకు ఎటువంటి నష్టం ఉండబోదని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో విపరీతంగా జరిగిన వ్యతిరేక ప్రచారంతో ప్రజలు ప్రభుత్వ మాటలను విశ్వసించడంలేదని వారు చెబుతున్నారు. ఈసారి వృద్ధి 3 శాతానికే పరిమితం.. ఇదిలా ఉంటే.. గత మూడేళ్లుగా డిపాజిట్లలో రెండంకెల వృద్ధిరేటు నమోదవుతూ వస్తోంది. పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది 2016–17లో అయితే ఏకంగా 20.43 శాతం వృద్ధి నమోదయ్యింది. ఆ ఏడాది డిపాజిట్లు భారీగా పెరిగి రూ.2,62,556 కోట్లకు పెరిగాయి. కానీ, 2017–18లో డిపాజిట్ల వృద్ధిరేటు మూడు శాతానికి పరిమితమవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా బ్యాంకుల ఆడిట్ పూర్తికాకపోవడంతో అధికారికంగా డిపాజిట్లు సంఖ్య రాలేదని, కానీ.. 8 నెలల సగటును పరిగణనలోకి తీసుకుంటే 3 శాతం వృద్ధితో రూ.2,70,432 కోట్లకు పరమితమవుతుందని అంచనా వేస్తున్నట్లు ఎస్ఎల్బీసీ అధికారులు వివరిస్తున్నారు. ఇదే సమయంలో రుణాలు రూ.2.80 లక్షల కోట్లుకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో డిపాజిట్ల కంటే రుణాల మొత్తం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం క్రెడిట్ డిపాజిట్ (సీడీ) రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా గడిచిన నాలుగేళ్లుగా ఈ నిష్పత్తి సగటున 107 శాతంగా ఉంటోంది. రాష్ట్రంలో డిపాజిట్ల రేట్లు తగ్గిపోవడంతో డిపాజిట్లపై దృష్టి సారించాల్సిందిగా ఆర్బీఐ మొన్నటి సమీక్షలో పేర్కొన్నట్లు ఎస్ఎల్బీసీ అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారీగా డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ను పరిశీలిస్తే.. ♦ పశ్చిమగోదావరి జిల్లాలోని ఎస్బీఐ బ్రాంచీలలో మొత్తం రూ.5,450 కోట్లు డిపాజిట్లు ఉండగా, గత ఆర్ధిక సంవత్సరంలో రూ.150 కోట్ల మేర కొత్త డిపాజిట్లు వచ్చాయి. ఇతర బ్యాంకుల బ్రాంచీలలో మొత్తం రూ.9,700 కోట్లు డిపాజిట్లు ఉండగా, గత ఆర్ధిక సంవత్సరంలో రూ.3,100 కోట్లు కొత్త డిపాజిట్లు వచ్చాయి. విత్‌డ్రాలు విషయానికొస్తే.. ప్రస్తుత మార్చి, ఏప్రిల్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులలో కలిపి మొత్తం రూ.380 కోట్ల డిపాజిట్లు విత్‌డ్రా అయ్యాయి. వీటిలో ఎస్బీఐ నుంచి కేవలం రూ.60 కోట్లు కాగా.. ఇతర అన్ని బ్యాంకుల నుంచి రూ.320 కోట్ల డిపాజిట్లు విత్‌డ్రా అయ్యాయి. ♦ శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.500 కోట్ల మేర డిపాజిట్లను ఖాతాదారులు విత్‌డ్రా చేశారు. కేవలం ఎఫ్ఆర్డీఏ బిల్లుపై ఆందోళన నెలకొనడంతో ఖాతాదారులు తమ డిపాజిట్ల్లను వాపస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, డిపాజిట్లపై సంవత్సరానికి రూ.10 వేలు వడ్డీ ఆదాయ రూపంలో వచ్చిన ఖాతాదారులకు 20 శాతం పన్ను విధించడం కూడా డిపాజిట్లు విత్‌డ్రా చేయడానికి ఒక కారణం. ఈ నాలుగు నెలల్లో డిపాజిట్లు చేసిన మొత్తం రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. ♦ నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం రోజు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు డిపాజిట్లు ఉంటే విత్‌డ్రాయల్స్ రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఉంటున్నాయి. ముఖ్యంగా నెలన్నరగా బ్యాంకుల నుంచి ఏటీఎంల నుంచి విత్‌డ్రా అయిన రూ.2 వేల నోట్లు మళ్లీ బ్యాంకులకు తిరిగి రావటం లేదు. ముఖ్యంగా గడిచిన మూడు నెలల్లో బ్యాంకుల్లో డిపాజిట్లు పూర్తిగా తగ్గిపోయాయి. విత్‌డ్రాయల్స్ భారీగా పెరిగాయి. ♦ గుంటూరు జిల్లాలో ఎఫ్ఆర్బీఐ బిల్లు భయంతో ఖాతాదారులు ఫిక్స్డ్ డిపాజిట్లను వెనక్కు తీసేసుకుంటున్నారు. 2017 అక్టోబరు నాటికి జిల్లాలోని బ్యాంకుల్లో రూ.25,325 కోట్ల డిపాజిట్లు ఉండేవి. ప్రతి ఏడాది బ్యాంకుల్లో 15–17 శాతం డిపాజిట్లు పెరిగేవి. ఎఫ్ఆర్బీఐ బిల్లు భయంతో 10 శాతం మేర డిపాజిట్లు వెనక్కు తీసుకున్నారు. దీంతో డిపాజిట్ల వృద్ధి రేటు తగ్గిపోయింది. ♦ తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. గతేడాది సెప్టెంబర్ వరకు రూ. 24,600 కోట్ల మేర డిపాజిట్లు జరగ్గా అది డిసెంబర్ నాటికి అది రూ. 25,500కోట్లకు చేరిందని, ఇప్పుడది రూ.26వేల కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. నగదు కొరతకు డిపాజిట్లు కారణం కాదని లీడ్ బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం చెప్పారు. ♦ కర్నూలు జిల్లాలో 2017 మార్చి 31 నాటికి జిల్లాలో ఉన్న డిపాజిట్లు రూ.15,273 కోట్లు. ఇదే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఆ డిపాజిట్లు రూ.14,723కు తగ్గిపోయాయి. అంటే.. రూ.550కోట్ల రూపాయల డిపాజిట్లను ఖాతాదారులు వాపస్ తీసుకున్నారు. ♦ వైఎస్సార్ జిల్లాలో గత మూడు నెలల్లో విత్‌డ్రాల సంఖ్య పెరుగుతుండగా.. డిపాజిట్లు చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. విత్‌డ్రాల రూపంలో మూడు నెలల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రజలు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోగా.. కేవలం రూ.25 కోట్లు మాత్రమే బ్యాంకులకు డిపాజిట్లు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రవేశపెడుతుందనే వార్తలతో ఈ పరిస్థితి నెలకొంది. ♦ విజయనగరం జిల్లాలో.. గత ఏడాది డిసెంబర్ నాటికి ముగిసిన ఆరు మాసాల్లో తొలి మూడు మాసాలకు రూ.7,956 కోట్ల మేరకు డిపాజిట్లు రాగా.. చివరి మూడు మాసాలలో రూ.300 కోట్ల వరకు తగ్గి కేవలం రూ.7,656 కోట్లు మాత్రమే డిపాజిట్లు లభించాయి. తగ్గిన రూ.300 కోట్ల డిపాజిట్లలో కనీసం 50 శాతం విత్‌డ్రాలే ఉంటాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. -
ఎఫ్ఆర్డీఐ బిల్లు 2017