breaking news
forest Telangana Academy
-
ఫారెస్ట్రీ విద్యకు ఉజ్వల భవిష్యత్తు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ఫారెస్ట్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడ్డాయి. అటవీ శాఖలో ఉద్యోగాలకు ఇక్కడ ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారికి ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించడంతో ఇదివరకు ఇక్కడ చదువుకున్నవారు, ప్రస్తుతం కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడవులు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న క్రమంలో అటవీ నిర్వహణను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రత్యేక విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో అటవీ కళాశాల, పరిశోధన సంస్థను ప్రారంభించింది. తొలుత సొంత భవనం లేకపోవడంతో హైదరాబాద్‌లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో సంస్థను ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట జిల్లా ములుగు సమీపంలో 52 హెక్టార్ల విస్తీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించారు. 2019 నుంచి ములుగులోని నూతన భవనంలో తరగతులు ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు.. ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారికి అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎఫ్ఆర్ఓ (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్) ఉద్యోగానికి 50 శాతం, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) ఉద్యోగానికి 25 శాతం, ఫారెస్టర్స్ ఉద్యోగాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన వారిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంతో ఈ కోర్సుకు మరింత డిమాండ్ పెరగనుంది. బీఎస్సీ ఫారెస్ట్రీ.. నాలుగేళ్ల కోర్సు ములుగు కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ నాలుగేళ్లు, ఎంఎస్సీ ఫారెస్ట్రీ రెండేళ్ల కోర్సులు కొనసాగుతున్నాయి. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు తొలి రెండు సంవత్సరాలు ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించారు. 2018 నుంచి ఎంసెట్ (బీపీసీ)లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లలో 97 మంది విద్యార్థులు నాలుగేళ్ల కోర్సును పూర్తి చేయగా మరో 214 మంది విద్యార్థులు ఈ కోర్సును అభ్యసిస్తున్నారు. 2020లో ఎంఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును ప్రారంభించారు. ఏఐఈఈఏ ఎంట్రెన్స్ ఉత్తీర్ణులు అయిన వారు ఎంఎస్సీ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంఎస్సీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ఈ సంవత్సరం విద్య పూర్తికానుంది. ఇందులో ఒక్కో సంవత్సరం 17 మందికి అడ్మిషన్ ఇస్తున్నారు, ఇప్పటి వరకు 34 మందికి ప్రవేశాలు కల్పించారు. -
అడవుల రక్షణపై అవగాహన
► అడవుల రక్షణపై అవగాహన ► కడెంలో ఎఫ్‌ఎస్‌వోల బృందం కడెం : శిక్షణ అంటేనే మనకు తెలియని కొత్త విషయాలు, కొత్త అంశాలపై అవగాహన చేసుకోవడం. అయితే ఈ శిక్షణ కోసం హైదరాబాదు, దూలపల్లికి చెందిన తెలంగాణ ఫారెస్టు అకాడమీ నుంచి 48 మంది ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు(ఎఫ్‌ఎస్‌ఓలు) శుక్రవారం నిర్మల్ జిల్లాలోని కడెంకు వచ్చారు. కడెం అటవీ క్షేత్ర పరిధిలోని గంగాపూర్, పాండ్వాపూర్ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో శిక్షణ బృందం డిప్యూటీ డెరైక్టర్ కొండల్రావు, కడెం ఎఫ్ఆర్వో రాథోడ్ రమేష్‌లు వివిధ అంశాలపై బృందం సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రాజెక్టు చివరన ఉన్న మైసమ్మ గుట్ట ద్వారా అడవుల్లోకి ప్రవేశించి గంగాపూర్ అటవీ సెక్షన్లోకి వెళ్లారు. అక్కడ చెక్‌డ్యాంలు, నీటికుంటలు, కందకాలు, వాచ్‌టవర్, సాసర్‌పిట్స్, మొక్కల శాస్త్రీయ నామం,వాటి ఎదుగుదల గురించి అధికారులు వివరించారు. టైగర్ జోన్లో జంతువుల సంరక్షణ, వాటి కదలికలపై వివరిస్తున్నారు. శాఖ పరంగా అవగాహన కలిగి ఉన్న గంగాపూర్ ఎఫ్ఎస్వో నజీర్‌ఖాన్ శిక్షణ బృందానికి పలు అంశాలపై సమగ్రంగా బోధించారు. కడెం ఎఫ్ఆర్వో రాథోడ్ రమేష్, ఎఫ్‌బీలు ఏ ప్రభాకర్, శ్రీనివాస్, కీర్తి రెడ్డిలు ఈ శిక్షణ బృందం వెంట ఉన్నారు. బృందంలో 38 మంది పురుషులు కాగా 10 మంది మహిళలున్నారు. అక్టోబరు 5న ప్రారంభమైన శిక్షణ డిశంబర్ 8న పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఇప్పటివరకు మెదక్ డివిజన్లోని సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి, నిర్మల్, కుంటాల, పొచ్చెర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. ఈ నెల 26న జన్నారం, 27న మంచిర్యాల, 28న భూపాలపల్లి, 29న భద్రాద్రి, 30న చింతూరు(ఏపీ), డిశంబర్1న పాడేరు, 2న అరకు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు అధికారులు వివరించారు. త మ శిక్షణ గురించి కడెంలో ‘సాక్షి’ తో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు. ధైర్యంగా ఉంటోంది నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఉద్యోగం అన్నాక శ్రమ ఉంటుంది. కానీ ఏనాడు నేను మహిళను.. ఈ ఉద్యోగం ఎలా చేయాలి.. అని ఆలోచించలేదు. అడవిలో పెట్రోలింగ్ చెయ్యాలి. బాధ్యత అన్నాక తప్పదు. ధైర్యం అంటే యూనిఫాంలోనే ఉంటుందనేది నా విశ్వాసం. అదే రక్షణ ఇస్తోంది . సి. సుప్రియ, ఎఫ్ఎస్వో, హైదరాబాద్ రోజూ కొత్త పాఠంలాగా.. శిక్షణలో చాలా విషయాలు తెలుస్తున్నాయి, అటవీ చట్టం, సెక్షన్లు ఇంకా అనేక విషయాలపై అవగాహన వస్తోంది. రోజూ కొత్త పాఠం నేర్చుకున్నట్లుగా ఉంది. మా ప్రాంతంలో అడవి ఉంది కానీ ఈ ప్రాంతంలో మరీ దట్టమైన అడవులున్నాయి. అధికారులు శిక్షణలో అన్నీ బాగా వివరిస్తున్నారు. - సీహెచ్ స్వర్ణలత, ఎఫ్ఎస్వో, పాల్వంచ ఎన్నో మెళ కువలు తెలుస్తున్నాయి నాకు శాఖాపరంగా, అటవీ చట్టం తదితర అంశాలపై మొదట కొంత అవగాహన ఉన్నప్పటికీ ఇపుడు శిక్షణలో మరిన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి, శిక్షణ ద్వారా కొత్త అనుభవాలు, మొక్కలపై అవగాహన చాలా పెరుగుతుంది. మా అనుమానాలను కూడా అధికార్లను అడిగి నివృత్తి చేస్కుంటున్నాం. - ఏ రవీందర్ ఎఫ్ఎస్వో, కడెం పకడ్బందీగా శిక్షణ ఈ బృందాన్ని ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వివిధ అంశాలపై అవగాహన కల్పించాం. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని టైగర్‌జోన్‌లో వివిధ ప్రాంతాలకు వెళ్లాం. టైగర్ సెన్సెస్, ఇక్కడి డీర్స్ పార్కు, దట్టమైన అడవులు, బేస్ క్యాంపులు, తదితర ప్రాంతాలపై అవగాహన కల్పిస్తాం. శిక్షణ పూర్తిగా పకడ్బందీగా నిర్వహిస్తాం. శిక్షణ వచ్చే నెలలో ముగుస్తుంది. - కొండల్రావ్, శిక్షణ బృందండిప్యూటీ డెరైక్టర్, దూలపల్లి