Female travelers
-
రైల్.. రైట్స్
మహిళలు ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తున్నట్టయితే ఈ రైల్వే యాక్ట్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! ద రైల్వే యాక్ట్ 1989, సెక్షన్ 139 ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా ఆందోళన చెందక్కర్లేదు. టికెట్ లేదని రైల్లోంచి దింపే అధికారం టీటీఈకి లేదు. ఫైన్ కట్టి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేకపోయినా భయపడక్కర్లేదు. లేడీ కానిస్టేబుల్ లేకుండా రైలు దింపడానికి వీల్లేదు.సెక్షన్ 311 ప్రకారం ఎట్టిపరిస్థితుల్లో మహిళల కంపార్ట్మెంట్లోకి మిలటరీ సహా పురుషులెవరూ ఎక్కడానికి వీల్లేదు. ఎక్కితే వారు శిక్షార్హులు. సెక్షన్ 162 ప్రకారం.. పన్నెండేళ్ల లోపు మగపిల్లలు మాత్రం తల్లి, సోదరి, అమ్మమ్మ, నానమ్మ లాంటి వాళ్లతో కలసి మహిళల కంపార్ట్మెంట్లో ప్రయాణించవచ్చు. అలాగే ప్రతి స్లీపర్ (మెయిల్, ఎక్స్‌ప్రెస్) క్లాస్‌లో, గరీబ్‌రథ్, రాజధాని, దురంతో లాంటి రైళ్లు లేదా మొత్తం ఎయిర్ కండిషన్డ్ రైళ్లలోని థర్డ్ ఏసీ (3 ఏసీ)లో మహిళలకు 6 బర్త్‌లు రిజర్వ్ అయి ఉంటాయి. గ్రూప్‌గా ప్రయాణిస్తున్న మహిళలూ వీటిని వినియోగించుకోవచ్చు. రైలు ఎక్కినప్పటి నుంచి గమ్యానికి చేరేవరకు మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘మేరీ సహేలీ’ యాప్‌నూ లాంచ్ చేశారు. అంతేకాదు రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమేరాలు, మానిటరింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రైల్వే హెల్ప్‌లైన్ 139 ఉండనే ఉంది. -
పింక్ టికెట్
‘స్త్రీ సాధికారత’ అనే మాట అర్థమైనట్లే ఉంటుంది కానీ, అర్థమేంటని అడిగితే మాత్రం సరిగ్గా అర్థమయ్యేలా చెప్పలేం. దేన్నైనా సాధించుకునే అధికారం సాధికారత. అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు, సొంతకాళ్లపై నిలబడే హక్కు, నలుగుర్ని పోషించే హక్కు... ఇవన్నీ కలిస్తే సాధికారత. స్త్రీ సాధికారత అంటే స్త్రీకి ఈ హక్కులన్నీ ఉండటం. స్త్రీ సాధికారతకు విద్య ఉండాలి. ఉద్యోగం లేదా ఉపాధి ఉండాలి. ఇవి సాధించడానికి ‘మొబిలిటీ’ ఉండాలి. మొబిలిటీ అంటే కదిలే వెసులుబాటు. ఇంటి నుంచి బయటికి స్వేచ్ఛగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా వెళ్లొచ్చే సదుపాయం ఉన్నట్లయితే.. అన్ని అర్హతలుండీ కేవలం కదిలే అవకాశాల్లేక గృహిణులుగా మాత్రమే ఉండిపోయిన ఎందరో మహిళలకు ‘మొబిలిటీ’ వస్తుంది. ప్రయాణ ఖర్చులను భరించలేక, ప్రయాణంలో భద్రత లేక ఇంటి చుట్టుపక్కల ఉండే స్కూళ్లు, కాలేజీలతో సరిపెట్టుకునే అవసరం ఉండదు. మంచి స్కూల్లో సీటోస్తే వెళ్లి చేరిపోతారు. మంచి ఆఫీస్‌లో ఆఫర్ వస్తే చాలీచాలని జీతంతో పాత ఉద్యోగాన్నే పట్టుకుని వేళ్లాడే పని ఉండదు. మొబిలిటీలో సాధికారత వచ్చేస్తుంది. లేదా సాధికారతకు దారి పడుతుంది. మంగళవారం నుంచి ఢిల్లీ సిటీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, వారి భద్రత కోసం అన్ని బస్సులలో కలిపి సుమారు 13 వేల మంది మార్షల్స్‌ను నియమించారు! ఈ సంఖ్య గతంలో 3,400 మాత్రమే ఉండేది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (డీటీసీ) ప్రస్తుతం 3,700 బస్సులను నడుపుతోంది.ప్రైవేటుగా మరో 1800 బస్సులను (క్లస్టర్ బస్సులు) నడుపుతోంది. వీటన్నిటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణమే. సిటీ బస్సెక్కగానే కండక్టరే వచ్చి టికెట్ ఇస్తాడు. డబ్బులు తీసుకోడు. మహిళలకు మాత్రమే ఇచ్చే ఆ టికెట్ లేత గులాబీ రంగులో ఉంటుంది. మహిళలకు ఈ సదుపాయాన్ని కల్పించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్టోబర్ 29న అన్నాచెల్లెళ్ల పండగైన ‘భాయ్ దూజ్’ (సోదరుని ఆశీస్సులు) రోజును ఎంచుకున్నారు. కేవలం సిటీ బస్సులకే కాకుండా, నోయిడా–ఎన్‌సిఆర్ (నేషనల్ రీజినల్ క్యాపిటల్) సర్వీసులు, విమానాశ్రయానికి, ఇతర ప్రత్యేక స్థలాలకు డీటీసీ నడిపే బస్సులకు కూడా ఈ ఉచితం వర్తిస్తుంది. బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులకు పది రూపాయల టిక్కెట్ ఇస్తారు. ఆ టికెట్‌తో ఆ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కినప్పుడు అందులోనూ పది రూపాయల టిక్కెట్ ఇస్తారు. అలా మహిళలు ఢిల్లీ అంతా ప్రయాణించవచ్చు. -
భద్రతకు భరోసా లేని ప్రయాణం!
- రైళ్లలో తూతూ మంత్రంగా గస్తీ - మహిళా ప్రయాణికులకు భద్రత కరువు - అవగాహన లేక అక్కరకురాని టోల్‌ఫ్రీ నంబర్లు సాక్షి, హైదరాబాద్: రైళ్లు, రైల్వే స్టేషన్లు పోకిరీలకు అడ్డాగా మారాయి. ప్రయాణికుల భద్రత గాల్లో దీపమయింది. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు ప్రవేశపెట్టిన టోల్‌ఫ్రీ నంబర్, మొబైల్ అప్లికేషన్లపై అవగాహన కరువై ప్రయోజనం లేకుండా పోతున్నాయి. ఇటీవల మిలీనియం, చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ల్లో వరుసగా చోటుచేసుకున్న సంఘటనలు మహిళా ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై నుంచి విజయవాడ వెళుతున్న ముగ్గురు మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పోకిరీలు వేధించిన సంఘటన ఇటీవల సంచలనం సృష్టించింది. పోకిరీల వేధింపులు భరించలేక ఆ ముగ్గురిలో ఒక మహిళ సింగరాయకొండ స్టేషన్ వద్ద రైల్లో నుంచి దూకి గాయాలపాలైంది. పోకిరీల బారి నుంచి రక్షణ కోసం వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫల మయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్, మొబైల్ యాప్‌లపై అవగాహన లేకపోవ డంతో అవి అక్కరకు రాలేదు. మరో ఘటనలో... చెన్నై నుంచి కాచిగూడకు వచ్చిన ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని కొందరు మహిళల మంగళసూత్రాలు అపహరణకు గురయ్యాయి. పట్టపగలే ఇలాంటి అకృత్యాలు జరగడం మహిళా ప్రయాణికులకు రైల్లో ఎంత భద్రత ఉందో అర్థమవుతోంది. ఈ రెండు ఘటనల్లోనూ ఆర్పీఎఫ్ సిబ్బంది నేరస్తులను పట్టుకున్నప్పటికీ.. ముందస్తు భద్రత మాత్రం లేకుండాపోయింది. అటకెక్కిన ‘రిస్తా’... రిస్తా (రైల్వే ఇంటరాక్టివ్ సెక్యూరిటీ సొల్యూషన్ ఫర్ ట్రావెలర్స్ అసిస్టెన్స్) యాప్‌ను ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టారు. ఈ యాప్‌లో ‘హెల్ప్’బటన్ నొక్కి, తమ ఫిర్యాదు వివరాలు ఎస్సెమ్మెస్ చేస్తే.. సికింద్రాబాద్‌లోని ఆర్పీఎఫ్ కంట్రోలింగ్ కేంద్రం తగిన భద్రతా చర్యలను చేపడుతుంది. నిర్భయ ఉదంతం నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ యాప్ మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. 182 నంబర్ అందుబాటులోకి రావడంతో ప్రారంభించిన ఏడాది లోపే ఈ యాప్‌ను నిలిపివేశారు. సదుపాయాలున్నా... ప్రయాణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, భద్రతాపరమైన అంశాలపై ఫిర్యాదు కోసం మరో టోల్‌ఫ్రీ నంబర్ కూడా రైల్వే తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తున్న ఈ టోల్‌ఫ్రీ నంబర్ 8121281212కు ప్రయాణికులు ఎస్సెమ్మెస్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు. వైద్యం, ఆహారం, బోగీ పరిశుభ్రతకు సంబంధించి 138 నంబర్ అందు బాటులో ఉంది. వీటి గురించి అతి కొద్ది మందికే అవగాహన ఉంది. సింగరాయ కొండ వద్ద మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో నుంచి దూకిన మహిళ ఉదంతంలోనూ ఈ నంబర్లపై అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమని ఆర్పీఎఫ్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రైల్లో వారు 182కు కాకుండా 100కు డయల్ చేశారు. దీంతో సరైన స్పందన లభించలేదు. రాత్రి వేళల్లోనే గస్తీ... హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి రోజూ సుమారు 150 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 100కు పైగా ప్యాసింజర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాకుండా 121 ఎంఎంటీఎస్ సర్వీసులు సిటీలో అందుబాటులో ఉన్నాయి. రోజుకు 3.5 లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ రైళ్లలో సగానికి పైగా పగటిపూట బయలుదేరేవే. కానీ రైల్వే భద్రతా వ్యవస్థ ఎక్కువ శాతం రాత్రి వేళలకే పరిమితమైంది. పగటిపూట భద్రతా సిబ్బంది రైల్వేస్టేషన్లకే పరిమితమవుతోంది. దీంతో పోకిరీలు, దొంగలు, అసాంఘిక శక్తులు పగటిపూట రైళ్లలో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు మచ్చుకైనా కనిపించడంలేదు. ఇక 2015లో మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ 182 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే... సమీపంలోని డివిజినల్ కార్యాలయం వెంటనే ఆర్పీఎఫ్ను అప్రమత్తం చేస్తుంది. అయితే దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో ఈ సేవలు అధిక శాతం మంది ప్రయాణికులు ఉపయోగించుకోలేకపోతున్నారు.