టికెట్ ఇవ్వకపోతే తెగదెంపులే
- చంద్రబాబుకు ఫరూక్ వర్గం అల్టిమేటం
నంద్యాల: తెలుగు దేశం పార్టీకి తెగదెంపులు చేసుకోవడానికి ఫరూక్ వర్గం సిద్ధమైంది. మాజీ మండలాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి అధ్యక్షత మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పోలూరు గ్రామ సమీపంలోని ఓ కాలేజీలో ఆదివారం సమావేశంపై అసంతృప్తిని వెళ్లగక్కారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న ఫరూక్ వర్గంలోని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రణవానందరెడ్డి, పార్టీ నేతలు మాజీ సర్పంచ్‌లు గుంటుపల్లి వెంకటేశ్వర్లు, తూమువిశ్వనాథరెడ్డి, మిద్దె సుబ్బరాయుడు, గోపాల్‌రెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, లక్ష్మిరెడ్డి, పీడీహుసేన్, నీటి సంఘం ఎస్సార్బీసీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు స్వామినాయక్, టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ సహాయ కార్యదర్శి మహ్మద్అయూబ్, మదార్సా, బాలమద్దిలేటి, తూము ప్రసాదరెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, అమరనాథరెడ్డి, విశ్వనాథరెడ్డిలతో పాటు 20 గ్రామాలకు చెందిన పార్టీ అసంతృప్తి నేతలు పాల్గొన్నారు. వీరంతా దాదాపు గంటన్నరసేపు చర్చించుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఫరూక్ టికెట్ ఇవ్వాలని, లేకపోతే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని మాజీ ఎంపీపీ వెంకటరామిరెడ్డి, ప్రణవానందరెడ్డి, విశ్వనాథరెడ్డి, ప్రసాదరెడ్డి, తదితరులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అల్టిమేటం ఇస్తున్నామని ప్రకటించారు. ఉప ఎన్నికలో పార్టీ టికెట్‌ను మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డికి ఇస్తే, పార్టీని వీడుతామని హెచ్చరించారు.
ఫరూక్ వర్గంపై ఫిర్యాదు:
పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఫరూక్ వర్గీయులు అల్టిమేటం ఇవ్వడంపై పార్టీ అ«ధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ వ్యవహారాలు, అసంతృప్తిని అంతర్గంతంగా చర్చించుకోకుండా, కాని పార్టీ అధ్యక్షుడికే అల్టిమేటం ఇస్తూ మీడియాలో ప్రకటనలు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘించినట్లేనని కొందరు పార్టీ జిల్లా అధ్యక్షుడు చక్రపాణిరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్లినట్లు సమాచారం. మాజీ మంత్రి ఫరూక్ రెండురోజుల క్రితం సోదరి అంత్యక్రియల్లో పాల్గొనడానికి బళ్లారి వెళ్లారు. ఆయన తిరిగిరాగానే అసంతృప్తిపై స్పందించే అవకాశం ఉంది.