breaking news
exhibition of paintings
-
ఆర్ట్@సోల్
మంచు పర్వతాల వెండి వెలుగులు... వాటి మధ్య సరిగంగలు... పొద్దు పొడుస్తున్నా నెలవంక సొగసులు... దానికి విహరించే విహంగాల హంగులు... కనులను తాకిన ప్రతి దృశ్యం చిత్రరంజితమై విరాజిల్లుతోంది. అరవై ఏడేళ్ల వయసులో వేల అడుగుల ఎత్తుకు వెళ్లి చూసిన అపురూపాలెన్నో శ్రీకాంత్ సోమని లెన్స్‌లో ప్రాణం పోసుకున్నాయి. సిరామిక్ కంపెనీ చైర్మన్‌గా నలభై ఐదేళ్ల వ్యాపార అనుభవం. కానీ... నగరాల్లో కన్నా పల్లెల్లో నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్న శ్రీకాంత్ చిత్రాల ఎగ్జిబిషన్... ‘హిమాలయాస్: ల్యాండ్ స్కేప్ ఫర్ ది సోల్’ ఆకట్టుకుంటోంది. బంజారాహిల్స్ కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన ఆయనతో ‘సిటీ ప్లస్’ ముచ్చటించింది. ఈ జర్నీ ఒక్క రోజులో చేసింది కాదు. పుష్కర కాలం పాటు సాగిన ప్రయాణంలో మరపురాని జ్ఞాపకాలు, మధురమైన అనుభవాలను ఇలా భద్రపరిచాను. లడక్, భూటాన్, నేపాల్... ఇలా 18,900 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల పైకి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి తీసిన ఫొటోలు కూడా ఉన్నాయి. నేను చూస్తున్న దానిని ఫొటో ద్వారా అందరికీ చూపడం, ఆ క్షణంలో నేను పొందిన అనుభవాన్ని భద్రంగా అందించడం, ఒకరి ముఖంలో కనిపించిన హావభావాలను ఫొటోలో చూపగలగడం... ఇదే పోట్రెయిట్. చూసేవారికి నా అనుభవాన్ని నేరుగా పంచడమే ఫొటో. ఇక్కడ ప్రదర్శనకు పెట్టినవి అలాంటి చిత్రాలే. జర్నీ ఇలా: బద్రీనాథ్ వెళుతున్నప్పుడు మా నాన్నని కెమెరా కొనమని అడిగా. అందుకు ఆయన ‘ఎవరిదైనా కెమెరా అడిగి మంచి ఫొటోలు తీసుకురా... చూస్తా’ అన్నారు. అలా సొంత కెమెరా లేకుండానే ఫొటోగ్రఫీ మొదలుపెట్టాను. ఆ తరువాత చాలా ఏళ్లు ట్రిప్పులు, చిన్న పిల్లలు... ఇలా నా ఫొటోలు ఇంటికే పరిమితమయ్యాయి. అంతకంతకూ ఆసక్తి పెరిగింది కానీ తగ్గలేదు. పదేళ్ల క్రితం టిబెట్‌కు వెళుతున్నప్పుడు... కాస్త బేసిక్స్ నేర్చుకోవడం అవసరమనిపించింది. వారంపాటు నేర్చుకున్నా. బేసిక్ కెమెరా నుంచి ఏడాదిలో ప్రొఫెషనల్ కెమెరా వాడటం వరకు వెళ్లా. మెమరబుల్: ఎత్తయిన పర్వతాల మధ్య ఒంటరిగా నిలుచున్నప్పుడు మనమెంత చిన్నవాళ్లమో అనిపిస్తుంది. అంత ఎత్తులో ఉన్నా, ఎంతలా నిగర్వంగా ఒదిగి ఉన్నాయో అనే ఫీలింగ్. ఇలాంటి అనుభవం ప్రకృతి నుంచి నేర్చుకొనే అవకాశం, అనుభూతిని ఫొటోగ్రఫీ ద్వారా పంచే ప్రయత్నం ఇది. ‘మౌంటేన్ అండ్ పీపుల్’... ఈ రెండింటిలో పర్వతాల్లో ఉండే స్వచ్ఛమైన మనుషులు నా జ్ఞాపకాల్లో ఎప్పుడూ కదలాడుతూనే ఉంటారు. వారి స్వభావం, మంచితనం, నిజాయతీ... మళ్లీ పర్వతాల వైపునకు నడిపిస్తుంటుంది. నగరాల్లో ఉంటూ మనమేదో సాధించేస్తున్నామని, గొప్పవాళ్లమనీ ఫీలింగ్. కానీ అందులో వాస్తవం లేదు. లాహోర్‌కు వెళ్లినప్పుడు ఓ చిన్న పల్లెటూరులో వాళ్ల మామయ్య వద్ద ఉంటున్న ఓ అమ్మాయిని కలిశా. ఆయన వైద్యుడు. నేను మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు... ఆయన చేసే మందుల తయారీ గురించి వివరించమని మీ మామయ్యను ఒప్పిస్తావా అని ఆ అమ్మాయిని అడిగా. తను ఏం మాట్లాడలేదు. నన్ను నమ్మినట్టు అనిపించలేదు. ఆరు నెలల తరువాత అక్కడికి మళ్లీ వెళ్లా. అప్పటికే ఆ పేద పిల్ల మా కోసం రూమ్‌లు అరేంజ్ చేసింది. అక్కడ మాటన్నా, మనుషులన్నా అంత నమ్మకం, గౌరవం. ఇలాంటి సంఘటనల వల్ల ప్రపంచంలో పెద్ద మార్పేమీ రాదు... కానీ, కొన్ని అపోహలపై అవగాహన పెరుగుతుంది. ప్యాషన్ మాత్రమే: ఫొటోగ్రఫీ నాకు ప్రొఫెషనలిజమ్ కాదు. దానిపై నాకున్న ప్రేమ మాత్రమే. హిమాలయాల వైవిధ్యం, శోభ కళ్లకు కట్టడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. మనం టైమ్‌కు బానిస కాకూడదు. మన కోసం మనం సమయం కేటాయించుకోలేక పోతే... ఓడిపోయినట్టే. ఏడాదిలో రెండు నెలలు నా కోసం బతుకుతాను. దిల్లీలో ఉంటున్నా హైదరాబాద్‌తో పన్నెండేళ్ల అనుబంధం నాది. జీవితం, వ్యాపారాన్ని గొప్పగా మలుచుకోవడానికి అవకాశం ఇచ్చిన నగరం ఇది. నగరంలో ఎంతో మంచి మిత్రులున్నారు. ఓ మధు -
అలనాటి చిత్రం
భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రముఖ ఆర్టిస్ట్ కొండపల్లి శేషగిరిరావు పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ కళాభిమానుల మనసు దోచుకుంది. ప్రతి చిత్రం వర్ణరంజితమై ఆకట్టుకుంది. రవీంద్రభారతిలోని ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో మంగళవారం నిర్వహించిన ఈ ప్రదర్శనలోని పెయింటింగ్స్‌ను మంత్రి చందూలాల్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శేషగిరిరావు పేరిట నగరంలో చిత్రకళా ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తాం. కాపు రాజయ్య, శేషగిరిరావు, పీటీ రెడ్డిల పేరు మీద ఏటా ఉత్తమ చిత్రకారులకు రూ.లక్ష నగదు పురస్కారం అందిస్తాం. అలాగే కొండపల్లి జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది’ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య, భాషాసాంస్కృతిక శాఖ డెరైక్టర్ ఎం.హరికృష్ణ తదితరులు శేషగిరిరావు ప్రతిభను కీర్తించారు. శేషగిరిరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాక్షి, సిటీప్లస్ -
సామాజిక చిత్రం
అదో పల్లెటూరు. అంతా గోలగోలగా ఉంది. ఏంటని చూస్తే... అక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి. రెండు పుంజులు హోరాహోరీగా పోటీపడుతున్న దృశ్యం మదిలో ముద్రితమైంది. అదే కాన్వాస్‌పై ఓ చక్కని చిత్రంగా మారింది. ఇలాంటివెన్నో జీవన చిత్రాలు ప్రముఖ చిత్రకారుడు దేబబ్రతా బిశ్వాస్ కుంచెతో రంగులద్దుకున్నాయి. జూబ్లీహిల్స్ బియాండ్ కాఫీలో తన అపురూప పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేసిన సందర్భంగా బిస్వాస్‌ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది... ఆర్ట్ అంటే ప్రాణం. మధ్య తరగతి కుటుంబం. అమ్మానాన్నలతో వాళ్ల సొంత గ్రామాలకు వెళుతుండేవాడిని. అలా పల్లెటూరు జీవనాన్ని దగ్గరి నుంచి చూశా. పంట పొలాలు, కల్మషం లేని మనుషులు, ఆహ్లాదకరమైన వాతావరణం... ఆ గ్రామాలంటే నాకెంతో ఇష్టం. మాది జంషెడ్పూర్. ఇంటర్ వరకు అక్కడే చదివా. పాఠశాల స్థాయి నుంచే జంతువులు, ప్రకృతి బొమ్ములు వేస్తుండే వాడిని. నా ప్రతిభ గుర్తించి పేరెంట్స్ ప్రోత్సహించారు. ఎక్కడ పెయింటింగ్ పోటీలు జరిగినా తీసుకెళ్లేవారు. వారి ప్రశంసలే నా కుంచెకు మరింత పదును పెట్టాయి. లెక్కలేనన్ని బహుమతులు తెచ్చి పెట్టాయి. ఇదే జోష్‌తో జంషెడ్పూర్ ఠాగూర్ సొసైటీలో ఆర్ట్స్‌లో డిప్లమో చేశా. కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజిక్ బోర్డు నుంచి బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ చేశా. పీజీ పూర్తయ్యేసరికి నేను ఎంచుకున్న కళలో లోతు చూశా. ఈ సమయంలోనే కళాకారులకు అరుదుగా లభించే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్కాలర్షిప్కు ఎంపికయ్యా. నా చిత్రాలతో వ్యక్తిగత ప్రదర్శనలు చెయ్యడం సొంతూరు (1997)లోనే మొదలైంది. ఇప్పటివరకు పదులకు పైగా వివిధ నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహించా. నా ఆర్ట్‌కు సబ్జెక్ట్ మాత్రం నా పరిసరాల్లో జరిగే అంశాలే. ప్రకృతి, జీవన గమనం వంటివి ప్రతి బొమ్మలో ప్రతిబింబిస్తాయి. సమాజాన్ని ప్రభావితం చేయగలిగి, ఉపయోగపడేదే నిజమైన కళ. మాయమవుతున్న పచ్చని పైర్లు, విచ్ఛిన్నమవుతున్న సంస్కృతి, పోటెత్తుతున్న కాలుష్యం... ఇలా సామాజిక, ప్రకృతి చిత్రాలే నావి. అక్రాలిక్, ఆయిల్, వాటర్ కలర్సతో బొమ్మలు వేస్తా. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం ఈ సిటీకి వచ్చిన నన్ను... మంచి ఆర్టిస్టుగా ఆదరించింది. భవిష్యత్‌లోనూ ఈ మహానగరంతో బంధం కొనసాగిస్తా. ...::: వీఎస్