breaking news
environmental ministry
-
పాపం గజరాజులు! విద్యుత్ షాక్‌లు, రైలు ప్రమాదాలు, విష ప్రయోగాలు..
సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల అసహజ మరణాలు ఇటీవలకాలంలో పెరిగిపోతున్నాయి. రైలు ప్రమాదాలు, విద్యుత్ షాక్, వేటాడటం, విషప్రయోగం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 494 ఏనుగులు మృత్యువాతపడినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యుదాఘాతం కారణంగా 2017–18 నుంచి 2021–22 వరకు అత్యధికంగా 340 ఏనుగులు మృతిచెందినట్లు తెలిపింది. ఆ తర్వాత రైలు ప్రమాదాలబారిన పడి ఐదేళ్లలో 80 గజరాజులు మృతిచెందాయి. వేటాడి 41, విషప్రయోగం ద్వారా 25 ఏనుగులను చంపినట్లు వివరించింది. ఐదేళ్లలో అత్యధికంగా అసోంలో 121 ఏనుగులు వివిధ కారణాలతో మృత్యువాతపడ్డాయి. అతితక్కువగా ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది ఏనుగులు విద్యుత్‌షాక్‌తో మరణించాయి. ఏనుగుల దంతాల కోసం విషప్రయోగాలు చేస్తుండటం శోచనీయం. వివిధ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో విషప్రయోగం ద్వారా 25 ఏనుగులను చంపేశారు. కేవలం అసోంలోనే విషప్రయోగం చేసి ఏకంగా 21 ఏనుగులను హతమార్చారు. విద్యుత్ షాక్ వల్లే ఎక్కువ.. ► ప్రధానంగా విద్యుదాఘాతం వల్లే ఎక్కువగా ఏనుగులు మరణిస్తున్నాయి. ► అటవీ ప్రాంతానికి సమీపంలోని పొలాల్లోకి ఏనుగులు రాకుండా రైతులు విద్యుత్ కంచెలను ఏర్పాటుచేస్తున్నారు. దీంతో ఆహారం, నీటి కోసం అడవి నుంచి బయటకు వస్తున్న ఏనుగులు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందుతున్నాయి. ఐదేళ్లలో విద్యుత్ షాక్‌కు గురై 340 ఏనుగులు మరణించాయి. ► విద్యుత్ షాక్ నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెలను తొలగించాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, విద్యుత్ ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ► భూమిపైన విద్యుత్ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, అండర్ గ్రౌండ్ లేదా, స్తంభాలపై మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు వెల్లడించింది. రైలు ప్రమాదాల కారణంగా... ► రైళ్లు ఢీకొని కూడా ఎక్కువగానే ఏనుగులు మృతి చెందుతున్నాయి. రైలు ప్రమాదాలబారిన పడి ఐదేళ్లలో 80 గజరాజులు మరణించాయి. ► రైలు ప్రమాదాల వల్ల ఏనుగుల మరణాల నివారణకు రైల్వే బోర్డు, పర్యావరణ–అటవీ మంత్రిత్వ శాఖతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ► రైలు పైలెట్లకు పట్టాల చుట్టూ ఎక్కువ దూరం స్పష్టంగా కనిపించేలా ట్రాక్ వెంబడి చెట్లను తొలగించాలని, ఏనుగుల ఉనికి గురించి పైలెట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలని, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించాలని, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్ పాస్, ఓవర్ పాస్‌లను నిర్మించాలని నిర్ణయించారు. ► ఏనుగుల ఉనికి ఉన్న ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లపై అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు నిరంతరం పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలను తీసుకుంటున్నారు. ఏనుగుల సంరక్షణకు ఆర్థిక, సాంకేతిక సాయం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో ఏర్పాట్లకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మనుషులు–ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడానికి ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో 32 ఎలిఫెంట్ రిజర్వ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. జాతీయ రహదారులపై ఎకో బ్రిడ్జ్‌ల ఏర్పాటు ద్వారా వన్యప్రాణులు సురక్షితంగా రహదారులు దాటేలా కసరత్తు జరుగుతోందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రపంచ బ్యాంకు సహాయం చేయనుందని పేర్కొంది. చదవండి: విదేశాలకు వలసల్లో మనమే టాప్.. దేశాన్ని వీడిన 1.80 కోట్ల మంది.. -
వెబ్సైట్లో ఎప్పుడు పెట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు మంజూరు చేసిన అనుమతులను అధికారికంగా వెబ్సైట్లో ఎప్పుడు పొందుపరిచారన్న విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు మంజూరు చేసిన అనుమతులు చెల్లవంటూ హాయాతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ బుధవారం విచారించింది. అనుమతులు మంజూరైన అనంతరం పిటిషనర్లు 22 రోజులు ఆలస్యంగా కేసు దాఖలు చేశారు. దీంతో కేసు విచారణార్హతపై ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. -
పరిశ్రమలు రెడ్, ఆరెంజ్, గ్రీన్!
కాలుష్యాన్ని బట్టి పరిశ్రమలకు కొత్త వర్గీకరణ ప్రతిపాదించిన పర్యావరణ శాఖ.. ఆన్లైన్లో పర్యావరణ అనుమతులు న్యూఢిల్లీ: కాలుష్య ఉద్గారాల స్థాయిని బట్టి పరిశ్రమలను కొత్తగా వర్గీకరించాలని కేంద్ర పర్యావరణ శాఖ ప్రతిపాదించింది. కాలుష్య స్థాయి 60 దాటిన పరిశ్రమలకు ఎరుపురంగు, 30-59 మధ్య ఉన్న వాటికి నారింజ(ఆరెంజ్) రంగు, 29-15 మధ్య స్థాయిలో కాలుష్యకారకాలను విడుదల చేస్తున్న పరిశ్రమలకు ఆకుపచ్చ రంగు, 15 లోపు కాలుష్యస్థాయి ఉన్న వాటికి తెలుపురంగు కేటాయిస్తూ వర్గీకరించాలని ప్రతిపాదించారు. కాలుష్య స్థాయి 15లోపు ఉన్నవాటిని పర్యావరణ మిత్ర పరిశ్రమలుగా గుర్తిస్తారు. గతంలో పరిశ్రమల వర్గీకరణలో కాలుష్య స్థాయిని పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ప్రతీ ఏడాది పరిశ్రమలను రెన్యువల్ చేయించాలనే నిబంధనను కూడా మార్చాలని నిర్ణయించారు. విద్యుదుత్పత్తి ప్లాంట్లు, సిమెంటు ఫ్యాక్టరీలు, తోళ్ల శుద్ధి కార్మాగారాలు.. తదితర 17 పారిశ్రామిక విభాగాలున్న రెడ్ కేటగిరీ పరిశ్రమలకు ప్రతీ ఐదేళ్లకు ఒకసారి, ‘నారింజ’ కేటగిరీకి 10 ఏళ్లకు ఒకసారి, ‘ఆకుపచ్చ’ కేటగిరీకి ఒకేసారి లైఫ్‌టైమ్ సర్టిఫికేషన్ ఇచ్చేలా రెన్యువల్ నిబంధనలను రూపొందించనున్నారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్రాల పర్యావరణ, అటవీ శాఖల మంత్రుల జాతీయ సదస్సు ఆమోదం తెలిపింది. మంగళవారం ముగిసిన ఆ సదస్సులో రాష్ట్రాలు ఆమోదించిన ఇతర తీర్మానాల వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు. పర్యావరణ నిబంధనలను పాటిస్తున్న స్వతంత్ర పారిశ్రామిక యూనిట్లకూ ‘స్టార్స్’ను కేటాయించాలనే ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులకు ఆన్లైన్లో పర్యావరణ అనుమతులను జారీ చేసే ప్రక్రియను ఈ అక్టోబర్‌లోగా ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలలను కేంద్రం ఆదేశించిందన్నారు. పర్యావరణ, అటవీ అనుమతులను ఆన్లైన్లో జారీ చేయడం కేంద్రం ఇప్పటికే ప్రారంభించిందని, అదే విధానాన్ని రాష్ట్రాలు కూడా అనుసరించాలని సూచించారు.బ్యాక్లాగ్ అటవీ అనుమతుల ప్రక్రియను ఈ జూన్ 31లోగా అన్ని రాష్ట్రాలు ముగించాల్సి ఉందని జవదేకర్ తెలిపారు. ఐక్యరాజ్య సమితి గ్రీన్ క్లైమేట్ ఫండ్‌కు సమర్పించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతీ రాష్ట్రం కనీసం ఒక వాతావరణ మార్పు ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉందన్నారు.