breaking news
environment security
-
‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: నేటి ఆధునిక ప్రపంచంలో విద్యుత్ లేనిదే ఎవరికీ పూట గడిచే పరిస్థితి లేదు. తలసరి విద్యుత్ వినియోగమే రాష్ట్ర, దేశ పురోగతికి సంకేతం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య తలసరి విద్యుత్ వినియోగం మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. పునరుత్పాదక విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) రావడానికి ముందు థర్మల్, జల, అణు, గ్యాస్ ఇంధనమే ప్రధానమైన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు. ప్రస్తుతం పవన, సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం రెన్యూవబుల్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే పరిమితమైన ఎన్టీపీసీ సైతం ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో వేగం పెంచింది. మరోవైపు ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతోంది. థర్మల్ కేంద్రాల నిర్మాణంలో ఐదేళ్లుగా ప్రైవేటు రంగం గణనీయంగా పడిపోతూ వస్తోంది. 2023లో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు రంగంలో గ్రిడ్‌కు అనుసంధానం కాకపోవడం గమనార్హం. రానురాను కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు తలకు మించిన భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలోనే కాదు.. దాని ఉత్పత్తి వ్యయం కూడా ఏటేటా పెరుగుతోంది. బొగ్గు ధరలు, బొగ్గు ఉత్పాదన కేంద్రం నుంచి ప్లాంట్ వరకు రవాణా వ్యయం కూడా పెరగడం వల్ల అంతిమంగా విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలకు వచ్చేసరికి తడిసి మోపెడవుతోంది. అది కాస్తా వినియోగదారులపై భారం మోపక తప్పని పరిస్థితి. 2030 నాటికి కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యమా..? దేశంలో ప్రస్తుతం ఉన్న 2,36,680 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలతో దాదాపు 910 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వీటిని గణనీయంగా తగ్గించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కేంద్ర ఇంధన శాఖలోని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) 2029–30 నాటికి శిలాజ ఇంధనలతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం, సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న మెగావాట్ ధరలూ ఓ కారణమా..? దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం ఒక మెగావాట్‌కు గడిచిన ఏడేళ్లుగా పెరిగిన తీరు పరిశీలిస్తే... అవి రాబోయే కాలంలో లాభసాటిగా అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2015లో ఒక మెగావాట్‌కు రూ. 4.88 కోట్లు, 2016లో రూ. 5.33 కోట్లు, 2019లో రూ. 6.79 కోట్లు, 2023లో రూ. 8.34 కోట్లు చేరినట్లు సీఈఏ గణాంకాలు చెబుతున్నాయి. సౌర విద్యుత్ మెగావాట్ వ్యయం దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేరకు ఉంటోంది. ఒకప్పుడు సౌర ఫలకాల ధరలు అధికంగా ఉండటంతో యూనిట్ విద్యుత్ రూ.14కు కూడా విద్యుత్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే సౌర విద్యుత్ రూ. 3.50 నుంచి రూ. 4.50 మధ్య అందుబాటులోకి వచ్చింది. 2030 నాటికి... దేశంలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం, సౌర, పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ప్రకారం 2029–30 నాటికి దేశంలోని అన్ని రకాల విద్యుదుత్పాదన ప్లాంట్ల సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. వాటిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2,66,911 మెగావాట్లకు చేరుకుంటే... సౌర, పవన విద్యుత్‌ల స్థాపిత సామర్థ్యం ఏకంగా 2,25,160 మెగావాట్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వాటితోపాటు జల, బయోమాస్, బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలన్న నిర్ణయం కూడా ఇమిడి ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం మొత్తం స్థాపిత సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉండనుంది. -
సురక్షితమైతేనే నగరం సుందరం
సమకాలీనం స్మార్ట్ సిటీ అంటే ఏమిటోగానీ, స్వచ్ఛమైన గాలి, నీరు లభించే వాతావరణం సగటు నగర జీవికి కావాలి. విపత్తుల్లోనూ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రతను కల్పించాలి. హరితాన్ని, జలవనరుల్ని పరిరక్షిస్తూ నిలకడైన అభివృద్ధిని సాధించే ఆవాసయోగ్య నగరాలే స్మార్ట్‌సిటీలు. ఆ లెక్కన మన నగరాలెంత భద్రమైనవి? పారిస్ సదస్సులో దేశాలన్నీ ఏ చర్యలకు కట్టుబడతాయో ప్రకటించినట్టే... నగరాల పరిరక్షణకు, పర్యావరణ భద్రతకు పాలకులు, అధికారులు, పౌర సమాజం తమ నిబద్ధతను ప్రకటించాలి. ఆశావహ సంకేతాలిచ్చిన పారిస్ పర్యావరణ సదస్సు నేర్పిన పాఠమేమిటి? మనందరి కింకర్తవ్యమేమిటి? నిడివిలో చిన్నవిగా ఉన్నా ఇవి చాలా పెద్ద ప్రశ్నలు. సమాధానాలు, కార్యాచరణలు మరీ పెద్దవి. పర్యావరణ పరిరక్ష ణకు భూతాప పరిమితిని రెండు డిగ్రీల సెల్సియస్ దాటనీకుండా నియం త్రించాలని 190కి పైగా దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ఆహ్వానించదగ్గదే! దాదాపు రెండు వారాలు సాగిన ఈ సదస్సు తర్వాత, భాగస్వామ్య దేశాలన్నీ తమ తమ స్థాయిలలో బద్ధులమై ఉంటామని ప్రకటించిన ఉద్దేశాల (ఐఏన్డీసీ)ను, కుదుర్చుకున్న ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట... ప్రపంచ మేధావులు క్రోడీకరిస్తున్న ఆచరణీయ ముఖ్యాంశాలు ఐదు: 1. అభివృద్ధికి నూతన నిర్వచనం, నిలకడైన ప్రగతికి వినూత్న పంథా అవసరం, 2. డిజిటల్ విప్లవ వేగంతో స్వచ్ఛ-ఇంధన వినియోగం వైపు పరివర్తన జరగాలి, 3. ఉత్పత్తి-వ్యాపార-వాణిజ్య రంగాలు కర్బన ముద్రలను (కార్బన్ ఫుట్‌ప్రింట్స్) తగ్గించే సరికొత్త ‘వాతావరణ పరిభాష’ను అలవరచుకోవాలి, 4. నగర-పట్టణీకరణ వ్యూహాలు... శిలాజ ఇంధనాల స్థానే పునర్వినియోగ ఇంధనాల్ని వాడటం వంటి చర్యల ద్వారా ‘కర్బన మూల్యం చెల్లింపుల‘కు సిద్ధపడాలి, 5. వాతావరణ మార్పు దుష్పరిణామాల్ని తట్టుకునే చర్యల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులను, వ్యయాలను పెంచే ఆర్థిక విధానాల ను అమలుపర్చాలి. ప్రభుత్వాలు, పౌర సంస్థలు, వ్యక్తులు చిత్తశుద్ధితో పాటి స్తేనే ఆశించిన లక్ష్యాలు నెరవేరి, ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా... కర్బన ఉద్గారాలకు, భూతాపోన్నతికి మానవ కారణాల్లో నగర, పట్టణీకరణ ప్రధాన సమస్య అని సదస్సు నొక్కి చెప్పింది. మన దేశంలో ఈ సమస్య మరింత తీవ్ర స్థాయిలో ఉంది. అందుకు మన హైదరాబాద్ ఒక ప్రత్యక్ష నిదర్శనం. మరో తెలుగు రాజధాని అమరావతి నిర్మాణమే ఓ పర్యావరణపరమైన పెద్ద సవాల్! గ్రామాల నుంచి అపరిమిత వలసల వల్ల పెరుగుతున్న జనాభా, తగిన ప్రణాళికలు లేకుండాసాగే ‘కుహనా అభివృద్ధి’, పెరుగుతున్న ఆర్థిక అంతరాలు సగటు మనిషి జీవన ప్రమాణాల్ని పతనం చేస్తున్నాయి. వాతావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకటి మహా నగర ఎన్నికల ముంగిట్లో, మరొకటి రాజధాని నిర్మాణ సన్నాహాల్లో ఉన్న ఈ సంధి కాలంలో వాటి బాగోగులు సర్వత్రా చర్చనీ యాంశాలే! మన మహానగరాల్లో ఆకర్షణీయత ఎంత? ఆవాసయోగ్యత ఎంత? అన్నది కోటి రూకల ప్రశ్న! అభివృద్ధి అంటే అభద్రతా? అధోఃగతా? నేటి పాలకులెవరిని కదిలించినా ప్రధాన నగరాలన్నింటినీ ‘స్మార్ట్ సిటీ’లు చేస్తామని అరచేత స్వర్గం చూపిస్తున్నారు. ఇంతకీ స్మార్ట్ సిటీ అంటే ఏంటి? ఏమో! కానీ, స్వచ్ఛమైన గాలి, నీరు లభించే వాతావరణంతో సగటు నగర జీవి జీవన ప్రమాణాల్ని పెంచి, విపత్తుల్లోనూ జీవితాలకు, స్థిరచరాస్తులకు భద్రతను కల్పించే నగరాల్ని స్మార్ట్ సిటీలు అనొచ్చేమో! సహజ వాతావ రణాన్ని కాపాడే హరితాన్ని, జలవనరుల్ని పరిరక్షిస్తూ నిలకడైన అభివృద్ధి సాధించే ‘ఆవాసయోగ్య’ నగరాలే స్మార్ట్‌సిటీలు. అలా లెక్కిస్తే మన నగరా లెంత భద్రమైనవి? ఎంత స్మార్ట్‌గా ఉన్నాయి? మొన్న హైదరాబాదు, ముంబాయి, నిన్న చెన్నై, రేపు... మరో నగరం! ఇంకా పెను ప్రమాదం ముందుందని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 2031 నాటికి భారత నగర, పట్టణ జనాభా 60 కోట్లు దాటుతుందని ‘గ్లోబల్ కమిషన్ ఆన్ క్లైమేట్ అండ్ ఎకానమీ’ వెల్లడించింది. ఇది అమెరికా జనాభాకు రెట్టింపు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పట్టణ జనాభా 37 కోట్లు మాత్రమే! ఇంత స్వల్ప వ్యవధిలో ఇంతగా నగర, పట్టణీకరణ చైనాలో తప్ప మరెక్కడా జరగలేదు. భవిష్యత్తు ప్రమాదాల్ని పసిగట్టి ఇప్పట్నుంచే నియంత్రణ చర్యల్ని చేపట్టడంలో చైనాతో మనకసలు పోలికే లేదు. ఎన్ని విమర్శలున్నా... నగరాలు, పట్టణాల నిలకడైన అభివృద్ధి ప్రణాళికల్లో, జనాభా వృద్ధిని నియం త్రించడంలో చైనాను అందుకోవడం భారత్‌కు అయ్యే పనికాదు. మెకిన్సే గ్లోబల్ సంస్థ అధ్యయనం ప్రకారం, వచ్చే పదేళ్లలో పది లక్షల జనాభా దాటే మన నగరాల సంఖ్య 68కి చేరనుంది. అప్పుడేంటి పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రెండు ముఖ్య కార్యక్రమాల్ని చేపట్టింది. ‘స్మార్ట్ సిటీ’ల అభివృద్ధి, ‘అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్’ (అమృత్). ఓ కార్యక్రమం కింద వంద, మరో కార్యక్రమం కింద 500 నగరాలు- పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా పేర్కొన్నారు. ‘‘ప్రణాళికాబద్ద పట్టణాభివృద్ధి భూమికపైనే భారత ప్రగతి కథాగమనం సాగిస్తామ’’ని కేంద్రం ప్రకటిం చింది. యూపీఏ హయాంనాటి జేఎన్ఎన్యూఆర్ఎమ్ పథకంలోని వైఫల్యా లను ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటున్నారో అనుమానమే! ప్రకృతి విపత్తుల కోణంలో తగు భద్రత కోసం రూపొందించిన విధాన ముసాయిదా (2014)లో ఉన్న పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ)... తీరా రాజపత్రం (2015)లో కనిపించకపోవడమే ఈ అనుమానానికి కారణం. ఆ రెండు నగరాల కథ! చరిత్రాత్మకమైన భాగ్యనగరం నేడు వాతావరణ పరంగా ఓ అభాగ్యనగరమే! సమీప భవిష్యత్తులోనే ఓ మహా మురికి కూపం అయినా కావచ్చు. అసా ధారణ స్థాయి వలసలు, లెక్కకు మించుతున్న జనాభా, అపరిమిత విస్తరణ, అడ్డగోలు నగరాభివృద్ధి, పౌర సదుపాయాల పరమైన వ్యూహం- ప్రణాళిక లేమి కలిసి పర్యావరణ భద్రత లోపిస్తోంది. భవిష్యత్తు మరింత భయం కలిగించేలా ఉంది. కులీకుతుబ్‌షాకు ప్రీతిపాత్రమైన హైదరాబాద్ ఒకప్పుడు చెరువులు, కుంటలకూ, హరితానికీ ప్రతీతి. సమశీతోష్ణ నగరమనే ఖ్యాతి ఉం డేది. అందుకే, రాష్ట్రపతి వేసవిలో, శీతాకాలంలో ఇక్కడికి విడిది వస్తుంటారు. ఆ పరిస్థితి మారి, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. కబ్జాదా రుల భూదురాక్రమణలు, పాలకుల నిర్లక్ష్యం, రియల్టర్ల దౌష్ట్యాల ఫలితంగా చెరువులు, పార్కులు దాదాపు కనుమరుగయ్యాయి. కాలుష్యం విపరీతంగా పెరిగింది. నగరంలో సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ (హరిత తోరణం) ఉందని జీహెచ్ఎంసీ చెబుతోంది. అంటే మొత్తం విస్తీర్ణం లో సుమారు 8 శాతం. బెంగళూరు విస్తీర్ణంలో 13 శాతం హరిత తోరణం ఉంది. చండీగఢ్ నగర విస్తీర్ణంలో 30 శాతం హరిత తోరణంగాఉంది. అందుకే అది హరిత నగరంగా దేశానికే ఆదర్శమైంది. ఇక రాజధాని ఢిల్లీలో 5.95 శాతం, చెన్నైలో 2.01 శాతం, ముంబాయిలో 5.11 శాతం హరిత తోరణం ఉంది. హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా, ఆధారపడ లేనిదిగా మారడంతో, వ్యక్తిగత వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగు తోంది. గ్రేటర్ పరిధిలో అది 43 లక్షలకు చేరుకుంది. 3,500 ఆర్టీసీ బస్సుల్లో రోజూ 20 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక 1.50 లక్షల ఆటోల్లో 4 లక్షల మంది, ఎంఎంటీఎస్ రైళ్లలో లక్షలాది మంది రాకపోకలు సాగిస్తు న్నారు. ద్విచక్ర వాహనాలపైనే నిత్యం 20 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. పలు శివారు ప్రాంతాలకు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేక వ్యక్తిగత వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఫలితంగా ఓ వైపు ఇంధన బడ్జెట్, మరోవైపు వాయు, శబ్ద కాలుష్యాలు పలు రెట్లు పెరుగు తున్నాయి. నగర తాగునీటి, మురుగునీటి వ్యవస్థలైతే ఓ ఇంద్రజాలమే! ఇక్ష్వాకుల కాలం నాటి పైపులైన్ల వ్యవస్థ స్వల్ప మరమ్మతులతో కొనసా గుతోంది. తాగునీటిని నగరానికి రప్పించడానికి చూపే శ్రద్ధాసక్తుల్లో పదో వంతయినా... మురుగు నీటిని బయటకు పంపడంపై లేదు. ఫలితంగా నగరం దుర్గంధ కూపంగా మారుతోంది. వరదనీటి కాలువలు, మురుగునీటి కాలువలు, తాగునీటి పైపు లైన్లు పలుచోట్ల కలగలిసిపోతున్నాయి. జబ్బులు పెచ్చుపెరిగి అనారోగ్య భాగ్యనగరాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇక కొత్తగా ఊపిరిపోసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమ రావతిది మరోచరిత్ర! సహజ న్యాయ సూత్రాలకు, సుప్రీంకోర్టు తీర్పు లకు విరుద్ధంగా బహుళ పంటల హరిత భూముల్ని హరించి, అనైతిక పునాదుల పైనే ఆ నగరం పురుడు పోసుకుంటోంది. వరదలకు పేరైన కృష్ణాతీరంలో ఈ స్థావరం... వరదలు, భూకంపాల జోన్ అని నిపుణుల కమిటీ చేసిన హెచ్చరి కల్ని బేఖాతరంటూ సాగుతున్న పురో‘గతి’! యాభై వేల ఎకరాల అటవీ భూముల్ని డీనోటిఫై చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్రం అభ్యం తరాలు వ్యక్తం చేసింది. పర్యావరణ భద్రతా చర్యల కార్యాచరణపై పలు సందేహాలున్నాయి. నిర్మాణ అనుమతుల్ని సూత్రప్రాయంగా నిరాకరించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు కేసు విచారణలో ఉంది. ఇక్కడ కూడా ‘నిబద్ధత’ వెల్లడించాలి! పారిస్ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ తమ స్థాయిలో ఏమేం చర్యలకు కట్టు బడతాయో ‘నిబద్ధత’ (ఐఎన్డీసీ) ప్రకటించినట్టే నగరాల పరిరక్షణకు, పర్యా వరణ భద్రతకు పాలకులు, అధికారులు, సంస్థలు, పౌర సమాజం, వ్యక్తులు తమ నిబద్ధతను ప్రకటించాలి. ప్రకటించిన ప్రతి అంశాన్నీ తు.చ. తప్పక ఆచరించాలి. ‘విశ్వస్థాయిలో ఆలోచించు-స్థానికంగా ఆచరించు’ అన్న సూత్ర మిక్కడ అక్షరాలా సరిపోతుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) ఆధ్వర్యంలో ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్’ (సెస్)లో ఇటీవల హైదరాబాద్ ఆవాసయోగ్యతపై లోతైన చర్చ జరిపింది. పలువురు నిపుణులు పాల్గొన్న ఈ సదస్సు సమస్య మూలాల్ని, తీవ్రతకు కారణమౌతున్న అంశాల్ని చర్చించడంతో పాటు నివారణ, ముందు జాగ్రత్త చర్యలను విపులీకరించింది. మహానగర ఎన్నికల ముంగిట్లో రాజకీయ పార్టీలు ‘ఎన్నికల హరిత ప్రణాళిక’లను ప్రకటించాలని, ఆచరించాలని డిమాండ్ చేసింది. పౌరుల్ని భాగస్వాముల్ని చేసి, తగు సంప్రదింపుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్ని రూపొందించాలని, వాటిని వ్యాపార దృక్ప థంతో కాక జనహితంలో, చిత్తశుద్ధితో ఆచరించేందుకు మార్గదర్శకాల్ని సూచించింది. సుస్థిరాభివృద్ధికి ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 17 లక్ష్యాల్లో రెండంశాలు, మన మహానగరాల పరిరక్షణకు సరిగ్గా సరిపోతాయి. ఒకటి, ‘సమ్మిళిత, సురక్షిత, పరిస్థితులకనుకూలంగా ఒదిగే, నిలకడైన పర్యావరణ విధానాల్ని రూపొందించుకోవాలి’. రెండు, ‘‘విపత్తుల్లో... మృతులు, బాధితుల సంఖ్యను, ప్రత్యక్ష ఆర్థిక నష్టాలను నిలకడగా తగ్గించుకోగలిగే దీర్ఘకాలిక చర్యలుండాలి’’ సురక్షిత నగరాలే సుందర నగరాలు, చూడచక్కని నగరాలు (స్మార్ట్ సిటీలు) సుమా!! దిలీప్‌రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com