breaking news
Eastern Ghats Conservation
-
జాతీయ ఎజెండా కావాలి
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తూర్పు కనుమలను కాపాడుకోవడమన్నది అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ అన్నారు. దీనిని జాతీయ ఎజెండాగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఇక్కడ తూర్పుకనుమల పరిరక్షణ వేదిక (గ్రేస్), కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పు తీరానికి ఎక్కువగా తుపానులు సంభవించడం, దానిని ఆనుకుని ఉన్న కనుమల లో పలు రకాల మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడం వంటి అంశాలను ప్రస్తావించారు. తూర్పుకనుమలను కాపాడుకున్నప్పుడే తీరప్రాంతాన్ని కూడా రక్షించుకోగలుగుతామని, దానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణానికి సంబంధించి కేంద్రం ఏమైనా ప్రతిపాదనలు చేస్తే రాష్ట్రాలు సహకరించాలని అప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. తూర్పు కనుమల పరిరక్షణ ప్రాధాన్యత దృష్ట్యా త్వరలో పర్యావరణంపై జరిగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి ‘గ్రేస్’ ప్రతినిధులకు ఆహ్వానం పంపుతామన్నారు. పర్యావరణ సమతూకం లేని ఆర్థికాభివృద్ధికి అర్థం లేదంటూ రెండింటినీ సమతూకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తూర్పుకనుమల పరిరక్షణ కు ‘గ్రేస్’ ప్రచురించిన పుస్తకంలోని వివరాల ఆధారంగా పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. తూర్పుకనుమలను కాపాడాలన్న శ్రద్ధ ఎవరికీ లేకపోవ డం దురదృష్టకరమని పాలసీ నిపుణుడు మెహన్ గురుస్వామి అన్నారు. పర్యావరణ నిపుణుడు తులసీదాసు ‘గ్రేస్’ రూపొందించిన పుస్తకంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వ్యవస్థాపకుడు కె.లక్ష్మారెడ్డి, సీజీఆర్ అధ్యక్షురాలు కె.లీలా లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు. -
తూర్పు కనుమల పరిరక్షణకు జాతీయ ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ: తూర్పు కనుమల పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అపార ఖనిజ, వృక్ష, జంతు, ఆయుర్వేద, జల సంపద కలిగి ఉన్న తూర్పు కనుమలు విధ్వంసానికి గురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీజీఆర్ సంస్థ ఆరేళ్లుగా పర్యావరణం కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సంస్థ జస్టిస్ కుల్దీప్ సింగ్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డును సీజీఆర్ సంస్థ శనివారం ఢిల్లీలో అందుకోనుంది. ఈ సందర్భంగా సంస్థ స్థాపకుడు లక్ష్మారెడ్డి, అధ్యక్షురాలు లీలా లకా్ష్మరెడ్డి, సీఈవో నారాయణరావు, గ్రేస్ సంస్థ చైర్మన్ ఆర్. దిలీప్‌రెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ.పురుషోత్తంరెడ్డి శుక్రవారం ఇక్కడి ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆరేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ చేస్తున్న కృషికి క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డు ప్రకటించడం అభినందనీయం. ఈ ఏడాది వ్యక్తిగత అవార్డు విభాగంలో ఏపీ, తెలంగాణ నుంచి ఫ్లోరోసిస్ విమోచనా సమితిని స్థాపించి నల్లగొండ జిల్లాలో విశేష కృషి చేసిన డా.కె.గోవర్దన్‌రెడ్డికి లభించింది’ అని ప్రొ.పురుషోత్తంరెడ్డి తెలిపారు. లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘జస్టిస్ కుల్దీప్సింగ్ అవార్డుకు సీజీఆర్‌ను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఆరేళ్లుగా సీజీఆర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం. సుమారు ఆరు లక్షల మంది విద్యార్థుల సాయంతో ఇప్పటి వరకు 30 లక్షల మొక్కలు నాటాం. విద్యార్థులు నాటిన మొక్కకి రాఖీ పండుగ రోజున రాఖీ కట్టించడం, మొక్కనాటి ఏడాది పూర్తై దానికి పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ఈ కృషికి గుర్తింపుగా అవార్డు లభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. తూర్పు కనుమల పరిరక్షణకు కృషి దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సీజీఆర్ ఆరు సంవత్సరాలుగా చేసిన కృషికి తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర స్థాయిలో ‘హరిత మిత్ర’ అవార్డు ప్రదానం చేసింది. సీజీఆర్ ఆధ్వర్యంలోనే ఐదేళ్ల క్రితం గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్ట్రన్ ఘాట్స్(గ్రేస్) అనే ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాం. 1,700 కిలోమీటర్ల పరిధిలో బెంగాల్, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న తూర్పు కనుమల పరిరక్షణకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తూర్పు కనుమల పరిధితో అనుసంధానమై ఉన్న 48 మంది ఎంపీలకు లేఖలు రాశాం. వారందరితో డిసెంబర్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒక సమావేశాన్ని నిర్వహించి వీటి పరిరక్షణపై చర్చిస్తాం. పశ్చిమ కనుమలను ఏవిధంగా అయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించిందో.. అదే విధంగా అపారమైన ఖనిజ, జల, వృక్ష సంపదను కలిగి ఉన్న తూర్పు కనుమలను గుర్తించాలి. దీని కోసం జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం. తూర్పు కనుమలను బయోడైవర్సిటీ హాట్ స్పాట్‌గా ఐక్యరాజ్యసమితి గుర్తించేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని కోరారు.