చెరో ఏడాది నిర్వహించండి!
ఎంసెట్‌పై తెలంగాణ, ఏపీలకు గవర్నర్ సూచన
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌పై గందరగోళాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని.. అవసరమైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెరో ఏడాది ఎంసెట్ నిర్వహణను చేపట్టాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. లేకపోతే పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను పరిశీ లించి, దాని ప్రకారం ముందుకెళ్లాలని.. మొత్తంగా విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా వ్యవహరించాలన్నారు. మంగళవారం ఉదయం ఏపీ విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు గ వర్నర్‌ను కలిసి మాట్లాడారు. అనంతరం గవర్నర్ కార్యాలయం నుంచి అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఎంసెట్ సమస్యపై అడిగినట్లు తెలిసింది.
దీంతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి.. సాయంత్రం స్వయంగా వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి, ఎంసెట్ విషయంలో తలెత్తిన సమస్యలను వివరించారు. విభజన చట్టం ప్రకారం ఎంసెట్‌ను ఎవరు నిర్వహించాలన్న దానిపై ఇరు రాష్ట్రాల కార్యదర్శుల సమావేశం నిర్వహించి, నిర్ణయం తీసుకుందామని తాము ఏపీ విద్యామంత్రికి తెలిపామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. కానీ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించిందని గవర్నర్‌కు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీతో కలిసి ముందుకు సాగడం కష్టమని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో వీలైతే చెరో ఏడాది ఎంసెట్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రెండు రాష్ట్రాలకు గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. అంతకుముందు సచివాలయంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎంసెట్‌పై ఏపీ ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికంగా, అనాగరి కంగా ఉందని మండిపడ్డారు.