breaking news
Dr. ramesbabu DASARI
-
అమ్మాయి నోట్లో పుండ్లు ఎందుకు?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు ఆరేళ్లు. వారం క్రితం గొంతు నొప్పి అంటే వెంటనే డాక్టర్‌కు చూపించాం. మా పాప నోట్లో, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చి, తగ్గాయి. ఇన్ఫెక్షన్ వచ్చినట్లుగా గొంతు లోపలిభాగం ఎర్రబారింది. ఏదైనా తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. పాప కొంచెం సన్నబడింది. మా పాప సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - మాధవి, మల్కాజ్గిరి మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యను పిల్లల్లో చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ఉద్వేగాల పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), * విటమిన్లు, పోషకాల లోపం... (ముఖ్యం విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) వైరల్ ఇన్ఫెక్షన్లు (ప్రధానంగా హెర్పిస్ వంటివి) నోట్లో గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు వాడటం, కొన్ని ఆహారపదార్థాల (అబ్రేసివ్ ఫుడ్) వల్ల అయ్యే అనేక గాయాల కారణంగా) పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం సరిపడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి. మీరు లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో ఇదీ కారణం అని నిర్దిష్టంగా చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు భావించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. ఇదేమీ ప్రమాదకరమైన సమస్య కాదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హెదరాబాద్ -
పీడియాట్రీ కౌన్సెలింగ్
మా బాబు వయసు పదేళ్లు. వాడు ఇప్పటికీ పక్కతడుపుతూనే ఉంటాడు. రాత్రిళ్లు ప్రతి రెండు గంటలకోసారి యూరిన్‌కు వెళ్తుంటాడు. పగలు కూడా ఎక్కువగానే వెళ్తుంటాడు. ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటాడు. మావాడి సమస్యకు తగిన సలహా ఇవ్వండి. - ధరణి, భీమవరం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అని చెప్పవచ్చు. యూరిన్ పరిమాణం ఎక్కువ వస్తోంది కాబట్టి పాలీయూరియా అన్న కండిషన్ కూడా ఉందేమోనని కూడా అనుమానించాలి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు, ఎండోక్రైన్ సమస్యలు, యూరినరీ బ్లాడర్ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలికమైన కిడ్నీ సమస్యలు, మలబద్దకం వంటివి ముఖ్యమైనవి. మీ బాబు సమస్యకు కారణాన్ని తెలుసుకోడానికి కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతో పాటు యూరిన్ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్ ఆఫ్ కేయూబీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు ఈ పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తినకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. యూరిన్ పాస్ చేసేటప్పుడు విసర్జన పూర్తిగా చేసేలా చూడటం ప్రధానం. ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే పైన పేర్కొన్న కారణాలలో ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. - డాక్టర్ రమేశ్‌బాబు దాసరి,సీనియర్ పీడియాట్రీషియన్ స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్