ఇల్లాలికి ఇక రెస్ట్ దొరుకుతుందట...!
ఇంట్లో అన్ని పనులకు ‘ఆమె’పై ఆధారపడడం సహజం కానీ వచ్చే 2050 నాటికి ‘గృహలక్ష్మి’లకు రెస్ట్ దొరకనుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతీ పనికీ రోబోట్లతో చేయించుకునే అవకాశాలు మెండుగా ఉంటుందనీ దీంతో ఇల్లాలికి ఉపశమనం దొరుకుతుందనీ అంటున్నారు. యాండ్రాయిడ్లు, కంప్యూటర్ల కాలా నికి ప్రత్యామ్నాయంగా రోబోల కాలం వచ్చి వంటావార్పూ, ఇంటి పనులు చేసేస్తాయని అంచనా వేస్తున్నారు ఫ్యూచరాలజిస్టులు. బట్టలు ఉతకడం, ఇంటి పనులు, వంట పనులకు రోబోలను కొనుక్కొని ఎంచక్కా చేయించుకోవచ్చని ఫ్యూచరాలజిస్టు డాక్టర్ ఇయాన్ పియర్సన్ చెప్తున్నారు.
వచ్చే 34 ఏళ్లలో 80 శాతం ఇళ్లలో రోబోట్ సర్వెంట్లే ఉంటాయంటూ ఆయన భవిష్య వాణిని వినిపిస్తున్నారు. నాలుగు గోడల మధ్య ఇంటి పనులు వంట పనులతో పాటు భర్త, పిల్లల బాధ్యతలను భుజానికెత్తుకొని భార్యపాత్రలో సతమతమవుతున్న నారీమణులకు ఈ రోబోలు ఎంతో సహకరిస్తాయని చెప్తున్నారు.
ఇంటిని శుభ్రపరచడం, మార్కెట్ పనులతో పాటు అన్నీ రోబోలే చేస్తాయని ఇయాన్ జోస్యం చెప్పారు. దీంతో ఇంట్లో భర్తలతో పాటు ఆర్థికబాధ్యతలనూ నెత్తినేసుకొని అటు ఉద్యోగినిగా, ఇటు గృహిణిగా ఇరు బాధ్యతల నడుమ కొట్టుమిట్టాడుతున్న మహిళామనులకు రానున్న తరంలో రోబోలు చక్కగా సహకరించనున్నాయట.అంటే కొన్నేళ్ల తర్వాత ఏ ఇంటికి వెళ్లినా రండి రండి అంటూ రోబోలే స్వాగతించవచ్చని ఇయాన్ అంచనా వేస్తున్నారు.