breaking news
Devotion of disa
-
నమస్కారం ఎవరికి.. ఎలా?
నమస్కారం భారతీయ సంస్కృతి. అది ఉత్తమ సంస్కారం అంటారు పెద్దలు. ఎలా నమస్కారం చేయాలనే కాదు ఎన్నిసార్లు నమస్కారం చేయాలో మన శాస్త్రంలో లెక్క ఉంది. ప్రసన్న వదనంతో రెండు చేతులు జోడించి వాటిని ఛాతీకి ఆనించి నమస్కారం చేయాలి. నమస్కారం ఎవరికి... ఎలా చేయాలో తెలుసుకుందాం... ఈ భూమి మన తల్లి. మన దినచర్యలో భాగంగా తెలిసో తెలియకో మనం ఎన్నో అపరాధాలు చెస్తున్నాం. అందుకే నిద్ర లేవగానే తప్పులు మన్నించమని ముందుగా భూమాతకు నమస్కారం చేయాలి. ఆ తరువాత ఇంటిలో తల్లిదండ్రులుంటే వారికి నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం అన్ని వేళలా, అన్ని చోట్లా చేయ నవసరం లేదు. పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలనుకుంటే వక్షస్థలాన్ని నేలకు తాకేలా శిరస్సు నేలపై ఉంచాలి. రెండు చేతులు నమస్కార స్థితిలో సాగదీసి ముందుకు చాపాలి. దేవుడికి ఈ నమస్కారం చేస్తున్నప్పుడు పురుషులు ఛాతి మీద వస్త్రం ఉంచుకోరాదు. అందువలన సాంప్రదాయకంగా దేవునికి, మఠాధిపతులకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నపుడు ఈ నియమం పాటించవచ్చు. పూర్వకాలంలో అంతవరకు పరిచయం లేని పెద్దలకు నమస్కారం చేస్తున్నప్పుడు తమ వంశం పరంపర, గోత్రం, పేరు చెప్పే ఆచారం ఉండేది. ఆధునిక కాలంలో అది కుదరదు. అయినా నమస్కారం చేస్తూ స్వంత పరిచయం చేసుకోవడం మంచిది. ఒక్కొక్కప్పుడు అవతలి వ్యక్తి హోదాలో పెద్ద, వయస్సులో చిన్న కావచ్చు. వయస్సులో చిన్నవారికి నమస్కారం చెయ్యం కాని హోదాలో పెద్ద కాబట్టి తప్పక నమస్కారం చేయాలి. కొందరు ఉన్నత అధికారులు తమ కన్నా తక్కువ ఉద్యోగంలో ఉన్న పెద్దవారికి ముందుగా నమస్కారం చేసిన ఉదాహరణలున్నాయి. కొన్ని సందర్భాల్లో వంగి నమస్కరించవలసి వస్తుంది. అప్పుడు వారి పాదాలను చేతితో తాకి ఆ చేతిని మన శిరస్సు మీద ఉంచుకోవాలి. తల్లిదండ్రులకు, తనకన్నా పెద్దవారైన ఇతర కుటుంబ సభ్యులకు ఒకసారి నమస్కారం చేస్తే చాలు. సన్న్యాసులు, మఠాధీశులు, చాతుర్మాస దీక్షలో ఉన్నప్పుడు నాలుగు పర్యాయాలు నమస్కారం చేయాలి. గుడిలోనూ పూజామందిరంలోనూ దేముడి ముందు నమస్కారం చేయాలి. అది ఒక స్థానంలో నిల్చుని అయినా లేదా ఆత్మప్రదక్షిణ చేస్తూనో చేయాలి. అమ్మవారి విషయంలో నాలుగు పర్యాయాలు నమస్కారం చెయ్యాలి. భక్తితో నమస్కరిస్తే అది అనంతకోటి ఫలాలనిస్తుందని శాస్త్రవచనం. ఇంతవరకు నమస్కారం చేసేవారి ధర్మం గురించి తెలుసుకున్నాం. మరి దానిని స్వీకరించినవారి ధర్మమేమిటి? మనకు పురుషులు నమస్కరిస్తే ‘దీర్ఘ ఆయుష్మాన్ భవ’ అని, పుణ్యస్త్రీలు అయితే ‘దీర్ఘ సుమంగళీ భవ’ అనీ ఆశీర్వదించాలి. పిల్లలు నమస్కరిస్తే ‘సువిద్యా పాప్తి రస్తు’ అని, అవివాహితులయిన యువతీ యువకులను శీఘ్రమేవ వివాహ ప్రాప్తి రస్తు’ అని దీవించాలి. సందర్భానుసారంగా వారి కోరికలు సిద్ధించాలని ఆశీర్వదించాలి. భగవంతుడు అభయ ముద్రలోనే ఉంటాడు కాబట్టి ఆయన మన నమస్కారం స్వీకరించేడని సంతృప్తి పడాలి. ఒక శ్లోక భావాన్ని అనుసరించి నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా మనం ఎవరికి నమస్కరించినా అది చివరకు కేశవుడికే చెందుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. –గుమ్మా ప్రసాద రావు -
సత్యం పలికేవానికి అన్నీ సాధ్యమే
శ్లోకనీతి భాగవత పద్యం-7 మానవేంద్ర! సత్యమతికి దుష్కరమెయ్యదెరుక కలుగు వాని కిష్టమెయ్య దీశ భక్తిరతునికీరాని దెయ్యది యెరుక లేనివానికేది కీడు వ్యాఖ్యాన భావం... పరీక్షిన్మహారాజా! సత్యం పలికేవానికి అసాధ్యమనేదే ఉండదు. వానికి అన్నీ సాధ్యమే. యుక్తాయుక్త విచక్షణ కలవానికి ‘ఇది ఇష్టము - ఇది అనిష్టము’ అనే భేద భావం ఉండదు. స్థిరబుద్ధితో ఉంటారు. భగవద్భక్తుడు ఈయరానిదంటూ ఏదీ ఉండదు. (సర్వస్వాన్నీ త్యాగం చేస్తాడు). అజ్ఞానికి ‘ఇది మేలు - ఇది కీడు’ అనే జ్ఞానమే ఉండదు కదా! తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తాడు. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనే ఇంగితజ్ఞానం వానికి ఉండదు. అంటూ వసుదేవుడు సమయస్ఫూర్తిని ఉపయోగించి కంసునితో పలుకుతూ, తన మాటపై నిలిచి కొడుకును అప్పగించాడు. వసుదేవుని స్థిరబుద్ధికి కంసుడు ఎంతో సంబరపడి, ప్రశంసించాడు. ఆపదలు కలిగినప్పుడు ఆ ఆపద నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. స్థిరచిత్తంతో సదాలోచన చేయాలి. వసుదేవుడు ఎంతో చాకచక్యంగా కంసునితో ప్రవర్తించాడు.... అని శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకి బోధించాడు. - డా. పురాణపండ వైజయంతి