ఆపరేషన్ భూ రైడింగ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ప్రభుత్వ, ఇతర భూముల వివరాలను సేకరించేందుకు గాను వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది రెవెన్యూ యంత్రాంగం. సమగ్ర కుటుంబ సర్వే స్ఫూర్తి తో మూకుమ్మడిగా ఏకకాలంలో పనిచేయడం ద్వారా మండలాలవారీగా అన్నిరకాల భూము ల వివరాలను సేకరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ నేతృత్వంలో జరగనున్న ఈ భూ వివరాల సేకరణకు రఘునాథపాలెం మండలాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకున్నారు.
ఈ నెల 27, 28 తేదీల్లో మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ రికార్డుల ఆధారంగా అన్ని రకాల భూముల సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లతో పాటు పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకోనున్నారు. ఈ ప్రయోగం ఆధారంగా వచ్చే ఫలితాలను బట్టి మున్ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ‘ఆపరేషన్ భూరైడింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
లెక్క తేలనందుకే..
వాస్తవానికి జిల్లాలో ప్రైవేటు పట్టాదారు భూములతో పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములున్నాయి. వీటితో పాటు ఇప్పటికే పేదలకు అసైన్ చేసిన భూములు, భూదాన్ భూములు, సీలింగ్, ఇనాం, వక్ఫ్, దేవాదాయ, చర్చి తదితర భూములు కూడా ఉన్నాయి. అయితే, ఈ భూములు ఎక్కడ ఎన్ని ఉన్నాయన్న దానిపై పక్కాగా లెక్కల్లేవు.
ఎప్పుడైనా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నా, ఏదైనా పరిశ్రమ కోసం స్థలం ఇవ్వాలన్నా ప్రభుత్వ భూములు అందుబాటులో లేవనే మాట వినిపిస్తోంది. స్థానిక రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తత, కాసుల కక్కుర్తితో పాటు ప్రజల నుంచి కూడా సరైన సహకారం లేకపోవడంతో ఈ భూముల సమస్య ఎప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోతోంది. దీనికి తోడు ప్రభుత్వ భూముల కబ్జాలపై వస్తున్న వార్తలు, ఫిర్యాదులకు కూడా అంతులేకుండా పోతోంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలపై ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది జిల్లా యంత్రాంగం. కానీ, ఈ డ్రైవ్లో సంతృప్తస్థాయిలో ఫలితాలు రాలేదు. ఏ ఇబ్బందీ లేకుండా ఉన్న భూముల వివరాలు లభ్యమయ్యాయి కానీ, ఇతరత్రా సమస్యలు, కబ్జాలకు గురయిన భూముల వివరాలు రాలేదు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల స్థాపనకు అవసరమైన 15వేల ఎకరాలను జిల్లా అధికారులు గుర్తించి ఆ భూమిని టీఎస్ఐఐసీకి కూడా అప్పగించారు.
అయితే, భూముల పక్కా లెక్క ఎలా అన్నది ఆలోచించే క్రమంలో సమగ్ర కుటుంబ సర్వేను ఆదర్శంగా తీసుకున్నారు. సర్వే తరహాలోనే ఏకకాలంలోనే పెద్ద ఎత్తున సిబ్బందిని వినియోగించి భూవివరాల సేకరణకు పూనుకుంటే ఎలా ఉంటుందన్న కోణంలో జేసీ సురేంద్రమోహన్ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జిల్లా కేంద్రానికి సమీపంలోని రఘునాథపాలెం మండలాన్ని ఎంచుకున్నారు.
ఆ రెండు రోజుల్లో ఏం చేస్తారు?
ఈ వినూత్న భూరైడింగ్ ఆపరేషన్ కోసం పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. రఘునాథపాలెం మండలంలో ఉన్న 17 రెవెన్యూ గ్రామాలకు గాను ఐదుగురు డిప్యూటీ కలెక్టర్ల పర్యవేక్షణలో రెవెన్యూ గ్రామానికో ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఒక్కొక్కరు చొప్పున సర్వేయర్, మున్సిపల్ సిబ్బందిని కేటాయించారు. భూవివరాల సేకరణ పారదర్శకంగా ఉండేందుకు గాను స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని ఈ ఆపరేషన్లో ఉపయోగించడం లేదు.
ఈనెల 27, 28 తేదీల్లో వీరంతా రఘునాథపాలెం మండలంలో పర్యటిస్తారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేయనున్న సమావేశంలో గ్రామాల వారీగా రెవెన్యూ రికార్డులను ఆ సిబ్బందికి అందజేస్తారు. సదరు సిబ్బంది రెండు రోజుల పాటు గ్రామాల వారీగా ఉన్న రికార్డుల ఆధారంగా ఏ సర్వే నెంబర్లో ఏ భూమి ఉందా? సక్రమంగా ఉందా... ఆక్రమణలకు గురయిందా? ఇనాం, వక్ఫ్, దేవాదాయ, చర్చి భూములు సురక్షితంగా ఉన్నాయా? అసైన్డ్ భూముల పరిస్థితి ఏంటి? ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలు తీసుకునే వెసులుబాటు ఉందా? ఖాళీ చేయించే అవకాశం ఉందా? అనే అంశాలను పరిశీలిస్తారు.
ఈ సర్వే అనంతరం సమగ్ర వివరాలతో ఈనెల 29 కల్లా జేసీకి నివేదిక అందజేస్తారు. ఈ రిపోర్టు ఆధారంగా భూవివరాల సేకరణ సంతృప్త స్థాయిలో జరిగిందా? లేక అదే మండలంలో మరోసారి ఇంకొంతమంది సిబ్బందితో సర్వే చేయించాలా? లేక ఇదే పద్ధతిలో జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాలా అన్నది నిర్ణయించనున్నారు.