breaking news
Delta area
-
పల్లె జనంపై పచ్చ దందా
తుందుర్రులో ఆక్వా పార్క్ కుట్రకు సూత్రధారులెవరో! అమాయక ప్రజల రక్తం చిందినా నోరు మెదపని ఎమ్మెల్యేలు సిసలైన ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం మోపమన్నది ఎవరు పచ్చని పొలాలతో ప్రశాంతంగా ఉంటే డెల్టా ప్రాంతంలో అమాయక పల్లె ప్రజల రక్తం చిందినా.. జిల్లాలోని ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు నోరు మెదపడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా చిన్నాపెద్దా, ఆడ, మగా, ముసలి, ముతక తేడా లేకుండా వేలాది మంది రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా అధికార పార్టీకి చెందిన ఒక్క నాయకుడైనా వారివెంట ఎందుకు నడవటం లేదు. కనీసం ఒక్కరైనా ముందుకొచ్చి ఎందుకు సమాధానం చెప్పడం లేదు. జిల్లా ప్రజలను తొలిచివేస్తున్న ప్రశ్నలివి. జిల్లాను అట్టుడికిస్తున్న భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యవహారం వెనుక ‘పచ్చ’ నేతల హస్తం ఉందన్న అనుమానాలు టీడీపీ ప్రజాప్రతినిధుల మౌనంతో మరింత బలపడుతున్నాయి. ఆక్వా పార్క్‌తో కలిగే విపరిణామాల వల్ల తుందుర్రు సమీప గ్రామాలన్నీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంటాయనేది అక్కడి ప్రజలను ఆందోళన. రొయ్యలు, చేపలను శుభ్రం చేసేందుకు టన్నులకొద్దీ ఉపయోగించే అమోనియాతోపాటు, ఇతర రసాయనాలు, వ్యర్థాలు తమ ప్రాంతంలోని జలా ల్ని, భూముల్ని కలుషితం చేస్తాయని వారంతా భయపడుతున్నారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని.. జనావాసాలు, పంట పొలా లు, జల వనరులకు దూరంగా నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నిర్మాణం ఏడాదిన్నర కాలంగా తుందుర్రు, బొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల ప్రజలతోపాటు చుట్టుపక్కల పది ఊళ్లకు చెందిన రైతులు, మత్స్యకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడూ ప్రశాం తంగా, సోదర భావంతో మెలిగే ఆ గ్రామాల ప్రజలు ఈ మధ్యకాలంలో ఉద్యమబాట పట్టారు. జనావాసాలు, పంట భూములు లేని వేరే ప్రాంతానికి దీనిని తరలించాలని కోరుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. న్యాయపరమైన పల్లె ప్రజల డిమాండ్లు అరణ్యరోదనగానే మిగిలాయి. వారి ఆవేదనను, ఆందోళనను, ఆక్రోశాన్ని ఎవ రూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, వారితో చర్చించడం, ఆక్వా పరిశ్రమ లాభనష్టాలపై వారికి అవగాహన కల్పించడం లాంటి చర్యలు ఎవరూ చేపట్టలేదు. ‘మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు అంతకన్నా లేవ్’ అన్నట్టుగా ఆక్వా పార్క్ నిర్మాణ పనులు శరవేగంగా సాగిపోతూనే ఉన్నాయి. దీంతో ప్రజల ఆవేదన ఆగ్రహంగా మారింది. డెల్టా ప్రాంతంలో ఎన్నడూ లేని ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. ఉపాధిని ఎరగా చూపుతూ.. ఉపాధిని ఎరగా చూపించి మెగా ఆక్వాఫుడ్ పార్క్ పేరిట కోట్లాది రూపాయల్ని స్వాహా చేసేందుకు కొందరు పెద్దలు పథకం పన్నారన్న ఆరోపణలున్నాయి. ప్రాసెసింగ్ చేసిన ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం భారీగా వస్తుందని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రాజెక్ట్ బాధ్యులతోపాటు టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే పచ్చని పొలాలను, వ్యవసాయాన్ని, మత్స్యకారుల ఉపాధిని నాశనం చేసే ఉపాధి మాకొద్దంటూ ప్రజలు మొత్తుకుంటున్నా వినే నాథుడే కనిపించడం లేదు. మూడు పంటలు పండే పొలాల మధ్య ఆక్వా పార్కుకు అనుమతులు రావడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. పథకం ప్రకారం ముందుగానే ఇక్కడి పొలాలను కొనుగోలు చేసి పంటలు వేయనివ్వకుండా బీడు భూములుగా చూపించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలకు చెందిన కొందరి భూములను 2012లోనే ఆక్వా పార్క్ ప్రతినిధులు కొనుగోలు చేశారు. వాటిని బీడు భూములుగా మార్చారు. అనంతరం 2014లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎకరం రూ.10 లక్షలు, రూ.12 లక్షలకే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ పత్రాల్లో మాత్రం ఎకరం రూ.40 లక్షలకు కొనుగోలు చేసినట్టు చూపించారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇక భౌగౌళిక సమాచారం కూడా తప్పుల తడకగా చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. తుందుర్రు నుంచి కాకినాడ పోర్టుకు 120 కిలోమీటర్ల దూరం ఉంటే, కేవలం 30 కిలోమీటర్లు మాత్రమేనని, మొగల్తూరు బైపాస్ రోడ్డు 15 కిలోమీటర్లు పైనే ఉంటే, 4 కిలోమీటర్లే అని నివేదికలో పేర్కొని అడ్డగోలుగా అనుమతులు పొందారని అంటున్నారు. మరోవైపు పార్క్ నిర్మాణ ప్రాంతంలో బీడు భూములు తప్ప ఇళ్లు లేవని చూపించి పర్యావరణ అనుమతులు పొందారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆక్వా పార్క్ అనుమతి కోసం కేంద్రానికి సమర్పించిన డాక్యుమెంట్లను బహిర్గతం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ‘పచ్చ’ నేతలకూ వాటా ప్రాజెక్టు బాధ్యులుగా ఆనంద్ గ్రూప్స్ చెందిన పారిశ్రామిక వేత్తలే తెరపైకి కనిపిస్తున్నా.. వెనుక మాత్రం అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఓ కీలక యువ నేత ఉన్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌కు 2014 ఎన్నికలకు ముందే బీజం పడినప్పటికీ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పెద్దలు రంగంలోకి దిగారు. అందుకే పర్యావరణ అనుమతుల నుంచి, బ్యాంకు రుణాల వరకూ కీలక పనులు చకాచకా జరిగిపోయాయి. జిల్లాకు చెందిన చెందిన ఓ ప్రజాప్రతినిధికి నేరుగా వాటాతోపాటు టీడీపీలో ఇప్పుడు చక్రం తిప్పుకున్న ఓ కీలక యువనేత భాగస్వామ్యం ఉన్నట్టు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. లేదంటే ప్రశాంతంగా ఉండే పశ్చిమ పల్లెలు అట్టుడికిపోతున్నా, తీరప్రాంత అమాయక ప్రజలు లాఠీదెబ్బలకు వెరవక ఆందోళన చేస్తున్నా జిల్లాలోని ప్రజాప్రతినిధులెవరూ నోరు మెదపకపోవడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. -
పసుపు రైతు కుదేలు
తెనాలిటౌన్: డెల్టా ప్రాంతంలో సాగయిన పసుపు పంట చేతికొచ్చింది. ప్రస్తుతం పసుపు దున్ని వండటం ప్రారంభించిన రైతులు దిగుబడుల తీరు చూసి కుదేలు అవుతున్నారు. తెనాలి వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో తొమ్మిది వేల ఎకరాల్లో ఈ ఏడాది పసుపు సాగయింది. తెనాలి మండలంలో 250 ఎకరాలు, కొల్లిపర మండలంలో 3000 ఎకరాలు, కొల్లూరులో 2500 ఎకరాలు, భట్టిప్రోలులో 1600 ఎకరాలు, దుగ్గిరాలలో 1250 ఎకరాలు, అమృతలూరులో 100 ఎకరాలు, వేమూరులో 100 ఎకరాలు, చుండూరులో 200 ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. అనుకూల పరిస్థితులు ఉంటే ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడులు ఈ ఏడాది 15 నుంచి 20 క్వింటాళ్లకు మించడం లేదు. ఎకరం కౌలు రూ.40 వేలు, విత్తనం పెట్టుబడులు, ఖర్చులు కలిపి మరో రూ.70 వేలు సాగుకు అవుతున్నట్లు రైతులు చెపుతున్నారు. పసుపు నాటడం, వండకానికి మరో రూ.10 వేలు అదనంగా ఖర్చు అవుతోంది. రూ.7వేలు దాటని ధరలు.. ప్రస్తుతం దుగ్గిరాల మార్కెట్లో సరుకు క్వింటా కనిష్ట ధర రూ.5,700, గరిష్ట ధర రూ.7,000 వరకు ఉంది. కాాయ కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.7,000 వరకు ఉంది. ఈ ఏడాది పెరిగిన సాగు ఖర్చుకు ఈ ధరలు ఆశాజనకంగా లేవని, ధరలు ఇలాగే కొన సాగితే నష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా పసుపు రూ.10 వేలు పలికితేనే గిట్టుబాటు అవుతుందంటున్నారు. క్వింటాకు రూ.10వేలు ధర ఉండాలి. రెండు ఎకరాల పొలంలో పసుపు సాగు చేశాను. ఎకరానికి 15 క్వింటాళ్ల మించి దిగుబడులు వచ్చే పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా మార్కెట్ లో క్వింటా రూ.5వేలకు మించి ధరలు లేవు. ఈ ఏడాది ధరలు కొంత మేరకు ఆశాజనకంగా ఉన్నప్పటికి దిగుబడులు తగ్గడంతో రైతుకు మిగిలేది ఏమీ లేదు. పసుపునకు ప్రభుత్వం క్వింటాకు రూ.9 వేల నుంచి రూ.10 వేలు మద్ధతు ధర ఏర్పాటు చేయాలి. ఈ ధరలు లేకపోతే వ్యవసాయం చేయడం దండగే. ఈ ఏడాది పసుపు సాగుకు ఖర్చులు పెరిగాయి. కూలీల కొరత ఏర్పడింది. - బొద్దులూరి పూర్ణచంద్రరావు, రైతు, గుడివాడ, తెనాలి మండలం -
నీటి సాక్షిగా నిర్లక్ష్యం!
డెల్టా ప్రాంత రైతాంగానికి గుండె కాయ లాంటి ప్రకాశం బ్యారేజీ గేట్లు రూపురేఖలు కోల్పోతున్నాయి. పుష్కర కాలానికే తుప్పుపట్టి శిథిలస్థితికి చేరుతున్నాయి. పాడైపోయిన గేట్లకు మరమ్మతులు చేపట్టనున్నట్టు సాక్షాత్తూ రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించి ఐదు నెలలు దాటినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. కాలయాపన చేసే కొద్ది మరమ్మతుల వ్యయం పెరిగే ప్రమాదం లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - తాడేపల్లి రూరల్ 2002లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ మొత్తం 74 గేట్లు(వర్టికల్) మార్చేందుకు నిర్ణయించి ఆ మేరకు పనులు ప్రారంభించింది. ఈ విషయంలో నైపుణ్యం కలిగిన సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్ షాప్ కార్మికులను కాదని, గేట్లు మార్చే పనులను తెలుగుదేశం ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఒప్పందం మేరకు ఆ సంస్థ కొత్త గేట్లు ఏర్పాటు చేసింది. అయితే పాత గేట్ల డిజైన్‌ను మార్చడంతో వీటీపీయస్లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బ్యారేజీ పాత గేట్లు 12 అడుగుల ఎత్తు ఉండగా, కొత్త గేట్లు అర అడుగు మేర తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడినట్టు గుర్తించారు.కొత్త గేట్లు ఎత్తు పెంచాలని వీటీపీఎస్ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని కోరడంతో మరో అర అడుగు రేకు అమర్చి 12 అడుగులకు మార్చారు. ఈ క్రమంలో పైనుంచి ప్రవహించే నీరంతా గేట్లపైనే పడుతోంది. ఈ కారణంగా కొత్త గేట్లు సైతం 12 ఏళ్లకే పూర్తిగా తుప్పుపట్టాయి. అంతేగాక నీటి ఒత్తిడిని తట్టుకునేందుకు సపోర్టుగా ఏర్పాటు చేసిన ఐరన్ చానళ్లు సైతం తుప్పు పట్టి ఊడిపోయాయి. ఈ రెండు విషయాలు ఈ ఏడాది ఆగస్టులో దినపత్రికల ద్వారా వెలుగు చూడడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రకాశం బ్యారేజీని సందర్శించింది. గేట్లు తుప్పు పట్టిన మాట వాస్తవమేనని నిర్ధారించింది. అనంతరం కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం 37 కోట్ల రూపాయలు కేటాయించి తక్షణం ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించింది.ఆ సమయంలోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు చేపడుతున్నట్టు చేసిన ప్రకటన నేటికీ అలానే మిగిలిపోయింది. నిధులు ఉన్నా పనులు చేపట్టకపోవడంపై అటు రైతులు, ఇటు ఆ శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గేట్ల మరమ్మతులకు చొరవ చూపాలని కోరుతున్నారు.