breaking news
defectors
-
కులాల లెక్కన...‘ఆకర్ష్’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రస్తుతం కులాలు, వర్గాల వారీగా ఓట్లను రాబట్టగల నేతలను ఆకర్షించడంపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రధాన కులాలను ప్రభావితం చేయగల సమర్ధులైన కీలక నేతలపై ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న అన్ని ప్రధాన పార్టీలు, వారిని చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా యూపీలో అధికారాన్ని కాపాడుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే ఫిరాయింపుదారులకు రెడ్‌కార్పెట్ వేయగా, ఎన్నికల షెడ్యూల్ అనంతరం సమాజ్‌వాదీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీ వ్యూహాన్ని చిత్తుచేసే పనిలో పడింది. మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్లు రాజీనామా చేసి బీజేపీని వీడటం, వారి బాటలోనే బీజేపీకి మరో నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో వలసల పర్వం హీటెక్కుతోంది. ముందే చేరికలను తెరతీసిన బీజేపీ గడిచిన ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 312 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ప్రస్తుత ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల కన్నా ముందుగానే మేల్కొన్న పార్టీ అధిష్టానం గత ఏడాది నవంబర్ నుంచే ప్రభావవంతమైన నేతలను ఆకట్టుకునే యత్నాలు ఆరంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల కాళీచరణ్, మహారాజ సుహేల్దేవ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బాబన్ రాజ్‌భర్‌ను పార్టీలో చేర్చుకుంది. 2.4 శాతంగా ఉన్న రాజ్భర్లు గతంలో బీజేపీతోనే ఉన్నా సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో వీరి ఓట్ల అటువైపుకు వెళ్లకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక బ్రాహ్మణ వర్గాలు ఏమాత్రం చేజారిపోకుండా కాంగ్రెస్‌కు చెందిన మాజీ హోంమంత్రి, ప్రయోగ్‌రాజ్ నుంచి మూడుస్లార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేంద్ర త్రిపాఠితో పాటు మరో మాజీ మంత్రి జై నారాయణ్ తివారీ, మరో కీలక నేత విజయ్ మిశ్రాలను పార్టీ కండువా కప్పింది. బీఎస్పీ నుంచి ఎస్పీకి దళిత ఓటు బ్యాంకు వెళ్లకుండా ఎస్సాలోని ప్రముఖ దళిత నేత సుభాస్ ఫసికి కాషాయ కండువా కప్పింది. ఎస్పీని బలహీనపర్చే యత్నంలో గత నవంబర్‌లో పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రవిశంకర్సింగ్, నరేంద్రసింగ్ భాటి, సీపీచాంద్, రామ్ నిరంజన్లను పార్టీలోకి లాగేసింది. వీరంతా ఠాకూర్ వర్గానికి చెందిన వారే. తాజాగా స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా నేపథ్యంలో మేల్కొన్న బీజేపీ బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైనీ, ఎస్పీ ఎమ్మెల్యే హరిఓంలను పార్టీలో చేర్చుకుంది. æ ఆటలో వేడి పెంచిన ఎస్పీ చేరికలపై బీజేపీ కమిటీ ఏర్పాటు చేసిన మరుక్షణమే వారికి షాక్ ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్‌లోనే ఆరుగురు బీఎస్పీ, ఒక బీజేపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో ఆట మొదలు పెట్టిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ప్రస్తుతం మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్‌ల రాజీనామాతో వేడి పెంచారు. స్వామి ప్రసాద్ సహా ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేలు 14న ఎస్పీలో చేరే అవకాశం ఉంది. ఓబీసీ వర్గాల్లో స్వామి ప్రసాద్‌కు గట్టు పట్టు ఉండగా, మిగతా ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే వారే. వీరితో పాటు మరో 13 నుంచి 17 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా ఓబీసీ, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ముస్లిం వర్గాల్లో గట్టి పట్టున్న ఇమ్రాన్ మసూద్‌ను ఎస్పీ చేర్చుకోగా, ఆయనతో పాటే ఇద్దరు ఎమ్మెల్యేలు నరేశ్ సైనీ, మసూద్ అక్తర్‌లో ఎస్పీలో చేరారు. 19 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు చీలకుండా ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీలలో మైనారిటీ నేతలందరినీ పార్టీలో చేర్చుకునేలా అఖిలేశ్ వ్యూహ రచన చేస్తున్నారు. -
‘అలా చేయడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవటమే’
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(వీహెచ్) విమర్శించారు. ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా అధికారంలో ఉన్నవారికి గవర్నర్ భజన చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని తూట్లు పొడవడమేనని అన్నారు. ఫిరాయింపుదారులతో ప్రమాణస్వీకారం చేయిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే అసహ్యం వస్తుందని అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతుంటే ప్రధాని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమించాలని టీపీసీసీని కోరారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తానని వీహెచ్ తెలిపారు. కాగా శనివారం కూడా వీహెచ్ రాజ్‌భవన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫిరాయింపుల కేసుపై కేసీఆర్ సమాలోచనలు
హైదరాబాద్: అనర్హత పిటిషన్ల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విస్తృతంగా సమాలోచనలు జరిపారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావుతో ఆయన శుక్రవారం అడ్వకేటు జననర్ (ఏజీ) రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఈ నెల 8వ తేదీలోగా స్పీకర్ కౌంటర్ దాఖలు చేయాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముథోల్ ఎమ్మెల్యే గడ్డం విఠల్‌రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య, చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్లో చేరారు. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ శాసన సభాపక్షం (సీఎల్పీ) విప్ , అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సంపత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్టు ఈనెల ఎనిమిదో తేదీలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం ఇవ్వాలని స్పీకర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై చర్చించేందుకు, న్యాయ సలహా పొందేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఏజీని పిలిపించి చర్చించారని విశ్వసనీయంగా తెలిసింది. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే తలెత్తినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే పూర్తి విచక్షణాధికారం స్పీకర్‌కే ఉన్నా, న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఈ వ్యవహారంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ సమాధానం ఇవ్వాల్సిన అవసరంపైనే చర్చించారని సమాచారం. అదే మాదిరిగా.., అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం, సమావేశాలను ఎప్పటి నుంచి నిర్వహించాలి, ఆ తేదీలపై కూడా కేసీఆర్, మంత్రి హరీష్ చర్చించుకున్నారని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నవంబర్ చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.