breaking news
Deer Protection
-
ట్రైన్ హారన్ సౌండ్ మారింది, హారన్‌కు బదులు కుక్క అరుపులు
ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జపాన్.. రైలు కూతలకు కుక్క అరుపులు జోడించిందనే వార్త హాస్యస్పదమే. కానీ ఇది నిజం. భూకంప పరిస్థితుల్లో సైతం ప్రత్యేక ఆటోమేటిక్ లాకింగ్ వ్యవస్థలు కలిగిన జపనీస్ ట్రైన్ టెక్నాలజీకి.. 2018 వరకూ ఆ దేశ వన్యప్రాణులే బ్రేక్స్ వేసేవి. సూపర్ ఫాస్ట్ షింకన్సేన్ (బుల్లెట్ ట్రైన్) సైతం దూసుకుపోగలిగే జపాన్ రైల్వే ట్రాక్స్‌పై వందలాదిగా జింకలు ప్రాణాలు కోల్పోవడం, ఆ కారణంగా రైల్వే ప్రయాణికులు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకోవడం.. ఇలా జపాన్‌కి పెద్ద సమస్యే వచ్చిపడింది. ట్రాక్స్‌కి, హిల్స్‌కి జరిగే యాక్షన్‌లో కొన్ని ఐరన్ ఫిల్లింగ్స్ ఆకర్షించే రుచిని కలిగి ఉండటంతో..వాటిని నాకేందుకు జింకలు భారీగా రైల్వే ట్రాక్స్ మీదకు వస్తున్నాయని అధ్యయనాలు తేల్చాయి. అలా వచ్చిన జింకలు రైలు కిందపడి చనిపోయేవి. దాంతో రంగంలోకి దిగిన రైల్వే టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్టీఆర్ఐ) పరిష్కారం దిశగా అడుగులు వేసింది. సింహం పేడను తెచ్చి ట్రాక్ పొడవునా జల్లి ఓ ప్రయోగం చేశారు. ఆ వాసనకి అక్కడ సింహాలు ఉన్నాయేమోనన్న భయంతో జింకలు ట్రాక్ మీదకి వచ్చేవి కావట. అయితే వర్షం పడి సింహం పేడ కొట్టుకుపోవడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. శాశ్వత పరిష్కారం కోసం రైలు కూత శబ్దానికి కుక్క అరుపులను జోడించారు. 20 సెకన్ల పాటు కుక్క అరుపులు వినిపిస్తుంటే.. జింకలు ట్రాక్ మీద నుంచి తుర్రుమనడం గమనించిన అధికారులు.. ఇదే పద్ధతిని అవలంబించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో జపాన్ రైళ్లు కుక్కల్లా మొరుగుతున్నాయి. ఐడియా అదుర్స్ కదూ. చదవండి: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్! -
లేడి పిల్లల స్వాధీనం
కొరాపుట్: వేర్వేరు గ్రామాలలో తిరుగాడుతున్న రెండు లేడి పిల్లలను ఫారెస్టు అధికారులు స్వా«ధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం కొరాపుట్ మున్సిపాలిటీ పరిధిలో గల జనిగుడ, సుక్రిగుడ గ్రామాల పరిసరాలలో తిరుగాడుతున్న లేడి పిల్లల గురించి సమాచారం అందుకున్న కొరాపుట్ ఫారెస్ట్ రేంజర్ సుభాష్‌చంద్ర కుంటియ తన సిబ్బందితో పాటు ఆ గ్రామాలను వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని నవరంగ్‌పూర్ జిల్లాలోని పపడహండిలో గల డీర్ పార్క్‌కు అందజేయనున్నట్లు రేంజర్ కుంటియ చెప్పారు. -
మన జింకకు మంచిరోజులు..!
నాగిరెడ్డిపేట : కిలోమీటర్ల పొడవునా పచ్చని చెట్లు.. చెంగుచెంగున ఎగిరే వన్యప్రాణులతో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది పోచారం అభయారణ్యం. ఈ అభయారణ్యం నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది. ఇక్కడి పచ్చదనాన్ని, జింకలు, వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు. రెండు జిల్లాలతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. జింకల రక్షణ కోసం ఈ ప్రాంతంలో జింకలు అధికంగా ఉండటంతో వాటిని సంరక్షించడంతో పాటు వాటి సంతతిని పెంచాలనే ఉద్దేశంతో షికార్‌ఘర్‌గా పిలువబడే ప్రాంతా న్ని 1950లో పోచారం అభయారణ్యంగా గుర్తించారు. అనంతరం జింకల సంతతి ని పెంచేందుకు రెండు ప్రత్యుత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అభయారణ్యం మొత్తం విస్తీర్ణం 164హెక్టార్లు కాగా, వీటిలో మొదటి జింకల ప్రత్యుత్పత్తి కేం ద్రం 125హెక్టార్లలో ఏర్పాటుచేయగా, మిగతా 39హెక్టార్లకు సంబంధించి 1986లో రెండో ప్రత్యుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. అటవీశాఖ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో ప్రత్యుత్పత్తికి అవసరమైన చర్యలు చేపడుతూ జింకల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నారు. సందర్శకులకు కనువిందు పోచారం వన్యప్రాణి అభయారణ్యాన్ని సందర్శించే వారికి జింకలు కనువిందు చేస్తాయి. అభయారణ్యంలో చుక్కల జింకలు, జింకలు, నెమళ్లు, కొండగొర్రెలు, అడవి పందులు, నీలుగాయిలు, సాంబార్లు ఎక్కువగా ఉన్నాయి. అటవీ అధికారుల అనుమతి పొంది, అభయారణ్యంలోకి వెళ్లే పెద్దసంఖ్యలో జింకలను, వన్యప్రాణులను తిలకించవచ్చు. గుంపులు గుంపులుగా తిరిగే జింకలు మనుషుల అలికిడి వినగానే చెంగు చెంగున దూకుతూ.. పరుగులు పెట్టడాన్ని ఆస్వాదించవచ్చు. అభయారణ్యంలో డీబీసీ-1లో మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. ఇందులోకి నాలుగు చక్రాల వాహనాల లో మాత్రమే లోనికి వెళ్లనిస్తారు. వాహనానికి రూ. 100, ఒక్కొ వ్యక్తికి రూ. 20చొప్పున ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తమ వెంట కెమెరాను తీసుకెళ్తే అదనంగా మరో రూ. 100 చెల్లించాలి. సుమారు 5 కిలోమీటర్ల మేర తిరిగి వన్యప్రాణులను తిలకించవచ్చు. ప్రభుత్వం జింకను రాష్ట్ర జంతువుగా ప్రకటించడంతో పోచారం అభయారణ్యానికి ప్రాధాన్యత సంతరించుకుంటోం ది. ఇక నుంచైనా ఈ ప్రాంతం పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయాన్ని పర్యాటకులు వ్యక్తంచేస్తున్నారు. పెరుగుతున్న సంతతి ప్రత్యుత్పత్తి కేంద్రాల ఏర్పాటుతో క్రమంగా అభయారణ్యంలో జింకల సంతతి పెరుగుతోంది. ఈ కేంద్రాల వల్ల అభయారణ్యంలో ప్రతియేడు 80 నుంచి 100 జింకలు జన్మిస్తున్నాయి. నాలుగేళ్లక్రితం సుమారు 200 జింకలు ఉండగా, తాజా గణాంకాల ప్రకారం వాటిసంఖ్య 500పైగా పెరిగింది. ప్రత్యుత్పత్తి కేంద్రాల్లో జింకలకు అధికారులు ప్రత్యేకంగా ఎలాంటి దాణా ఇవ్వరు. అభయారణ్యంలో సహజంగా పెరిగే గ్రాసాన్ని తినే పెరుగుతాయి. ఇక్కడ ఉత్పత్తి చేసిన జింకలను కాస్త పెద్దయ్యాక మెదక్ జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలి పెడుతుంటారు. నాటి షికార్‌ఘర్.. నిజాంకాలంలో అప్పటి ప్రభువులు జంతువులను వేటాడేందుకు తరుచూ ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఈ ప్రాంతాన్ని అప్పట్లో షికార్‌ఘర్‌గా పిలిచేవారు. క్రమక్రమంగా అదే పోచారం వన్యప్రాణుల అభయారణ్యంగా మారింది. జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలతో పాటు మెదక్ జిల్లాలోని మెదక్ మండల పరిధిలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. వేటాడేందుకు వచ్చిన సమయంలో నిజాం పాలకులు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ రెండు భారీ అతిథి గృహాలను నిర్మించారు. కాలక్రమంలో ప్రభుత్వ ఆదరణ కరువై ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి.