breaking news
Credit default
-
అమెరికా టారిఫ్‌లతో డిఫాల్ట్ రిస్కులు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల వల్ల రుణాలకు సంబంధించిన పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని, తక్కువ రేటింగ్, స్పెక్యులేటివ్ రేటింగ్ ఉన్న కార్పొరేట్లు డిఫాల్ట్ అయ్యే రిస్కులు పెరగవచ్చని మూడీస్ రేటింగ్స్ వెల్లడించింది. గ్లోబల్ వృద్ధి నెమ్మదించి, మాంద్యం వచ్చే అవకాశాలు పెరగవచ్చని ఓ నివేదికలో వివరించింది.‘ఫైనాన్షియల్ మార్కెట్లను టారిఫ్‌లు షాక్‌కు గురిచేశాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వచ్చే రిస్కులు పెరుగుతున్నాయి. అనిశ్చితి కొనసాగడం వల్ల వ్యాపార ప్రణాళికలకు అవరోధంగా మారుతుంది. పెట్టుబడులు నిల్చిపోతాయి. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతుంది‘ అని మూడీస్ రేటింగ్స్ తెలిపింది.టారిఫ్‌ల అమలుకు తాత్కాలికంగా విరామం ఇవ్వడం వల్ల వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తి, కొనుగోళ్లను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం లభించినప్పటికీ, 90 రోజుల తర్వాత టారిఫ్‌ల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో వ్యాపార ప్రణాళికలకు సమస్యలు తలెత్తవచ్చని వివరించింది. గత నెల రోజులుగా రుణ సంబంధ పరిస్థితులు (రుణాల లభ్యత, వడ్డీ రేట్లు, రుణ గ్రహీతలు చెల్లించే సామర్థ్యాలు మొదలైనవి) గణనీయంగా దిగజారినట్లు మూడీస్ రేటింగ్స్ వివరించింది. అమెరికా జీడీపీపైనా ప్రభావం.. ఇక అమెరికా ఎకానమీ మీద కూడా టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. అగ్రరాజ్యం జీడీపీ వృద్ధి కనీసం ఒక పర్సెంటేజీ పాయింట్ మేర తగ్గొచ్చని, అమెరికన్ వినియోగదారులు.. వ్యాపార సంస్థలకు ధరలు గణనీయంగా పెరిగిపోవచ్చని మూడీస్ తెలిపింది. టారిఫ్‌ల భారాన్ని నెమ్మదిగా బదలాయించినా, అంతిమంగా దాన్ని మోయాల్సింది అమెరికన్ వినియోగదారులేనని తెలిపింది.సుంకాల వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుందని, పలు సంస్థల లాభాల మార్జిన్లు పడిపోతాయని వివరించింది. అటు చైనా విషయానికొస్తే వాణిజ్య యుద్ధంపరమైన ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీ మందగమనం వల్ల ఎగుమతుల రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది.ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికా–చైనా సంబంధాలు వివాదాస్పదంగానే కొనసాగవచ్చని, దీనితో వ్యాపారవర్గాలు.. వినియోగదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. ఫలితంగా దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఏర్పడొచ్చని తెలిపింది. -
‘జీ’పై ఎన్సీఎల్టీకి ఇండస్ఇండ్ బ్యాంక్
న్యూఢిల్లీ: రుణాల డిఫాల్ట్ కేసులో మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)పై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఇండస్ఇండ్ బ్యాంక్ ఆశ్రయించింది. జీఎల్ రూ. 83.08 కోట్లు డిఫాల్ట్ అయినట్లు పేర్కొంది. దీనిపై ముంబైలోని ఎన్సీఎల్టీకి ఇండస్ఇండ్ బ్యాంక్ దరఖాస్తు సమర్పించినట్లు జీల్ వెల్లడించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ సిటీ నెట్వర్క్స్ పొందిన రుణానికి సంబంధించి బ్యాంకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. అయితే, ఈ కేసుపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంకు చర్యలు ప్రారంభించిందని జీల్ పేర్కొంది. దీనిపై న్యాయపరంగా తగు చర్యలు తీసుకుంటామని వివరించింది. దివాలా కోడ్‌లోని (ఐబీసీ) సెక్షన్ 7 ప్రకారం రూ. 1 కోటికి పైగా రుణాలను ఎగవేసిన సంస్థలపై సీఐఆర్‌పీ కింద చర్యలు తీసుకోవాలంటూ రుణదాతలు .. కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. గతేడాది డిసెంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్తో జీల్ విలీనమైన సంగతి తెలిసిందే. -
డీఆర్టీ ఉత్తర్వుపై డియాజియో అభ్యంతరం
బెంగళూరు: రుణ ఎగవేత వివాదాన్ని ఎస్బీఐతో పరిష్కరించుకునే దాకా లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాకు చెల్లించాల్సిన 75 మిలియన్ డాలర్లను విడుదల చేయవద్దని తనకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన ఆదేశాలపై బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం- డియాజియో మంగళవారం తన అభ్యంతరాలను దాఖలు చేసింది. యునెటైడ్ స్పిరిట్స్ సంస్థ నుంచి వైదొలిగినందుకుగాను ఆయనకు 75 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు డియాజియో సిద్ధపడిం ది. ఇచ్చిన రుణంలో కొంతైనా రికవర్ అయ్యేలా ఈ నిధులు ముందుగా తమకు దఖలుపడేలా ఆదేశించాలంటూ డీఆర్టీని ఆశ్రయించింది ఎస్బీఐ. దీనికి సానుకూల రూలింగ్‌ను డీఆర్టీ గతనెల్లో జారీ చేసింది. దీనిపై తాజాగా డియాజియో, దాని అనుబంధ రెండు కంపెనీలు తమ తరఫు అభ్యంతరాలను దాఖలు చేశాయి. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా పడింది.