breaking news
consuption
-
ధరలు పెరిగినా.. తగ్గేదేలే అంటున్నారు..
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ.. మరోవైపు కర్బన ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. జూన్ నెలలో మొదటి రెండు వారాల్లో పెట్రోల్ విక్రయాలు 54 శాతం పెరగ్గా, డీజిల్ విక్రయాలు 48 శాతం అధికంగా నమోదయ్యాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు జూన్ 1 నుంచి 14 వరకు 1.28 మిలియన్ టన్నుల పెట్రోల్ విక్రయించాయి. 2021లో ఇదే కాలంలో నమోదైన విక్రయాలతో పోలిస్తే 54 శాతం ఎక్కువ. కానీ, కరోనాకు ముందు 2019లో జూన్ 1–14 నాటి విక్రయాలు 1.02 మిలియన్ టన్నులతో పోల్చి చూసినా 25 శాతం అధికంగా నమోదైనట్టు తెలుస్తోంది. ఎక్కువగా వినియోగమయ్యే డీజిల్ విక్రయాలు జూన్ 1–14 మధ్య 3.4 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలోని విక్రయాలతో పోలిస్తే 47.8 శాతం ఎక్కువ. ఇక 2020లో ఇదే కాలంతో పోలిస్తే 37.3 శాతం, 2019లో ఇదే కాలంతో పోలిస్తే 20.3 శాతం అధికం. పెట్రోల్, డీజిల్‌కు అధిక డిమాండ్ మళ్లీ ఏర్పడినట్టు, సాగు సీజన్ కూడా ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గ్యాస్ విక్రయాలు.. వంటగ్యాస్ విక్రయాలు 4.21 శాతం పెరిగి 1.06 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2019లో ఇదే కాలంతో పోలిస్తే 28 శాతం అధికం. విమాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు గతేడాది ఇదే కాలంలో పోలిస్తే రెట్టింపై 2,42,900 టన్నులుగా ఉన్నాయి. చదవండి: సంపద సృష్టిలో అదానీ అదరహో -
అమెరికా ఆడాళ్ల తరువాత మనోళ్లే!
ఢిల్లీ: దేశంలో గత సంవత్సరంతో పోల్చితే సిగరెట్ల వినియోగం బాగానే తగ్గింది. అయితే మహిళా స్మోకర్ల సంఖ్య మాత్రం తెగ పెరిగిపోయింది. భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ పార్లమెంట్లో తెలిపిన తాజా గణాంకాల్లో సిగరెట్ల వినియోగం, ఉత్పత్తి వివరాలను వెల్లడించింది. 2013-14 సంవత్సరంలో భారత్‌లో ఊదేసిన సిగరెట్ల సంఖ్య 10,180 కోట్లుగా ఉంది. అయితే 2014-15 సంవత్సరానికి ఈ సంఖ్య 9,320 కోట్లకు తగ్గడం కొంతవరకు ఊరట కలిగించే అంశం. డిమాండ్ తగ్గడంతో సిగరెట్ల తయారీ కూడా తగ్గినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2013-14 సంవత్సరంలో ఇండియాలో 11,010 కోట్ల సిగరెట్లు ఉత్పత్తి కాగా, 2014-15 సంవత్సరానికి ఉత్పత్తి 10,530 కోట్లకు తగ్గింది. అయితే.. సిగరెట్లను కాల్చే ఆడాళ్ల సంఖ్య మాత్రం మన దేశంలో బాగా పెరిగింది. గ్లోబల్ టొబాకో స్టడీ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా తర్వాత అత్యధికంగా సిగరెట్లు తాగుతున్న ఆడాళ్లు మనోళ్లే కావడం విశేషం.1980 నాటికి భారత్‌లో సిగరెట్లు తాగుతున్న మహిళల సంఖ్య 53 లక్షల మంది ఉండగా, 2012 నాటికి వీరి సంఖ్య 1.25 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ పెరుగుదల ఆందోళనకరమని యాంటీ టొబాకో యాక్టివిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.